సినీజోష్ రివ్యూ: దసరా
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: నాని, కీర్తి సురేష్, అనంత్ సింగ్, దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్, ఝాన్సీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
రిలీజ్ డేట్ 30-03 -2023
ఓ పండగ పేరుతో రూపొందిన సినిమా మరో పండగ కానుకగా రావడం భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. అప్పుడెప్పుడో 2005 లో వెంకటేష్ నటించిన సంక్రాంతి చిత్రం శివరాత్రికి విడుదలైతే మళ్ళీ ఇన్నేళ్ల తరువాత శ్రీరామనవమి రోజున దసరాని తీసుకొచ్చాడు నాని.
పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన నాని మంచి కథలను ఎంచుకుంటూ ఉండడంతో మనింటి కుర్రాడైపోయాడు. మనందరికీ నచ్చేసే నటుడిగా మారాడు. స్క్రీన్ పై సహజమైన నటనను కనబరిచే నానిని నేచురల్ స్టార్ అంటారు కానీ విగరస్ రోల్ దొరికినపుడు మాత్రం విజృంభించేస్తూ ఉంటాడు నాని. శ్యామ్ సింగరాయ్ తర్వాత దసరా చిత్రంలోని ధరణి పాత్ర రూపంలో మరోమారు ఛాలెంజింగ్ రోల్ దక్కించుకున్న నాని మొత్తంగా తన ఆహార్యాన్నే మార్చేసుకున్నాడు. తెరపైకి అచ్చంగా ధరణినే తెచ్చేసాడు. మరి నాని కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా ఫిలింగా హై బడ్జెట్ తో నిర్మితమై, అదే స్థాయిలో హయ్యస్ట్ రేట్స్ కి బిజినెస్ జరుపుకుని, నేడు అనూహ్యమైన రీతిలో భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన ఈ దసరా చిత్రం ఆ హైప్ కి తగ్గట్టే ఉందా, ధరణి పాత్ర కోసం నాని పడ్డ కష్టానికి ఫలితం దక్కిందా... సమీక్షలో చూద్దాం.!
దసరా స్టోరీ : 1995 నేపథ్యంతో గోదావరిఖని జిల్లాలోని వీర్లపల్లి ప్రాంతంలో జరిగే కథ దసరా. రైళ్లలో బొగ్గు దొంగిలించడం, స్నేహితులతో కలిసి మద్యం సేవించడమే దినచర్యగా తిరిగేవాడు ధరణి (నాని). అతని చిన్ననాటి స్నేహితులైన వెన్నెల (కీర్తి సురేష్), సూరి (దీక్షిత్ శెట్టి) అంటే అమితంగా ఇష్టపడే ధరణి స్నేహితుడు సూరి కోసం తన ప్రేమని సైతం త్యాగం చేస్తాడు. అయితే అదే సూరి శాశ్వతంగా దూరం అయిపోతే ధరణి ఎలా రియాక్ట్ అయ్యాడు, ఆ ఊరి సర్పంచ్ ఎన్నికలు ఈ ముగ్గురి స్నేహితుల జీవితాలని ఎంతగా అతలాకుతలం చేశాయనేదే ఈ కథలోని కీలక అంశాలు.
దసరా స్క్రీన్ ప్లే : సింగరేణి బొగ్గు గనుల సమీప ప్రాంతాన్ని కథకి నేపథ్యంగా ఎంచుకుని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రానికి ఓ కొత్త కలర్ తీసుకొచ్చాడు నవ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఊరి పెద్దలు, రాజకీయాలు అంటూ సాగే ఆరంభ సన్నివేశాలు సో సోగా అనిపించినా నాని ఎంట్రీతో అసలు షో స్టార్ట్ అవుతుంది. స్నేహం, ప్రేమ, త్యాగం వంటి అంశాలు మెల్లమెల్లగా కథలో బలం పెంచుతూ కథనాన్ని నడిపిస్తాయి. కుర్రాళ్ళ క్రికెట్ పోటీలు, వెన్నెల పెళ్లి సన్నివేశాలు వంటివి అన్నీ సినిమాని విరామం వైపుగా తీసుకెళితే ఇంటర్వెల్ బిఫోర్ ఎపిసోడ్ మాత్రం ఒక్కసారిగా దసరా దర్పాన్ని పెంచేస్తుంది. తనదైన నటనతో ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర చెలరేగిపోయిన నాని సెకండాఫ్ పై అంచనాలు అమాంతం పెంచేసినా మళ్ళీ అటువంటి అద్భుత ఘట్టం చూసేందుకై ముగింపు దృశ్యాల వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ద్వితీయార్ధంలో ధరణి - వెన్నెల పాత్రల మధ్య మరింత సంఘర్షణ చూపించే అవకాశం ఉన్నా, కథని మరిన్ని మలుపులు తిప్పగల ఆస్కారం ఉన్నా ఆ దిశగా ప్రయత్నించలేదు దర్శకుడు. అందుకే కథనం అంచనాలకు అనుగుణంగా సాగుతుంది. ఆల్ రెడీ మనం చూసేసి ఉన్న కొన్ని సినిమాలను గుర్తుకు తెస్తుంది.
దసరా ఎఫర్ట్స్ : ఇప్పటివరకు పక్కింటి కుర్రాడిగా, మిడిల్ క్లాస్ యువకుడిగా, క్లాస్ అబ్బాయిగా మెప్పించిన నానికి.. మధ్యలో మాస్ అంటూ చేసిన పాత్రలు మాత్రం షాకిచ్చాయి. కొన్నాళ్లుగా ఒకేరకమైన కేరెక్టర్స్ కి అలవాటిపడిపోయిన నాని శ్యామ్ సింఘా రాయ్ లో డిఫరెంట్ కేరెక్టర్ లో కనిపించాడు. ఇప్పుడు దసరా లో రగ్గడ్ లుక్ లో ధరణి పాత్రలో ఎమోషన్స్ పండించాడు. ధరణి కేరెక్టర్ లో నాని ఇచ్చిన పెరఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతున్నారు.. శెభాష్ అంటున్నారు. నాని కెరీర్ బెస్ట్ అనేలా ధరణి పాత్ర, ఆ పాత్ర తీరు తెన్నులు, లుక్స్ ఉన్నాయి. వెన్నెల కేరెక్టర్ లో కీర్తి సురేష్ మరోసారి మహానటి నటనని చూపించింది. డీ గ్లామర్ గా కీర్తి సురేష్ అభినయం అద్భుతమనే చెప్పాలి. నాని ఫ్రెండ్ సూరి పాత్రలో సహజసిద్ధమైన నటనతో దీక్షిత్ శెట్టి ఆకట్టుకున్నాడు. సముద్రఖని కేరెక్టర్ కొత్తగా ఉన్నా ఆయన పాత్రకి అంత స్కోప్ లేదు. ఇక ఊరి పెద్దగా సాయి కుమార్ మెప్పించారు.
టెక్నీకల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ లో చమ్కీల అంగిలేసే సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది, ధూమ్ ధామ్ సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నా సంతోష్ నారాయణన్ BGM ఎక్స్ట్రార్డినరీగా ఉంది. దసరా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని. ఇక దసరాకి మరో అసెట్ కెమెరా. సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ అద్భుతం.. ప్రతి సన్నివేశాన్ని చక్కగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే నవీన్ నూలి.. ఫస్ట్ హాఫ్ లో చాలా షార్ప్ గా చూపించినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం అక్కర్లేని సన్నివేశలను అలానే ఉంచేసాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బడ్జెట్ కథకి తగ్గట్టుగా.. పాన్ ఇండియా మార్కెట్ రేంజ్ లో ఉంది.
ఎనాలసిస్ : పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక మనదైన మట్టి కథలను గట్టి కథనంతో అన్ని ప్రాంతాలకూ పట్టుకెళ్లగలిగే పట్టు చిక్కింది. నాని వంటి విలక్షణ నటుల చిత్రాలకు సైతం భారీ బడ్జెట్ వెచ్చించే వీలు దక్కింది. అయితే ఈ తరహా చిత్రాలకు కాస్త అనుభవమున్న దర్శకుడైతే ఖర్చుతో బాటు కథ, కథనాలు కూడా అదుపులో ఉండేవి కదా అనిపించేలా చేసింది దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తాను అనుకున్న కథను తనకు కుదిరినంత నిజాయితీగానే చెప్పే ప్రయత్నం చేసాడు కానీ స్క్రిప్ట్ లాంగ్వేజ్ కీ, స్క్రీన్ లాంగ్వేజ్ కీ డిఫరెన్స్ తెలిసేంత ఎక్స్ పీరియన్స్ లేక కాస్త తడబడ్డాడు. అందుకే మరింత దర్జాగా నిలబడాల్సిన దసరా ఓ రేంజ్ కే పరిమితమై ఓకే అనిపించుకోవడంతో సరిపెట్టుకుంది. నాని, కీర్తి సురేష్ ఇంకా ఇతర తారాగణమంతా అద్భుతంగా నటించినా స్టోరీలో స్ట్రెంగ్తు, స్క్రీన్ ప్లే లో స్పీడు సరిపోక.. సాంగ్స్ ప్లేసుమెంట్ కానీ, పిక్చరైజెషన్ కానీ సరిగా కుదరక హిస్టరీగా మారాల్సిన దసరా మాస్ హిస్టీరియా జస్ట్ గట్టెక్కింది.. హిట్టు మెట్టెక్కింది.
పంచ్ లైన్: దసరా.. నాని అభినయమే ఆసరా.!
సినీజోష్ రేటింగ్: 2.75/5