Advertisementt

సినీజోష్ రివ్యూ : రంగమార్తాండ

Sun 02nd Apr 2023 10:10 AM
rangamarthanda telugu review  సినీజోష్ రివ్యూ : రంగమార్తాండ
Rangamarthanda Review సినీజోష్ రివ్యూ : రంగమార్తాండ
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: రంగమార్తాండ
బ్యానర్: హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, జయలలిత, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
ఎడిటింగ్: పవన్‌కుమర్ విన్నకోట
నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి
దర్శకుడు: కృష్ణవంశీ
రిలీజ్ డేట్: 22-03- 2023

గులాబీతో వచ్చి నిన్నే పెళ్లాడతా అంటే కృష్ణవంశీకి ప్రేక్షకుల నాడి తెలుసు అనుకున్నారు కానీ సిందూరం దిద్ది అంతఃపురం చూపించాక కృష్ణవంశీలోని వేడి అందరికీ అర్ధమైంది. అప్పట్నుంచీ సృజనాత్మక సముద్రంలో మథనం చేస్తూ వస్తోన్న కృష్ణవంశీ మురారితో మురిపించారు. ఖడ్గం పట్టి కదం తొక్కారు. అణువణువూ భారతీయ సంస్కృతిని నింపుకున్న తన బాధ్యతాయుత దృక్పథాన్ని చందమామ కథల్లా చక్కగా తెరపై పరిచారు. గత కొంతకాలంగా తనను పరాజయాలు వెంటాడుతున్నప్పటికీ బెంగపడకుండా, లొంగిపోకుండా మళ్ళీ తనదైన శైలిలోనే రంగమార్తాండను మలిచారు. 

మరాఠీ చిత్రం నటసమ్రాట్ పట్టుకొచ్చి రీమేక్ చేద్దామంటూ నటుడు ప్రకాష్ రాజ్ పట్టుబట్టడంతో మొదట మొహమాటంగానే అంగీకరించారట కృష్ణవంశీ. అయితే నటసమ్రాట్ చూసాక మాతృకలోని ఆత్మ ఆయన్ని ఆవహించింది. మనదైన కథగా సరికొత్త రూపం సంతరించుకుంది. రంగమార్తాండగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో, మేటి నటీనటుల మేళవింపుతో, మేస్ట్రో ఇళయరాజా సంగీతంతో భావోద్వేగభరిత చిత్రంగా రూపొందిన రంగమార్తాండకు ఈ హంగులన్నీ ఏ మేరకు సరిపోయాయో సమీక్షలో చూద్దాం. 

కథ : రంగస్థల నటుడిగా విశేష ఖ్యాతి గడించిన రాఘవరావు (ప్రకాష్ రాజ్)కు రంగమార్తాండ బిరుదును ప్రదానం చేస్తారు. అదే వేదికపై తన రిటైర్మెంట్ ప్రకటించిన రాఘవరావు తాను రాజుగారూ (రమ్యకృష్ణ) అని పిలుచుకునే భార్యతో కలిసి విశ్రాంత జీవితాన్ని గడపాలి అనుకుంటాడు. కానీ అక్కడ్నుంచే మొదలవుతుంది అసలైన నాటకం. అప్పటివరకూ స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం)తో కలిసి ప్రదర్శనలిస్తూ, ప్రశంసలు పొందుతూ నాటక రంగమే ప్రపంచంగా బ్రతికేసిన రాఘవరావుకు జీవిత రంగం ఊహించని మలుపులు చూపిస్తుంది. కన్న బిడ్డల్లోనే కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తుంది. వేదికపై ఎన్నో నాటకాలు వేసిన రాఘవరావుకు నిజ జీవితంలో ఎవరెలా ఎన్ని నాటకాలు ఆడతారో అర్ధమవుతూ వుంటే ఆయనెలా స్పందించాడు, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు, ఏ తీరానికి చేరాడన్న అంశాల రంగరింపే రంగమార్తాండ కథ. 

కథనం : మామూలుగానే కృష్ణవంశీ సినిమాల్లో కథనం చాలా సహజ ధోరణిలో సాగుతుంది. మరిక ఈ తరహా కథను తను చేపట్టారంటే ఇక చెప్పేదేముంటుంది.! ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియాలిటీ పేరుతో పక్క దారి పట్టకుండా రంగమార్తాండ రాఘవరావు జీవితం మాత్రమే కనిపించేలా హృద్యమైన కథనాన్ని తెరపైకి తెచ్చారు కృష్ణవంశీ. కథ మొదలైన కాసేపటికే రాఘవరావు, రాజుగారు, చక్రపాణి పాత్రలతో ప్రేక్షకులు పూర్తిగా మమేకం అయిపోతారంటే అది కథనంలో గొప్పదనమే. అలాగని కృష్ణవంశీ అద్భుతాలేం చేయలేదు. స్క్రీన్ ప్లే రెగ్యులర్ గానే ఉంటుంది. స్క్రీన్ పై మాత్రం ఆర్టిస్టుల అభినయం అబ్బురపరుస్తూ ఉంటుంది. కథనం ఊహించిన దిశగానే నిదానంగా కదులుతూ ఉంటుంది. కానీ ఆయా పాత్రల్లోని సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నిజానికిది ఓ రంగస్థల నటుడి కథే అయినా అవకాశం కుదిరిన ప్రతిచోటా సమకాలీన అంశాల పట్ల తన స్పందన తెలిపే ప్రయత్నం చేసారు కృష్ణవంశీ. షేక్ స్పియర్ రచనల గురించి, ఆంగ్ల భాషకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం గురించి రాఘవరావు వ్యక్తపరిచే ఆవేశం ఆడియన్సులో కూడా సరైన ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ లో అయితే గుండె బరువెక్కడం, కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. రాఘవరావు, రాజుగారు, చక్రపాణి పాత్రలు నిజ జీవితంలో మనకు తారసపడ్డట్టే అనిపిస్తాయి. సినిమా అయిపోయాక కూడా మనతోనే వస్తాయి. ముఖ్యంగా రాఘవరావు - చక్రపాణి మధ్య సన్నివేశాలు చాలాకాలం గుర్తుండిపోతాయి. ఈ కథనాన్ని ప్రథమార్ధం, ద్వితీయార్ధం అని విడదీసి చూడక్కర్లేదు. అవి రాఘవరావు జీవితంలోని రెండు ప్రధాన ఘట్టాలు. అంతటి రంగమార్తాండునికే ఓ పట్టాన మింగుడుపడని నేటి సమాజపు సత్యాలు.!

నటీనటులు : అంతఃపురంలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రని హిందీలో నానా పాటేకర్ చేస్తే.. మరాఠీలో నానా పాటేకర్ చేసిన నటసమ్రాట్ ని ఛాలెంజ్ గా తీసుకుని మరీ చేసారు ప్రకాష్ రాజ్. అయితే ఈ ప్రయత్నానికి కారణం మాత్రం కథేనని అంటున్నారు కృష్ణవంశీ. ఏదైతేనేం రంగమార్తాండ రాఘవరావుగా తన నట విశ్వరూపం చూపించేసారు ప్రకాష్ రాజ్. ఇద్దరు, అంతఃపురం, కాంజీవరం చిత్రాల రీతిలో మరో అరుదైన పాత్రను ఏరికోరి తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ప్రతి సన్నివేశంలోనూ ప్రాణం పెట్టేసారు. నటుడిగా ప్రకాష్ రాజ్ స్థాయి ఇదీ అని చాటడమే కాకుండా తనని మరో పది మెట్లు పైకి ఎక్కిస్తుంది రంగమార్తాండ. కళ్ళతోనే అభినయించే క్లిష్టమైన పాత్రలో అద్భుతంగా ఆవిష్కృతమైంది రమ్యకృష్ణ. సవాల్ విసిరే పాత్ర దొరికిన ప్రతిసారీ నటిగా తన సత్తా చాటుకునే రాజమాత ఖాతాలోకి ఈ రాజుగారు పాత్ర కూడా సగర్వంగా చేరుతుంది. ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది, ప్రశంసించి తీరాల్సింది హాస్య బ్రహ్మ బ్రహ్మానందాన్ని. కొన్ని దశాబ్దాలుగా కేవలం నవ్వించడానికే పరిమితమైన (అన్న వంటి కొన్ని సినిమాలు మినహా) బ్రహ్మానందం తనలోని నట తృష్ణను తీర్చుకునేందుకై ఈ చిత్రంతో కొత్త ప్రయాణం ప్రారంభించారని భావించొచ్చు. చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం ప్రదర్శించిన భావోద్వేగభరిత అభినయం వీక్షకులు విస్మయానికి లోనయ్యేలా చేస్తుంది. అనసూయ భరద్వాజ్ - శివాత్మిక రాజశేఖర్ లు పాత్రోచితంగా నటిస్తే.. రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, ఆదర్శ్ బాలకృష్ణ తమకు తగ్గ పాత్రల్లో ఒదిగిపోయారు. 

సాంకేతిక నిపుణులు : మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ ఈ చిత్రానికి యాడెడ్ స్పార్క్ అయింది. లయబద్దంగా సాగే కథను తనదైన శైలిలో స్వరబద్దం చేసి మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉండడం ఆయన అనుభవానికి అద్దం పడుతుంది. రాజ్ కె. నల్లి ఛాయాగ్రహణం దర్శకుడు కృష్ణవంశీ అభిరుచికి అనుగుణంగా సాగిందని అనుకోవాలి. కొన్ని కెమెరా యాంగిల్స్, కొన్ని పర్టిక్యులర్ ఫ్రేమ్స్ స్పెషల్ అప్రిసియేషన్ అందుకుంటాయి. ఆకెళ్ళ శివప్రసాద్ మాటలు ఆలోచింపజేస్తాయి. ఆవేశాన్ని రగుల్చుతాయి. ఆర్ద్రతనూ పంచుతాయి. ఇతర సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ చిత్రాన్ని వెండితెర వేదికపైకి తెచ్చేందుకు తమ తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించారనే చెప్పొచ్చు. నిర్మాణ వ్యవధి, వ్యయం రెండూ పెరిగిపోయినా కథకు కావాల్సిన అన్ని హంగులతో రంగమార్తాండను రూపొందించిన నిబద్దత కలిగిన నిర్మాతలు అభినందనీయులు. ఇక ఈ చిత్ర సూత్రధారి కృష్ణవంశీ విషయానికి వస్తే... డెప్త్ ఉన్న సబ్జెక్ట్ కుదిరితే  తన స్ట్రెంగ్త్ ఏంటో చూపిస్తానని మరోమారు ప్రూవ్ చేసుకున్నారు కృష్ణవంశీ. పేరుకిది రీమేక్ అయినా ఆ మరాఠీ మాతృకకి తేట తెలుగు సొబగులద్ది, హంగులిచ్చి, రంగులేసి రంగమార్తాండగా మార్చిన కృష్ణవంశీ ఆ ప్రయత్నంలో అడుగడుగునా తనదైన ముద్రను వేశారు. తనకు మాత్రమే సొంతమైన శైలిలో హృద్యమైన కథనంతో ప్రేక్షకుల హృదయాలను కదిలించగలిగారు. డైరెక్టర్ గా కృష్ణవంశీ క్యాలిబర్ కీ, క్యాపబిలిటీస్ కీ మనం కొత్తగా కాంప్లిమెంట్స్ ఇవ్వక్కర్లేదు కానీ ఫిలిం మేకింగ్ లో ఆయన కమిట్ మెంట్ కీ, కన్విక్షన్ కీ మాత్రం హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.!

ముక్తాయింపు : మెగాస్టార్ చిరంజీవి షాయరీలుగా పలుకుతోన్న వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్రం ఆద్యంతం మన అమ్మ నాన్నల కథగానే కనిపిస్తుంది. ప్రీమియర్ షోస్ దగ్గిర్నుంచే అంతటి అద్భుత స్పందన ఎలా రాబట్టగలిగిందో చూపిస్తుంది. మరి సాటి దర్శక, నిర్మాతలందరూ శెభాష్ కృష్ణవంశీ అని అభినందించేలా చేసిన ఈ రంగమార్తాండ పట్ల ప్రేక్షకలోకం ఎలా స్పందిస్తుందో.. ఎంతగా  స్వీకరిస్తుందో వేచి చూడాలి.!

కమర్షియల్ సినిమాలు తరచుగా వస్తుంటాయి కానీ కదిలించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. 

మాస్ మసాలాలు కోరుకోవచ్చు కానీ మనసుని కరిగించే కథల్ని మిస్ అవ్వకూడదు. 

జీవితాల్లోని నాటకాల్నీ, వాస్తవాల్నీ వాడిగా వేడిగా రంగరించిన చిత్రం రంగమార్తాండ. 

స్పందించే హృదయమున్న ప్రతి ప్రేక్షకుడిని రంజింపజేసే చిత్రం రంగమార్తాండ.!

సినీజోష్ రేటింగ్ : 3/5

 

 

Rangamarthanda Review:

Rangamarthanda Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ