సినీజోష్ రివ్యూ: ధమాకా
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
తారాగణం: రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, హైపర్ ఆది, తులసి తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
విడుదల తేదీ: 23-12-2022
లాస్ట్ ఇయర్ క్రాక్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్టే అని అభిమానులు భావించారు. అయితే ఆపై రవితేజ ఆడిన ఖిలాడీ గేమ్ నిరాశ పరిచింది. రామారావుగా చేసిన డ్యూటీ నీరసం తెప్పించింది. దాంతో కాస్త అలెర్ట్ అయినట్టే కనిపించిన రవితేజ తనకు బాగా కంఫర్ట్ జోన్ అయిన పక్కా కమర్షియల్ ఫార్మేట్ వైపు వెళ్లారు. అలా రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంటుతో పాటు ఎక్సయిటింగ్ ఏక్షన్ ఎలిమెంట్సునీ మిక్స్ చేసి ఫిక్స్ చేసిన ధమాకా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ధమాకాలో ద్విపాత్రాభినయం చేస్తోన్న రవితేజ విక్రమార్కుడు తరహాలో మరోమారు డబుల్ ధమాకా ట్రీట్ ఇస్తారని ఆశించిన ప్రేక్షకులకు నవ్య సొగసుల నర్తకి శ్రీలీల అదనపు ఆకర్షణగా మారింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి పాటా మాస్ మహారాజా మార్కు మాసిజం చూపించడం, టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే ఉండడంతో నేడు అంతటా ఓ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగింది ధమాకా. మరింతకీ డబుల్ ఇంపాక్ట్ ఇస్తానంటూ ఎంతో నమ్మకంగా నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ ధమాకా పటాకా థియేటర్లలో ఏ మేరకు పేలిందన్నది సమీక్షలో తెలుసుకుందాం.!
స్టోరీ : ధమాకా కథ ఏంటో చెప్పమని అడిగితే సాధారణ ప్రేక్షకుడైనా తనకు సాధ్యమైన స్థాయిలో కాస్త కొత్తగా చెప్పగలడేమో కానీ.. నక్కిన వారు మాత్రం మరో దారి తొక్కే ప్రసక్తే లేదంటూ మక్కీకి మక్కీగా నాలుగు దశాబ్దాలుగా చూస్తూ వస్తోన్న వ్యవహారాన్నే వండీ వండకుండా వార్చేసారు. హీరో ద్విపాత్రాభినయం. ఒక పాత్ర సంపన్నుడు. మరొకరు సామాన్యుడు. సమస్య ఎదుర్కుంటున్న సంపన్నుడి స్థానంలోకి సామాన్యుడు వస్తాడు. తన సామర్ధ్యంతో అంతా చక్కపెట్టేస్తాడు. తరతరాలుగా మనం చూస్తూ వస్తోన్న ఈ తంతునే ధమాకా పేరుతో దంచేసి జనం ముందు దించేశారు త్రినాథ - ప్రసన్నలు. మరీ దర్శక, రచయితలకు అదే అద్భుతంగా అనిపించి ఉండొచ్చు కానీ ఆల్ రెడీ ఒకసారి ఇలాంటి దరువు వేసేసి ఉన్న రవితేజ మళ్ళీ ధమాకాకి ఎలా కనెక్ట్ అయ్యాడు, ఎందుకు టెంప్ట్ అయ్యాడు అన్నదే ఆయన అభిమానులకి కూడా అర్ధం కానీ ట్విస్ట్. సర్లెండి.. సినిమాలో ఎలాగూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమీ లేవు కనుక కాస్త కన్సర్న్ తో ఈ క్యూరియాసిటీ కలిగించాడు మన మాస్ మహారాజా అనేసుకుందాం.!
స్క్రీన్ ప్లే : సమీక్షలు అందించే సగటు ధోరణిలో భాగంగా స్క్రీన్ ప్లే అనే పదాన్ని వాడాలి, విభాగాన్ని నింపాలి తప్ప నిజానికి ధమాకా ఇలాకాలో అంతటి అవకాశమే లేదు. ఆస్తుల నేపథ్యంతో కథ మొదలవడం, హీరోయిన్ ని రౌడీ గ్యాంగ్ టీజ్ చేయడం, హీరో గారు సేవ్ చేయడం, పాట, ఫైటు, ప్రాసలతో కూడిన పంచు డైలాగులతో దాని మానాన అది సాగిపోయే ధమాకాలో ఒకే పోలికలతో ఇద్దరు ఉండడం అనేది మాత్రం ఆసక్తికరం. అయితే అరెరే.. అది మాత్రం ఎందుకు ఉండాలి అనుకున్నారో ఏమో ఇంటర్వెల్ కే దాన్ని కూడా పోగొట్టేసి ద్వితీయార్ధం మొత్తం జనం జాలీగా ఫోన్లు చూసుకునే వీలు కల్పించారు విజ్ఞులైన దర్శక, రచయితలు. ఇక ఏక కాలంలో ఇద్దరు హీరోలనీ ప్రేమించేసే కథానాయిక క్లయిమాక్స్ లో ఎవరిని ఎంచుకుంటుంది అన్నది అమోఘమైన అంశం అని సినిమా ప్రమోషన్స్ లో గొప్పగా చెప్పుకున్నారు కనుక అంతోటి కీలకంగా భావించిన ఆ కీటక అంశాన్ని సినిమా చూసేవారికి, చివరివరకు చూడగలిగే వారికి వదిలేద్దాం.!
ఎఫర్ట్స్ : ధమాకా కథకి ఎస్ చెప్పడంలో తప్ప మరే తప్పూ చెయ్యలేదు రవితేజ. ఎంటర్ టైనింగ్ సీన్సులో తన మార్క్ చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన స్పార్క్ చూపించాడు. ఫేస్ లో ఏజ్ తెలుస్తున్నా పెర్ ఫార్మెన్స్ లో గ్రేస్ మారలేదు.. డ్యాన్స్ లో ఎనర్జీ తగ్గలేదు. శ్రీలీల నటన స్లో గా నేర్చుకుంటోంది కానీ డాన్స్ లో మాత్రం కళ్ళు చెదిరే స్పీడు చూపించింది. మలయాళ నటుడు జయరాం తొలిసారిగా పూర్తి స్థాయి ప్రతినాయక పాత్ర చేసారు. అయితే ఆయన విలన్ రోల్ కి లెంగ్తే తప్ప స్ట్రెంగ్త్ లేదు. రావు రమేష్ - హైపర్ ఆది ట్రాక్ తో రావు గోపాలరావు - అల్లు రామలింగయ్యల శైలిని అనుకరించే ప్రయత్నం జరిగింది కానీ కుదరలేదు. ఆలీ, ప్రవీణ్ వంటి హాస్య నటులున్నా కథనంలో అతకలేదు. సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, తులసి వంటి సీనియర్ నటులు ఉనికిని చాటుకోగలిగారు. ఇక సో కాల్డ్ కమర్షియల్ హంగులకీ, అవసరం ఉన్నా లేకున్నా పెట్టేసిన ఖర్చులకి లోటైతే లేదులెండి. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ధమాకాకి దన్నుగా నిలిచారు. ముఖ్యంగా పాటలు.సంగీతంతోనే కాక డ్యాన్సులతోనూ, విజువల్స్ తోనూ కూడా బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఆ అంశం యూట్యూబ్ లో వ్యూస్ అండ్ లైక్స్ కి యూజ్ అవుతుంది తప్ప ధమాకా రిజల్ట్ ని కొంతైనా ప్రభావితం చేయగలదా అనేది వేచి చూడాలి. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు చెయ్యాల్సినదంతా చేస్తే.. ఎడిటర్ ప్రవీణ్ తాను చెయ్యగలిగింది ఇంతే అని తేల్చేసాడు. బెజవాడ ప్రసన్నకుమార్ మాటల్లో కొన్ని మెరుపులున్నాయి కానీ కథ, కథనాలు మాత్రం మరీ మూస ధోరణితో విసిగించాయి. దర్శకుడు నక్కిన త్రినాథరావు స్క్రిప్ట్ విషయాన్ని గ్రాంటెడ్ గా తీసుకున్నారో లేక కేర్ లెస్ గా దూసుకెళ్లారో తనకే తెలియాలి. బట్ రవితేజని కరెక్టుగా ప్రొజెక్ట్ చేయడంలోనూ, ఫుల్ ప్లెడ్జెడ్ కమర్షియల్ ఫిలిం హ్యాండిల్ చేయడంలోనూ మాత్రం సామర్ధ్యం చాటుకున్నారు.
ఎనాలసిస్ : రవితేజ కామెడీ టైమింగ్ కి అందరూ ఫ్యాన్సే. (వెంకీ, దుబాయ్ శీను, కృష్ణ, కిక్ వంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి). రవితేజ ఇంటెన్స్ పెర్ ఫార్మెన్సుకి అందరూ ఫిదానే. (నేనింతే, విక్రమార్కుడు, క్రాక్, పవర్ వంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి). ఇక తన డ్యాన్సులు, డైలాగులు, హావభావాలు అన్నీ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటి పూత పూసేసి పులిహోర కలిపేస్తే పనైపోద్ధి అనుకోవడం అమాయకత్వం. అసలు కథలో విషయం ఉండాలి. ఆపై కథనంలో కొత్తదనం నిండాలి. అప్పుడే దానికి రవితేజం తోడవుతుంది.. విజయానికి బీజం పడుతుంది. కానీ మాస్ హీరోలకి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది కదా... కమర్షియల్ సినిమాకి ఓ పర్టిక్యులర్ టెంప్లేట్ ఉంది కదా... ఆ ఇమేజ్ కి ఈ టెంప్లేట్ మ్యాచ్ కాగలిగితే చాలు.. ఈజీగా సక్సెస్ ని క్యాచ్ చేసేయ్యొచ్చు, క్యాష్ చేసేస్కోవచ్చు అనే మైండ్ సెట్ మన మేకర్స్ మార్చుకునేంత వరకు ఇలా ధమాకా వంటి ఊకదంపుడు ఊర సినిమాలు వస్తూ పోతూనే ఉంటాయి. ప్రస్తుతం ఓటీటీ పుణ్యమా అని వరల్డ్ సినిమా మొత్తం వాచ్ చేస్తోన్న నేటి తరం ఆడియన్సుకి అల్లాటప్పా సినిమాలు ఆనవప్పా.!
సినీజోష్ పంచ్ లైన్ : దిమాక్ వాడని ధమాకా
సినీజోష్ రేటింగ్ : 2/5