సినీజోష్ రివ్యూ : యశోద
బ్యానర్ : శ్రీదేవి మూవీస్
నటీనటులు : సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ తదితరులు
మాటలు : పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి
ఛాయాగ్రహణం : M సుకుమార్
కూర్పు : మార్తాండ్ K వెంకటేష్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి - హరీష్
విడుదల తేదీ : 11-11-2022
మొదట్నుంచీ నటిగా తనదైన ప్రత్యేక శైలితో అభిమానుల్ని సంపాదించుకుంది సమంత. మొదట్లో గ్లామరస్ క్యారెక్టర్స్ చేసినా ఆపై అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన సమంత యు టర్న్, ఓ బేబీ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సక్సెస్సులు సాధించింది. ఇప్పుడదే కోవలో సమంత చేసిన తాజా చిత్రం యశోద. గర్భవతిగా నటిస్తూ.. ఛాలెంజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తూ సమంత ఎంతో డెడికేటెడ్ గా చేసిన యశోద చిత్రం మంచి అంచనాల నడుమ నేడు (11-11-2022) విడుదలైంది. వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నా... వృత్తిపరంగా తన బాధ్యతలకు న్యాయం చేస్తానంటూ వైద్యుల పర్యవేక్షణలో యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పి, సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన సమంత సిన్సియారిటీకి అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే మరింతకీ సమంతతో ఇంత హార్డ్ వర్క్ చేయించిన యశోద చిత్రం ఎలా ఉందనేది ఇప్పుడిక రివ్యూలో చూద్దాం.!
స్టోరీ : పేద కుటుంబానికి చెందిన బస్తీ అమ్మాయి యశోద (సమంత) ఆర్ధిక అవసరాల రీత్యా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. సరోగసీ పద్దతిలో బిడ్డకి జన్మనిచ్చేందుకు అంగీకరించి డాక్టర్ మధు (వరలక్ష్మీ శరత్ కుమార్)కి చెందిన ఈవా హాస్పిటల్ లో చేరుతుంది. అయితే అక్కడి పరిస్థితులు, పరిణామాలు యశోదకు విచిత్రంగా అనిపిస్తాయి. ఎన్నో అనుమానాలు మొదలవుతాయి. తనలాగే సరోగసీకి సిద్ధపడి ఆ ఆస్పత్రిలో చేరిన తోటి మహిళలు అదృశ్యం అయిపోతూ ఉండడం గమనించి ఆ మిస్టరీని చేధించే ప్రయత్నం చేస్తుంది యశోద. ఆ ప్రాసెస్ లో యశోదకి ఎలాంటి విషయాలు తెలిసాయి, ఆ మహిళలు ఏమవుతున్నారు, హాస్పిటల్ లో జరిగే సంఘటనలకీ - బయట జరిగే హత్యలకీ సంబంధం ఏమిటి అనే ఆసక్తికర అంశాలను సినిమాలో చూడాల్సిందే.!
స్క్రీన్ ప్లే : బేసిక్ గా క్రైమ్ థ్రిల్లర్స్ కి కట్టిపడేసే కథనమే ప్రాణం. సరోగసి నేపథ్యంలో మెడికల్ మాఫియా కథగా యశోదను మలిచిన దర్శకద్వయం హరి - హరీష్ లు స్క్రీన్ ప్లే వైజ్ మాత్రం సదరు కథకు కావాల్సిన స్ట్రాంగ్ గ్రిప్ చూపించలేకపోయారు. గర్భధారణ కోసం యశోద ఆస్పత్రిలో చేరడం దగ్గర్నుంచి ఆసక్తికరంగా సాగిన ఈ కథనంలో కొన్ని అతకని సన్నివేశాలు, సంభాషణలు విసిగిస్తాయి. సరోగసి స్కాండల్ సబ్జెక్ట్ అని అర్ధం అవుతూనే ఉన్నా కానీ ప్రథమార్ధం వరకు ఉత్కంఠభరితంగానే ఉన్న స్క్రీన్ ప్లే ద్వితీయార్ధంలో మాత్రం గాడి తప్పింది. నేర పరిశోధనలో ఇంట్రెస్టింగ్ గా అనిపించాల్సిన అంశాలు, థ్రిల్ పంచాల్సిన విషయాలు మరీ చప్పగా ఉండడం డిజప్పాయింట్ చేస్తుంది. నేరస్తులే తమ గురించి రివీల్ చేసుకోవడం, సమంత చెల్లెలి ట్రాక్ అనసరం అనిపించేలా ఉండడం, పతాక దృశ్యాలకు చేరే క్రమంలో సాగతీత ఎక్కువవడం యశోద కథనంలో ప్రధాన బలహీనతలు. అయితే ఎంచుకున్న స్టోరీ లైన్ లోనే స్ట్రెంగ్త్ ఉంది కనుక, భావోద్వేగాలను బాగానే ప్రెజెంట్ చేసారు కనుక ఓవరాల్ గా పర్లేదనిపించుకుంటుంది యశోద. ప్రీ క్లయిమాక్స్ టైమ్ కి వచ్చే సమంత క్యారెక్టర్ ట్విస్ట్ కొత్తదేమీ కాకపోయినా బాగానే వర్కవుట్ అయింది.
ఎఫర్ట్స్ : యశోద చిత్రానికి ఎట్రాక్షన్ - ఎస్సెట్ రెండూ సమంతే. సినిమా స్టార్టింగ్ లో కాస్త అమాయకంగా కనిపిస్తూ తన మార్క్ నటనతో ఎంటర్ టైన్ చేసిన సమంత... తర్వాత మాత్రం యశోద పాత్రలోని వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ అద్భుతమైన అభినయం కనబరిచింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో నెక్సెట్ లెవెల్ పర్ ఫార్మెన్స్ చూపించిన సమంత టోటల్ గా తనదైన నటనతో యశోద పాత్రకు ప్రాణం పోస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా విశేషంగా ఆకట్టుంది. డాక్టర్ మధు తరహా పాత్రలు చేయడంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకత మరోసారి ప్రూవ్ అయింది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా తనకి సరిగ్గా సూట్ అయిన రోల్ లో సెటిల్డ్ గా నటించాడు. రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు సైతం తమకు తగ్గ పాత్రలే దొరకడంతో తడబాటు లేకుండా పని కానిచ్చేశారు. పులగం చిన్నారాయణ - చల్లా భాగ్యలక్ష్మి రాసిన సంభాషణలు కథకు తగ్గట్లుగా కుదిరాయి. సుకుమార్ సినిమాటోగ్రఫీ - అశోక్ ఆర్ట్ డైరెక్షన్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మణిశర్మ స్వరపరిచిన పాటలు సోసోగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం మంచి మార్కులు వేయించుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చక్కగానే డిజైన్ చేసారు కానీ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. కథకు తగ్గ కరెక్ట్ క్యాస్టింగ్ చూజ్ చేసుకోవడం దగ్గర్నుంచీ బడ్జెట్ కి వెనుకాడకుండా హాస్పిటల్ సెట్ వెయ్యడం వరకూ తన అనుభవాన్ని, అభిరుచిని చాటుకున్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ యశోదని పాన్ ఇండియా ఫిలింగా మలచడంలో సక్సెస్ అయ్యారు. సరోగసి సీక్రెట్స్ అనే ఇంట్రెస్టింగ్ థీమ్ తో మెడికల్ క్రైమ్స్ ని ప్రేక్షకులకు చూపించేలా యశోద కథను రాసుకున్న దర్శక ద్వయం హరి - హరీష్ లు మంచి సమన్వయంతో పనిచేసారు. దర్శకులుగా మెప్పించారు. కానీ థ్రిల్లర్ మూవీస్ కి కంపల్సరీగా కావాల్సిన టెంపో మిస్ అవడం, స్టోరీ నేరేషన్ లో ఉండాల్సిన ఉత్కంఠ లేకపోవడం యశోదకు ప్రతికూలతలు.!
ఎనాలసిస్ : ఇదీ మా కాన్సెప్ట్ అంటూ ఓ మెడికల్ థ్రిల్లర్ చూసేందుకై ఆడియన్సుని ఫ్రమ్ ది బిగినింగ్ ప్రిపేర్ చేస్తూ వచ్చిన యశోద మేకర్స్ సినిమాలో అదే చూపించారు కానీ ఆశించినంత థ్రిల్ మాత్రం అందించలేకపోయారు. ఫ్యామిలి మ్యాన్ వెబ్ సిరీస్ తరహాలో సమంతకు యశోద అనే మరో శక్తివంతమైన పాత్ర దొరికింది తప్ప.. చప్పగా సాగిన కథనం యశోదను ఓ సాదా సీదా సినిమాగా మాత్రమే నిలిపింది. మరి ప్రెడిక్టబుల్ గా అనిపించే ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్స్ లో అంతంతమాత్రం స్పందనే పొందవచ్చు కానీ ఓటీటీలో మాత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది అని భావించొచ్చు. ఎందుకంటే ఈరోజుల్లో ఇటువంటి చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులే మహారాజపోషకులు.!
సినీజోష్ రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : థ్రిల్ లెస్ థ్రిల్లర్