సినీజోష్ రివ్యూ : అల్లూరి
బేనర్ : లక్కీ మీడియా
నటీనటులు : శ్రీ విష్ణు, కయ్యదు లోహర్, సుమన్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర, పృథ్విరాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
సమర్పణ : బెక్కెం బబిత
నిర్మాత : బెక్కెం వేణుగోపాల్
రచన, దర్శకత్వం : ప్రదీప్ వర్మ
విడుదల తేదీ : 23-09-2022
తన ఈజ్ అఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ, విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు యువ నటుడు శ్రీ విష్ణు. ఇప్పటివరకూ బోయ్ నెక్సెట్ డోర్ రోల్స్ చేసిన శ్రీ విష్ణు తొలిసారి హీరోయిక్ క్యారెక్టర్ టేకప్ చేసి, పోలీస్ గెటప్ తో నటించిన పవర్ ఫుల్ చిత్రం అల్లూరి. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. టైటిల్ దగ్గర్నుంచీ ట్రైలర్ వరకు అన్నీ ఓ వైవిధ్యమైన చిత్రంగానే అల్లూరి చిత్రంపై అభిప్రాయాన్ని ఏర్పరచగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో రావడం ఈ చిత్రానికి ఇంకాస్త మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆల్ మోస్ట్ ఓ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ అనదగ్గ విధంగా రూపొందిన అల్లూరి వివరాలేమిటో, విశేషాలు ఏమున్నాయో విశ్లేషణలో చూద్దాం.
బేసిక్ పాయింట్ : తన వృత్తి నిర్వహణలో ఎప్పటికప్పుడు అనేక బదిలీలను ఎదుర్కునే సిన్సియర్ పోలీస్ రామరాజు (శ్రీ విష్ణు). అతనెందుకు అన్నిసార్లు ట్రాన్స్ ఫర్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందనేది కథలో కీలకమైన అంశం. ఓ రాజకీయ నాయకుడితో పోరుకి సిద్ధపడ్డ రామరాజు ఆ ప్రాసెస్ లో చేసే ఫైట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే అసలా పోరాటానికి కారణం ఏంటి, గెలుపెవరిది అనేది తెరపైనే చూడాల్సిన అంశం.
ప్లస్ పాయింట్ : రామరాజు పాత్ర పోషణకై శ్రీ విష్ణు చూపించిన మేకోవర్ ని ముందుగా ప్రశంసించాలి. పోలీస్ యూనిఫామ్ కి తగ్గట్టు పర్ ఫెక్ట్ ఫిజిక్ తో కనిపించిన శ్రీ విష్ణు నటుడిగాను డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు. ఛాలెంజింగ్ రోల్ చూజ్ చేసుకోవడమే కాకుండా.. నిజంగానే ఈ సినిమాని అతనెంత సవాలుగా ఫీలై చేసాడో శ్రీ విష్ణు నటనలో స్పష్టంగా తెలుస్తోంది. కయదు లోహర్ ఆకర్షణీయంగా ఉంది కానీ తన పాత్ర నిడివి తక్కువ. మిగిలిన నటీనటులు తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర , పృధ్వీ రాజ్ , రవివర్మ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. సినిమాగా చూసుకుంటే ఇది సిన్సియర్ ఎటెంప్టే కానీ ఒక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ తప్ప ప్లస్ పాయింట్స్ గా చెప్పుకునేవి పెద్దగా ఏవీ లేని అంతంత మాత్రం అవుట్ ఫుట్ అనిపించుకుంటుంది అల్లూరి.
మైనస్ పాయింట్ : అర్జున్ రెడ్డితో మెప్పించిన రాజ్ తోట సినిమాటోగ్రఫీ అల్లూరిలో మాత్రం ఆ రేంజ్ లో కనిపించలేదు. హర్షవర్ధన్ సంగీతం కూడా సో సో గానే సాగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు పాస్ మార్కులు వేసేయ్యొచ్చు. ఎడిటింగ్ లో పదును తగ్గింది.. కథనంలో కొత్తదనం కొరవడింది. ఓవరాల్ గా టెక్నికల్ డిపార్టుమెంట్స్ అన్నీ కూడా బిలో యావరేజ్ ఎఫర్ట్ తోనే సరిపెట్టేసారు. దర్శకుడు ప్రదీప్ వర్మ హానెస్టీని, హార్డ్ వర్కుని శంకించలేం కానీ క్యారెక్టర్ కోసం శ్రీ విష్ణు చేసినట్టే.. కథ విషయంలో ప్రదీప్ కూడా కరెక్టుగా కసరత్తులు చేసి ఉండాల్సింది.
ఫైనల్ పాయింట్ : శ్రీ విష్ణు నటన మాత్రమే మేజర్ ఎస్సెట్ అయిన ఈ చిత్రానికి రొటీన్ గా అనిపించే కథ, కొత్తదనం లేని సన్నివేశాలు విలన్లుగా మారాయి. క్లయిమాక్స్ లో ఉప్పెన చిత్రం తరహా సీన్ ని ఎందుకు ఇందులోకి చొప్పించారనేది అర్ధం కాదు.. ఆకట్టుకోదు. బహుశా డిజిటల్ స్ట్రీమింగ్ లో అయితే పర్లేదు అనిపించుకోవచ్చు కానీ థియేటర్స్ లో మాత్రం అల్లూరికి ఆశించిన ఫలితం కష్టమే. అందులోను ఆర్ధిక సమస్యల కారణంగా సకాలంలో విడుదల కాలేకపోయిన అల్లూరికి ఆ ప్రభావం ప్రారంభ వసూళ్లపై గట్టిగానే పడింది.
పంచ్ లైన్ : శ్రీ విష్ణు సిన్సియర్ అటెంప్ట్
రేటింగ్ : 2/5