సినీజోష్ రివ్యూ: ఒకే ఒక జీవితం
నటీనటులు: శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
మ్యూజిక్ డైరెక్టర్: జాక్స్ బిజోయ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
నిర్మాత: ప్రకాష్ బాబు, ప్రభు
స్టోరీ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీ కార్తీక్
రిలీజ్ డేట్: 09-09-2022
శర్వానంద్ ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలన్నీ అతనికి నిరాశనే మిగులుస్తున్నాయి. అటు లవ్ స్టోరీస్, ఇటు మాస్ కథలు రెండు అతనికి కలిసి రావడం లేదు. ఎంతో ఇష్టపడి చేసిన జాను శర్వాని బాగా నిరాశ పరిచింది. సాయి పల్లవితో కలిసి చేసిన ప్యూర్ లవ్ స్టోరీ పడి పడి లేచే మనసు హిట్ అవుతుంది నమ్మిన శర్వాకి అది కూడా ప్లాప్ నిచ్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు తేవచ్చు అంటూ లక్షలు సంపాదించే సాఫ్ట్ వెర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ లుంగీ కట్టిన శర్వాకి శ్రీకారం కూడా షాక్ ఇచ్చింది. ఆహా ఓహో అని పొగిడారు తప్ప సినిమాని ఆడియన్స్ ఆదరించలేదు. కనీసం రష్మిక లక్ అయినా కలిసొస్తుంది అనుకుంటే అది కూడా ఆడవాళ్ళ రూపంలో బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు అమల అక్కినేని తో కలిసి ఒకే ఒక జీవితం తో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు శర్వానంద్. అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తో ప్రమోషన్స్ చేసి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఎంతో నమ్మకంతో బాక్సాఫీసు బరిలోకి దిగిన శర్వానంద్ కి ఒకే ఒక జీవితం ఎలాటి రిజల్ట్ అందించిందో రివ్యూలో చూసేద్దాం.
బేసిక్ పాయింట్: ముగురు బెస్ట్ ఫ్రెండ్స్ కి ఒకే రకమయిన సమస్య. అందరితో కలవాలని ఉన్నా కలవలేరు కొందరు, అందరూ చూస్తుండగా మాట్లాడాలన్నా, పాటలు పాడాలన్న ఏదో బెరుకు. కొంతమంది చిన్నప్పుడు సరిగ్గా చదువులకోలేదు, చదువుకుంటే ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉండేవాళ్ళం అనుకునే వారు ఇంకొందరు. కొందరు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలని చూసినా ఇంకా వాళ్లలో అందంగా ఉన్న అమ్మాయి దొరికితే బావుంటుంది అనుకునేవారు మరికొందరు. ఇలాంటి చిత్ర విచిత్రమైన సమస్యలతోనే ఒకే ఒక జీవితం కథని రాసుకున్నాడు దర్శకుడు కార్తీక్. కథలోకి వెళితే ఆది(శర్వానంద్) కి స్టేజ్ ఫియర్. గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి(రీతూ వర్మ) ఎంతగా ఎంకరేజ్ చేసినా ఆది కి భయం పోదు. తన తల్లి (అమల) ఎదురుగా ఉంటే ధైర్యంగా పాడగలను అని ఫీలవుతాడు. శ్రీను(వెన్నెల కిషోర్) ఇంగ్లీష్ వస్తే బావుంటుంది అని ఫీలయ్యే రకం. ఇక మూడో వ్యక్తి చైతన్య(ప్రియదర్శి) పెళ్లి సమస్య. ఏ అమ్మాయి నచ్చదు. ఈ ముగ్గురికి సైన్ టిస్ట్ పరిచయమై వాళ్ళ జీవితాలనే మార్చేస్తే.. అది ఈ ఒకే ఒక జీవితం కాన్సెప్ట్.
ప్లస్ పాయింట్: తల్లి కొడుకుల ప్రేమ ఈ కథలో హైలెట్. తల్లిగా అమల కొడుకుగా శర్వానంద్ ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. కథ కొత్తగా అనిపించినా కథనం బాగా ఇబ్బంది పెట్టేసింది. శర్వానంద్ ఆది పాత్రలో స్టేజ్ అంటే భయమున్న కుర్రాడిగా, ఎమోషనల్ సీన్స్ లో, అమలతో వచ్చే ప్రతి సన్నివేశంలో తన నటనతో మెప్పించాడు. బ్రోకర్ శ్రీను పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ ఆహ్లదంగా అనిపిస్తుంది. సైన్ టిస్ట్ పాల్ గా నాజర్ బరువైన పాత్రలో ఆకట్టుకున్నారు. సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ జాక్స్ బిజోయ్ నేపధ్యం సంగీతం. ఎమోషనల్ సీన్స్ లో నేపధ్య సంగీతం బరువుగా సాగింది. అమ్మ పాట వినసొంపుగా ఉన్నప్పటికీ.. తొందరగానే మది నుండి మాయమైపోతుంది. సుజిత్ సారంగ్ కెమెరా ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించాడు. రీతూ వర్మ పాత్ర, ఆమె పెరఫార్మెన్స్ నిండుగా అనిపించాయి.. కానీ ఆమె పాత్రకి ఇంకాస్త నిడివి పెంచి ఉంటే బావుండేది. నిర్మాతలు ఖర్చు పెట్టిన ప్రతి పైసా సినిమాని కలర్ ఫుల్ గా చూపించింది.
మైనస్ పాయింట్: కథ విషయంలో సక్సెస్ అయిన కార్తీక్ కథనం విషయంలో ఫెయిల్ అయ్యాడు. కథకి బలమైన నటులని ఎంపిక చేసుకుని మంచి పనే చేసాడు. వెన్నెల కిషోర్ కామెడీతో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి పాత్ర ఇంకాస్త గట్టిగా డిజైన్ చెయ్యాల్సింది అనిపిస్తుంది. టైం ట్రావెల్ సీన్స్ ని మరింత ఆసక్తిగా చూపించాల్సింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న వేగం.. సెకండ్ హాఫ్ లో కనిపించలేదు. హీరో కి మాత్రమే టైం ట్రావెల్ లో తల్లి ని కలిసే అవకాశం ఇచ్చిన దర్శకుడు, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కి తల్లి తండ్రులు ఉంటారు, వారికీ ఎమోషన్స్ ఉంటాయనే విషయం మరిచిపోయాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ లా.. క్లైమాక్స్ లో కూడా ఓ ట్విస్ట్ కూడా పెడితే బావుండేది అనిపిస్తుంది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ లో కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది.
ఫైనల్ పాయింట్: శర్వానంద్ కథల ఎంపిక వరసగా ఫెయిల్ అవుతున్నట్టే.. ఇప్పుడు ఈ కథ విషయంలోనూ కాస్త ఆలోచించాల్సి ఉంది. అది శర్వా తప్పు కాదు. కథ బావుంది. కానీ కార్తీక్ దర్శకత్వంలోని లోపాలు కథని కప్పెట్టేశాయి. గతంలో అమ్మ చెప్పింది కథలో శర్వానంద్ అమాయకపు కొడుకు కేరెక్టర్ చేసాడు. ఇప్పుడు అమ్మ తో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అనే టైం ట్రావెల్ చేసే కథలో కనిపించాడు. రెండింటిలోనూ అమ్మ ప్రేమ కనిపిస్తుంది. టైం ట్రావెల్ కథలతో ఆదిత్య 369, రీసెంట్ గా బింబిసార కథలు సక్సెస్ అయ్యాయి. అదే సోల్ తో ఒకే ఒక జీవితం కథని కార్తీక్ తీసుకున్నాడు. 20 ఏళ్ళ క్రితం చనిపోయిన అమ్మని టైం ట్రావెల్ లో కలుసుకోవడం, ఎమోషనల్ గా తల్లీకొడుకుల బంధాన్ని పెనవేసినా.. కామెడీ తో కవర్ చేసినా.. సెకండ్ హాఫ్ లో బరువైన ఎమోషన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేసినా.. క్లైమాక్స్ ఆడియెన్ ఊహకందేలా ఉండడం రొటీన్ గా అనిపిస్తుంది. సైన్స్ గొప్పదనాన్ని-అదే టైం లో విధి రాతని మార్చలేమనే విషయాన్ని బలంగా చూపించడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ అయ్యాడు.
పంచ్ లైన్: ఒక్కసారి చూడదగ్గ సినిమా
రేటింగ్: 2.5/5