సినీ జోష్ రివ్యూ : పక్కా కమర్షియల్
నటీనటులు : గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్,అజయ్ ఘోష్, సప్తగిరి వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు..
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా
మ్యూజిక్ డైరెక్టర్: జెేక్స్ బిజోయ్
నిర్మాతలు : గీతా ఆర్ట్స్స్ 2 , యూవీ క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
రిలీజ్ డేట్ : 01-07-2022
ఇటీవల కాలంలో వకీల్ సాబ్, జై భీం, జన గణ మన వంటి సీరియస్ కోర్టు రూమ్ డ్రామాలు విశేష ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో అదే బ్యాగ్డ్రాప్ తో పక్కా కమర్షియల్ సినిమా అందించే ప్రయత్నం చేసింది గోపీచంద్ - మారుతిల జోడి. ఈ ప్రాజెక్ట్ కోసం గీతా ఆర్ట్స్-యువీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు చేతులు కలపడంతో ఈ ప్రాజెక్ట్ ప్రామిసింగ్ గా అనిపించింది. టీజర్స్, ట్రైలర్స్ లోనూ పక్కా కమర్షియల్ కళ కనిపించింది. ఖచ్చితంగా కొత్తదనం ఉండి తీరాలని కోరుకుంటున్న ప్రస్తుత ప్రేక్షక జనాల్ని కమర్షియల్ అంశాలతో కనికట్టు చేసి మెప్పించే ప్రయత్నం జరిగిందా? లేక ఏదైనా నోవెల్ పాయింట్ తో ఒప్పించే ప్రాసెస్ జరిగిందా? చూద్దాం సమీక్షలో..
కథ:
నీతిగా నిజాయితీగా ఉండే సెషెన్స్ కోర్ట్ జడ్జ్ సూర్య నారాయణ (సత్యరాజ్). తన వల్లే జరిగిన ఓ తప్పిదానికి ఆ వృత్తినే వద్దనుకుంటాడు, కామన్ మ్యాన్ గా మారిపోయి కిరానా కొట్టు పెట్టుకుంటాడు. ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉందో ఆయన కొడుకు లక్కీ (గోపీచంద్) అంత పక్కా కమర్షియల్ లాయర్ అవుతాడు. 'లా' ని వాడుకుంటాడు. 'లా' తో ఆడుకుంటాడు. ప్రతి కేసు ని క్యాష్ చేసుకుంటాడు. మరీ ఇంత కమర్షియల్ గా మారిపోయిన కొడుకుని చూసి ఆ తండ్రి ఎంత తల్లడిల్లాడో, వాడిలో మార్పు తేవడానికై ఎటువంటి ప్రయత్నం చేసాడో అన్నది క్లుప్తంగా పక్కా కమర్షియల్ కథ. దీనికి జత పడ్డ ఉప కథ ఝాన్సీ (రాశి ఖన్నా) ట్రాక్. అది వినోదాన్ని పంచిందా? విసిగించిందా? అనేది ఇక స్క్రీన్ పై చూడాల్సిందే.
నటీనటులు:
హీరో గాను, విలన్ గాను గోపీచంద్ మార్క్ ఆఫ్ పెరఫార్మెన్స్ చాలా సినిమాల్లో చూసేసాం. ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ కన్నింగ్ లాయర్ పాత్రలో కూడా ఎంతో ఈజ్‌తో నటించారు. రెగ్యులర్ కమర్షియల్ హీరో బ్యాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పెర్ఫరామెన్స్ చూపించారు. స్క్రిప్ట్ ఎంత వీక్ గా ఉన్నా గోపి లుక్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. రాశీ ఖన్నా గ్లామర్ గా అందంగా లాయర్ ఝాన్సీ అంటూ నవ్వించే ప్రయత్నంలో విఫలమైంది. స్కిన్ షో లో మాత్రం సక్సెస్ అయ్యింది. ఇంటర్వెల్ వరకు ఈ పాత్ర ఉన్నా.. ఆ తర్వాత క్లైమాక్స్ వరకు కనిపించదు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. విలన్‌గా నటించిన రావు రమేష్ తన నటనలోని కొత్త కోణాన్ని చూపించారు. అజయ్ ఘోష్ కూడా తనదైన విలనిజంతో మెప్పించాడు.
సాంకేతికంగా..
జెేక్స్ బిజోయ్ అందించిన ఆల్బమ్ లో రెండు పాటలు వినడానికి బావున్నా.. రాశి ఖన్నా ఎంతగా స్కిన్ షో చేసినా సినిమాలో మాత్రం సాంగ్స్ ప్లేస్ మెంట్స్ చాలా ఇబ్బంది పెట్టింది ప్రేక్షకులని. కెమెరా వర్క్ బావుంది. లొకేషన్స్ ని అందంగా చూపించారు. సినిమా మొత్తం మీద చెప్పుకోదగ్గది క్వాలిటీ. నిర్మాతలు రాజి పడకుండా సినిమాని రిచ్ గా తెరకెక్కించారు.
మారుతి రాసిన కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కథ పరమ రొటీను, మాటలు వినేసినవే, స్క్రీన్ ప్లె చూసేసిందే, డైరెక్షన్ పాతకాలం నాటిదే, ఎక్కడా కొత్తదనం జాడ కనబడలేదు. మనమింక చెప్పుకోవడానికి ఏమీ లేదు. మారాల్సిన టైమ్ వచ్చింది మారుతీ అని తనకు తనే చెప్పుకోవాలేమో.!
విశ్లేషణ:
పక్కా కమర్షియల్ టైటిల్ కి తగ్గట్టే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా రొటీన్ సినిమా అందించారు మారుతి. అందుకే ఓటిటి పుణ్యమా అన్ని భాషల చిత్రాలను చూస్తూ వైవిద్యం ఉన్న కథలకే ఓటేస్తున్న నేటి ప్రేక్షకులను గ్రాంటెడ్ గా తీసుకుంటే అన్ వాంటెడ్ రిజల్ట్ వస్తుందనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనంగా మారింది. ఫస్ట్ హాఫ్ వరకు సహనంగానే ఉన్న ప్రేక్షకులు సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందో.. క్లైమాక్స్ కి ఏమవ్వబోతుందో.. ఈజీగా ఊహించేసి థియేటర్స్ నుండి వాకౌట్ చేస్తున్నారు అంటే ఆ అంశం ఈ సినిమా దర్శకుడికే కాదు, ఇలాంటి కథలతో ఇంకా కంటిన్యూ అయిపోవచ్చు అనుకునే దర్శకులందరికి ఇదో పాఠం, గుణపాఠం. గోపీచంద్ నుంచి మనం కొన్ని ప్లాప్స్ చూసి ఉండొచ్చు. మారుతి నుండి ఇలాంటివి చాలా వచ్చి ఉండొచ్చు. కానీ.. గీతా ఆర్ట్స్ - యువీ క్రియేషన్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలు సినిమా జెడ్జ్ మెంట్ పై చాలా అవగాహన ఉంది అనుకునే వ్యక్తులు నుంచి ఇటువంటి అవుట్ ఫుట్ రావడం పక్కా కంప్లయింటబుల్.
Punch line : పరమ రొటీన్.!
రేటింగ్: 2/5