Advertisementt

సినీ జోష్ రివ్యూ: విరాటపర్వం

Fri 17th Jun 2022 11:59 AM
virata parvam review,virataparvam review,virata parvam movie,virata parvam telugu review,sai pallavi virata parvam review,rana virata parvam review  సినీ జోష్ రివ్యూ: విరాటపర్వం
Cinejosh Review: Virata Parvam సినీ జోష్ రివ్యూ: విరాటపర్వం
Advertisement

సినీ జోష్ రివ్యూ: విరాటపర్వం 

బ్యానర్: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌

నటీనటులు: సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, నవీన్‌ చంద్ర తదితరులు

సంగీతం: సురేశ్‌ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌

ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు

దర్శకత్వం: వేణు ఊడుగుల

రిలీజ్ డేట్: 17-06 -2022

కమర్షియల్ ఎలిమెంట్స్ అనే కంచెలు తెంచుకుని.. ఏ లెక్కలని లెక్క చెయ్యకుండా వాస్తవికతని ప్రతింబించేలా అనుకున్న కథని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకురావడం నిజంగా సాహసమనే చెప్పాలి. సరిగ్గా అలాంటి సాహసమే చేసింది విరాట పర్వం యూనిట్. 1990 దశకంలో సంచలనం సృష్టించిన వరంగల్ వాసి సరళ ఇతి వృత్తాన్ని దర్శకుడు వేణు నేపథ్యంగా తీసుకుని విరాట పర్వం కథని మలిస్తే ఆ కథలోని రవన్న-వెన్నెల పాత్రలకు తమ అభినయంతో ప్రాణం పోశారు రానా-సాయి పల్లవి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ కి హృద్యమైన ప్రేమ కథ జత పడడంతో ఓ విభిన్న చిత్రంగా మారిన విరాట పర్వం ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతినిస్తుందో సమీక్షించుకుందాం..

కథ:

ములుగు జిల్లాలో పోలీసులు, నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెల(సాయి పల్లవి) జన్మిస్తుంది. వెన్నెల తల్లికి(ఈశ్వరీరావు) పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మావోయిస్టు నేత(నివేదా పేతురాజ్‌). వెన్నెలకి మావోయిస్ట్‌ నాయకుడు రవన్న(రానా) రాసిన విప్లవ భావజాలం ఉన్న పుస్తకాలు చదువుతూ రవన్నతో ప్రేమలో పడిపోతుంది. మరోపక్క వెన్నెల తల్లిదండ్రులు వెన్నెల బావ(రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్‌ చేస్తారు. కానీ తనకి పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి.. రవన్న ని వెతికే ప్రయత్నాల్లో ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి రవన్నని వెతికి తన ప్రేమని తెలియజేసిన వెన్నెలని రవన్న స్వీకరిస్తాడా? ప్రజల సమస్యలను తీర్చడం కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? చివరికి వెన్నెల ప్రేమ ఫలించిందా.. జ్వలించిందా? అనేది తెలియాలంటే విరాటపర్వం చూడాల్సిందే.

నటీనటులు:

ఇప్పటికే హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి గ్లామర్ రోల్స్ లో ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తుందో.. భానుమతి, వెన్నెల వంటి బలమైన పాత్రలు దొరికితే అంతకుమించి చెలరేగిపోతుంది. వెన్నెలగా సాయి పల్లవి లుక్స్ విషయంలోనూ, ఆమె పెరఫార్మెన్స్ విషయంలోనూ కామెంట్ చెయ్యడానికి ఏమిలేదు.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం తప్ప. ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే, యాక్షన్‌ సీన్స్‌లో విజిల్స్ కొట్టించింది. కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. నటుడిగా తనని తాను శాటిస్ ఫై చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కేరెక్టర్స్ ఎంచుకునే రానా విరాట పర్వం విషయంలోనూ అదే చేసాడు. విరాట పర్వం ఈవెంట్ లో ఈ సినిమా డైరెక్టర్ వేణు చెప్పినట్టే ఈ కథకి వెన్నెల సాయి పల్లవి అయితే, చంద్రుడు రానా అన్నమాట అక్షరాలా నిజమే అనిపించింది రవన్న పాత్రలో రానా అభినయం చూస్తే.! మావోయిస్టు సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్‌ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్‌, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. రాహుల్‌ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా..

విరాట పర్వం సాంగ్స్ సందర్భోచితంగా ఆకట్టుకున్నాయి, సురేశ్‌ బొబ్బిలి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా అద్భుతంగా ఉంది. ఇక దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌ కెమెరా వర్క్ కూడా కథకి తగ్గట్టు కరెక్ట్ టోన్ లో కుదిరింది.  తెలంగాణ పల్లెలు, అడవులను తమ కెమెరాలో అందంగా చూపించారు. విరాట పర్వంలో డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్, చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా వంటి డైలాగ్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.      

దర్శకుడు వేణు ఊడుగుల నీది నాది ఒకే కథ సినిమాతోనే తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు విరాట పర్వంతో తాను అనుకన్న కథను అనుకున్న విధంగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా తెరకెక్కించాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్‌. నటీనటుల నుండి తనకి కావాల్సిన పెరఫార్మెన్స్ ని రాబట్టుకున్నాడు. ఒక అమ్మాయి ప్రేమను విప్లవం కంటే గొప్పగా చూపించాడు.  

విశ్లేషణ 

పోలీస్ - నక్సల్స్ పోరుని తెరకెక్కించే ప్రాసెస్ లో మేకర్స్ కి ఎటువైపు స్టాండ్ తీసుకున్నా రిస్కె! ఓ వర్గాన్ని పాజిటివ్ గా చూపిస్తే, మరో వర్గం విరుచుకుపడుతుంది. అలాగని అటువంటి కథాంశాన్ని న్యూట్రల్ గా డీల్ చేస్తే.. సరిగ్గా దిద్దని సిందూరమవుతుంది. పోలీస్ లకి విప్లవ కారులకి మధ్య ఓ ప్రేమ జంట కథని నడుపుతామంటే మణిరత్నం అమృతమైనా రుచించదు. పూరి జగన్నాధ్ 143  చెప్పినా చెవికెక్కదు. మరి ఇటువంటి టిపికల్ అండ్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తో సినిమా చెయ్యాలనుకున్న దర్శకుడు వేణుకి సాయి పల్లవి రూపంలో స్ట్రాంగ్ సపోర్ట్ దొరికింది అని చెప్పాలి. విప్లవాన్ని, విధ్వంశాలని పట్టించుకోకుండా ప్రేక్షకులు పూర్తిగా వెన్నెల కథకే కనెక్ట్ అయ్యేలా సాయి పల్లవి తన అభినయంతో కట్టిపడేస్తే, అందుకు రానా కొండంత అండగా నిలబడితే, కథకి మాత్రమే కట్టుబడి అనుకున్న అవుట్ ఫుట్ ని విరాట పర్వం రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు దర్శకుడు వేణు. సోకాల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోయినా భావోద్వేగాలే ప్రధాన బలంగా రూపొందిన ఈ చిత్రానికి ఈతరం ప్రేక్షకులు ఎటువంటి తీర్పునిస్తారో వేచి చూడాలి. థియేటర్స్ లో ఓ రేంజ్ వరకు ఓకె అనిపించుకునే ఈ చిత్రానికి ఓటిటిలో మాత్రం విశేషమైన ఆదరణ దక్కే అవకాశాలు పుష్కలం.!

పంచ్ లైన్: విభిన్న చిత్రం.. విరాటపర్వం

రేటింగ్ : 2.5/5

Cinejosh Review: Virata Parvam:

Virata Parvam Movie Telugu review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement