సినీ జోష్ రివ్యూ: విక్రమ్: హిట్ లిస్ట్
నిర్మాణ సంస్థ : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: గణేష్ గంగాధరం
ప్రొడ్యూసర్స్: కమల్ హాసన్, R. మహేంద్రన్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
రిలీజ్ డేట్: 03-06-2022
'ఏంట్రా యాక్టింగ్ చేస్తున్నావ్ నువ్వేమన్నా కమల్ హాసన్ అనుకుంటున్నావా' అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ ఒక్క వాక్యం చాలు కమల్ హాసన్ ఎంతటి నటుడు, ఎలాంటి నటుడో చెప్పెయ్యడానికి. మన దగ్గర సుకుమార్ ఎలాగో తమిళ సినిమా ఇండస్ట్రీలో అలా విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ - కనగరాజ్ ల కలయికే చాలా ఆసక్తిని సృష్టిస్తే.. అదే ప్రాజెక్ట్ కి విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి వెర్సటైల్ యాక్టర్స్ తోడవడం అంచనాలను అమాంతం పెంచేసింది. ఇంతటి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కి యువ సంగీత సంచలనం అనిరుద్ రవి చంద్రన్ మ్యూజిక్ ఇంకా బలం కలిపింది. చాలా ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ ని వెండితెరపైకి తీసుకొచ్చిన విక్రమ్ ఎలా ఉన్నాడు? ఏం చేసాడు? ఏం చెప్పాడు చూద్దాం రివ్యూలో..
కథ:
మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠా పోలీస్ లని వరుసగా హత్యలు చేస్తుంటారు. ఈ హత్యల్లోనే ఓ మలుపు ఉంటుంది. అందులోనుండి వచ్చే ఓ సాధారణ వ్యక్తిలా కర్ణణ్ (కమల్ హాసన్) తెర పైకి వస్తారు. ముసుగు ముఠాను పట్టుకునేందుకు స్పై ఏజెంట్ అమర్ (ఫహద్ ఫాజిల్) అతని టీమ్‌తో ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్ హత్య వెనుక డ్రగ్స్ మాఫీయా లీడర్ సంతానం (విజయ్ సేతుపతి)ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణన్ హత్య కేసులో అమర్ కి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. పోలీస్ లని వరస హత్యలు చేస్తున్న సంతానం మోటివేషన్ ఏమిటి? కర్ణన్ ఏజెంట్ విక్రమ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్ వేసిన ప్లాన్ ఏంటి? అమర్ కర్ణన్ కి ఏవిధంగా సహాయం చేశాడు? అసలు విక్రమ్ కథలో సూర్య పార్ట్ ఏమిటి అనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్ మీద విక్రమ్ చూడాల్సిందే.
నటీనటులు:
కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు ఏముంటుంది. ఈ వయసులోనూ కమల్ హాసన్ యాక్షన్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. మాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదానే. విక్రమ్ గా కమల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. యాక్షన్ సీన్స్‌లో కమల్ చూపించిన యాటిట్యూడ్ అదిరిపోయింది. తాగుబోతుగా, డ్రగ్స్ బానిసగా కమల్ దుమ్ము దులిపేసారు. ఇక ఆయనే స్వయంగా రాసిన పాటైతే తమిళ వర్షన్ కి పెద్ద ఎస్సెట్. తెలుగులోనూ బాగా సెట్ అయ్యింది. క్లైమాక్స్‌లో కమల్ హాసన్ చేసే ఫైట్ సినిమాకే హైలైట్. విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్రగ్స్ మాఫీయా లీడర్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి గెటప్ కానీ, యాక్టింగ్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. కానీ విజయ్ సేతుపతిని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వినాల్సి వస్తుంది దర్శకుడికి. స్పై ఏజెంట్ అమర్‌గా ఫహద్ ఫాజిల్ యాక్షన్ సీన్స్‌లో ఇరగదీసాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఫహద్ నటన వేరే లెవల్. క్లైమాక్స్‌లో సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. మిగతా నటులు పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా:
ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి. అనిరుధ్ నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. యాక్షన్ సీన్స్ లో బీజీఎమ్ ఇరక్కొట్టేసాడు, విక్రమ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఇకపై కూడా వినాలనిపించేలా అద్భుతంగా ఉంది. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్, నైట్ ఎఫెక్ట్స్ ని చాలా అందంగా చూపించారు. స్క్రీన్‌ప్లేలో లోపాలున్నప్పటికీ స్క్రీన్ పై కనిపిస్తోన్న ప్రతిభావంతులైన నటులు వాటిని కప్పిపుచ్చేసారు, కవర్ చేసేసారు. అలాగే ఫైట్ సీన్స్ డిజైన్ చేసిన తీరు బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజింగ్ లో ఎంత కేర్ తీసుకున్నారో స్క్రీన్ పై తెలుస్తుంది. నిర్మాణ విలువలు కథ స్థాయిని పెంచాయి. కలర్ ఫుల్ గా విక్రమ్ ని స్క్రీన్ పైకి తెచ్చాయి.
విశ్లేషణ:
తాను అనుకున్న కథని కాదని కమల్ హాసన్ చెప్పిన పాయింట్ తో విక్రమ్ కథని అల్లిన కనకరాజ్ కంగారు పడ్డారో.. కన్ఫ్యూజ్ అయ్యారో కంప్లీట్ నెస్ మాత్రం తేలేకపోయారు. ఓపెనింగ్ సీన్ ఇంట్రెస్టింగ్ గా మలిచినా, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటెన్సివ్ గా ఉన్నా సెకండ్ హాఫ్ లో మాత్రం కథనం దారితప్పింది. జోరు తగ్గింది. బోరు కొట్టింది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కాస్త సర్దుకున్న దర్శకుడు సూర్య ఎంట్రీ కి పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసాడు. స్వతహాగా మేటి నటుడైన సూర్య ని సూపర్బ్ లుక్ తో స్క్రీన్ పై చూపించాడు. సినిమాగా ఓ మోస్తరుగానే ఆకట్టుకున్నప్పటికీ.. ఇంతటి మేటి నటులతో ఈ మాత్రం అవుట్ ఫుట్ ఇవ్వడంలో తనవంతు ప్రయత్నం చేసిన కనకరాజ్.. డైరెక్టర్ గా తానిప్పటివరకు పొందిన క్రెడిబులిటీని పోగొట్టుకోలేదనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీ వరకు విక్రమ్ కి తిరుగుండదు. తెలుగు ట్రేడ్ లోనూ వినిపిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం విక్రమ్ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న హీరో నితిన్ అండ్ హిజ్ బ్యానర్ హిట్ కొట్టేసినట్టే. విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం ఒక్క నైజాం ఏరియా లోనే వచ్చేస్తాయి అనేది ట్రేడ్ టాక్. ఇక మిగిలినదంతా ప్లస్సే, బోనస్సే!
పంచ్ లైన్: స్ట్రాంగ్ సబ్జెక్ట్ లేకున్నా తిరిగిన చక్రమ్.. విక్రమ్
రేటింగ్: 2.75/5