Advertisementt

సినీ జోష్ రివ్యూ : ఆచార్య

Fri 29th Apr 2022 10:53 AM
acharya movie,acharya review,acharya telugu movie review,acharya movie review,chiranjeevi acharya review,ram charan acharya movie review,koratala shiva acharya review,acharya review and rating  సినీ జోష్ రివ్యూ : ఆచార్య
Cinejosh Review: Acharya సినీ జోష్ రివ్యూ : ఆచార్య
Advertisement
Ads by CJ

సినీ జోష్ రివ్యూ : ఆచార్య

రిలీజ్ డేట్ : 29-04-2022

బేనర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్

సమర్పణ : కొణిదెల ప్రొడక్షన్స్

నటీ నటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెగ్డే, సోనూసూద్, నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు (అతిధి పాత్రల్లో సత్యదేవ్, రెజీనా, సంగీత)

సినిమాటోగ్రఫీ : తిరు

ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్

ఎడిటింగ్ : నవీన్ నూలి

ఫైట్స్ : రామ్ లక్షణ్

సంగీతం : మణిశర్మ

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

రచన, దర్శకత్వం : కొరటాల శివ

అద్భుత విజయాలెన్నింటికో అడ్రస్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి

అప్రతిహత విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల శివ..

అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉన్న ఈ ఇద్దరి కలయికే చాలు ఆచార్య పై అందరి దృష్టీ కేంద్రీకృతం కావడానికి.!

అయితే ఆ అగ్నికీ - ఆజ్యానికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూపంలో వాయువు కూడా తోడైతే... ఇక చెప్పేదేముంది అంచనాలు దావానలం అయ్యాయి. అభిమానులు దాసోహం అయ్యారు.

ఎపుడెపుడు ఆ తండ్రీ కొడుకుల కనుల పండుగ వంటి కలయికని చూసి ఆనందిద్దామా అని... ఎపుడూ కొత్తగా అనిపించే కొరటాల శైలి కథనాన్ని మరోసారి తెరపై ఆస్వాదించాలని అశేష ప్రేక్షకలోకం ఆసక్తిగా, ఆతృతగా ఆచార్య కోసం ఎదురు చూస్తూ ఉంది.

కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల కాస్త జాప్యమే జరిగినప్పటికీ ఎప్పటికపుడు అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఒక్కొక్క సాంగ్ తో ఊపు పెంచుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వరుస ఇంటర్వూస్ తో హడావిడి చేస్తూ వచ్చిన ఆచార్య మొత్తానికి నేడు థియేటర్స్ లో దర్శనమిచ్చాడు. మరీ ఆచార్య ఎవరు, కథలోని ధర్మస్థలి నేపధ్యం ఏమిటి, సిద్ద పాత్రతో ఆచార్య కథనం ఏ స్థాయిలో ప్రభావితం అయింది అనే పలు ఆసక్తికర అంశాలు ఈ విశ్లేషణలో చూద్దాం.!

కథ :  మహేష్ బాబు స్వరంతో ధర్మస్థలి ప్రాంత విశిష్టతని వివరిస్తూ కథ ఆరంభమవుతుంది. ఓ సాధారణ వ్యక్తిగా ఆ ప్రాంతంలోకి అడుగుపెడతాడు ఆచార్య(చిరంజీవి). అక్కడి వారందరితో కలిసిపోయిన ఆచార్య ఆ ప్రాంత ప్రజల పట్ల ఆగడాలు చేస్తున్న మున్సిపల్ చైర్మన్ బసవ(సోను సూద్) ముఠాకి ఎదురు తిరుగుతాడు. ధర్మస్థలికి, పాద ఘట్టం ప్రాంతానికి ఓ  రక్షకుడిగా నిలబడతాడు. దానితో ఆచార్యకి బసవకి మధ్య పోరాటం ప్రారంభమవుతుంది. సరిగ్గా ఆ సందర్భంలో సిద్ద ప్రస్తావన వస్తుంది. అక్కడితో కథ మరో మలుపు తిరుగుతుంది. అసలు ఆ సిద్ద ఎవరు? ఆచార్య ఆ ప్రాంతానికి రావడానికి గల కారణం ఏమిటి? ఆచార్యకి సిద్దకి ఉన్న అనుబంధం ఏమిటి? సిద్ద నీలాంబరిల ప్రేమ కథ ఏమైంది? ఆచార్య వచ్చిన లక్ష్యం నెరవేరిందా...  ఇవన్నీ ద్వితీయార్ధంలో రివీల్ అవుతాయి.

కథనం : స్వతహాగా సాదా సీదాగా సినిమాని ఆరంభించి ఆపై అంచెలంచెలుగా హైట్స్ కి తీసుకువెళ్లే కొరటాల శివ అదే పంథాను ఆచార్యలోను పాటించారు. ఆచార్య సినిమా కూడా చాలా సాదాసీదాగా ఆరంభం అవుతుంది. అయితే ఇక్కడ జరిగిన తప్పిదం ఏమిటి అంటే అంచెలంచెలుగా ఎదగడం అనేది ఆచార్య విషయంలో జరగలేదు. దాంతో చాలా నీరసంగా సాగిన ప్రథమార్ధం.. ఇది చిరంజీవి చెయ్యాల్సిన సినిమానేనా.. ఇది కొరటాల రాసిన కథేనా అనుకునేలా చేస్తుంది. సిద్ద పాత్రతో అయినా కథలో ఊపొస్తుంది అని ఆశించిన ప్రేక్షకులకి రెండో భాగంగాలోను నిరాశే మిగిలింది. కొంతలో కొంత సిద్ద పాత్రతో కథలో కొంత కదలిక వచ్చినప్పటికీ అది కూడా కొంత కదలికగానే మిగిలిపోయింది. తండ్రి కొడుకులైన మెగా హీరోల కలయికని తెర పై చూడడానికి ముచ్చటపడే అభిమానులకి మాత్రమే ఆ సన్నివేశాలు కాస్త రుచిస్తాయి. సామాన్య ప్రేక్షకులకి మాత్రం అవి కూడా సాగదీతగానే అనిపిస్తాయి.

విశ్లేషణ : ధర్మస్థలికి 800 ల ఏళ్ళ చరిత్ర ఉందంటూ కథని ఆరంభించిన కొరటాల శివ కథనం కోసం 80 వ దశకానికి వెళ్లినట్టున్నారు. దానితో థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడికి రాబోయే సన్నివేశాలన్నీ తెలిసిపోయినట్టు, ఆల్రెడీ చూసేసినట్టుగా అనిపించడం మొదలయింది. సినిమా నెరేషన్ గ్రిప్పింగ్ గా ఉండకపోవడం వలన, కథలో టెంపో లేకపోవడం వలన కామ్ గా ఖాళీగా కూర్చున్న ఆడియన్స్ కి ఆటోమాటిక్ గా రాబోయే సీన్స్ అన్నీ అర్ధం చేసేసుకునే  తీరిక దొరికింది. బహుశా ఆచార్య విషయంలో రెండు రకాల వాదనలు వినిపించే అవకాశం ఉంది. చిరంజీవి సీనియారిటీ కొరటాల శివ రైటింగ్ ని డామినేట్ చేసింది అని కొంతమంది వాదించొచ్చు. ఇద్దరు మెగా హీరోలని ఏక కాలంలో హ్యాండిల్ చెయ్యడంలో కొరటాల శివే ఫెయిల్ అయ్యాడేమో అని మెగా ఫాన్స్ కంప్లైంట్ చెయ్యొచ్చు. ఎవరి వాదన వారిదే అయినప్పటికీ వేదన మాత్రం ప్రేక్షకులది. మొత్తానికి మెగా అభిమానులనే రెండున్నర గంటల సినిమాలో రెండు పాటలు, రెండు సీన్స్ మాత్రమే మెప్పించగలిగాయి అంటే ఆచార్యని ఎలా మలిచారో అర్ధం చేసుకోవచ్చు.!

నటీనటులు : 151 సినిమాలు చేసిన అనుభవజ్ఞుడు చిరంజీవి గారి అభినయాన్ని మనం విశ్లేషించలేం కానీ.. బహుశా ఆ అనుభవమే ఆయన సహజ సిద్దమైన నటనకు అడ్డుపడుతుందేమో అనిపించేలా చేసింది ఆచార్య. ఆ రోజుల్లో ఆ డైలాగ్ డెలివరీకి క్లాప్స్ పడ్డాయేమో కానీ ఈ రోజుల్లో నేటి స్పీడ్ యుగంలో ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఆయన డైలాగ్ డెలివరీ మ్యాచ్ అవ్వలేదా అనిపించాయి కొన్ని సీన్స్ చూస్తుంటే.! అఫ్ కోర్స్ కొన్ని కొన్ని ఎక్సప్రెషన్స్, కొన్ని కొన్ని డాన్స్ మూమెంట్స్ నేటికీ మెగాస్టార్ మాత్రమే చెయ్యగలరు అని చెప్పడంలో సందేహం లేదు. ఆరు పదులు దాటిన వయసులోనూ ఆయనంత చలాకీగా డాన్స్ చేస్తుంటే సినిమా ఎలా ఉన్నా ఆయన చురుకుదనం మాత్రం అందరి చూపులని ఆకర్షించిందని ఖచ్చితంగా చెప్పాలి. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ లో రామరాజుగా గా అదరగొట్టిన రామ్ చరణ్ ఆచార్యలోను సిద్ద గా తన పాత్రకు తగ్గ న్యాయమే చేసాడు. ఉన్నత వరకు సిద్ధగా సినిమాని మోశాడు. అలాగని మరీ కథలోని లోపాలని, కథనంలోని  తప్పిదాలను కప్పిపుచ్చేంత స్థాయిలో మాత్రం కాపాడలేకపోయాడు. పూజ హెగ్డే తో చేసిన నీలాంబరి సాంగ్ లో ఎంత క్యూట్ గా కనిపించాడో, తన తండ్రి చిరు తో కలిసి స్టెప్స్ వేసిన బంజారా సాంగ్ లో మళ్ళీ తన నాటు చూపించాడు. పూజ హెగ్డే పాటలో చాలా అందంగా కనిపించింది. సినిమాలోనూ ఆకర్షణీయంగా కనిపించింది. అంటే కనిపించడం తప్ప తనకిక చెయ్యడానికి ఏం లేకపోయింది. సోను సూద్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని మరీ రెగ్యులర్ విలన్ లా మార్చెయ్యడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన అతని అభిమానులకి బహుశా నచ్చకపోవచ్చు. నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్, వెన్నెల కిషోర్ అందరివీ చిన్న చిన్న పాత్రలే. ఉన్నంతలో చెయ్యగలిగింది చేసారు. లాహే లాహే పాటలో కనిపించిన సంగీత సంగీతాన్ని మించి చిందులేస్తే, సానా కష్టం పాటలో కనిపించిన రెజినా అవసరం లేనంతగా అందాలు ఆరబోసింది. గెస్ట్ రోల్ లో సత్యదేవ్ పెరఫార్మెన్స్ మాత్రం ఇంప్రెసివ్ గా వుంది.

టెక్నీషియన్స్ : సాంకేతిక నిపుణుల్లో ముందుగా చెప్పుకునేది.. మెప్పు పొందేది ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్. 20 ఎకరాల స్థలంలో ధర్మస్థలిని స్థాపించి దాన్నో టెంపుల్ సిటీగా క్రియేట్ చెయ్యడం ఆషామాషీ వ్యవహారం కాదు. వెండితెర పై చూస్తుంటే నిజంగానే ఓ అద్భుతాన్ని చూసినట్టుగా అనిపించింది. అలాగే ఆ అద్భుతమైన సెట్ కి తన కెమెరా కళ్ళతో తెరపై ప్రాణప్రతిష్ట చేసారు సినిమాటోగ్రాఫర్ తిరు. ఆచార్యకి సంబంధించి ఖచ్చితంగా మెచ్చుకు తీరాల్సిన సాంకేతిక నిపుణులు వీరిద్దరూ. అలాగే కంప్లైంట్స్ అంటూ మొదలు పెడితే.. మణిశర్మతోనే ఆరంభించాలి. గతంలో చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో మెగా మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ ఆచార్య తో మళ్ళీ చింపేస్తాడని గంపెడు ఆశలు పెట్టుకున్న మెగా అభిమానుల్లో నిలువెల్లా నీరసాన్ని నింపేసాడు ఆయన. ఇటు పాటల్లోనూ ఊపులేక, అటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనూ ఉత్సాహం రాక పాపం విలవిల్లాడిపోయారు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలిని ఎవరెంత కెలికారో.. ఎవరెంత నలిపారో తెలియదు కానీ తాను కూడా కళ్ళకి తప్ప కత్తెరకి పని చెప్పలేదు. రామ్ లక్షణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కి ఫ్యాన్సే కన్విన్స్ అవ్వడం లేదు అంటే కామన్ ఆడియన్స్ సంగతి వేరే చెప్పక్కర్లేదుగా.! నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ కి వంక పెట్టలేం. ఎంత లేట్ అవుతూ వచ్చినా ఓపిగ్గా వెయిట్ చేసారు.. ఎంత అవసరం అన్నా ఉదారంగా ఖర్చు పెట్టారు. కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోవడంలోనే భంగపాటు ఎదురయ్యేలా ఉంది. ఇక ఈ ఆచార్య ఆవిష్కర్త కొరటాల శివ విషయానికి వస్తే... ముందుగా కొంత ఆశ్చర్యాన్ని ఆపై మరికొంత అనుమానాన్ని వ్యక్తం చెయ్యాలి. వరుస విజయాలతో మాంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు ఒక్కసారిగా పక్కదారి పట్టి పాతకాలం నాటి మూస ధోరణిలోకి వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మూడేళ్ళుగా చెక్కుతూ వచ్చి కూడా ముతక సినిమాని అందించడం అనేది పలు అనుమానాల్ని రేకెత్తిస్తుంది. మరి కొరటాల కలానికి ఆ కారణాలేమిటో తెలిసే ఉంటాయి కనుక ఈ ఆచార్య నేర్పించిన గుణపాఠం తన కళ్ళు తెరిపిస్తుందనీ.. అందరి నోళ్లు మూయించే కరెక్ట్ కమ్ బ్యాక్ ఇప్పిస్తుందనీ ఆశిద్దాం.

సినీజోష్ రేటింగ్ : 2.25/5

పంచ్ లైన్ : శివమెత్తేందుకు సరిగా సిద్ధమవని ఆచార్య.!

Cinejosh Review: Acharya:

Acharya Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ