రేటింగ్: 2.0/5
బ్యానర్: సన్ పిక్చర్స్
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: డీ ఇమామ్
సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు
ఎడిటింగ్: రూబెన్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: పాండిరాజ్
రిలీజ్ డేట్ : 10 - 03- 2022
కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో తన సినిమాలని ఓటిటి నుండి రిలీజ్ చేసి.. అద్భుతమైన హిట్స్ అందుకున్న సూర్యా దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్స్ లో తన సినిమాని రిలీజ్ చేసారు. ఆకాశం నీహద్దు రా, జై భీమ్ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసిన సూర్య ఈటి(ఎవరికీ తలవంచడు) మూవీని నేడు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. పాండిరాజ్ దర్శకత్వంలో లాయర్ గా సూర్య మరోసారి ప్రేక్షకులని అలరించడానికి ఈటి తో రెడీ అయ్యారు. తెలుగులోనూ భారీ ప్రమోషన్స్ తో సూర్య ఈటిపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చెయ్యడమే కాదు, పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ పై పోటీకి సై అనడంతో ఈటిపై అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. మరి ఈటితో సూర్య ఆడియన్స్ అంచనాలు అందుకున్నారో.. లేదో.. సమీక్షలో చూసేద్దాం.
కథ:
సైంటిస్ట్ కావాలనుకొన్న కృష్ణ మోహన్ (సూర్య) క్రిమినల్ లాయర్ గా అమ్మాయిలపై, మహిళలపై జరిగే అన్యాయాలను ఎదిరిస్తాడు. కృష్ణ మోహన్ ఊరిలో, పక్క ఊరిలో అమ్మాయిలు పుడితే పండగ చేసుకుంటారు. వారికి పెళ్లి చేసాక కూడా పుట్టింటికి తీసుకొచ్చి చీర, సారే పెట్టి ఉత్సవాలు చేస్తారు. అలాంటి ఊళ్ళ మధ్యన ఓ గొడవ రెండు ఊర్లని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఆ ఊరి అమ్మాయిని ఈ ఊరికి ఇవ్వరు, ఈ ఊరి అమ్మాయిని ఆ ఊరికి ఇవ్వనంతగా గొడవలు పెరిగిపోతాయి. కృష్ణ మోహన్ పక్కఊరి అమ్మాయి అదిరా (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఆ ఊళ్ళ మధ్యలో ఉన్న గొడవలు వారి ప్రేమకు సమస్య అవుతుంది. ఆ క్రమంలోనే కృష్ణ మోహన్ ఊరిలో అమ్మాయిలు వరసగా చనిపోతుంటారు. అసలీ కృష్ణ మోహన్ ఊరి అమ్మాయిలు ఎందుకు చనిపోతారు? కృష్ణ మోహన్ తన ఊరి అమ్మాయిలని ఎలా కాపాడుకున్నాడు? రెండు ఊర్ల వైరం తో తన ప్రేమని వదులుకున్నాడా? కృష్ణ మోహన్ అధిరని పెళ్లాడాడా? అనేది ఈటి చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు:
సూర్య మరోసారి ఎమోషనల్ గా కనిపించారు. కాకపోతే లాయర్ గా కృష్ణమోహన్ పాత్ర సూర్య స్టామినాకు తగినట్టు లేదు. యాక్షన్ సీన్స్, డాన్స్ లు విషయంలో సూర్య చేసిన విన్యాసాలు సినిమాకు హైలెట్. మాస్ ఆడియన్స్ కి సూర్య స్టయిల్ నచ్చుతుంది. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గ్లామర్ పరంగా, ఫెర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదనిపించింది. సెకండ్ హాఫ్ లో ఓ కీలకమైన సీన్ లో ప్రియాంక పెరఫార్మెన్స్ బావుంది. భార్యభర్తలుగా శరణ్య, సత్యరాజ్ మధ్య సీన్లు అక్కడక్కడా ఫన్ క్రియేట్ చేస్తాయి. సత్యరాజ్ కేరెక్టర్ ని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. వినయ్ రాయ్ విలనిజంగా కూడా పెద్దగా పండలేదు. మిగతా వారు తమ పరిధిలో ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు పాండిరాజ్ ఫ్యామిలీ డైరెక్టర్, సూర్య మాస్ హీరో. ఇక్కడ దర్శకుడు ఈటి కోసం ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ప్రస్తుత కాలంలో ఆడపిల్లపై జరిగే దారుణాలు ఎక్కువైపోయాయి. అదే కాన్సెప్ట్ తో ఈ ఈటి తెరకెక్కింది. సూర్య కోసం మాస్ కథనే రాసుకుంటూ, అందులోనే తన ఫ్యామిలీ డ్రామా కలపాలనే ప్లాన్ చేసారు దర్శకుడు. కానీ ఎమోషనల్ పాయింట్‌ను కథగా మలచడంలో తడబాటు కనిపిస్తుంది. కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ, లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. సూర్య అమ్మ కేరెక్టర్ చేసిన శరణ్య మాటి మాటికీ ఫోన్ చేసి, భోం చేశావా, నీళ్లు తావాగా.. అని అడుగుతుంది. అవన్నీ చిరాకు తెప్పించే సీన్స్. ఈ సినిమాకు కథనం మైనస్ అనిచెప్పవచ్చు. బలమైన సన్నివేశాలు లేకపోవడం, ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేసే అంశాలు లేకపోవడం వల్ల సినిమా సాదాసీదాగా సాగుతుంది. చివరి 20 నిమిషాలు కథను డీల్ చేసిన విధానం బాగుంది. హీరో, విలన్ల మధ్యన వచ్చే యాక్షన్ సన్నివేశాలు సాగతీసినట్లు, కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఆరవ తంభీల ఓవేరేక్షన్ యాక్షన్, తమిళ వాసనలు, మసాలు దట్టించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే అయినా.. మాస్ ఆడియన్స్ ని రప్పించగల చిత్రంగా ఈటి మిగిలిపోతుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. ఇమామ్ మ్యూజిక్ ఓకె ఓకె. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా అనిపిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్ల చిత్రీకరణ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రూబెన్ ఎడిటింగ్ లో కొన్ని సీన్ల లెంగ్త్ తగ్గించడానికి అవకాశం ఉందనిపిస్తుంది. ఫైట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.