సినీజోష్ రివ్యూ: సామాన్యుడు
నటీనటులు: విశాల్, డింపుల్ హయ్యాతి, యోగిబాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కెవిఎన్ రాజా
ఎడిటింగ్: శ్రీకాంత్
నిర్మాత: విశాల్
దర్శకుడు: శరవణన్
కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. డిటెక్టీవ్, అభిమన్యుడు సినిమాల హిట్ తర్వాత విశాల్ సినిమాలు తెలుగులోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. తమిళం తో పాటుగా తెలుగులోనూ ప్రమోషన్స్ చేసి తన సినిమాలను విడుదల చేస్తున్నాడు విశాల్. ఇక కరోనా థర్డ్ వేవ్ లేకపోతే.. సంక్రాంతికి కానీ, లేదంటే అన్ని అనుకూలిస్తే రిపబ్లిక్ డే కి కానీ విడుదల కావాల్సిన విశాల్ సామాన్యుడు సినిమా.. చివరికి ఫిబ్రవరి 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ హీరోగా విశాల్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు. మరి సామాన్యుడు నాట్ ఏ కామన్ మ్యాన్ అంటూ.. యాక్షన్ ఎంటర్టైనర్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ సామాన్యుడు ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.
కథ:
పోరస్ (విశాల్) సామాన్య యువకుడు, పోలీస్ కావాలని ఆశపడతాడు. పోలీస్ కావడం కోసం వ్రాత పరీక్షకు హాజరవడమే కాకుండా వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తూ మైథిలి(డింపుల్) ప్రేమలో ఉంటాడు. పోరస్ పోలీస్ అవ్వకముందు నుండి తప్పులని ఎదురిస్తూ.. న్యాయం కోసం పోరాడతాడు. అలాంటి క్రమంలో పోలీస్ అవ్వకుండానే ఇలాంటి గొడవలు జోలికి వెళితే ఉద్యోగం రాదని, అప్పటివరకు కామ్ గా ఉండమని పోరస్ తండ్రి అతనికి చెబుతాడు. కానీ పోరస్ తన సోదరి ద్వారక (రవీనా రాయ్)ని ఏడిపించిన వ్యక్తిని కొట్టినప్పుడు అతనికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే పోరస్ చెల్లెలు ద్వారకా హత్య చెయ్యబడుతుంది. ద్వారకతో పాటుగా.. మరికొందరు హత్య చేయబడతారు. ఈ హత్యల వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ హత్యలకు రాజకీయాలే కారణమా? అసలు ఈ కేసుని పోరస్ ఎలా ఛేదించాడనేది సామాన్యుడు మిగతా కథ.
పెరఫార్మెన్స్:
విశాల్ ఎప్పటిలాగే సామాన్యమైన యువకుడు పోరస్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాల్లోను అదరగొట్టేసాడు. హీరోయిన్ డింపుల్ హయాతికి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. ఆమె గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు. కమెడియన్ యోగిబాబు అక్కడక్కడా నవ్వించాడు. మిగతా నాస్తులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
క్రైం థ్రిల్లర్ డ్రామా, యాక్షన్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులకి కొత్త కాకపోయినా.. అందులోని ట్విస్ట్ లు కొత్తగా, కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. క్రైమ్ థ్రిల్లర్స్ సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా దర్శకుడు శరవణన్ సామాన్యుడు కథనాన్ని ఇంట్రెస్టింగ్ గానే మలిచారు. స్టార్టింగ్ సీన్స్ సదాసీదాగానే అనిపించినా, కథలోకి వెళ్ళేకొలిదీ ఆసక్తికరమైన అంశాలని జోడించాడు. ఫస్ట్ హాఫ్ అంతా హత్యలు, ఆ హత్యలకు పొలిటికల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగానే అనిపిస్తాయి. హత్య చెయ్యబడిన వారి బ్యాగ్ డ్రాప్ గురించి ఫస్ట్ హాఫ్ లోనే చూపించేసారు. సెకండ్ హాఫ్ లో ఆ హత్యలు ఎందుకు జరుగుతూన్నాయో కనిపెట్టడం హీరో వంతు. హీరో విలన్స్ ని వేటాడే తీరు అంత ఆసక్తికరంగా అనిపించదు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ సదా సీదాగా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ని కలిగించినా దర్శకుడు దానిని మెయింటింగ్ చెయ్యలేకపోయాడు. సినిమా మొత్తం మీద విశాల్ ఒక్కడే ప్లస్ పాయింట్. ఇది విశాల్ మార్క్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు.
ఇక యువన్ శంకర్ రాజా సంగీతం, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫి అన్ని ఓకె ఓకె అనిపిస్తాయి. ఎడిటింగ్ లో మాత్రం కత్తెర వేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి.
రేటింగ్:1.5/5