సినీజోష్ రివ్యూ: స్కైలాబ్
బ్యానర్: బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ
నటీనటులు: నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సహ నిర్మాత: నిత్యామీనన్
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
1970 టైమ్ లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక స్కైలాబ్ సక్సెస్ అవ్వక అది ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడు పడిపోతుందో.. అని ప్రపంచంలోని చాలా దేశాలకి చెందిన ప్రజలు చాలా రోజుల పాటు భయంభయంగా బ్రతికారు. ఇప్పుడు అదే ఒరిజినల్ కథతో స్కైలాబ్ అంటూ దర్శకుడు విశ్వక్ ఖండేరావు సినిమా చేసాడు. విలక్షణ నటిగా పేరున్న నిత్యా మీనన్ కీలక పాత్రలో, విలక్షణ నటుడు సత్య దేవ్ నటించిన ఈ స్కైలాబ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసాయి. మరి ఈ రోజు డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కైలాబ్ ప్రేక్షకులని ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
ఆనంద్ (సత్యదేవ్) తన తాతగారి ఊరైన బండ లింగంపల్లికి వస్తాడు. బండ లింగంపల్లికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) బాగా బ్రతికిన ఫ్యామిలీ.. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఫ్యామిలీని గట్టించేందుకు ప్లాన్స్ చేస్తుంటాడు. అదే సమయంలో ఆనంద్ సుబేదార్ రామారావుతో పరిచయం పెంచుకుని ఆ ఊరిలో చిన్న క్లినిక్ ఓపెన్ చేయాలనుకుంటాడు. ఇద్దరూ క్లినిక్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉంటారు.. ఆ వెంటనే ఊళ్లో స్కైలాబ్ పడుతుందనే భయాలు మొదలవుతాయి. దాంతో వాళ్లిద్దరి కథ మొదటికే వస్తుంది. మరోపక్క ఆ ఊరిలో ఉన్నతకుటుంబంలో పుట్టిన గౌరి (నిత్యమేనన్) జర్నలిస్ట్ గా ఎదిగే ప్రయత్నంలో ఉంటుంది. సిటీ నుంచి పల్లెటూరికి వచ్చిన గౌరి ఆ ఊరి నుండే వార్తలు రాయడం మొదలు పెడుతుంది. కానీ గౌరీ రాసిన వార్తలేవి.. పేపర్ లో ప్రింట్ అవ్వవు. మరి ఆ ఊరిపై స్కైలాబ్ పడిందా? ఆ సమయంలో ఆనంద్ క్లినిక్ పెట్టాడా? స్కైలాబ్ భయాలు ఆ ఊరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? అసలు గోరి రాసిన వార్తలు పేపర్ లో ఎందుకు ప్రింట్ అవ్వవు? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యమీనన్.. ఈ ముగ్గురూ స్కైలాబ్ మూవీ కి మెయిన్ పిల్లర్స్. ముగ్గురి పాత్రలు సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయి. సత్యదేవ్ కొత్త తరహా పాత్రలవైపు ఎక్కువగా ప్రభావితం అవుతాడు. తన వరకూ.. ఇది మరో మంచి పాత్ర. రాహుల్ రామకృష్ణలో చాలామంది కమిడియన్‌నేచూశారు. కానీ.. అది దాటొచ్చి చాలా సెటిల్డ్ నటన ప్రదర్శించగలడు. ఈమధ్యన కాస్త బొద్దుగా మారిన నిత్య చాలా కాలం తరవాత చూడముద్దొచ్చేలా కనిపించింది. తనకు గౌరీ లాంటి పాత్రలు కొట్టిన పిండి. అలాగే గౌరి అసిస్టెంట్‌గా కనిపించే విష్ణు, తులసి, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ:
దర్శకుడి విశ్వక్ ఖండేరావు స్కైలాబ్ అంటూ ఎవరూ ఊహించని కొత్త కథని తీసుకున్నాడు. దర్శకుడు ఆలోచన చాలా బావుంది. కానీ దానిని సినిమాగా మలచడానికి దర్శకుడు అడుగడుగునా తడబడ్డాడు. బోరింగ్ సీన్లు.. కథలోకి త్వరగా వెళ్లకపోవడం, ఎంతసేపూ పాత్ర చిత్రణపైనే దృష్టి పెట్టడంతో అసలు విషయం మరుగున పడిపోయింది. డైలాగ్స్ బాగున్నాయి. సున్నిశితమైన కామెడీ తో అక్కడక్కడా ఆకట్టుకుంది.. కానీ సినిమా పరంగా దర్శకుడు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాడు.. అందులో మెయిన్ గా సినిమా సగం పూర్తయ్యేవరకు అసలు కథ మొదలు కాకపోవడం, ఫస్ట్ హాఫ్ లో సున్నితమైన కామెడీ ఇంట్రెస్ట్ కలిగించకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. క్లైమాక్స్ కి ముందు కథ ఎమోషనల్ వే లో అనిపిస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినట్టు అనిపిస్తుంది. మూడు కీలక పాత్రల డిఫ్రెంట్ డిఫ్రెంట్ కథలు, 1970 దశకాన్ని గుర్తు చేసేలా సహజమైన వాతావరణాన్ని సృష్టించిన తీరు, మ్యూజిక్ ఇలా అన్నీ మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయి. అసలు విషయంలోకి వస్తే.. ఊళ్లో ఎవరి పనుల్లో, ఎవరి సమస్యల్లో వాళ్ళు ఉండగా.. స్కైలాబ్ హడావుడి మొదలు కావడం నుంచే స్టోరీ లో స్పీడు కనిపిస్తుంది. భయం బతుకుని ఎలా నేర్పుతుందనే విషయాల్ని క్లైమాక్స్ సీన్స్ లో చక్కగా ఆవిష్కరించారు. డబ్బున్నోళ్లంతా వాటిని కాపాడుకోవడం కోసం దాక్కోవడం, లేనివాళ్లంతా తమ తమ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం, దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించడం, ఆ నేపథ్యంలో పండే ఎమోషన్స్ హత్తుకుంటాయి. ఇది ఓ మంచి ప్రయత్నమే.. కానీ దర్శకుడు మాత్రం కొత్తగా ఆలోచిస్తే.. మంచి సినిమాగా స్కైలాబ్ మిగిలిపోయేది.
సాంకేతికంగా:
ప్రశాంత్ ఆర్. విహా సాంగ్స్ తో పాటుగా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఆదిత్య కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించిన తీరు చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
పంచ్ లైన్: స్కైలాబ్ గురి తప్పి ప్రేక్షకుల పై పడింది
రేటింగ్: 1.75