బ్యానర్: పూరి కనెక్ట్స్
నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్యకృష్ణ, ఉత్తేజ్, రమాప్రభ, దేవయాని తదితరులు
మ్యూజిక్: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: నరేష్ రానా
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
దర్శకత్వం: అనిల్ పాదూరి
పూరి జగన్నాధ్ మాస్ పల్స్ ఉన్న డైరెక్టర్. అందుకే తనకొడుకు ఆకాష్ పూరి ని మాస్ హీరోగా నిలబెట్టేందుకు మెహబూబా అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా కిక్ ఇవ్వలేదు. తర్వాత పూరి జగన్నాధ్ తన ఆధ్వర్యంలోనే రొమాంటిక్ అనే మాస్ లవ్ స్టోరీ ని అనిల్ పాదూరి దర్శకత్వంలో నిర్మాతగా మారి తెరకెక్కించాడు. ఇక ప్లాప్ హీరోలకి భారీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాద్.. తన కొడుకు ఆకాష్ ని కూడా ఆ స్టార్ హీరోల సరసన నిలిపేందుకు కష్టపడుతున్నాడు. రొమాంటిక్ సినిమాని మాస్ లవ్ స్టోరీగా ప్రెజెంట్ చెయ్యడమే కాదు.. ఆ సినిమా ప్రమోషన్స్ తోనే అందరిలో సినిమాపై క్యూరియాసిటీ, హైప్ కలిగేలా చేసాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, విజయ్ తో రొమాంటిక్ ప్రమోషన్స్ ఇప్పించడమే కాదు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ కి కొడుకు సినిమా ప్రీమియర్స్ వేసి మరీ చూపించి.. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేసాడు. మరి పూరి పెంచిన అంచనాలు ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయ్యిందో రొమాంటిక్ సమీక్షలో చూసేద్దాం.
కథ:
వాస్కోడిగామా (ఆకాష్ పూరి) తండ్రి ఓ పోలీస్ ఆఫీసర్. నీతి నిజాయితీకి మారు పేరు. ఆ క్రమంలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. దానితో వాస్కోడిగామా అనాధ అవుతాడు. తనలాంటి వాళ్ళ కోసం ఇళ్లు కట్టించాలని.. అందుకోసం ఎలాంటి పని చెయ్యడానికైనా సిద్ధపడతాడు. ఆ క్రమంలోనే వాస్కోడిగామా నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో రెండు ముఠాల మధ్య అధిపత్య పోరు నడుస్తుంటుంది. డబ్బు కోసం, ఆధిపత్యం కోసం వాస్కోడిగామా ఓ ముఠాలో చేరి.. చాలా త్వరగా ఆ ముఠా నాయకుడిగా ఎదుగుతాడు. ఆలా నేరస్తుడిగా మారిన వాస్కోడిగామా గోవా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారతాడు. వాస్కోడిగామా గ్యాంగ్ లో ఉన్న మౌనిక (కేతిక శర్మ) ని ఇష్టపడతాడు. అయితే డ్రగ్స్ దందా ను ఆపడానికి, వాస్కోడిగామా జోరుకి కళ్లెం వెయ్యడానికి గోవా ప్రభుత్వం ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ)ను రంగంలోకి దించుతుంది. వాస్కోని, అతని గ్యాంగ్‌ను అంతం చేయడమే ఆమె లక్ష్యం. మరి వాస్కోడిగామా ఏసిపి రమ్యకి చిక్కుతాడా? ఏసీపీ రమ్యని వాస్కోడిగామా ఎలా ఎదుర్కొన్నాడు? మౌనిక ని వాస్కోడిగామా ప్రేమిస్తాడా? పెళ్లి చేసుకుంటాడా? అనేది రొమాంటిక్ చూసి తెలుసుకోవాల్సిందే.
పెరఫార్మెన్స్:
ఆకాష్ పూరి నటనలో మెహబూబా తో పోలిస్తే.. కాస్త పరిణితి కనిపిస్తుంది. వాస్కోడిగామా కేరెక్టర్ కోసం మాస్ లుక్స్ లో అదరగొట్టాడని చెప్పలేం కానీ.. ఆకాశ్ బాగానే సెట్ అయ్యాడు. వాస్కోడిగామా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఆకాష్ వాయిస్ నిజంగా ఆకాష్ కి ప్లస్ అనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. కాకపోతే ఇంత చిన్న ఏజ్ లో వాస్కోడిగామా లాంటి బరువైన కేరెక్టర్ చెయ్యడం కరెక్ట్ అనిపించలేదు. కేతిక శర్మ తెరపై చాలా అందంగా కనిపించింది. పెరఫార్మెన్స్ పరంగా కేతిక శర్మ తేలిపోయింది. ఆమె పాత్ర తీరు అలాంటిది. రొమాంటిక్ సీన్స్ లో మాత్రం కేతిక చెలరేగిపోయింది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ చక్కగా ఒదిగిపోయింది. ఆమె పాత్రే సినిమాకి మెయిన్ హైలైట్. మకరంద్ దేశ్ పాండే పాత్రను సరైన రీతిలో వాడుకోలేదనిపిస్తుంది. మిగతా నటీనటులు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విస్లశేషణ:
పూరి జగన్నాధ్ కి గోవాకి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆయన సినిమాలలో ఏదో ఒక ఎపిసోడ్ గోవా ఎపిసోడ్ ఉండేలా ప్లాన్ చేస్తాడు. కొన్ని సినిమాలు పూర్తిగా గోవాలోని తెరకెక్కించాడు. తన కొడుకు ఆకాష్ పూరి - అనిల్ పాదూరి కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ కూడా గోవా బ్యాగ్ డ్రాప్ లోనే తెరకెక్కించాడు. రొమాంటిక్ సినిమాలో కథ ఏం ఉండదు.. రెండు గ్యాంగ్ ల మధ్యన వార్. ఓ గ్యాంగ్ కి లీడర్ అయిన ఓ కుర్రాడిని పట్టుకోవడానికి ఓ ఏసీపీ.. మధ్యలో రొమాన్స్ తప్ప రొమాంటిక్ లో కథ లాంటిదేం లేదు. పూరి సినిమాలో హీరోల కేరెక్టర్స్ ఎలా ఉంటాయో.. అచ్చం ఆకాష్ పూరి వాస్కోడిగామా పాత్ర అలానే రఫ్ గా ఉంటుంది. ఇక రొమాంటిక్ గా కథలోకి వెళితే.. ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ కొడుకు.. అనాధగా మారి.. ఓ డ్రగ్స్ దందాని నడిపించే నాయకుడిగా ఎలా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ప్రతి సీన్ లో, ప్రతి కేరెక్టర్ పూరి మార్క్ స్పష్టంగా కనిపించింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ లో వాస్కోడిగామాగా ఆకాష్‌ను పరిచయం చేసిన తీరు.. గ్యాంగ్‌స్టర్‌గా హీరోగా ఎదిగిన వైనం అన్నీ మహేష్ తో పూరి తెరకెక్కించిన బిజినెస్‌మెన్ సినిమాతో పోల్చవచ్చు. మోహం పేరుతో వాస్కో.. మౌనిక వెంట పడే సన్నివేశాలు, ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ఎపిసోడ్‌లు యూత్ కి పిచ్చగా నచ్చేస్తాయి. రొమాంటిక్ పేరుకి తగ్గట్టే రొమాంటింక్ సీన్స్ పండాయి. ఫస్ట్ హాఫ్ లో ఉంటే యాక్షన్.. లేదంటే రొమాన్స్.. అంతే. ఇక సెకండ్ హాఫ్ లో ఎమన్నా ఆసక్తికర అంశాలు ఉన్నాయా అంటే.. అంతే చప్పగా సాగింది. ఏసీపీ రమ్య పాత్రని కూడా తేల్చేసారు. వాస్కోడిగామాను పట్టుకునేందుకు రమ్య గోవార్కర్ చేసే ప్రయత్నాలు చాలా నీరసంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ ని ఎమోషనల్ గా తీర్చిదిద్దిన తీరు.. విషాదాంతపు ముగింపు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కించారు. యూత్ కి కావాల్సినంత రొమాన్స్ ఈ రొమాంటిక్ లో దొరికేస్తుంది.
సాంకేతికంగా..
సినిమాకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇరగదీసింది అని చెప్పలేం కానీ.. పర్వాలేదనిపిస్తుంది. పాటల్లో కొన్ని ఆకట్టుకుంటాయి. పీనేకే బాద్.. పాట మంచి జోష్ తో సాగుతుంది. ఆ పాటలో రామ్, పూరి కనిపించడంతో ఫాన్స్ కి మరింత జోష్ వస్తుంది. ఈ సినిమాకిమెయిన్ హైలెట్ పూరి మార్క్ డైలాగులు. సినిమాటోగ్రాఫర్ గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.
రేటింగ్: 2.5/5