బ్యానర్: AK ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యువల్, రావు రమేష్, జగపతి బాబు, గరుడ రామ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: ప్రవీణ్ KL
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: అజయ్ భూపతి
ఈ ఏడాది శ్రీకారం తో హిట్ కొట్టిన శర్వానంద్ RX100 తో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తో కలిసి మహా సముద్రం అనే మల్టీస్టారర్ మూవీ చేసాడు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటించడంతో.. ఈ సినిమా మల్టీస్టారర్ గా ప్రొజెక్ట్ అవుతూ రావడమే కాదు.. హీరోయిన్స్ అను ఇమ్మాన్యువల్ గ్లామర్, అదితి రావు పెరఫార్మెన్స్, రావు రమేష్, జగపతి బాబు లాంటి దిగ్గజ నటులతో.. ఈ సినిమాని తెరకెక్కించారు. మహా సముద్రం ట్రైలర్, అందులోని పాత్రల లుక్స్, మూవీకి చేసిన ప్రమోషన్స్, సాంగ్స్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసాయి. మరి నేడు దసరా పండగ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహా సముద్రం మూవీ ఎలా ఉందో.. సమీక్షలో చూసేద్దాం.
కథ:
చిన్నప్పటినుండి అర్జున్ ( శర్వానంద్), విజయ్ (సిద్ధార్ద్) మంచి స్నేహితులు. అనాధ అయిన విజయ్ ఎస్సై అవ్వాలనే కలతో పెరుగుతాడు. విజయ్ మహా తో (అదితిరావు హైదరీ) ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు. కొన్ని సంఘటనలు కారణంగా విజయ్ వైజాగ్ నుంచి వెళ్ళిపోతూ.. మహాను మోసం చేసి పారిపోతాడు. వైజాగ్ లో విజయ్ చేసిన పొరపాట్లు కారణంగా అర్జున్ స్మగ్లింగ్ లోకి దిగాల్సి వస్తోంది. విజయ్ మోసం చేసిన మహా పరిస్థితి ఏమిటి? ఈ క్రమంలో చుంచు మామ (జగపతిబాబు) అర్జున్ కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు ? అర్జున్ వైజాగ్ సముద్రం పై ఆధిపత్యం సాధించాడా ? మళ్ళీ అర్జున్ జీవితంలోకి విజయ్ వచ్చాడా? ఇన్ని అనుమానాలు తీరాలంటే.. మహా సముద్రం వెండితెర మీద వీక్షించాల్సిందే.
పెరఫార్మెన్స్:
అర్జున్ గా శర్వానంద్ మాస్ నటనతో అదరగొట్టేసాడు. ఎమోషనల్ గాను ఆకట్టుకున్నాడు. అర్జున్ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ ఫిజిక్ లో కనిపించాడు. ఈ సినిమా మెయిన్ హైలెట్స్ లో శర్వానంద్ నటన ఒకటి అనేలా చేసాడు. అమ్మాయిని మోసం చేసి పారిపోయి.. స్నేహితుడు మీద పగ పెంచుకున్న విజయ్ కేరెక్టర్ సిద్దార్థ్ ఓకె ఓకె.. గా అనిపించాడు. ఎందుకంటే అతని పాత్ర ని మలిచిన తీరు అలా ఉంది. లుక్స్ వైజ్ గా కట్టుకున్నాడు. హీరోయిన్స్ విషయానికి వస్తే అదితిరావు హైదరీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, గ్లామర్ తో స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓకె ఓకె గా అనిపించింది.జగపతిబాబు, రావు రమేష్ పాత్రలకి న్యాయం చెయ్యడం కాదు.. సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. గరుడ రామ్ కి ఎలివేషన్ ఓ రేంజ్ లో ఇచ్చి.. పూర్తిగా నిరాశపరిచాడు.
విశ్లేషణ:
అజయ్ భూపతి.. RX100 అంటూ ఓ భగ్న ప్రేమికుడు.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేస్తాడో.. ఆఖరికి మోసం చేసింది అని తెలిసాక.. అతను పడే నరకం, ప్రాణాలు వదలడం అనే రియల్ స్టోరీ తో సినిమా చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు కమర్షియల్ కథతో ఇద్దరి హీరోలతో వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం సినిమా చేసాడు. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన వైరం ఎలా వచ్చిందో.. దాని వలన కలిగిన పరిణామాలు ఏమిటో ఈ సినిమాలో చూపించారు. అయితే మహా సముద్రం అంటూ వైజాగ్ నేపథ్యంలో నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. చివరికి రొటీన్ ఫార్ములా గా మిగిలిపోయింది. సినిమా స్టార్టింగ్ ఇంట్రస్ట్ గా మొదలుపెట్టినప్పటికీ.. ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. తన ఫ్రెండు ఒక అమ్మాయిని మోసం చేసి పారిపోతే.. ఫ్రెండ్ ద్వారా పుట్టిన బిడ్డతో పాటుగా అమ్మాయిని ఆదరించే హీరో పాత్ర బాగానే చూపించాడు. కానీ అర్జున్ - మహాల కథలో కొత్తగా ట్విస్ట్ లు ఏమి కనిపించవు. వాళ్ళ రిలేషన్ లో ప్రేమ కంటే కూడా జాలి, బాధ్యత లాంటి విషయాలే హైలైట్ అయ్యాయి. వాళ్లదే కాదు విజయ్ - మహా ల లవ్ స్టోరీ లోను కొత్తదనం కనిపించదు. అర్జున్ - శ్వేతల లవ్ స్టోరీ అస్సలు ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. గరుడ రామ్ పాత్రకు ట్రైలర్ లోనే కాదు.. సినిమాలోనూ ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చినా... ఆ తర్వాత అది తేలిపోయింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగేలా చేసాడు దర్శకుడు. కానీ ప్రేక్షకు ఫీల్ అయిన ఇంట్రెస్ట్ ని మాత్రం ఎక్కడా ఆసక్తికరంగా మలచలేకపోయాడు.సెకండ్ హాఫ్ లో లాగ్ లు, నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లోను దెబ్బ తీశాడు. యాక్షన్ లొనూ కొత్తదనం లేదు.. రొటీన్ ఫార్ములాతో కథను తేల్చేసాడు. అటు లవ్ స్టోరీ గాను కాక, ఇటు యాక్షన్ పరంగాను లేక.. ప్రేక్షకుడు ఎటూ కానీ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు.
సాంకేతికంగా:
మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ ఓకె ఓకె గా ఉన్నా నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫర్ రాజ్ తోట సినిమాలో చాల సన్నివేశాలని చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.
రేటింగ్: 2.75/5