బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్
నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: థమన్ , గోపీ సుందర్(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
అమెజాన్ ప్రైమ్ వీడియో(ఓటిటి రిలీజ్)
కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఓటిటి అయితేనేమి.. థియేటర్స్ అయితేనేమి.. నిర్మాతలకు ఏదైనా ఒకటే. కాకపోతే థియేటర్స్ లో సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ లో పాప్ కార్న్ కొనుక్కుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే మజానే వేరు. కానీ కరోనా మాత్రం ఆ ఎంజాయ్మెంట్ మీద నీళ్లు చల్లింది. దానితో మేకర్స్ సినిమాలు ఫినిష్ అయ్యి థియేటర్స్ లో రిలీజ్ చేసి లాస్ అవ్వలేక, ఓటిటి కి విక్రయించేస్తున్నారు. అందులో నాని టక్ జగదీశ్ కూడా ఉంది. నాని టక్ జగదీశ్ నిర్మాతలు ముందు థియేటర్స్ అన్నా.. కరోనా పరిస్థితుల కారణంగా టాక్ జగదీశ్ ని వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ రోజు అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ చేసారు. నిన్ను కోరి లాంటి హిట్ మూవీ కాంబినేషన్ తో శివ నిర్వాణ కి నాని నుండి వస్తున్న టాక్ జగదీశ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ టక్ జగదీష్ ప్రమోషన్స్ సినిమాపై అందరిలో ఆసక్తిని కలిగించేలా ఉంది. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టక్ జగదీష్ ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.
కథ:
కొంతమందికి డబ్బంటే ప్రాణం.. కొంతమందికి ఆస్తి అంటే ప్రాణం.. కానీ జగదీశ్ కి కుటుంబం అంటే పిచ్చి.
భూదేవిపురంలో రైతుల పక్షాన ఆదిశేషులు నాయుడు(నాజర్) పోరాడుతుంటే.. ప్రత్యర్థి వీరేంద్రనాయుడు(డానియల్ బాలాజీ) మాత్రం భూములు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి. అయితే ఆదిశేషుల నాయుడికి కక్షలు, కార్పణ్యాలు లేని గ్రామాన్ని చూడాలని కోరిక. ఆదిశేషులు నాయుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసు(జగపతిబాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్న కొడుకు టక్ జగదీష్(నాని) మాత్రం ఊరి గొడవలు, పొలాలు గురించి పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. ఆ క్రమంలోనే వీఆర్వో గుమ్మడి వరలక్ష్మి(రైతు వర్మ)ని చూసి ఇష్టపడతాడు. కానీ జగదీశ్ మేనకోడలు చంద్ర(ఐశ్వర్య రాజేష్) కి మావయ్య అంటే ప్రాణం. మేనమావనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆదిశేషులు నాయుడు గుండెపోటుతో చనిపోతాడు. అప్పటివరకు ప్రేమతో ఉన్న అన్నదమ్ములు బోసు బాబు - టక్ జగదీష్ ఆస్తుల విషయంలో విడిపోతారు. మరి ప్రేమతో ఉండే అన్నదమ్ములు విడిపోవడానికి ఆస్తులే కారణమా? ఆ ఊరిలో వీరేంద్ర నాయుడి అరాచకాలకు జగదీశ్ ఎలా అడ్డుకున్నాడు? గుమ్మడి వరలక్ష్మి ని జగదీశ్ పెళ్లి చేసుకున్నాడా? మరి మేనకోడలు చంద్ర పరిస్థితి ఏమిటి? అసలు కలిసి ఉండాలన్న కుటుంబాన్ని జగదీశ్ ఆస్తి గోలతో కొట్టుకుంటుంటే.. మళ్ళీ ఎలా కలిపాడు? అనేది తెలియాలంటే.. అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీశ్ వీక్షించాల్సిందే.
పెరఫార్మెన్స్:
నాని టక్ జగదీశ్ పాత్రలో చాలా స్టైలిష్ గా, టక్ తియ్యకుండా.. ఆ పాత్రకి ప్రాణం పోసాడు. యాక్షన్ లో స్టయిల్, డాన్స్ లో స్టయిల్, డైలాగ్ డెలివరీలో స్టయిల్.. అన్నిటిలో నాని అదరగొట్టేసాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోను నాని 100 శాతం పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. రీతూవర్మ అందంగా కనిపించింది. సారీస్ లో ట్రెడిషనల్ గా అదరగొట్టింది. నాని-రీతూ వర్మల కెమిస్ట్రీ ఆహ్లాదంగా, నీట్ కనిపించింది. నాని మేనకోడలిగా ఐశ్వర్య రాజేష్ చంద్రమ్మ పాత్రకి న్యాయం చేసింది. జగపతిబాబు ఎప్పటిలాగే బోసు బాబు పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో ఉన్న రెండు రకాల వేరియేషన్స్ చక్కగా పలికించారు. విలన్ గా డానియల్ బాలాజీ, నాని తండ్రిగా నాజర్, తాగుబోతు బావగా నరేష్, రావు రమేష్ ఇలా ఎవరి పాత్రకి వారు న్యాయం చేసారు.
విశ్లేషణ:
భూ వివాదాలు, ఉమ్మడి కుటుంబాలు ఆస్తుల కోసం విడిపోవడం, ఊరి కక్షలు, కార్పణ్యాల నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. నిన్నుకోరి, మజిలీ లాంటి ఫ్యామిలీ డ్రామాలతో ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ మరోసారి టక్ జగదీశ్ అంటూ ఫ్యామిలీ డ్రామాతో నే సినిమా చేసాడు. విలేజ్ లో జరిగే భూ వివాదాలను హైలెట్ చేస్తూ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలగలిపి టక్ జగదీశ్ ని తెరకెక్కించాడు. అయితే అక్కడక్కడా వెంకటేష్ కలిసుందాం రా.. శర్వానంద్ శతమానం భవతి, కార్తీ చినబాబు సినిమాలు గుర్తుకు వచ్చేలా ఈ టక్ జగదీశ్ సాగింది. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు కథలోకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. టక్ జగదీష్ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా స్లోగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ పక్కా ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మంచివాడనుకున్న బోసు బాబు విలన్ గా మారిపోవడం, ఫ్యామిలీ కోసం జగదీశ్ ఆ ఊరికే గవర్నమెంట్ ఆఫీసర్ గా రావడం ఇవన్నీ ఆసక్తిని కలిగించినా.. తర్వాత కథ లో అంతగా ఆసక్తి అనిపించదు. ఊరి బాగు కోసం జగదీశ్ చేసే ప్రయత్నాలు, ఫ్యామిలీ కోసం తీసుకునే నిర్ణయాలు అన్ని ఎక్కడో ఎప్పుడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మేనకోడలు బాగు కోసం రాత్రి పూట కాపు కాయడం, ఫ్యామిలీ కోసం నిందలు మోయడం.. అన్ని రొటీన్ గానే అనిపిస్తాయి. విలన్ వీరేంద్రనాయుడు నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నా.. దర్శకుడు ఆ టెంపోను చివరి వరకూ కొనసాగించి ఉంటే బాగుండేది. ప్రీక్లైమాక్స్‌కు మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్స్ ని జత చేసేసరికి కథ మొత్తం రొటీన్ ఫార్ములాలోకి మారిపోయింది.
సాంకేతికంగా:
సాంకేతికంగా టక్ జగదీశ్ ఉన్నతంగా అనిపిస్తుంది. థమన్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఓకే. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి ఫ్రేమ్ అందంగా చూపించారు. విలేజ్ అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కి మరికాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
టక్ జగదీశ్ రేటింగ్: 2.75/5