మాస్టర్ రివ్యూ
నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాలవికా మోహన్, ఆండ్రియా జెరెమియా తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
నిర్మాతలు : గ్జావియర్ బ్రిట్టో (మహేష్ కోనేరు)
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
మార్చ్ లో విడుదల కావాల్సిన సినిమా కరోనా క్రైసిస్ వలన పోస్ట్ పోన్ అవుతూ మళ్ళీ పొంగల్ టైం కి థియేటర్స్ అందుబాటులోకి వచ్చాక క్రేజీ కాంబో విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన మాస్టర్ నేడు థియేటర్స్ లో విడుదలైంది. క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానలు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా అడుగడుగునా విజయ్ మాస్టర్ ని అడ్డుకుంటూనే ఉంది. అయినా మాస్టర్ టీం నిరుత్సాహపడకుండా థియేటర్స్ కోసం ఎదురు చూసింది. మరి అన్ని అనుకున్నట్టుగా జరిగి మాస్టర్ విడుదల అవుతుంది అనుకున్న క్షణంలో మాస్టర్ మేజర్ సీన్స్ లీకవడంతో మాస్టర్ టీం షాకయినా వెంటనే దిద్దుబాటు చర్యలతో ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆపగలిగింది. అన్ని అడ్డంకులు దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ ఎలా ఉందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
జేడీ (విజయ్) కాలేజీ ప్రొఫెసర్. సెయింట్ జేవియర్ కాలేజీ స్టూడెంట్స్ అంతా జేడీకి ఫాలోవర్స్ గా ఉంటారు. వ్యక్తిగతంగా జేడీ ఫుల్ గా తాగుతూ టైం పాస్ చేస్తుంటాడు. ఒకొనొక టైం లో కాలేజీ ఎలెక్షన్స్ కి కారణమవుతాడు జేడీ. ఆ ఎన్నికల్లో గొడవలు జరగడంతో జేడీ స్టేట్ అబ్జార్వేషన్ హోమ్ కి మాస్టర్ గా వెళ్తాడు. ఆ హోమ్ ని అడ్డం పెట్టుకుని భవాని(విజయ్ సేతుపతి) అరాచకాలు సృష్టిస్తాడు. భవానీ జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు కారణంగా అతను రాక్షసుడుగా మారతాడు. పైగా పిల్లలను అడ్డు పెట్టుకుని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య భవానీకి అడ్డుగా జేడీ నిలుస్తాడు ? ఈ పరిస్థితులని జేడీ ఎలా చక్కబెట్టాడు అనేదే మాస్టర్ మిగిలిన కథ.
నటన:
మాస్టర్ అనేది క్లాస్ పదమే కానీ.. విజయ్ మాస్టర్ జేడీ పాత్రలో ఊర మాస్ లుక్ లో అదరగొట్టేసాడు. కాకపోతే మరీ తాగుబోతుగా విజయ్ ని అలా చూసిన ఫాన్స్ కే నచ్చదు. కాకపోతే విజయ్ ఆ పాత్రలో లీనమైపోయారు. తన మార్క్ యాక్టింగ్ తో స్టయిల్ తో సినిమాకి హైలెట్ గా నిలచారు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ విజయ్ అక్కడక్కడ నవ్విస్తారు. భవానిగా ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి పాత్రలో చెలరేగిపోయాడు. సేతుపతి భవాని పాత్రకి ప్రాణం పోసాడు. ఎమోషనల్ అవుతూనే దారుణాలకు తెగ బడడం చూస్తే హీరో కానన్ విలన్ గానే విజయ్ సేతుపతి అదరగొట్టేసాడు అనేస్తారు. విజయ్ - విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా తమకి ఇచ్చిన పవర్ఫుల్ పాత్రలను నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పెర్ఫర్మ్ చేసారు. చారు పాత్రలో మాళవిక మోహన్ కి ప్రాధాన్యత కనిపించకపోయినా తెర మీద ఆమె చాలా బావుంది. మిగతా పాత్రలకి అంతగా ప్రాధాన్యత అనిపించదు.
విశ్లేషణ:
స్టార్ హీరో - ఖైదీ లాంటి హిట్ అందుకున్న దర్శకుడు కాంబోలో మూవీ అనగానే ఆటోమాటిక్ గా అందరిలో ఆసక్తి. భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ - విజయ్ కాంబో అనగానే అందరి దృష్టి ఆ సినిమాపైనే. అయితే లోకేష్ కనకరాజ్ మీదున్న అంచనాలు అతను విజయ్ మీద పెట్టుకున్నాడు. అందుకే విజయ్ వెర్షన్ లోనే మాస్టర్ కథ రాసుకున్నాడు. విజయ్ అభిమానిగా కథ తయారు చేసుకుని.. విజయ్ ని హైలెట్ చేసాడు. అందరు అనుకున్నట్టుగానే పక్కా కమర్షియల్ కథని తీసుకుని ఓ పవర్ ఫుల్ హీరో - ఓ పవర్ ఫుల్ విలన్ అన్న రేంజ్ లోనే కథ ని మాస్టర్ గా తీర్చిదిద్దాడు. అక్కడక్కడా హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ ఆభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చాడు. ఖైదీ సినిమాలోలా భారీ ట్విస్ట్ లు కానీ, తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్సుకత మాస్టర్ లో కొరవడింది. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ హీరోయిజాన్ని హైలెట్ చెయ్యడం, తాగుబోతు మాస్టర్ గా విజయ్ ని చూపించడమే సరిపోయింది. కొన్నిసార్లు ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు ఈలలు వేసినా.. సగటు ప్రేక్షకుడికి తల బొప్పికడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చిరు మాస్టర్ సినిమా గుర్తుకురాగా.. సెకండ్ హాఫ్ లో విలన్ - హీరో మధ్య హోరా హోరి ఫైట్ జరుగుతుంది. కానీ ఎత్తుకు పై ఎత్తులు ఎక్కడా కనిపించవు. పవర్ ఫుల్ హీరో - పవర్ ఫుల్ విలన్ అన్నమాటే కానీ.. ఎక్కడా ఆసక్తికరమైన సంభాషణలు ఉండవు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి ఊహకి తగ్గట్టుగానే స్క్రీన్ మీద కనబడేసరికి సగటు ప్రేక్షకుడు నిరుత్సాహపడుతూనే ఉంటాడు. ఓపిక చేసుకుని చూస్తే విజయ్ ఫాన్స్ కి ఓకె కానీ.. సాధారణ ప్రేక్షకుడికి మింగుడు పడదు.
రేటింగ్: 2.0/5