Advertisementt

ఓటీటీ రివ్యూ: మిస్ ఇండియా (కీర్తిసురేష్)

Wed 04th Nov 2020 10:23 AM
keerty suresh,miss india movie,telugu review,cinejosh review,miss india movie review and rating,jagapathi babu,naveen chandra,narendra nath director,mahesh koneru producer  ఓటీటీ రివ్యూ: మిస్ ఇండియా (కీర్తిసురేష్)
Miss India Movie Review ఓటీటీ రివ్యూ: మిస్ ఇండియా (కీర్తిసురేష్)
Advertisement
Ads by CJ

బ్యానర్: ఈస్ట్ కోస్ట్ బ్యానర్

నటీనటులు: కీర్తి సురేష్, నవీన్ చంద్ర, జగపతి బాబు, సుమంత్ శైలేంద్ర, నరేష్, నదియా, రాజేంద్ర ప్రసాద్, పూజిత పొన్నాడ తదితరులు

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్ 

ఎడిటింగ్: తమ్మిరాజు 

మ్యూజిక్ డైరెక్టర్: థమన్ 

నిర్మాత: మహేష్ కోనేరు 

దర్శకత్వం: నరేంద్ర నాధ్ 

థియేటర్స్ లో సినిమా ప్రివ్యూ చూసి రివ్యూ రాసే రోజులు పోయాయా? ఏమో కరోనా కరుణించేవరకు అదే జరిగేలా కనబడుతుంది. థియేటర్స్ ఓపెన్ అయినా థియేటర్స్ లో బొమ్మ పడే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే సినిమాలు అన్ని ఓటిటి బాట పట్టినట్లే కీర్తి సురేష్ మిస్ ఇండియా కూడా ఓటిటికి ఓకే చెప్పింది. మహేష్ కోనేరు నిర్మాతగా, నరేంద్ర నాధ్ దర్శకత్వంలో ఓ అమ్మాయి తాను కలలు కన్న ప్రపంచాన్ని ఎలా సాకారం చేసుకుందో అనే పాయింట్ తో మిస్ ఇండియా ని తెరకెక్కించారు. మహానటి కీర్తి సురేష్ వరసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలతో సినిమాలు చెయ్యడం, జాతీయ ఉత్తమనటి కావడంతో సహజంగానే కీర్తి సురేష్ సినిమాలపై అందరిలో అంచనాలు ఉన్నట్లే మిస్ ఇండియాపై అందరిలో ఆసక్తి కనబడింది. మిస్ ఇండియా ట్రైలర్ తోనూ సినిమాపై క్యూరియాసిటీ పెంచిన టీం ప్రమోషన్స్ తోనూ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది. మరి కీర్తి సురేష్ మిస్ ఇండియా కథ కమామిషు ఏంటో సమీక్షలో తెలుసుకుందాం..

కథ:

మాన‌స సంయుక్త (కీర్తి సురేష్‌) ఓ మారుమూల ప‌ల్లెటూరులో పెరుగుతుంది. మానసకి తాను ఎంబీఏ చేసి పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది. మానసకి తాత‌య్య విశ్వ‌నాథ శాస్త్రి (రాజేంద్ర ప్ర‌సాద్‌) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కలలు కంటూ పెరిగిన మానసుకు పెద్ద‌య్యాక ఇంట్లో ప‌రిస్థితులు మారిపోతాయి. తాత‌య్య చ‌నిపోవడం, తండ్రి(నరేష్) అనారోగ్యం. మానస అన్నయ్య (క‌మ‌ల్ కామ‌రాజు)కు అమెరికాలో ఉద్యోగం వ‌స్తుంది. దాంతో.. మానస ఫ్యామిలీ మొత్తం.. అమెరికా షిఫ్ట్ అవుతుంది. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకున్న మానసకి ఓ ఉద్యోగం వస్తుంది. మరి త‌న‌కిష్ట‌మైన వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని కలలు కన్న మానస ఆ ఉద్యోగం చేస్తుందా? మానసకి బిజినెస్ అంటే ఎందుకంత ఇష్టం? అసలు మానస ఆశ నెరవేరుతుందా? ఆమె అనుకున్నది ఎలా సాధించింది? అనేది తెలియాలంటే మిస్ ఇండియాని వీక్షించాల్సిందే.

నటీనటుల నటన:

కీర్తి సురేష్ ఈ సినిమాని గట్టెక్కించడానికి తన సాయశక్తులా ప్రయత్నించింది. సినిమా మొత్తం కీర్తి సురేష్ మానస పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కాబట్టే స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. మహానటితో గొప్ప నటి అనిపించుకున్న కీర్తి సురేష్ చెయ్యాల్సిన సినిమా ఇదా అని అనిపించక మానదు. బిజినెస్ లో అతి తక్కువ టైం లో ఎదుగుతున్న అమ్మాయిగా, ఆమెలోని కసి, ఎదిగిన తర్వాత కీర్తి సురేష్ నడవడిక, ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ అన్ని హైలెట్ అనేలా ఉన్నా.. ఎక్కడో ఏదో లోటు. ఇక బిగ్ బిజినెస్ మ్యాన్ గా జగపతి బాబు ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. నవీన్ చంద్రకు అంతగా స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. జస్ట్ నాలుగైదు సన్నివేశాలకి నవీన్ చంద్ర పరిమితమయ్యాడు. మిగిలిన సుమంత్ శైలేంద్ర, నదియా, రాజేంద్ర ప్రసాద్, పూజిత, నరేష్ తమ పాత్రలకు న్యాయం చేసారు. 

విశ్లేషణ:

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకే మొగ్గు చూపినట్లుగా అనిపిస్తుంది. మహానటి తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఇలా ఏ సినిమా చూసినా  కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కే ఓటు వేస్తుంది అనిపిస్తుంది. అంటే కథలో దమ్ముంటేనే కీర్తి సురేష్ సినిమాలు ఓకే చెయ్యాలి. కానీ అలా కనిపించడం లేదు ఆమె సినిమాల లిస్ట్. దర్శకుడు నరేంద్ర నాధ్ కూడా కీర్తి సురేష్ కోసం మిస్ ఇండియా లాంటి ఓ సింపుల్ కథని రాసుకుని ఆమెని ఇంప్రెస్ చేసేశాడు. మరి మిస్ ఇండియా అనే టైటిల్ చూస్తే సినిమా మొత్తం గ్లామర్, అందం, ఫ్యాషన్ షోస్ ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు మిస్ ఇండియా కథ ఓ అమ్మాయి చిన్నప్పటి నుండి ఎంబీఏ చేసి బిజినెస్ మ్యాన్ గా ప్రపంచాన్ని శాసించాలనుకోవడం. లైన్ బానే ఉంది. కానీ దాని ఎగ్జిక్యూట్ బాలేదు. సినిమా మొదలవడమే హీరోయిన్ చుట్టూ అనేక సమస్యలు. ఇంటి సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్  కి అమెరికా అవకాశం రావడం, అక్కడ చదువుకుని ఉద్యోగం వచ్చినా అది వదులుకుని ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌తో పోరాడుతూ బిజినెస్ చేసి కేవలం రెండు నెలలోనే టాప్ పొజిషన్ కి వెళ్లడం అనేది చాలా సినిమాల్లో చూసేశాం. దర్శకుడు కీర్తి సురేష్ ని పెట్టుకుని ఏదేదో చేసేస్తే.. అది చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు.. వాళ్ళకి లాజిక్ కావాలి. ట్విస్ట్ లు కావాలి. కామెడీ కావాలి. కానీ అవన్నీ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ప్రోబ్లెంస్, సెకండ్ హాఫ్ మొత్తం బిజినెస్ ప్రోబ్లెంస్. ఇదే మిస్ ఇండియా కథ. ఓ అమ్మాయి (కీర్తి) బిజినెస్ చేయాలనుకుంటే దానికి బడా వ్యాపారవేత్త (సుమంత్ శైలేంద్ర) సాయం చెయ్యడం.. దానికి మరో బడా బిజినెస్ మ్యాన్( జగపతిబాబు) అడ్డుపడడం చాలా సింపుల్ లాజిక్ అది. కీర్తి సురేష్ బిజినెస్ లో పైకి ఎదుగుతున్నప్పుడు కూల్ గా సాగిన సినిమా ఆమె టాప్ పొజిషన్ కి వెళ్ళాక గాడి తప్పింది. ఆ బిజినెస్ లో కాస్త ట్విస్ట్ లు పెడితే బావుండేది అనిపించింది. ఓవరాల్ గా కీర్తి అభిమానులను కూడా ఈ మిస్ ఇండియా సంతృప్తిని ఇవ్వలేదు. ప్రస్తుతం సినిమాలేవీ లేవు కాబట్టి.. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాని కీర్తిసురేష్ కోసం అందరూ ఒకసారి చూసే అవకాశం అయితే లేకపోలేదు.

సాంకేతికంగా.. థమన్ నేపధ్య సంగీతం బాగున్నా పాటలు ఆకట్టుకునేలా లేవు. అయితే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. సుజిత్ వాసుదేవ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా ప్రారంభంలో పల్లె అందాలు,అమెరికా అందాలు చూపించడంలో సుజిత్ వాసుదేవ్ పని బావుంది. ఇక ఎడిటింగ్ పరంగా చాలా వీక్ అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథానుసారంగా పర్వాలేదనిపిస్తాయి.

రేటింగ్: 2.0/5

Miss India Movie Review:

Keerty Suresh Miss India Movie Telugu Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ