బ్యానర్: అమృత ప్రొడక్షన్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: కాల భైరవ
ఎడిటర్: కోదాటి పవన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి
ప్రొడ్యూసర్: సాయి రాజేష్
దర్శకత్వం: సందీప్ రాజ్
దసరా సీజన్ అంటే థియేటర్స్ కళకళలాడాలి. థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు ఎలా ఉండాలి.. టికెట్స్ కోసం తోసుకోవాలి.. ఆన్ లైన్ లో పడిగాపులు.. టికెట్స్ దొరక్క నిరాశ, భారీ బడ్జెట్ సినిమాల్తో థియేటర్స్ కళకళలు. కానీ ఈ దసరాకి అవేం లేవు. థియేటర్స్ బంద్.. సినిమాల విడుదలకు బ్రేకులు వెయ్యడంతో సినిమాలన్నీ ఓటిటి దారి పట్టాయి. తాజాగా ఆహా ఓటిటి నుండి చిన్న సినిమా ఒకటి విడుదలైంది. హీరోలకు ఫ్రెండ్ కేరెక్టర్స్ లో కామెడీ పండించే సుహాస్ ని హీరోగా పెట్టి.. కమెడియన్ సునీల్ ని విలన్ గా మార్చి సాయి రాజేష్ నిర్మాతగా సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాని తెరకెక్కిచాడు. థియేటర్స్ బంద్ వలన కలర్ ఫోటో ఆహా ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కమెడియన్ సుహాస్ హీరో అనగానే అందరిలో ఆసక్తి, అలాగే కమెడియన్ కం హీరో సునీల్ విలన్ అనగానే అందరిలో క్యూరియాసిటీ.. అందుకే కలర్ ఫోటో పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి కలర్ ఫోటో ఆహా ద్వారా ప్రేక్షకులని ఏమంత ఆహా అనిపించిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
1997 లో జరిగిన కథగా కలర్ ఫోటో సినిమా ఉండబోతుంది. ఓ మారుమూల పల్లెటూరులో ఉండే జయకృష్ణ(సుహాస్) ఇంజినీరింగ్ చదువుతుంటాడు. బాగా చదివి తండ్రిని మంచిగా చూసుకోవాలని జయకృష్ణ కలలు కంటుంటాడు. జయకృష్ణ చదివే కాలేజ్ లో ఓ ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ లో అమ్మవారి గెటప్ లో ఉన్న దీప్తి(చాందిని చౌదరి) ని చూసి ప్రేమలో పడతాడు జయకృష్ణ. అయితే దీప్తి తెల్లగా అందంగా ఉంటుంది. అలాంటి అమ్మాయి నా లాంటి నల్లగా ఉన్న అబ్బాయిని ప్రేమిస్తుందా? అనే మీమాంశలో ఆమెని ఆరాధిస్తుంటాడు. అయితే జయకృష్ణ గుణగణాలు తెలుకున్న దీప్తి కూడా జయకృష్ణ ప్రేమలో పడుతుంది. కానీ ప్రేమ, ప్రేమ పెళ్లిళ్లపై సదాభిప్రాయం లేని దీప్తి అన్నయ్య ఇన్స్పెక్టర్ రామరాజు(సునీల్) కి దీప్తి జయకృష్ణ ని ప్రేమించడం నచ్చదు. జయకృష్ణ నల్లగా ఉన్నాడనే కారణం చూపించి వాళ్ళ ప్రేమను ఒప్పుకోడు. మరి దీప్తి అన్నని జయకృష్ణ ఎలా ఒప్పించాడు? అసలు జయకృష్ణ - దీప్తి పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.
నటీనటులు:
ఇప్పటివరకు ఫ్రెండ్స్ కేరెక్టర్స్ లో కామెడీ చేసి ఆకట్టుకున్న సుహాస్ మొదటిసారిగా కలర్ ఫోటో లో హీరో గా నటించాడు. జయకృష్ణ పాత్రని 100 కి 100 శాతం న్యాయం చేసాడు. ఫేస్ ఎక్సప్రెషన్స్ లో సుహాస్ అదరగొట్టేసాడు. ఎమోషనల్ సీన్స్ లో మంచి పెరఫార్మెన్స్ చూపించాడు. కాకపోతే కామెడీ చేసే అవకాశం ఈ పాత్ర ద్వారా సుహాస్ కి పెద్దగా దక్కలేదు. ఇక హీరోయిన్ చాందిని చౌదరి దీప్తి పాత్రలో ఒదిగిపోయింది. నేచురల్ నటనతో ఆకట్టుకుంది. ఇక విలన్ గా సునీల్ ఏమంత గొప్పగా అనిపించలేదు. విలన్ గా సునీల్ ని యాక్సిప్ట్ చెయ్యలేరు. వైవా హర్ష కి మంచి పాత్ర పడింది.
విశ్లేషణ:
దర్శకుడు సందీప్ రాజ్ 1997 లో కలర్ ఫోటో కథను ఎంచుకుని దానికి లవ్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, కులం, మతం ప్రేమలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చినా వర్ణ వివక్షతో పెద్దగా సినిమాలు రాలేదు. దర్శకుడు తీసుకున్న పాయింట్ బావుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో ఆద్యంతం తడబాటు కనబడుతుంది. ఇక కథలోకి వెళితే ప్యూర్ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోనప్పటికీ.. ఎమోషనల్ సీన్లు హార్ట్ టచింగ్ అనేలా ఉన్నాయి. దర్శకుడు కథలోని లవ్ ఫీల్ ని కంప్లీట్ గా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. అయితే ఎమోషనల్ సీన్లు బాగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా.. కాలేజ్ లో ప్రేమ, సీనియర్స్ తో గొడవలు, కొట్లాటలు.. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ ప్రేమ ఓ కొలిక్కి రావడం అంతలోనే ఆ ప్రేమకి హీరోయిన్ అన్న అడ్డుపడడం వంటి సీన్స్ తో నింపేసాడు దర్శకుడు. కథ కొత్తగానే ఉన్నప్పటికీ... దర్శకుడు దాన్ని రొటీన్ చేసిపారేసి బోర్ కొట్టించేసాడు.
సాంకేతికంగా..
సినిమాకి మెయిన్ హైలెట్ కాలభైరవ పాటలు. అటు పాటలు ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.25/5