మూవీ: నిశ్శబ్దం
నటీనటులు: అనుష్క, మాధవన్, షాలిని పాండే, అంజలి, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: శనేయిల్ దెవొ
నిర్మాత: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: హేమంత్ మధుకర్
థ్రిల్లర్ - హర్రర్ జోనర్‌లో ఎన్ని సినిమాలొచ్చినా.. అందులోని ట్విస్ట్‌లే థియేటర్స్ వైపు ప్రేక్షకులను నడిపిస్తాయి. థ్రిల్లర్ మూవీ అంటే ఓ బూత్ బంగ్లాలో మొదలైన కథ.. సినిమా చివరి వరకు ఆ ఇంటి చుట్టూనే తిరిగేలా చేస్తారు దర్శకులు. ఇక్కడ హేమంత్ కూడా ఓ హంటెడ్ హౌస్.. అందులో దెయ్యాలున్నాయని అభూత కల్పన.. చివరికి దెయ్యం కాదు మనిషే మనిషిని చంపేస్తున్నారు అంటూ ట్విస్ట్ ఇవ్వడం, అనుష్కతో మ్యూట్ కేరెక్టర్ చేయిస్తూ కథకు నిశ్శబ్దం అనే టైటిల్ పెట్టడం చూస్తే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక బాహుబలి, భాగమతి తర్వాత సినిమాలకు దొరక్కుండా భారీ గ్యాప్ ఇచ్చిన అనుష్క మళ్ళీ నిశ్శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అది కూడా అనుష్క ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మ్యూట్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది అంటే ఆ సినిమాపై ఎంత క్రేజ్, ఎన్ని అంచనాలుంటాయి. అనుష్క మెయిన్ లీడ్ అంటే అందులో ఎవరు నటించినా పట్టించుకోరు. కానీ మాధవన్, అంజలి, షాలినీ పాండే నటించడంతో కథలో ఎంత దమ్ముందో ఇంత మెయిన్ లీడ్ యాక్టర్స్ నటించారని అనుమానం వస్తుంది. మరి లాక్‌డౌన్ ముందే విడుదల కావాల్సిన నిశ్శబ్దం.. నిశ్శబ్దంగానే ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. రిలీజ్‌కు ముందు కాస్త హడావుడి చేసి.. అమెజాన్ ప్రైమ్‌లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిశ్శబ్దం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
హర్రర్ కథల్లో మాదిరిగానే నిశ్శబ్దంలోనూ హంటెడ్ హౌస్ (వుడ్ సైడ్ విల్లా)లో సినిమా మొదలవుతుంది. సాక్షి (అనుష్క) ఓ పెయింటర్. సాక్షికి వినిపించదు. మాట్లాడలేదు. అలా ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో పెయింటింగ్ వేసినప్పుడు.. ఆ ఎగ్జిబిషన్ ఓపెనింగ్‌కి వచ్చిన అమెరికాలోని ప్రఖ్యాత మ్యూజీషియన్ ఆంటోనీ (మాధవన్) సాక్షి పెయింట్స్ చూసి ఇంప్రెస్ అవుతాడు. సాక్షితో క్లోజ్‌గా మూవ్ అవుతూ ఆమె మంచి మనసు చూసి ఇష్టపడతాడు. అయితే సాక్షి ఫ్రెండ్ సోనాలీ (షాలినీ పాండే), సాక్షి ఎవరికీ దగ్గరైనా తట్టుకోలేదు. సోనాలి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. అయితే ఆంటోనికి - సాక్షికి ఎంగేజ్మెంట్ అయ్యాక సోనాలి కనబడకుండా పోతుంది. ఆ బాధనుండి బయటపడడానికి సాక్షిని తీసుకుని ఆంటోని పెయింటింగ్‌కి రిప్లికా కోసం హంటెడ్ హౌస్‌కి వెళతారు. ఆ వుడ్ సైడ్ విల్లాలో దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే పెయింటింగ్ కోసం సాక్షితో పాటుగా వచ్చిన ఆంటోని అక్కడ హత్య చేయబడతాడు. అసలు ఆంటోనిని చంపింది దెయ్యమేనా? లేదా ఎవరైనా హత్య చేసారా? ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న మహా (అంజలి) ఎలాంటి నిజాల్ని వెతికి తీయగలిగింది? సాక్షి ఫ్రెండ్ సోనాలి ఏమైంది? అనేది తెలియాలంటే నిశ్శబ్దం సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
సినిమా మొత్తం అనుష్క, మాధవన్, షాలిని పాండే చుట్టూనే తిరుగుతుంది. ఇక సాక్షి పాత్రలో అనుష్క.. మ్యూట్ కేరెక్టర్‌లో ఇరగదీసింది. దీనికోసం అనుష్క ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకుందో.. ఆ కష్టం తెర మీద కనబడుతుంది. కాకపోతే లుక్స్ పరంగా అనుష్క మరీ బొద్దుగా తయారైపోయింది. మాటలు లేకుండా సైగలే. అనుష్క పాత్రని మరీ బొమ్మలా మార్చేశారు. ఇక అమెరికా నేపథ్యంలో తీసిన కథ కావడం చేత అనుష్క చేత అక్కడి కల్చర్‌కి తగిన దుస్తులు వేయించారు. అనుష్క బొద్దుగా అవడంతో.. డ్రెస్సెస్ పరంగా కూడా తేలిపోయింది. ఇరాక్ ఆంటోనిగా, మ్యూజీషియన్‌గా మాధవన్ లుక్స్ ఆకట్టుకుంటాయి. అంజలి లుక్స్ పరంగాను, వృత్తి పరంగాను తేలిపోయింది. ఇక షాలిని పాండే ఓ విచిత్రమైన మనస్తత్వంతో కనిపిస్తుంది. నటన పరంగా పర్వాలేదు. సుబ్బరాజుకి చాలా రోజుల తర్వాత కాస్త నిడివి ఉన్న పాత్ర దొరికింది. ఇక ఇంతకూ మించి ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్రలేవీ కనిపించవు.
విశ్లేషణ:
థ్రిల్లర్ - హర్రర్ జోనర్ కథల్ని ఓ బూత్ బంగళాలో మొదలైనట్టుగానే ఈ నిశ్శబ్దం కథని ఓ హంటెడ్ హౌస్ నుండే మొదలు పెట్టాడు దర్శకుడు హేమంత్ మధుకర్. వుడ్ సైడ్ విల్లాలో దెయ్యాలున్నాయని.. అక్కడ నివసిస్తే చనిపోతారని.. అందుకే ఆ ఇల్లు పాడుబడిన బంగాళాలా మారిపోవడం, ఓ పెయింటింగ్ కోసం హీరో - హీరోయిన్ అక్కడికి వెళ్లగా హీరో హత్య చేయబడడం ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసేశాం. ఇక అనుష్క మ్యూట్ పాత్ర చూడగానే మనకి వసంత కాలంలో నయనతార పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో నయనతార మ్యూట్ కేరెక్టర్ చెయ్యడమే కాదు, ఓ పెయింటర్ కూడా. మన కథలోని హీరోయిన్ అనుష్క కూడా ఓ పెయింటర్ అలాగే మ్యూట్ కేరెక్టర్. ఇక మాధవన్ కేరెక్టర్ చూడగానే మన్మధ సినిమాలో శింబు పాత్ర గుర్తుకు వస్తుంది. శింబు కూడా తమ్ముడిని మోసం చేసిన అమ్మాయిని చంపినట్టుగానే.. ఈ చిత్రంలో మాధవన్ పాత్రని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇలా నిశ్శబ్దంలోని ప్రతి సీన్ ఎప్పుడో ఎక్కడో చూసిన ఫీలింగ్. థ్రిల్లర్ సినిమాలకు.. కథ అర్థమైనా అందులోని ట్విస్టులు ప్రాణం పోస్తాయి. కథ తెలిసిపోయినా తర్వాత సన్నివేశం ఏమిటా? అని ప్రేక్షకుడు ఆసక్తి ఫీల్ అయ్యేలా కథను తెర మీద ఉంచితే ఆ సినిమా హిట్టే. కానీ దర్శకుడు ఆ లాజిక్ మిస్ అయ్యాడు. చాలా థ్రిల్లర్ సినిమాలు చూసేసి ఈ నిశ్శబ్దం కథని తయారు చేసుకున్నాడనిపిస్తుంది. అనుష్కతో మ్యూట్ కేరెక్టర్ చేయించి కథలో కొత్తదనం చూపించాలనుకున్నాడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. ఇక అంజలి పోలీస్ ఆఫీసర్‌గా కథలోని ట్విస్ట్‌లు చెప్పెయ్యడం పెద్దగా ఇంట్రెస్టు అనిపించదు. అలాగే షాలిని పాండే పాత్రని కానీ, మాధవన్ పాత్ర గురించి దర్శకుడు చెప్పిన తీరు కూడా ఆసక్తిగా అనిపించదు. ఇక ఆంటోని మర్డర్‌కి, షాలిని మర్డర్‌కి ఉన్న లింక్ ట్విస్ట్ బాగుంది. ఇక సినిమా మొత్తం అమెరికా లొకేషన్స్ లో సాగడం వలన అందులోని ఇంగ్లీష్ డైలాగ్స్‌ని అర్థం చేసుకోవడానికి తెలుగు ప్రేక్షకుడు చాలా ఇబ్బంది పడతాడు. ఏదేమైనా నిశ్శబ్దం క్లాస్ పీపుల్ అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి సరిపోయే మూవీనే కానీ.... మాస్‌కి ఏమాత్రం ఎక్కదు.
సాంకేతికంగా..
థ్రిల్లర్ సినిమాలకు నేపధ్య సంగీతం ప్రాణం పోస్తుంది. గిరీష్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు కూడా కథానుసారం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు కెమెరామెన్. ఇక ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.
ట్యాగ్‌లైన్: ‘హిట్’ అనే శబ్దం కూడా మిస్సయింది
రేటింగ్: 2.0/5