మూవీ: ఒరేయ్ బుజ్జిగా..
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్, వాణి విశ్వనాధ్, సత్య, సప్తగిరి, మధునందన్, అజయ్ ఘోష్, భద్రం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ప్రొడ్యూసర్: కె. కె. రాధామోహన్
స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నితిన్ - నిత్యామీనన్ జంటగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో గతంలో వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా అటు కామెడీ గాను, ఇటు రొమాంటిక్ గాను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి దర్శకుడు లవర్ బాయ్ రాజ్ తరుణ్‌తో కలిసి సినిమా అనగానే అందరిలో ఆసక్తి మొదలైంది. రాజ్ తరుణ్‌కి వరస ప్లాప్స్ ఉన్నప్పటికీ.. రాజ్ తరుణ్ సినిమా అనగానే మార్కెట్‌లో కాస్త క్రేజ్ అయితే కనబడింది. అలాంటి విజయ్ కుమార్ కొండా - రాజ్ తరుణ్ కాంబోలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఎప్పుడో ఉగాదికి విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడడం.. చివరికి థియేటర్స్ ఓపెన్ కావేమో అనుకుని దానిని ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్‌కి అమ్మడం, అది ఆకాస్త నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి భారీ ప్రమోషన్స్‌తో ఆహా ఓటిటి నుంచి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కోటేశ్వరరావు(పోసాని కృష్ణమురళి) కాంట్రాక్టర్. అతని కొడుకు బుజ్జిగాడు అలియాస్ శ్రీనివాస్(రాజ్‌తరుణ్). అయితే శ్రీనివాస్ తల్లి చనిపోవడంతో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం కొడుకు శ్రీనివాస్‌కు పెళ్లి చేయాలని అనుకుంటాడు కోటేశ్వరరావు. అయితే పెళ్ళంటే ఇష్టం లేని శ్రీనివాస్ ఊరు వదలి వెళ్ళిపోతాడు. అదే ఊరిలో ఉండే చీఫ్ ఇంజనీర్ చాముండేశ్వరి(వాణీవిశ్వనాథ్) కూతురు కృష్ణవేణి(మాళవికా నాయర్)కి కూడా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే కృష్ణ వేణి ఇంట్లో తనకి ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో.. పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోతుంది. శ్రీనివాస్ - కృష్ణవేణి ఇద్దరూ ఒకే ట్రెయిన్ ఎక్కుతారు. దాంతో శ్రీనివాస్ - కృష్ణవేణి లేచిపోయారనే పుకార్లు మొదలవుతాయి. అది తెలియని శ్రీనివాస్ - కృష్ణవేణి లు ట్రెయిన్‌లో స్నేహితులు అవుతారు. తను ట్రెయిన్ ఎక్కడం వల్ల బుజ్జిగాడుతో కృష్ణవేణి లేచిపోయిందనే పుకారు మొదలైందనే విషయం కృష్ణవేణికి తెలుస్తుంది. శ్రీనివాస్ ముద్దుపేరు బుజ్జిగాడు అని కృష్ణవేణికి తెలియయకపోవడం వలన బుజ్జిగాడు మీద పీకలదాకా కోపం పెంచుకుంటుంది. మరోవైపు కృష్ణవేణి కారణంగా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయని తెలుసుకున్న బుజ్జిగాడు.. ఆమెను వెతికి పట్టుకొస్తానని అమ్మకు ప్రామిస్ చేస్తాడు. కృష్ణవేణి కూడా స్వాతి అని పేరు మార్చి చెప్పడంతో, బుజ్జిగాడు కూడా కృష్ణవేణినే తను వెతుకుతున్న స్వాతి అని తెలియక ఆమెతో స్నేహం చేస్తాడు. మరి శ్రీనివాస్ - కృష్ణవేణిలా స్నేహం ప్రేమగా మారుతుందా? ఒకరికి తెలియకుండా ఒకరిని వెతుకుతున్న వారు చివరికి అసలు నిజం తెలుసుకుంటారా? అసలు ఈ గందరగోళానికి కారణం ఏమిటి? అనేది ఒరేయ్ బుజ్జిగా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు నటన:
రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల దగ్గరనుండి ఒకే రకమైన నటనతో కాస్త బోర్ కొట్టించేస్తున్నాడనే చెప్పాలి. కామెడీ టైమింగ్ తోనే నెట్టుకొస్తున్న రాజ్ తరుణ్ కి ఒరేయ్ బుజ్జిగాలో బుజ్జిగాడు పాత్ర కొట్టిన పిండే. ఆ పాత్రని చాలా ఈజ్ తో నటించేసాడు. ఎప్పటిలాగే కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మాళవిక నాయర్ కూడా కృష్ణవేణి పాత్రని చక్కగానే పండించింది. ట్రెడిషనల్‌గా ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ ది మరీ అతిథి పాత్ర అయిపోయింది. ఉన్నంతసేపు నవ్వించింది. సప్తగిరి, సత్య లాంటి వాళ్లున్నా దర్శకుడు సరిగా వాడుకోలేదు. అంతెందుకు.. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ పాత్రని అలానే చేసాడు దర్శకుడు. మిగతా నటులు పరిధిమేర నటించారు.
విశ్లేషణ:
కన్ఫ్యూజన్ కామెడీని మనం లెక్కకుమించిన సినిమాల్లో చూసేసాం. హీరో హీరోయిన్స్ ఇంట్లో నుండి పారిపోవడం అనేది తరుణ్ - ఇలియానా, రోమియో జూలియట్ దగ్గరనుండి చూస్తూనే ఉన్నాం. ఇద్దరు ట్రైన్ నుండి దిగగానే ఫ్రెండ్స్ అయ్యి దొంగతనం చేస్తూ.. కలిసి ఉండడం చివరికి పెళ్లి పీటలెక్కడం.. ఇప్పుడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా తరుణ్ రోమియో జూలియట్ చూసి ఇన్స్పైర్ అయ్యాడనిపించింది. ఒరేయ్ బుజ్జిగాలో కూడా హీరో హీరోయిన్స్ కి పెళ్లంటే ఇష్టం లేక పారిపోయి ట్రైన్ ఎక్కి.. ఇద్దరూ లేచిపోయారని ఊరంతా అనుకోవడం... ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ట్రైన్ లో పరిచయం స్నేహం, తర్వాత ప్రేమ పెళ్లి.. మధ్యలో కామెడీ.. ఇది ఒరేయ్ బుజ్జిగా సినిమా. అయితే అందులోని సన్నివేశాలను కామెడీగా ఎంటర్టైనింగ్ ఎలా ఆకట్టుకున్నాయి అనేది దర్శకుడు పనితనం మీదే ఆధారపడుతుంది. ఈ విషయంలో విజయ్ కుమార్ కొండా గట్టి ప్రయత్నమే చేసాడు. కథను ముందుకు తీస్కెళ్ళే క్రమంలో ఫస్ట్ హాఫ్ సాగదీతగా అనిపించగా.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ ఇచ్చాడు. అక్కడనుండి కథని పట్టాలెక్కించాడు. సెకండ్ హాఫ్ లో కామెడీతో కూడిన కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్లి నేనే బుజ్జిగాడ్ని అని చెప్పేస్తే క్లియర్ అయిపోయే కథ ఇది. కానీ చెప్పడు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈరోజుల్లో కూడా ఈ దాగుడు మూతల ఆటేంటో అర్థం కాదు. ఇక సినిమాలో చిరాకు తెప్పించే సీన్ ఏదైనా ఉందిగా అంటే అది ఆసుపత్రి సీన్. ఆ సీన్ ప్రేక్షకుల సహనానికి అసలైన పరీక్ష పెడుతుంది. ఇలాంటి సిల్లీ కామెడీతో సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది తప్ప పెద్దగా ఎక్కదు. మరి రాజ్ తరుణ్ ఖాతాలో మరో ప్లాప్ వేసాడు విజయ్ కుమార్ కొండా.
సాంకేతికంగా..
అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సో సో గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. ఆండ్రు సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ లోను, సెకండ్ హాఫ్ లోను కత్తెర వెయ్యాల్సిన సన్నివేశాలను యాజిటీజ్ గా అలానే ఉంచేశాడు. ఇక నిర్మాణ విలువలు కూడా సో సో గానే అనిపిస్తాయి.
>ట్యాగ్‌లైన్: ఏంట్రా.. బుజ్జిగా ఇది >రేటింగ్: 2.0/5