పలాస 1978 మూవీ రివ్యూ
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, తమ్మారెడ్డి భరద్వాజ
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచే, జనార్దన్, శృతి, లక్ష్మణ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: రఘు కుంచె
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెన్ట్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాత: ద్యాన్ అట్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
గతంలో కేరాఫ్ కంచర పాలెం సినిమా విషయంలో ఏదైతే జరిగిందో.. ఇప్పుడు పలాస 1978 విషయంలోనూ అదే జరిగింది. కేరాఫ్ కంచర పాలెం సినిమా విడుదల సమయం వరకు ఆ సినిమా ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. కానీ ఆ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ తో ఎంత సంచలనం అయ్యిందో.. విడుదలయ్యాక అంతే సంచలనం అయ్యింది. తాజాగా మరో సినిమా పలాస 1978 సినిమా ఎప్పుడు మొదలయ్యిందో.. ఈ సినిమా కథ ఎలాంటిదో కూడా నిన్నమొన్నటివరకు ప్రేక్షకులకు స్పష్టత లేదు. ఎందుకంటే అసలు ఈ సినిమా నేపథ్యం ఏమిటో.. అసలు ఇలాంటి సినిమా ఒకటి తెరకెక్కుతుంది అనే ఊహే ప్రేక్షకులకు రాలేదు. కానీ ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా ఉన్నట్టుండి.. గత వారం రోజులుగా మీడియాలోనే నానుతుంది. కారణం పబ్లిసిటీ. ఈ సినిమాలోని నటులు, సినిమాని తీసిన డైరెక్టర్ అందరూ ప్రేక్షకులకు పరిచయమే లేని పేర్లు. అయినప్పటికీ... ఈ సినిమా చూసిన అల్లు అరవింద్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ పలాస డైరెక్టర్ కరుణ కుమార్‌కి సెకండ్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడం.. ఓ సంచలనం అయితే.. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూట్ చెయ్యడంతో.. సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతంలో నివాసముండే.. అన్నదమ్ములు మోహన రావు(రక్షిత్), రంగారావు(తిరు వీర్) లు. ఇద్దరూ కూడా నాట్య కళాకారులు. అయితే అదే ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు (జనార్దన్) చిన్న షావుకారు(రఘు కుంచె) ఇద్దరూ అన్నదమ్ములు. అయితే పెద్ద, చిన్న షావుకారు మధ్యన ఆధిపత్య పోరు, అధికారం కోసం పోటీ పడుతూ ఉంటారు. అయితే పెద్ద షావుకారు, చిన్న షావుకారు రాజకీయ ఎత్తుగడలో.. మోహన రావు, రంగారావు అనుకోకుండా రౌడీలుగా మారతారు. అన్న షావుకారుపై పైచేయి సాధించాలి అనుకున్న చిన్న షావుకారు ఆ అన్నదమ్ములు ఇద్దరిని చేరదీసి రాజకీయంగా ఎదగడానికి వాళ్ళను వాడుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదమ్ములైన మోహన్ రావు, రంగారావుల జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? రౌడీలుగా మారిన అన్నదమ్ములిద్దరూ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటారు? చివరికి ఏం జరిగింది? అనేది పలాస సినిమా కథ.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో పాత్రలే కనబడతాయి.. అందులోని నటులను వెతకడం చాలా కష్టం. ఈ సినిమాకోసం నటుడు రక్షిత్ చాలా కష్టపడ్డాడు. మోహన్ రావు పాత్రలో రక్షిత్ ఒదిగిపోయాడు. కాస్త అనుభవం వస్తే మంచి నటుడు అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ నక్షత్ర మాత్రం తన పాత్ర పరిధి వరకు వంక పెట్టడానికి లేకుండా నటించింది. చిన్న షావుకారుగా రఘుకుంచె ఓకే అనిపిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు అన్నీ కూడా డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టుగా కనిపించాయి, పర్లేదు అనిపించాయి. కాకపోతే సహజత్వం కోసం కొన్ని పాత్రలకు మితిమీరిన మేకప్ వేసినట్టుగా స్పష్టంగా తెలిసిపోవడం కాస్త ఇబ్బంది పడే విషయం.
విశ్లేషణ:
దర్శకుడు కరుణ కుమార్ వాస్తవికతకు పెద్ద పీట వేస్తూ.. సగటు జీవితాన్ని, జీవన విధానాన్ని, కొంతమంది వ్యక్తుల నైజాన్ని ఈ పలాస 1978 ద్వారా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా మొత్తం పల్లెటూరిలో నడిచే సినిమా, రాజకీయానికి సంబందించిన కథనం, పెద్ద జాతిపై పోరాడిన ఇద్దరు అన్నదమ్ములు, సహజత్వం ఉట్టి పడే పాత్రలతో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా కూడా ఆ స్లాంగ్ మిస్ కాకుండా ప్రతి పాత్రతో శ్రీకాకుళం యాస మాట్లాడించాడు. శ్రీకాకుళంలోని పల్లె జీవితాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ, అక్కడి జానపదాల్ని వినిపిస్తూ ప్రేక్షకులను కథలో లీనం చేసాడు దర్శకుడు. అన్నదమ్ములైన మోహనరావు, రంగారావులను విడదీసి వాడుకునే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఫోర్త్ అండ్ బ్యాక్ స్క్రీన్‌ప్లే తో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచటానికి ప్రత్నించిన డైరెక్టర్ ఇంటర్వెల్ వరకు అక్కడక్కడా బోర్ కొట్టించినా కూడా కూర్చోబెట్టగలిగాడు. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే అన్నదమ్ముల మధ్యన ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్‌తో ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ లోకి వెళ్తాడు. అక్కడ ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ మొత్తం దాడులు, ప్రతి దాడులు అన్నట్టుగానే సాగిపోయింది. ఇక ఏదో చూపిస్తాడు అనుకున్న క్లైమాక్స్ చాలా పేలవంగా ఉంది. బ్యాలెన్సింగ్ గా చెప్పాల్సిన సెన్సిటివ్ పాయింట్ ని డైరెక్టర్ చాలా సునాయాసంగా ఒకే వర్గానికి ఫేవర్‌గా చెప్పేసాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాలుగు దశల్లో సాగే కథని దర్శకుడు అంతగా ఆకట్టుకునేలా వైవిధ్యంగా తియ్యడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. రఘు కుంచె నటుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగా కూడా మెప్పించాడు. రఘు కుంచె అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనుకోవాలి. పాటలు సినిమా ఫ్లో లో కలిసి సాగిపోయాయి. ఇక నేపధ్య సంగీతం అయితే చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ కొన్ని కొన్ని చోట్ల మెప్పిస్తుంది. ఇక నిర్మాణ విలువలు మాత్రం ఓకే అన్న రీతిలో ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా బి,సి సెంటర్స్‌లో కొన్ని రోజులు నిలబడే అవకాశం అయితే లేకపోలేదు.
>సినీజోష్ రేటింగ్: 2.75/5