>>>జాను మూవీ రివ్యూ
>>>బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
>>>నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, శరణ్య ప్రదీప్, రఘుబాబు, సాయి కిరణ్ కుమార్, గౌరీ జి కిషన్ తదితరులు తదితరులు
>>>సినిమాటోగ్రఫీ: మహేందిరం జయరాజు
>>>ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
>>>మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత
>>>నిర్మాత: దిల్ రాజు, శిరీష్
>>>స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సి. ప్రేమ్ కుమార్
శర్వానంద్ - సమంత కలిసి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తున్నారు అనగానే కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పెళ్లి తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే కనెక్ట్ అవుతున్న సమంత.. రెండు పరాజయాల తర్వాత శర్వానంద్ ఒప్పుకున్న సినిమా కావడం, దిల్ రాజు తమిళనాట ప్రివ్యూ చూసిన దగ్గరనుండి.. 96 రీమేక్ చెయ్యాలని అనుకోవడంతో.. వీరి కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనబడింది. అయితే కోలీవుడ్ లో 96 సినిమా చూసాక ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ ని తెలుగులో చేసి చెడగొడతారేమో అనే ఫీలింగ్ లో ఉన్నవారికి ఆ సినిమా టైటిల్ (జానూ), టీజర్, ట్రైలర్ ఓ అంచనాలకి వచ్చేలా చేసాయి. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ 96 రీమేక్ సినిమాని డైరెక్ట్ చెయ్యడం, టైటిల్ జానూ పాత్రలో సమంత హీరోయిన్ కావడంతో సినిమాపై ఆటోమాటిక్ గా అంచనాలు పెరిగాయి. అయితే దిల్ రాజు అంతగా నమ్మిన 96 రీమేక్ తెలుగులో జానూ గా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో అనేది... ప్రేక్షకులు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. మరి జానూ సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.
కథలోకి వెళితే.. రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్) వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫేర్... అడవుల్లోని క్రూర మృగాలను, అరుదయిన పక్షులను ఫొటోస్ తీసే రామ్ అనుకోకుండా తాను చిన్నప్పుడు చదివిన స్కూల్ కి వెళ్లడం.. అక్కడ వాచ్ మ్యాన్ తనని గుర్తుపట్టాడో లేదో చూసి.. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో తాను ఇష్టపడిన జానకి దేవి అలియాస్ జానూ(సమంత) ఆలోచనలలో ఉండగా.. స్కూల్ డేస్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి పిలవడంతో.. రామ్ ఆ పార్టీకి వస్తాడు. అక్కడికి జానూ కూడా వస్తుంది. ఆ ఫంక్షన్ లో రామ్ ని చూసిన జానూ ఎమోషనల్ అవ్వడమే కాదు.. రామ్ తో మాట్లాడాలని, రామ్ తో టైం స్పెండ్ చెయ్యాలని ట్రై చేస్తుంది.. ఆ పార్టీ తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి రామ్ కి జానూ ని అప్పగించి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించమంటారు. మరి స్కూల్ డేస్ లో ప్రేమించుకున్న రామ్ - జానూ ప్రేమ 15 ఏళ్ళ తర్వాత ఎలా ఉంది? అసలు రామ్ ని వదిలి జానూ ఎక్కడికి వెళ్ళిపోయింది? 15 ఏళ్ళ తరవాత పార్టీలో కలిసిన జానూ - రామ్ లు ఏం చేసారు? పార్టీ తర్వాత జానూ తిరిగి రామ్ ని వదిలి వెళ్లిపోయిందా? అనేది జానూ మిగతా కథ.
నటనాపరంగా.. జానకి దేవి అలియాస్ జానూ గా సమంత ఎక్సప్రెషన్స్, ఆమె ఎమోషనల్ నటన కట్టిపడేస్తుంది. జానూ కథ మొత్తం సమంత - శర్వానంద్ చుట్టూనే తిరుగుతుంది. రామచంద్ర అలియాస్ రామ్ గా శర్వానంద్ లుక్స్ పరంగాను, నటన పరంగాను అదరగొట్టేసాడు సమంత - శర్వానంద్ కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ హైలెట్. హగ్స్,కిస్సులు లేకపోయినా.. సమంత- శర్వా.. కళ్ళలో పలికే ఎక్సప్రెషన్స్, నటనతోనే రొమాంటిక్ గా కట్టిపడేసారు. మిగతా వాళ్లలో వెన్నెల కిషోర్ పాత్ర శరణ్య ప్రదీప్ పాత్ర కామెడీ యాంగిల్ లో మెప్పిస్తుంది. స్కూల్ డేస్ లో చేసిన సాయి కిరణ్ కుమార్, గౌరీ జి కిషన్ తదితర నటులు మెప్పిస్తారు. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ
స్ట్రయిట్ గా జానూ సినిమా గురించి చెప్పాలి అంటే.... తమిళ 96 సినిమాని పక్కనపెట్టి.. జానూ గురించి మాత్రం మాట్లాడుకుందాం. దర్శకుడు ప్రేమ్ కుమార్ స్కూల్ డే లో మొదలయ్యే ప్రేమ మీద స్టోరీ లైన్ రాసుకున్నాడు. ఇలాంటి ప్రేమ కథలు గతంలో చాలానే చూసినా.. దర్శకుడు స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసి ప్రేక్షుడిలో ఆసక్తి కలిగించాలనుకున్నాడు. స్కూల్ డేస్ లో పుట్టిన ప్రేమ స్వచ్ఛంగా కనబడుతుంది. కానీ అప్పుడది ఆకర్షణ అనుకోవాలి.. అదే ప్రేమ 15 ఏళ్ళ తర్వాత కూడా కంటిన్యూ అయితే.. అది నిజంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ జానూ అని రివీల్ అయినప్పటినుండి, టీజర్, ట్రైలర్ చూసాక.. సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక సినిమాలోకి వెళితే జానూ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శర్వానంద్ స్కూల్ డేస్ ని గుర్తు చేసుకోవడం, స్కూల్ డేస్ బ్యాచ్ అంతా 15 ఏళ్ళ తర్వాత రియూనియన్ పార్టీ.. సమంత ఎంట్రీ.. స్కూల్ బ్యాక్ డ్రాప్ తో ఓకె ఓకె అనిపిస్తుంది.. అయితే దర్శకుడు సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్గా నడిపించే ప్రయత్నం చేశాడు. సమంత.. శర్వా ని వదిలేసి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అవడం, తన కోసం శర్వా ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం, శర్వా ని అలా చూసి సమంత ఎమోషన్ అవ్వడం అన్ని బావుంటాయి. ఇక సినిమా మెయిన్ హైలెట్స్ లో శర్వానంద్, సమంత కెమిస్ట్రీ ఒకటి. వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. వాళ్ళ తొలిప్రేమని తలచుకుని వాళ్ళు బాధ పడే సన్నివేశాలు సున్నితంగా గుండెను తాకుతాయి అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా.... అది అలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నా కూడా.. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్.. ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి అని సరిపెట్టుకోవాలేమో అనిపిస్తుంది. దానివలన ప్రేక్షకుడు అక్కడక్కడా కాస్త బోర్ ఫీల్ అవుతాడు. ఇక ఓవరాల్ గా తమిళంలో 96 చూడని వాళ్లకు జాను పర్లేదు అనిపిస్తుంది. ఇది రీమేక్ కావడంతో ఒరిజినల్‌తో దీన్ని పోల్చి చూస్తే జాను ఆ సినిమా స్థాయిలో మాత్రం ఉండదు. అలా కాకుండా ఒక ఫ్రెష్ సినిమాగా చూసేవారికి మాత్రం నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.
సాంకేతికంగా... సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసింది. గోవింద్ వసంత మ్యూజిక్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. పాటలు కథలో భాగమైపోయాయి అనిపిస్తుంది. విడిగా వింటే అంతగా నచ్చని పాట కూడా తెరపై మాత్రం బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. రొమాంటిక్ సన్నివేశాల్లోను, స్కూల్ నేపథ్యంలోనూ, ఎమోషనల్ సీన్స్ లోను నేపధ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక సినిమాకి మహేందిరం జయరాజు సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఎడిటింగ్ విషయానొకేస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్స్ కత్తెర వేస్తె బావుండు అనిపిస్తుంది.. కానీ సినిమా పరంగా అవి ఖచ్చితంగా ఉండాల్సినవి సీన్స్ అనిపించక మానదు. నిర్మాణ విలువలు కథానుసారం ఆకట్టుకున్నాయి.
>రేటింగ్: 2.5/5