Advertisementt

సినీజోష్ రివ్యూ: వినయ విధేయ రామ

Fri 11th Jan 2019 09:38 PM
ramcharan new movie vinaya vidheya rama,vinaya vidheya rama movie review in cinejosh,vinaya vidheya rama cinejosh review,boyapati new movie vinaya vidheya rama  సినీజోష్ రివ్యూ: వినయ విధేయ రామ
vinaya vidheya rama movie review సినీజోష్ రివ్యూ: వినయ విధేయ రామ
సినీజోష్ రివ్యూ: వినయ విధేయ రామ Rating: 2.25 / 5
Advertisement
Ads by CJ

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్

వినయ విధేయ రామ

తారాగణం: రామ్‌చరణ్, కియారా అద్వాని, వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, స్నేహ, హేమ, పృథ్వీ, ముఖేష్ రుషి, మహేష్ మంజ్రేకర్, రవివర్మ, హరీష్ ఉత్తమన్, ఈషా గుప్తా తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, రిషి పంజాబీ

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

మాటలు: ఎం.రత్నం

సమర్పణ: డి.పార్వతి

నిర్మాత: దానయ్య డి.వి.వి.

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

విడుదల తేదీ: 11.01.2019

ఏ సినిమాకైనా కథే హీరో... తర్వాతే దర్శకుడు, నటీనటులు. ఈ మాటను మనం పదే పదే వింటూ ఉంటాం. అయితే ఒక ఇమేజ్ ఉన్న హీరో, అడపా దడపా సూపర్‌హిట్ సినిమాలు తీసే డైరెక్టర్.. ఈ కాంబినేషన్‌లో సినిమా చేసేస్తే సూపర్‌హిట్ అయిపోతుంది, కాసుల వర్షం కురుస్తుంది అనే భ్రమ చాలా మంది దర్శకనిర్మాతల్లో ఉంది. కేవలం కాంబినేషన్ వల్ల సినిమాలు సూపర్‌హిట్ అవ్వవు అనేది ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా ఆ ఆశ చావదు. ఈ శుక్రవారం విడుదలైన వినయ విధేయ రామ చిత్రం కూడా దానికి మినహాయింపు కాదు. రంగస్థలం వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత రామ్‌చరణ్ చేస్తున్న సినిమా అంటే భారీ అంచనాలు ఏర్పడడం సహజమే. అందులోనూ హీరోను పవర్‌ఫుల్ క్యారెక్టర్ ద్వారా అద్భుతంగా ప్రజెంట్ చెయ్యగలడు అని పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా చేస్తున్నాడంటే ఏదో విషయం ఉంటేనే తప్ప ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాదు అనే గట్టి నమ్మకం కూడా అందరికీ ఉంటుంది. మరి ఆ నమ్మకాన్ని బోయపాటి ఎంతవరకు నిలబెట్టుకున్నారు? చరణ్‌ని ఎంత పవర్‌ఫుల్‌గా చూపించారు? వినయ విధేయ రామ అనే సాఫ్ట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కొత్త అంశాలేమిటి? రంగస్థలంతో సూపర్‌హిట్ కొట్టిన చరణ్‌కి బోయపాటి మరో సూపర్‌హిట్ ఇవ్వగలిగాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

మనం మొదట చెప్పుకున్నట్టు సినిమాకి కథే హీరో. అయితే ఆ హీరో ఈ సినిమాలో లేడు. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వందల సినిమాల్లో ఈ తరహా కథలను చూసేశాం. కథ పాతదే..కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. ఒక సాదా సీదా కథను తీసుకొని దానికి కొంతమంది ప్రముఖ నటీనటులను తీసుకొచ్చి కొత్త లొకేషన్స్ అనే ముసుగువేసి ప్రేక్షకుల సమయంతో ఆడుకున్న సినిమా వినయ విధేయ రామ. అనాథలైన నలుగురు కుర్రాళ్ళకి అనుకోకుండా ఓ చిన్నపిల్లాడు దొరుకుతాడు. అతన్ని సొంత తమ్ముడిలా పెంచుకుంటూ ఉంటారు. అతనికి రామ్(రామ్‌చరణ్) అని పేరు పెడతారు. అన్నయ్యలు తనమీద చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడైన ఆ తమ్ము తన చదువు మానేసి అన్నయ్యలను చదివిస్తాడు. వాళ్ళు పెద్ద చదువులు చదివి గొప్పవారవుతారు. వారిలో పెద్దవాడు భువన్‌కుమార్(ప్రశాంత్) ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయి ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేస్తుంటాడు. అన్నయ్యలకు ఏ ఆపద వచ్చినా రామ్ వెంటనే స్పందిస్తాడు, తగిన పరిష్కారం చూపిస్తాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న భువన్‌కుమార్‌ని బీహార్‌లో జరిగే ఎన్నికలకు కమిషనర్‌గా పంపిస్తారు. రాజా భాయ్(వివేక్ ఓబెరాయ్) అనే రౌడీ బీహార్‌లోని ఒక ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ వారిని సైతం ఆడిస్తుంటాడు. అక్క ఎలక్షన్స్ జరగకుండా తన బలగంతో అడ్డుకుంటూ ఉంటాడు. దాంతో భువన్‌కుమార్‌ని అక్కిడికి పంపిస్తుంది ప్రభుత్వం. దానికి రాజా భాయ్ ఎలా స్పందించాడు? తన నిజాయితీ వల్ల భువన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? తమ్ముడు రామ్ అతనికి ఏవిధంగా సాయపడ్డాడు? రాజా భాయ్ నుంచి అన్నయ్యను కాపాడుకోగలిగాడు? అనేది మిగతా సినిమా. 

రామ్ క్యారెక్టర్‌లో నటించిన రామ్‌చరణ్ ఈ తరహా క్యారెక్టర్ కొత్తేమీ కాదు. అదీకాక రామ్ క్యారెక్టరైజేషన్ కూడా గొప్పగా అనిపించదు. జీవితంలో ఒక ఎయిమ్ అంటూ లేని వ్యక్తి. తప్పు చేసినవారిని తన్నడమే పనిగా పెట్టుకున్న క్యారెక్టర్. పెర్‌ఫార్మెన్స్ విషయానికి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాగే పాటల్లో వేసిన స్టెప్స్ కూడా అతని గత సినిమాల స్టెప్స్‌లాగే అనిపిస్తాయి. హీరోయిన్‌గా నటించిన కియారా అద్వారా కాస్త గ్లామరస్‌గా కనిపించే ప్రయత్నం చేసింది. ఆమె పెర్‌ఫార్మెన్స్ కూడా కొత్తగా అనిపించదు. విలన్‌గా నటించి వివేక్ ఓబెరాయ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అతని పెర్‌ఫార్మెన్స్ కూడా డిగ్నిఫైడ్‌గా ఉంది. ఒక విధంగా రామ్‌చరణ్‌కి పెర్‌ఫార్మెన్స్ పరంగా గట్టి పోటీ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించిన ప్రశాంత్ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే మంచి నటన ప్రదర్శించాడు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఆర్యన్ రాజేష్‌కి ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారు. ఏ సందర్భంలోనూ అతని క్యారెక్టర్ ఎలివేట్ అవ్వదు. ప్రశాంత్‌కి భార్యగా నటించిన స్నేహ హుందాగా కనిపించింది. అయితే క్లైమాక్స్‌లో విలన్‌తో ఛాలెంజ్ చేసే సీన్ మాత్రం చాలా చీప్‌గా ఉంటుంది. హీరోయిన్స్ ఛాలెంజ్ చేసే సీన్స్ గతంలో చాలా సినిమాల్లో చూసేసి ఉండడం వల్ల ఆడియన్స్‌కి ఎలాంటి ఫీలింగ్ కలగదు. కనిపించిన రెండు, మూడు సీన్స్‌లో హేమ, పృథ్వీ నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమాలో తారాగణం చాలా ఎక్కువే. కానీ, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ.

టెక్నికల్‌గా చూస్తే ఆర్థర్ ఎ. విల్సన్, రిషి పంజాబీ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రతి సీన్‌ని రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా  చూపించే ప్రయత్నం చేశారు. బోయపాటితో కలిసి చేసిన సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చే దేవిశ్రీప్రసాద్ ఈసారి పాటల విషయంలో నిరాశ పరిచాడు. ఒకటి, రెండు పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కూడా ఎలాంటి మెరుపులు కనిపించలేదు. టోటల్‌గా దేవి మ్యూజిక్ సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఇక ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాశ్ వర్క్ బాగుంది. ప్రతి సీన్‌లో అతని పనితనం కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ షరా మామూలే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. లొకేషన్స్‌గానీ, సెట్టింగ్స్‌గానీ, యాక్షన్ సీక్వెన్స్‌లకుగానీ, సి.జి. వర్క్‌కిగానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. ఎం.రత్నం రాసిన మాటలు కూడా చాలా సాదా సీదాగా ఉన్నాయి. సినిమాలోని ఏ ఒక్క డైలాగ్ కూడా కొత్తగా ఉందే అనిపించేలా లేదు. ఫైనల్‌గా డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి చెప్పాలంటే.. నాలుగు పాటలు, నాలుగు రక్తం చిందే యాక్షన్ సీక్వెన్స్‌లు, హీరోని ఎలివేట్ చేసే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇవి ఉంటే చాలు సినిమా సక్సెస్ అయిపోతుందనే భ్రమలో ఉన్నట్టున్నాడు బోయపాటి. అందుకే తన ప్రతి సినిమాలోనూ యాక్షన్‌ని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ సినిమా విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్స్‌లను అవసరానికి మించిన లెంగ్త్‌లో చూపించాడు. ఒక్కో ఫైట్‌ను చాలా సేపు చూపించడం వల్ల ఆడియన్స్‌కి చిరాకు పుట్టే ప్రమాదం ఉంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. మరో పక్క ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసే స్క్రీన్‌ప్లేతో మరింత చిరాకు పుట్టించాడు. ఏ సీన్ ఎక్కడ జరుగుతుంది, ఏ సీన్ తర్వాత ఏది వస్తుందో అర్థంకాని అయోమయంలో ఉన్నప్పుడే ఒక లాంగ్ ఫైట్‌తో సినిమా ఎండ్ అవుతుంది. వినయ విధేయ రామ అనే టైటిల్‌కి సినిమాలో ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. కేవలం రైమింగ్ బాగుందని ఆ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కమర్షియల్ ఫార్ములాను పట్టుకొని చేసిన ఈ సినిమా ఏ సెంటర్ ఆడియన్స్‌కీ నచ్చే అవకాశం లేదు. 

ఫినిషింగ్ టచ్: రామ రామ

vinaya vidheya rama movie review :

telugu movie VINAYA VIDHEYA RAMA

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ