Advertisementt

సినీజోష్ రివ్యూ: కవచం

Sat 08th Dec 2018 09:05 AM
telugu movie kavacham,bellamkonda sai srinivas new movie kavacham,kavacham movie review,kavacham movie review in cinejosh,kavacham movie cinejosh review  సినీజోష్ రివ్యూ: కవచం
telugu movie kavacham review సినీజోష్ రివ్యూ: కవచం
సినీజోష్ రివ్యూ: కవచం Rating: 2 / 5
Advertisement

వంశధార క్రియేషన్స్

కవచం

తారాగణం: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్, నీల్ నితిన్ ముఖేష్, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్, హర్షవర్థన్ రాణె తదితరులు

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు

ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్

సంగీతం: ఎస్.ఎస్.థమన్

నిర్మాత: నవీన్ శొంఠినేని

రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ

విడుదల తేదీ: 07.12..2018

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్స్, పెద్ద బేనర్స్‌లోనే. ఆ సినిమాల జయాపజయాల విషయం పక్కన పెడితే ఈసారి కొత్త డైరెక్టర్‌తో, కొత్త బేనర్‌లో చేసిన సినిమా కవచం. బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో హీరో బెల్లంకొండ పోలీసాఫీసర్‌గా ఎంతవరకు ఆకట్టుకున్నాడు? కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ కవచంలో చూపించిన కొత్తదనం ఏమిటి? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

అతని పేరు విజయ్(బెల్లంకొండ సాయిశ్రీనివాస్). తండ్రి పోలీసాఫీసర్ కావడంతో తను కూడా ఖాకీ యూనిఫామ్‌పై మక్కువ పెంచుకొని ఎస్.ఐ.గా జాయిన్ అవుతాడు. సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌కి ఓరోజు ఓ అమ్మాయి(మెహరీన్) తారస పడుతుంది. ప్రేమించిన వాడి కోసం ఇంటినుంచి పారిపోయి వచ్చిన ఆమెను కొంతమంది రౌడీల నుంచి విజయ్ కాపాడతాడు. తన పేరు సంయుక్త అని చెబుతుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఒకరోజు అతని తల్లి యాక్సిడెంట్‌కి గురవుతుంది. ఆమె బ్రతకాలంటే 50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ చెబుతాడు. అంత డబ్బు విజయ్ దగ్గర లేదు. దానికి సంయుక్త ఒక ప్లాన్ చెబుతుంది. తన మావయ్య కోటీశ్వరుడని, తనని కిడ్నాప్ చేసానని చెప్పి 50 లక్షలు డిమాండ్ చెయ్యమని సలహా ఇస్తుంది. ఆమె చెప్పినట్టుగానే కిడ్నాప్ పేరుతో 50 లక్షలు సంపాదించి తల్లిని కాపాడుకుంటాడు విజయ్. ఆ తర్వాత సంయుక్తను ఇంటికి పంపించేస్తాడు. గతంలో విజయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ, అనుకోకుండా ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఇదిలా ఉంటే కోటీశ్వరుడు మహేంద్రవర్మ మేనకోడలు సంయుక్తను పోలీసాఫీసర్ విజయ్ కిడ్నాప్ చేశాడని టీవీలో న్యూస్ వస్తుంది. అది గతంలో విజయ్ ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి సంయుక్త అయితే తన ఇంట్లో అన్నిరోజులు ఉన్నది ఎవరు? తను సంయుక్తగా ఎందుకు నటించింది? ఇప్పుడు అసలు సంయుక్తను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కేసులో తనని ఎందుకు ఇరికించారు? వంటి ప్రశ్నలు విజయ్‌ను వేధిస్తుంటాయి. తను ప్రేమించిన అమ్మాయిని కిడ్నాపర్స్ నుంచి కాపాడుకునేందుకు పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు విజయ్. ఇన్ని ట్విస్టులు ఇచ్చిన నిజమైన కిడ్నాపర్ ఎవరు? ఆ కిడ్నాపర్ విజయ్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు? తను ప్రేమించిన అమ్మాయిని రక్షించుకునేందుకు విజయ్ ఎలాంటి ప్లాన్ వేశాడు? ఆమెను ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ. 

పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ మెప్పించలేకపోయాడు. గతంలో ఎంతో మంది హీరోలు పోలీసాఫీసర్స్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించి పవర్‌ఫుల్ పోలీస్ అంటే ఇలా ఉంటాడని చెప్పారు. అయితే శ్రీనివాస్ ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. కేవలం డాన్సులు, ఫైట్స్‌లో మాత్రమే తన టాలెంట్ చూపించగలిగాడు. ఇక హీరోయిన్లు కాజల్, మెహరీన్‌లు తమ గ్లామర్‌తో, క్యారెక్టర్స్‌కి తగ్గ నటనతో ఆకట్టుకోగలిగారు. విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్ ఫర్వాలేదు అనిపించాడు. సినిమాలో మిగతా క్యారెక్టర్స్‌కి అంతగా ఇంపార్టెన్స్ లేదు. అక్కడక్కడ కనిపించే ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్‌ల పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాలంటే మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు గురించి. ప్రతి షాట్, ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు. హీరోయిన్లను గ్లామరస్‌గా కనిపించారంటే అతను అందించిన ఫోటోగ్రఫీయే కారణం. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు చేసిన పాటల్లో ఒక్కపాట కూడా వినసొంపుగా లేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌లో బాగుంది, కొన్ని చోట్ల విసిగించింది. ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గురించి చెప్పుకోవాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సినిమా ఎంతో రిచ్‌గా కనిపించడంలో అతని పనితనం కూడా చాలా ఉంది. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ తన కతె్తరకి మరికాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో కథకు అవసరం లేని, కాలయాపన చేసే సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. సినిమా మొత్తం ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ల గురించి చెప్పాలంటే తనకిది మొదటి సినిమాయే అయినప్పటికీ టేకింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకోగలిగాడు. అయితే కథలోగానీ, కథనంలోగానీ, ఆర్టిస్టుల ఎంపికలో గానీ జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు కోకొల్లలు. ఒక కిడ్నాపర్‌గా టీవీల్లో కూడా కనిపించిన హీరో రోడ్లమీద హ్యాపీగా తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుంటూ ఉంటాడు. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని ట్విస్టులు ఉంటే చాలు సినిమా ఆడేస్తుందన్న భ్రమలో ఉన్నాడేమో ఢైరెక్టర్. హండ్రెడ్ పర్సెంట్ దాన్నే ఫాలో అయ్యాడు. అందుకే మధ్య మధ్యలో వచ్చే పాటలు ఆడియన్స్‌ని విసిగిస్తాయి. ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో వచ్చే సినిమాల్లో హీరోయిజాన్ని చూపిస్తూ, విలన్‌ని మట్టికరిపించే హీరోకి అన్నీ తనకు అనుకూలంగానే జరుగుతుంటాయి. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. హీరో వేసిన ప్లాన్ ప్రకారమే విలన్ కదలికలు ఉంటాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా చెప్పాల్సి వస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పాలి. హీరో పెర్‌ఫార్మెన్స్, బలం లేని కథ, కథనాలు, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎంటర్‌టైన్‌మెంట్, లాజిక్ లేని సీన్స్... ఇలా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే పేరుకు కమర్షియల్ సినిమాయే అయినా సరైన కథగానీ, పాటలుగానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ లేకపోవడం వల్ల ఎ సెంటర్ నుంచి సి సెంటర్ వరకు ఏ ప్రేక్షకుల్నీ ఈ సినిమా ఆకట్టుకోదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్ టచ్: ప్రేక్షకులకు రక్షణ లేని కవచం

telugu movie kavacham review:

bellamkonda srinivas new movie kavacham

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement