Advertisementt

సినీజోష్ రివ్యూ: 2.0

Fri 30th Nov 2018 12:18 PM
rajnikanth new movie 2.0 review,2.0 movie review in cinejosh,2.0 movie cinejosh review,rajnikanth and shankar latest movie 2.0 review  సినీజోష్ రివ్యూ: 2.0
telugu movie 2.0 review సినీజోష్ రివ్యూ: 2.0
సినీజోష్ రివ్యూ: 2.0 Rating: 3 / 5
Advertisement
Ads by CJ

 

 

 

లైకా ప్రొడక్షన్స్, ఎన్.వి.ఆర్. సినిమా

2.0

తారాగణం: రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్‌కుమార్, సుధాంశు పాండే, అనంత్ మహదేవన్, ఆదిల్ హుస్సేన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

ఎడిటింగ్: ఆంటోని

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎ.ఆర్.రెహమాన్, కుతుబ్-ఎ-క్రిప

నిర్మాత: సుభాస్కరన్

రచన, దర్శకత్వం: శంకర్

విడుదల తేదీ: 29.11.2018

సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉంది. తమ స్వలాభం కోసం మరొక ప్రాణిని చంపే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా మనిషికి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తమ విలాసాల కోసం సెల్ ఫోన్లు వాడుతూ, వాటి ద్వారా వ్యాపించే రేడియేషన్‌తో పక్షుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. సెల్ ఫోన్స్ వాడినా రేడియేషన్‌ను తగ్గించే మార్గం చూడాలి. సెల్ నెట్‌వర్క్‌లు పదుల సంఖ్యలో కాకుండా అంకెల వరకే పరిమితం కావాలి. ఇదీ ఈ గురువారం విడుదలైన రజనీకాంత్, శంకర్‌ల 2.0 చిత్ర కథాంశం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రోబో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందిన ఈ 2.0 చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్ర యూనిట్ నాలుగేళ్ళు పడిన కష్టాని ప్రతిఫలంగా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి 2.0 చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? శంకర్ చెప్పిన పాయింట్‌కి ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

నగరంలో హఠాత్తుగా సెల్ ఫోన్లు మాయమవుతూ ఉంటాయి. ప్రజల చేతుల్లోని సెల్ ఫోన్స్ రెక్కల్లొచ్చి గాల్లోకి ఎగిరిపోతుంటాయి. ఆఖరికి రోబో సైంటిస్ట్ డా.వశీకర్(రజనీకాంత్) సెల్ ఫోన్ కూడా మాయమవుతుంది. ఆ సెల్‌ఫోన్లన్నీ ఒక సమూహంగా మారతాయి. సెల్ ఫోన్ల షోరూమ్ ఓనర్‌ని, మినిస్టర్‌ని... ఇలా వరసగా ఆ సెల్‌ఫోన్  సమూహం అంతం చేస్తుంటుంది. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడుతుంది. అత్యవసరంగా సైంటిస్టులతో సమావేశమై సమస్యపై తీవ్రంగా చర్చిస్తారు. డా.వశీకర్, అతని అసిస్టెంట్ రోబో వెన్నెల(అమీ జాక్సన్) కలిసి ఆ సెల్‌ఫోన్లు ఉన్న చోటును కనుక్కుంటారు. సెల్‌ఫోన్లన్నీ ఒక పెద్ద పక్షిగా మారుతుంది. ఆ పక్షి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సెల్‌ఫోన్లన్నీ పక్షిగా ఎందుకు మారాయి అంటే దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. అతని పేరు పక్షిరాజు(అక్షయ్‌కుమార్). పక్షులంటే అతనికి ప్రాణం. కొన్ని వేల పక్షులు అతని దగ్గర ఆశ్రయం పొందుతుంటాయి. అయితే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు అంతరిస్తున్నాయని గ్రహిస్తాడు పక్షిరాజు. దానిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతాడు. సెల్ ఫోన్లు వాడకండి, పక్షుల్ని కాపాడండి అంటూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలనుకుంటాడు. అందులో భాగంగానే దానికి సంబంధించిన మినిస్టర్‌ని, సెల్ కంపెనీ అధిపతిని కలుస్తాడు. కానీ, ఎవరూ అతనికి అనుకూలంగా స్పందించరు. దీంతో మనస్తాపం చెందిన పక్షిరాజు ఒక సెల్ టవర్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మగా మారిన పక్షిరాజుకు అప్పటివరకు చనిపోయిన పక్షుల ఆత్మలు కూడా తోడై అతన్ని మహా బలవంతుడుగా మారతాడు. పక్షుల మరణానికి కారణం అవుతున్న సెల్ ఫోన్లను నిర్మూలించడమే ఇప్పుడు పక్షిరాజు లక్ష్యం. అందుకే సెల్ ఫోన్లను మాయం చేస్తుంటాడు. పక్షిరాజును అంతం చేసేందుకు డా. వశీకర్‌ను ఆశ్రయిస్తుంది ప్రభుత్వం. అతను సృష్టించిన చిట్టి(రోబో) చట్ట వ్యతిరేకమైందని అప్పట్లో ప్రభుత్వం నిషేధించింది. అయితే చిట్టి రాక అనివార్యం కావడంతో దాన్ని అనుమతిస్తారు. చిట్టి సాయంతో డా.వశీకర్... పక్షిరాజును ఎలా అంతం చేశాడు అనేది మిగతా కథ. 

శంకర్ గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే 2.0 కథ పూర్తి భిన్నమైంది. అతని ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. అతని మొదటి సినిమా జెంటిల్‌మేన్‌లో చదువుకోవాలని ఉన్నా ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల గురించి ఆ సినిమా చేశాడు. లంచగొండితనం వల్ల సామాన్య ప్రజలు ఎలా నష్టపోతున్నారనేది భారతీయుడులో చూపించాడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా చేయగలం అని ఒకే ఒక్కడు చిత్రంలో చెప్పాడు... ఇలా ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. 2.0 విషయానికి వస్తే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అనే విషయాన్ని ఒక విజువల్ వండర్ రూపంలో చెప్పాడు. ఆ సినిమాలకు, ఈ సినిమాకి ఉన్న తేడా... ఎమోషన్... ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం. సెల్ ఫోన్ల వల్ల పర్యావరణం కలుషితమైపోతుందనేది హాట్ టాపిక్కే అయినా కథలోని క్యారెక్టర్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోవడం, ముఖ్యంగా కామన్ ఆడియన్ ఒక విజువల్ ఎఫెక్ట్స్‌తో చేసిన సినిమా చూస్తున్న భావనతోనే ఉంటాడు తప్ప కంటెంట్‌కి, క్యారెక్టర్స్‌కి ఎక్కడా కనెక్ట్ అవ్వడు. ఈ సినిమా మొదటి భాగం రోబోలో కథ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అందుకే ఆ సినిమాను సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో క్లారిటీగా చూస్తాడు. 

కథ, కథనాలు పక్కన పెడితే ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక బలం విజువల్ ఎఫెక్ట్స్. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి షాట్‌ని ఎంతో కష్టపడి చేశారు. విజువల్‌గా ఒక వండర్‌ని క్రియేట్ చేసారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెల్‌ఫోన్ల వరద, సెల్‌ఫోన్లన్నీ పక్షిగా మారడం, సెల్‌ఫోన్లు మిలటరీ కంపెనీపై దాడి చేయడం, చిట్టి-పక్షిరాజు మధ్య భారీ ఫైట్...ఇలా సినిమాలోని ప్రతి విజువల్ వండర్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో 3.0 పేరుతో కనిపించే చిన్న రోబోలను అద్భుతంగా క్రియేట్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా విజువల్ ఎఫెక్ట్స్‌ని చేయడంలో 2.0 టీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఇండియన్ డైరెక్టర్లు కూడా ఇలాంటి సినిమాలు తియ్యగలరని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు డైరెక్టర్ శంకర్. ఈ సినిమా టెక్నీషియన్స్‌లో మరో ముఖ్యపాత్ర పోషించింది ఎ.ఆర్.రెహమాన్. ఈ సినిమాలో పాటలు ఎక్కువ లేవు. ఉన్న మూడు పాటల్ని తనదైన శైలిలో చెయ్యగలిగాడు రెహమాన్. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అత్యద్భుతంగా చేశాడు. నిరవ్‌షా ఫోటోగ్రఫీ సినిమాలోని రిచ్‌నెస్‌ని చూపించింది. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే వశీకర్‌గా, చిట్టిగా రజనీకాంత్ ఎప్పటిలాగే మంచి నటనను ప్రదర్శించారు. పక్షిరాజుగా ఓల్డ్ గెటప్‌లో అక్షయ్‌కుమార్ పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రోబో వెన్నెలగా అమీ జాక్సన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. 

ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చేయని ఒక గ్రాండియర్ మూవీ 2.0. మంచి మెసేజ్ ఇస్తూనే కళ్ళు చెదిరే విజువల్స్‌తో ఒక అద్భుతాన్ని సృష్టించారు శంకర్. ఇలాంటి ఓ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో శంకర్, అతని టీమ్ చేసిన కృషిని తప్పకుండా ప్రశంసించి తీరాలి. భావి తరం దర్శకులు కూడా ఇలాంటి అద్భుతాలను చేయడానికి శంకర్ మార్గదర్శిగా మారాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే 2.0 విజువల్‌గా అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లల్ని ఈ సినిమా విశేషంగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్ టచ్: శంకర్ మరో అద్భుత సృష్టి

telugu movie 2.0 review :

rajnikanth new movie 2.0

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ