సన్ పిక్చర్స్
సర్కార్
తారాగణం: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాధారవి, యోగిబాబు, తులసి తదితరులు
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
సమర్పణ: కళానిధి మారన్
నిర్మాత: వల్లభనేని అశోక్
రచన, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్
విడుదల తేదీ: 06.11.2018
ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కుని మరొకరు లాగేసుకుంటే... మనకు తెలియకుండానే మరొకరు మన ఓటు వేసేస్తే.. ఈ పాయింట్‌తో ప్రారంభమయ్యే సినిమా సర్కార్. తమిళ స్టార్ హీరో విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మరి ఈ మూడో సినిమాకి ఎలాంటి ఫలితం వచ్చింది? సర్కార్ చిత్రంతో హ్యాట్రిక్ సాధించారా? ఈ సినిమా ద్వారా మురుగదాస్ ఇచ్చిన మెసేజ్ ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతని పేరు సుందర్‌స్వామి(విజయ్). అమెరికాలోని జి.ఎల్. కార్పొరేట్ కంపెనీలో సి.ఇ.ఓ.గా పనిచేస్తుంటాడు. అతని పేరు చెబితే మిగతా దేశాల్లోని కార్పొరేట్ కంపెనీలు వణికిపోతాయి. అతను ఒక దేశంలో అడుగుపెట్టాడంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలను మూయించిన తర్వాతే అమెరికా వెళతాడు. తమ దేశంలోకి అడుగుపెట్టకుండా కొన్ని దేశాలు సుందర్‌ని నిషేధించాయి కూడా. వందల కోట్ల ఆదాయం ఉన్న సుందర్ సడన్‌గా ఇండియా వస్తాడు. అతను రాబోతున్నాడని కొన్ని కంపెనీలు కలవరపడతాయి. అయితే అతను వచ్చింది తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఇది తెలుసుకొని దేశంలోని కొన్ని కంపెనీల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకుంటాయి. ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కి వెళ్ళిన సుందర్ తన పేరు మీద వేరొకరు ఓటు వేసేశారని తెలుసుకొని షాక్ అవుతాడు. మీడియాలో అదో సంచలన వార్త అవుతుంది. తన ఓటు విషయమై సుందర్ కోర్టును ఆశ్రయిస్తాడు. తన ఓటుని తిరిగి తెచ్చుకుంటాడు. రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. ముఖ్యమంత్రికి ప్రత్యర్థిగా సుందర్ నిలబడతాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఓటు గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని అతను చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందా? అనేది మిగతా కథ.
హీరో విజయ్ తమిళ్‌లో స్టార్. అతని సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అతని స్టైల్‌కి, మేనరిజమ్స్‌కి, పెర్‌ఫార్మెన్స్‌కి తమిళ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌కి అంత సీన్ లేదు. విక్రమ్, సూర్య, కార్తీ వంటి హీరోలను ఆదరించినంతగా విజయ్‌ని మనవాళ్ళు ఆదరించలేకపోతున్నారు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. హీరోగా అతని బిల్డప్‌ని చూసి తట్టుకొనే ఓపిక ప్రేక్షకులకు లేదు. అయినా తుపాకి వంటి సినిమా సూపర్‌హిట్ అయిందంటే దానికి కారణం డైరెక్టర్. సర్కార్ సినిమా విషయానికి వస్తే కార్పొరేట్ కంపెనీ సి.ఇ.ఓ.గా డిగ్నిఫైడ్‌గా కనిపించే ప్రయత్నం చేసినప్పటికీ అది చాలా కృతకంగా అనిపిస్తుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో కూడా ఎలాంటి మెరుపులు కనిపించవు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో అతని పెర్‌ఫార్మెన్స్ కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరో పక్కన ఒక అందమైన అమ్మాయి ఉండాలి అన్నట్టుగా ఎప్పుడూ అతని పక్కనే కనిపిస్తుంది. హీరో ప్రత్యర్థి కుమార్తె అయిన కొమరవల్లిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన ఆకట్టుకుంది. మిగతా పాత్రల్లో నటించిన వారంతా తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని నటీనటులే కావడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వరు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలంటే గిరీష్ గంగాధరన్ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. తనకున్న పరిధి మేరకు రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని అనవసరమైన సీన్స్, లెంగ్తీ సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. దానివల్ల సినిమా నిడివి 2 గంటల 44 నిముషాలకు చేరుకుంది. సంగీతం విషయానికి వస్తే పాటలు రెహమాన్ మార్క్‌లోనే ఉన్నప్పటికీ లిరిక్స్ అర్థం కాకుండా పాటలు చేశాడు. మొత్తం మీద చెప్పుకోదగిన పాటలు లేవు. అయితే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు. రామ్‌లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వెరైటీగా అనిపించాయి. డబ్బింగ్ విషయానికి వస్తే సినిమాలో చాలా సందర్భాల్లో డైలాగ్‌కి లిప్ సింక్ అవ్వకపోవడం గమనించవచ్చు. ఇక డైరెక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆమధ్య మహేష్‌తో అతను చేసిన స్పైడర్ ఎంతటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అర్థం పర్థం లేని కథతో రూపొందించిన ఆ సినిమా తరహాలోనే సర్కార్ కూడా ఉండడం విశేషంగానే చెప్పుకోవాలి. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్ బోర్ ఫీల్ కావడం మొదలవుతుంది. మధ్య మధ్యలో విజయ్ ఇచ్చే క్లాస్‌లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఓటు హక్కుపై మురుగదాస్ తీసుకున్న పాయింట్ మంచిదే అయినా దాన్ని సరైన పద్ధతిలో తెరపై ఆవిష్కరించడంలో అతను విఫలమయ్యాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని ప్రతి సీన్ ఆడియన్స్‌కి బోర్ కొట్టించేలా ఉంటుంది. ఎప్పుడు సినిమా అయిపోతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తారు. మురుగదాస్ గత చిత్రాల్లోని గ్రిప్ ఈ సినిమాలో కనిపించదు. చాలా సీన్స్ తేలిపోయినట్టుగా ఉంటాయి. క్లైమాక్స్‌ని కూడా సాదా సీదాగా ముగించేయడం ఆడియన్స్‌ని నిరాశపరుస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సర్కార్ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. పట్టులేని కథతో సినిమా నడుస్తున్న నేపథ్యంలో మధ్యలో వచ్చే పాటలు మరింత విసిగిస్తాయి. తమిళ్‌లో విజయ్‌కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అతని ఇమేజ్‌తో కలెక్షన్స్ బాగానే ఉంటే అవకాశం ఉంది. తెలుగు ఆడియన్స్‌ని మాత్రం ఈ సినిమా అన్నివిధాలా నిరుత్సాహపరుస్తుంది.
ఫినిషింగ్ టచ్: విసిగించే సర్కార్
vijay new movie sarkar