ఐరా క్రియేషన్స్
@నర్తనశాల
తారాగణం: నాగశౌర్య, కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్, శివాజీరాజా, అజయ్, జయప్రకాశ్‌రెడ్డి, సత్యం రాజేష్, రాకెట్ రాఘవ, సుధ తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మహతి స్వరసాగర్
సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి
నిర్మాత: ఉషా మూల్పూరి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి
విడుదల తేదీ: 30.08.2018
హీరో నాగశౌర్య ఇప్పటివరకు చాలా సినిమాలే చేసినా అతనికి పేరు తెచ్చినవి, కమర్షియల్ సక్సెస్ అయినవి చాలా తక్కువ. ఊహలు గుసగుసలాగే చిత్రం తర్వాత అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా ఛలో ఒక్కటే. సొంత బేనర్‌లో నిర్మించిన సినిమా కమర్షియల్ మంచి విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో తమ బేనర్‌లో రెండో సినిమాగా శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడుగా పరిచయం చేస్తూ నర్తనశాల చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తాను గే గా నటిస్తున్నానని హీరో నాగశౌర్య విడుదలకు ముందే ప్రకటించాడు. మన సినిమాల్లో గే కల్చర్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కథతో సంబంధం లేకపోయినా కేవలం కామెడీ కోసం కొన్ని సినిమాల్లో గే పాత్రలతో ఎంటర్‌టైన్ చెయ్యాలని కొంతమంది దర్శకులు ట్రై చేశారు. అయితే సక్సెస్ అయింది మాత్రం తక్కువే. గే క్యారెక్టర్స్‌తో కామెడీ చేసినా అది అందరికీ నచ్చదని ఇది వరకే ప్రూవ్ అయింది. సినిమాలో ఒక ట్రాక్‌లా కాకుండా హీరోనే గే గా నటిస్తే.. అందులోనూ నాగశౌర్య వంటి హీరో ఆ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎంతవరకు ఆ క్యారెక్టర్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది? అనే లెక్కలు వేసుకుంటే సమాధానం శూన్యం అనే చెప్పొచ్చు. ఈ గురువారం విడుదలైన నర్తనశాల పరిస్థితి కూడా అదే. అసలు ఈ సినిమాకు ఎంచుకున్న కథాంశం ఏమిటి? హీరో గే గా ఎందుకు నటించాల్సి వచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతని పేరు కళామందిర్ కల్యాణ్(శివాజీరాజా). కల్యాణ్‌కి ఆడపిల్ల పుట్టాలని, తన తల్లే మనవరాలిగా పుట్టాలని కల్యాణ్ తండ్రి కోరిక. కానీ, కల్యాణ్‌కి మగపిల్లాడు పుడతాడు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యా పుట్టింది ఆడపిల్ల అని అబద్ధం చెప్తాడు కల్యాణ్. తండ్రి కోసం తన కొడుకుని కూతురిలా పెంచుతాడు. ఈ కథ అక్కడితో అయిపోతుంది. కట్ చేస్తే కల్యాణ్ కొడుకు రాధాకృష్ణ(నాగశౌర్య) పెద్దవాడు అవుతాడు. ఆడది అబల కాదు, సబల అని మహిళలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఎక్కడ ఆడవాళ్ళకు సమస్యలు వచ్చినా అక్కడ వాలిపోతుంటాడు. వారికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేందుకు ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా పెడతాడు. పెళ్ళి చేసుకొమ్మని పెద్దవాళ్లు ఒత్తిడి తెస్తున్నా.. తనకు ఆ ఫీలింగ్ రావడం లేదని చెప్తుంటాడు. అతనికి మానస(కశ్మీరా పరదేశి) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఓ సందర్భంలో పరిచయమైన సత్యభామ(యామిని భాస్కర్)తో సెల్ఫీ తీసుకుంటాడు కృష్ణ. ఆ ఫోటో చూసిన అతని తండ్రి ఆ అమ్మాయి కృష్ణ లవర్ అనుకుంటాడు. తన కొడుక్కి పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని ఆనందపడతాడు. అంతటితో ఆగకుండా ఎంగేజ్‌మెంట్‌కి కూడా రంగం సిద్ధం చేస్తాడు. ఆ అమ్మాయి తండ్రి రాయుడు(జయప్రకాశ్‌రెడ్డి). అతని కొడుకు రాజా(అజయ్). ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన ఆ ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడానికి కల్యాణ్ రెడీ అవుతాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయి సత్యభామ కాదని కృష్ణ చెప్పడంతో షాక్ అవుతాడు కల్యాణ్. కృష్ణ ప్రేమించింది, పెళ్ళి చేసుకోవాలనుకుంది సత్యభామను కాదని తెలిస్తే తనను చంపేస్తారని భయపడిన కృష్ణ.. తనకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదని, అబ్బాయిలంటే ప్రేమ అని చెప్తాడు. అలా గే గా నటించి పెళ్ళి నుంచి తప్పించుకుంటాడు. అయితే తను కూడా గే అని రాజా చెప్తాడు. కృష్ణను ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాయుడు ఫ్యామిలీ నుంచి కృష్ణ ఎలా తప్పించుకున్నాడు? మానసను పెళ్లి చేసుకున్నాడా? అనేది మిగతా కథ.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది తలా తోక లేని కథ. ఎలాంటి ఎమోషన్స్‌ని క్యారీ చెయ్యలేని కథ, కథనాలతో చాలా పేలవంగా తెరకెక్కించిన సినిమా. నటీనటుల పెర్‌ఫార్మెన్స్ నుంచి సాంకేతిక నిపుణుల వరకు ఎవ్వరూ మనసు పెట్టి చెయ్యని సినిమా. సినిమా రిలీజ్‌కి ముందు నాగశౌర్య గే గా నటిస్తున్నాడని ఏదో గొప్పగా చెప్పారు. అయితే గే క్యారెక్టర్‌లో నాగశౌర్య కనిపించేది సెకండాఫ్‌లోనే అది కూడా రెండు, మూడు సీన్స్‌లో మాత్రమే. దానికోసం క్లాసిక్ మూవీ నర్తనశాల టైటిల్ కథకు యాప్ట్ అనుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ ఒక్క క్యారెక్టర్ కూడా పెర్‌ఫెక్ట్ అనిపించదు. హీరో తండ్రిగా నటించిన శివాజీ రాజా ప్రతి ఎక్స్‌ప్రెషన్‌లోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ పూర్తిగా రాజేంద్రప్రసాద్‌ని అనుకరిస్తున్నట్టుగానే ఉంటుంది. పైగా అతని ఓవరాక్షన్ చాలా సందర్భాల్లో చిరాకు తెప్పిస్తుంది. హీరో నాగశౌర్య పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతని గత సినిమాల్లోలాగే ఈ సినిమాలోనూ కనిపించాడు తప్ప నటన పరంగా ఎలాంటి ప్రత్యేకత చూపించలేదు. గే గా కనిపించిన రెండు, మూడు సీన్స్ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇక హీరోయిన్ కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్.. ఏ దశలోనూ హీరోయిన్లుగా కనిపించలేదు. టోటల్‌గా ఇది మిస్ట్ కాస్టింగ్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో ఎంటర్ అయ్యే జయప్రకాశ్‌రెడ్డి కాస్తో కూస్తో నవ్వించే ప్రయత్నం చేశాడు. రాయలసీమ స్లాంగ్‌లో అతను చెప్పిన డైలాగ్స్ కొన్ని బాగానే అనిపించాయి. అయితే అవి సినిమాకి ఏమాత్రం బలాన్ని ఇవ్వలేవు. మిగతా క్యారెక్టర్ల గురించి, ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్... ఇలా అన్నీ చాలా సాదా సీదాగా ఉన్నాయి. పాటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రీరికార్డింగ్ గురించి ఇక చెప్పక్కర్లేదు. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా చీప్ అనిపిస్తాయి. పాటల కోసం ఫారిన్ వెళ్ళొచ్చారు తప్ప మిగతా సీన్స్ అన్నీ రెండు ఇళ్ళలో తీసిపారేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గురించి చెప్పాలంటే కొత్త డైరెక్టర్ అయినా అతని వర్క్‌లో ఫైర్ కనిపించదు. ఎవ్వరికీ ఆసక్తి కలగని ఓ సబ్జెక్ట్ తీసుకొని దాని చుట్టూ కొన్ని కామెడీ సీన్స్‌ని జొప్పిస్తే సినిమా హిట్టే అనుకుని ఉంటాడు. కథ, కథనం, క్యారెక్టర్లు.. ఏ ఒక్కటీ మనకు కొత్తగా అనిపించవు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కామెడీగానే అనిపించాయి తప్ప ఆడియన్స్‌కి ఎలాంటి ఫీలింగ్స్ కలిగించవు. ఈ సినిమాలో సిల్లీగా అనిపించే సన్నివేశాలకు లెక్కలేదు. ఉదాహరణకి రాయుడు తమ్ముడు తన భార్య డెలివరీ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. అప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో తమ్ముడు చనిపోతాడు. ఆ తర్వాత కూతురికి జన్మనిచ్చి తల్లి కూడా చనిపోతుంది. అమ్మాయి పుట్టడం వల్లే తన తమ్ముడు చనిపోయాడని పసిగుడ్డును సైతం అసహ్యించుకుంటాడు రాయుడు. ఆరోజు నుంచి 20 ఏళ్ళ వరకు ఆమెను దగ్గరకు రానివ్వడు. అతనే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా ఆ అమ్మాయిపై కనికరం చూపించరు. ఈ సీన్స్ అన్నీ చాలా ఫూలిష్‌గా అనిపిస్తాయి. విలన్‌కి భయపడి హీరో గే గా నటించడం అందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఎలాంటి యాక్టివిటీస్ లేని విలన్ దగ్గరి నుంచి తప్పించుకొని పారిపోవడం పెద్ద విషయం కాకపోయినా దాన్ని హీరో పట్టించుకోడు. తన పాటికి తాను గే గా నటించేస్తుంటాడు. ఒక మంచి ప్రొడక్ట్‌ని ఇవ్వడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఫైనల్‌గా చెప్పాలంటే నర్తనశాల చిత్రంలో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా ఉన్నాయి. యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని... ఇలా ఏ వర్గానికీ ఈ సినిమా నచ్చే అవకాశం లేదు.
ఫినిషింగ్ టచ్: నర్తనశాల.. ఒకటే గోల!
telugu movie @narthanasala review