2డి ఎంటర్‌టైన్‌మెంట్, ద్వారకా క్రియేషన్స్
చినబాబు
తారాగణం: కార్తీ, సాయేషా సైగల్, సత్యరాజ్, శత్రు, భానుప్రియ, సూరి, శ్రీమాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్
ఎడిటింగ్: రూబెన్
సంగీతం: డి.ఇమాన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు: సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: పాండిరాజ్
విడుదల తేదీ: 13.07.2018
కమర్షియల్ ఫార్ములా సినిమాలు, యూత్‌ఫుల్ మూవీస్, డిఫరెంట్ జోనర్ సినిమాలను తెరకెక్కించేందుకే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సెంటిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అందర్నీ ఆకట్టుకునే కథాంశాలతో సినిమాలు ఈమధ్యకాలంలో రావడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా తీసే ప్రయత్నం చేసినా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. అయితే అది ప్రేక్షకుల్లో తప్పు కాదని, ఆయా దర్శకులు ఎంచుకున్న కథాంశాలు అలాంటివని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. సెంటిమెంట్ సినిమాలైనా తీసే విధంగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ శుక్రవారం విడుదలైన చినబాబు చిత్రం నిరూపించింది. ఇప్పటివరకు మాస్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ మొదటి సారి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రైతుగా, ఐదుగురు అక్కలకు తమ్ముడిగా పూర్తిగా కుటుంబ నేపథ్యంతో సాగే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి? రైతు పాత్రకు కార్తీ ఎంతవరకు న్యాయం చేశాడు? విభిన్న కథాంశాలతో సినిమాలు చేసే పాండిరాజ్ చినబాబు చిత్రాన్ని ఏ స్థాయిలో రూపొందించాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అది రుద్రరాజు(సత్యరాజ్) కుటుంబం. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్ళు, వారందరి కంటే చిన్నవాడు, ఒకే ఒక్క కొడుకు కృష్ణంరాజు అలియాస్ చినబాబు(కార్తీ). ఐదుగురు అక్కలకు పెళ్లిళ్లు అయిపోగా, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ రైతుగా మంచి పేరు తెచ్చుకుంటాడు చినబాబు. ఆదర్శ రైతుగా వార్తల్లోకెక్కుతాడు. అతనికి ఇద్దరు రాధ, ఇందిర అనే ఇద్దరు మేనకోడళ్ళు ఉంటారు. రాధను చినబాబుకిచ్చి పెళ్లి చేయాలని పెద్దవారి ఆలోచన. అయితే ఒకర్ని చేసుకుంటే ఒకరికి కోపం వస్తుంది, కుటుంబంలో మనస్పర్థలు పెరిగిపోతాయన్న ఉద్దేశంతో బయటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు చినబాబు. అదే ఊళ్ళో ఒక కమ్యూనిటీకి వత్తాసు పలుకుతూ రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు సురేందర్‌రాజు(శత్రు) అనే వ్యక్తి. అతనికి, చినబాబుకి పడదు. అతని మరదల్ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చినబాబు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చర్చిస్తాడు చినబాబు. ఇక్క అక్కడి నుంచి అక్కలతో అతనికి అభిప్రాయ భేదాలు వస్తాయి. అవి తారాస్థాయికి చేరతాయి. అప్పుడు కుటుంబ పెద్ద అయిన రుద్రరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన మేనకోడళ్ళను కాదని బయటి అమ్మాయి నీలనీరద(సాయేషా సైగల్)ను చేసుకోవడానికి సిద్ధపడిన చినబాబు ఎలాంటి మానసిక వ్యధను అనుభవించాడు? తన మరదల్ని ప్రేమించిన చినబాబు కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు సురేందర్‌రాజు చేసిన ప్రయత్నాలు ఏమిటి? చివరికి ఈ కుటుంబ కథ ఎలా సుఖాంతమైంది? చినబాబు.. నీల నీరదను పెళ్లి చేసుకోవడానికి అతని అక్కలు ఒప్పుకున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఇప్పటివరకు మాస్ సినిమాలు, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చిన కార్తీ తొలిసారి రైతు పాత్రలో పూర్తి స్థాయిలో మెప్పించాడు. ఐదుగురు అక్కల గారాల తమ్ముడిగా సెంటిమెంట్ సీన్స్‌లోనూ అదే స్థాయిలో నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే సీన్‌లో ఎమోషనల్‌గా అద్భుతమైన నటనను కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌లోనూ, కొన్ని కామెడీ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. కార్తీ కెరీర్‌లో ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. అతనికి జోడీగా నటించిన సాయేషా సైగల్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాల్లోనూ తనదైన నటనతో అలరించింది. కుటుంబ పెద్దగా సత్యరాజ్ నటన ఎంతో సహజంగా ఉంది. విలన్‌గా నటించిన శత్రు తన పెర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. చినబాబు మేనల్లుడు నరసింహరాజుగా సూరి మధ్య మధ్యలో సందర్భోచితమైన కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేశాడు.
టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పాలంటే వేల్‌రాజ్ ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్ అయింది. ప్రతి విజువల్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇమాన్ చేసిన పాటల్లో ఒకటి రెండు మాత్రమే ఆకట్టుకునే ఉన్నాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కథ, కథనాలకు తగ్గట్టుగా ఉంది. రూబెన్ ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని కట్ చేసి ఉంటే బాగుండేది. ఇక సత్యరాజ్‌కి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో డబ్బింగ్ చెప్పించడం బాగా లేదు. శశాంక్ వెన్నెలకంటి రాసిన మాటలు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని ఎమోషనల్ డైలాగ్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ఇక డైరెక్టర్ పాండిరాజ్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యంలో సినిమా చేయడం సాహసంతో కూడుకున్నదే. దానికి కార్తీ, నిర్మాత సూర్య సపోర్ట్ కూడా లభించడంతో తన శక్తిమేరకు సినిమాను బాగానే తీశాడు. ఫస్ట్‌హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరోయిన్‌తో హీరో లవ్‌లో పడడం, కారీ, సూరి కలిసి చేసిన కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో మైనస్‌గా చెప్పుకోదగింది కొన్ని లెంగ్తీ సీన్స్ గురించి. వాటి వల్ల అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించాడు. అయితే ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని ఇష్టపడే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే పూర్తిగా తమిళ నేటివిటీలో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు విజయపథంలో నడిపించే అవకాశం ఉంది. అయితే కొన్ని అనవసరమైన సీన్స్ తీసేసి సినిమాను ట్రిమ్ చేస్తే ఇంకా స్పీడ్‌గా ఉండేది. ఈమధ్యకాలంలో ఇలాంటి ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలు రాలేదు కాబట్టి ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
ఫినిషింగ్ టచ్: చినబాబు.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్
telug movie chinababu