డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్
భరత్ అనే నేను
తారాగణం: మహేష్, కియరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, దేవరాజ్, రవిశంకర్, పోసాని, రావు రమేష్, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, అజయ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: 20.04.2018
ముఖ్యమంత్రి పదవి ఎంత బాధ్యతతో కూడుకున్నదో, ఎన్ని సమస్యలతో ముడిపడి ఉన్నదో అందరికీ తెలిసిందే. అన్ని వర్గాల ప్రజల్ని మెప్పిస్తూ పదవిలో కొనసాగడం ఎంత కష్టమో మనకు తెలియనిది కాదు. ఈ తరహా కథాంశంతో ఒక పెద్ద హీరోని ముఖ్యమంత్రిగా చూపిస్తూ సినిమా తియ్యడం, ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో ఎంటర్‌టైన్ చెయ్యడం సాహసంతో కూడుకున్న పని. అలాంటి సాహసం చెయ్యడానికి సిద్ధపడ్డారు మహేష్, కొరటాల శివ. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి అంటూ నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కథే భరత్ అనే నేను. బ్రహ్మూెత్సవం, స్పైడర్ సినిమాలతో పరాజయాల బాటలో పయనిస్తున్న మహేష్.. భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్‌ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. శ్రీమంతుడు వంటి బిగ్గెస్ట్ హిట్‌ని అందించిన మహేష్, కొరటాల శివ.. భరత్ అనే నేను చిత్రంలో మరో సూపర్‌హిట్‌ని సాధించగలిగారా? తన ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్‌ని ఇచ్చే కొరటాల ఈ సినిమా ద్వారా ఏం చెప్పాడు? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతని పేరు భరత్ రామ్(మహేష్). లండన్‌లో ఐదు డిగ్రీలు పూర్తి చేసి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైమ్‌లో అతని తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాఘవ(శరత్‌కుమార్) చనిపోయాడన్న వార్త తెలుసుకుని ఇండియా వస్తాడు భరత్. రాఘవ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలి అనే విషయంలో పార్టీలో అభిప్రాయ భేదాలు వస్తాయి. దీంతో భరత్‌ని ముఖ్యమంత్రిని చెయ్యాలనుకుంటాడు పార్టీ అధ్యక్షుడు, రాఘవ స్నేహితుడు వరదరాజులు(ప్రకాష్‌రాజ్). రాజకీయాలంటే పరిచయమే లేని భరత్ ఆ పదవిని తిరస్కరిస్తాడు. భరత్ తప్ప వేరెవర్నయినా ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ చీలిపోతుందన్న కారణంతో భరత్‌ని బలవంతంగా ఒప్పిస్తాడు. భరత్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. వచ్చీ రావడంతోనే ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేసే వారికి వేలల్లో జరిమానాలు విధిస్తాడు. ప్రైవేట్ స్కూల్స్‌ని టార్గెట్ చేస్తాడు. గ్రామాల అభివృద్ధికి స్వయం పాలన అమలులోకి తీసుకొస్తాడు. అతను తీసుకునే నిర్ణయాల వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. వరదరాజులు కూడా భరత్‌కు వ్యతిరేకంగా మారతాడు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా భరత్ ఎలా నెగ్గుకొచ్చాడు? రాష్ట్రంలోని సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఏర్పడ్డాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఎడ్యుకేటెడ్ ముఖ్యమంత్రిగా మహేష్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. తనదైన శైలిలో ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నించాడు. కేవలం పాటలకు, కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైపోయింది హీరోయిన్ కియారా అద్వాని, పార్టీ అధ్యక్షుడిగా ప్రకాష్‌రాజ్ ఎప్పటిలాగే బాగా చేశాడు. శరత్‌కుమార్ తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ అయినా తన పరిధిలో మెప్పించాడు. పోసాని, పృథ్వీ, రావు రమేష్, రవిశంకర్ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే రవి కె.చంద్రన్, తిరునవుక్కరసు ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించింది. రెండు పాటలు, కొన్ని సీన్స్, ఫైట్స్ చిత్రీకరణ బాగుంది. సినిమాలోని మూడు పాటలు ఆకట్టుకునేలా చేశాడు దేవిశ్రీప్రసాద్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని మూడ్‌కి తగ్గట్టు చేశాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే నవ సమాజ నిర్మాణం కోసం నిజాయితీగా పనిచేసే ముఖ్యమంత్రి పాత్రని బాగా డిజైన్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మహేష్ నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోగలిగాడు. అయితే కథలోగానీ, కథనంలోగానీ ఎలాంటి కొత్తదనం కనిపించదు. సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా కృతకంగా అనిపిస్తాయి. సహజత్వానికి చాలా దూరంగా ఉన్న సీన్స్ సినిమాలో చాలా వున్నాయి. అయితే మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ కొన్ని మైనస్‌లని కూడా అధిగమించేలా చేసింది. ఇంతకుముందు కొరటాల సినిమాల్లో వున్న పక్కా కథ, కథనాలు ఈ సినిమాలో కనిపించవు. అయితే టేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్న కొరటాల ప్రతి సీన్‌ని అద్భుతంగా మలిచేందుకు ట్రై చేశాడు. ఇక మహేష్ ఛరిష్మా ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెడుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే మహేష్ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్, ఫోటోగ్రఫీ, పాటలు, కొరటాల శివ టేకింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, స్లో నేరేషన్ మైనస్ అయింది. అయినప్పటికీ ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్‌టైన్ చేస్తుంది భరత్ అనే నేను.
ఫినిషింగ్ టచ్: హామీని నిలబెట్టుకున్న మహేష్
mahesh movie bharath ane nenu