మైత్రి మూవీ మేకర్స్
రంగస్థలం
తారాగణం: రామ్‌చరణ్, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అనసూయ, నరేష్, రోహిణి, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్, శత్రు, మహేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్
రచన, దర్శకత్వం: సుకుమార్
విడుదల తేదీ: 30.03.2018
డాన్సులు, ఫైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించే రెగ్యులర్ కమర్షియల్ హీరో కాస్త విభిన్నంగా ఉండే క్యారెక్టర్ చెయ్యాలనుకుంటే.. ఇమేజ్‌ని పక్కన పెట్టి వినికిడి లోపం ఉన్న క్యారెక్టర్‌కు ఓకే చెప్తే.. ఆ సినిమాని ప్రేక్షకులు, అభిమానులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఆ సినిమా కమర్షియల్‌గా నిర్మాతలకు ఎంతవరకు వర్కవుట్ అవుతుంది, డైరెక్టర్‌కి ఎలాంటి పేరు తెస్తుంది.. ఇలాంటి లెక్కలేమీ వేసుకోకుండా కేవలం ఒక కొత్త తరహా సినిమా చెయ్యాలి, కొత్త క్యారెక్టర్‌ని ప్రేక్షకులకు పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా రంగస్థలం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ఇమేజ్‌ని పక్కన పెట్టి రామ్‌చరణ్ చేసిన చిట్టిబాబు క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అతని పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంది? డైరెక్టర్ సుకుమార్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా రూపొందించిన ఈ సినిమా అతనికి ఎలాంటి పేరు తెచ్చింది? రంగస్థలం సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతని పేరు చిట్టిబాబు(రామ్‌చరణ్). అతనికో క్వాలిఫికేషన్ ఉంది. వినికిడి లోపం వల్ల గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు. అందుకే అందరూ అతన్ని సౌండ్ ఇంజనీర్ అంటారు. అతని అన్నయ్య కుమార్(ఆది పినిశెట్టి). దుబాయ్ వెళ్లొస్తాడు. చిట్టిబాబు అదే ఊళ్లో ఉండే రామలక్ష్మీ(సమంత)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఫణీంద్ర భూపతి(జగపతిబాబు) గత 30 సంవత్సరాలుగా ఆ ఊరికి ఏకగ్రీవ ప్రెసిడెంట్. తన అంగబలంతో ఆ ఊరి ప్రజల్ని అన్నివిధాలుగా దోచుకుంటూ ఉంటాడు. అతన్ని ఎదిరించిన వారిని, ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేసిన వారిని హతమారుస్తుంటాడు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలనుకుంటాడు కుమార్. ఎలక్షన్స్‌లో అతనికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఇక అక్కడి నుంచి కుమార్ అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ఫణీంద్ర. అతన్ని ఎదిరించిన వారంతా హత్య చేయబడ్డారు. తన అన్నయ్య అలా కాకూడదని చిట్టిబాబు అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరి కుమార్‌ను ఫణీంద్ర బారి నుంచి కాపాడుకోగలిగాడా? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.
ఒక కమర్షియల్ హీరో తన ఇమేజ్‌ని పక్కన పెట్టి సినిమా ఆద్యంతం లుంగీతో, పెరిగిన గడ్డంతో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్యారెక్టర్‌ని ఎంతో ప్రేమిస్తే తప్ప అలా చెయ్యడం సాధ్యం కాదు. రామ్‌చరణ్ అంతగా ప్రేమించాడు కాబట్టే చిట్టిబాబు పాత్రకు జీవం పోయగలిగాడు. చెవిటివాడిగా అతని నటన, బాడీ లాంగ్వేజ్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. తన క్యారెక్టర్‌లోని అన్ని షేడ్స్‌ని అద్భుతంగా పలికించడంలో చరణ్ సక్సెస్ అయ్యాడు. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకు చరణ్ చేసిన సినిమాల్లో పెర్‌ఫార్మెన్స్ పరంగా రంగస్థలం బెస్ట్ అని చెప్పొచ్చు. గ్లామర్ పాత్రలు చేసే సమంత ఈ సినిమాలో కాస్త డీగ్లామర్‌గా ఉండే క్యారెక్టర్‌ని ఎలాంటి సంకోచం లేకుండా చేసింది. కొన్ని సీన్స్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. ప్రెసిడెంట్‌గా జగపతిబాబు, రాజకీయ నాయకుడు దక్షిణామూర్తిగా ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్లు రొటీన్‌గానే అనిపిస్తాయి. కుమార్‌గా ఆది పినిశెట్టి అందరికీ గుర్తుండిపోయే పాత్రలో రాణించాడు. అనసూయ.. రంగమ్మత్తగా ఓ విభిన్నమైన పాత్రతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒకటి రెండు సీన్స్‌లో కనిపించే జబర్దస్త్ మహేష్.. ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చరణ్ పక్కనే కనిపిస్తాడు. ఇక నరేష్, రోహిణి, రాజీవ్ కనకాల నటన ఫర్వాలేదు.
సాంకేతికంగా చూస్తే రత్నవేలు ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్‌గా చెప్పొచ్చు. ప్రతి సీన్‌ని కొత్తగా చూపించడంలో రత్నవేలు సక్సెస్ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్ చేసిన పాటల్లో మూడు పాటలు ఆడియోపరంగా, విజువల్‌గా కూడా ఆకట్టుకుంటాయి. ప్రారంభం నుంచి చివరి వరకు దేవి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్షన్ గురించి. రామకృష్ణ, మోనిక వేసిన విలేజ్ సెట్ సినిమాకే పెద్ద హైలైట్‌గా చెప్పొచ్చు. గ్రామీణ వాతావరణాన్ని నూటికి నూరుపాళ్ళు తమ ఆర్ట్ వర్క్‌తో చూపించారు. ఇక నిడివి విషయానికి వస్తే సినిమాలో కత్తిరించాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఎడిటర్ నవీన్ నూలి నిడివి విషయంలో డైరెక్టర్‌ని కన్విన్స్ చేసినట్టయితే 20 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉండేది. కథ, కథనం ఎంత కొత్తగా ఉన్నా లెంగ్త్ ఎక్కువైతే ఎవరికైనా బోర్ కొడుతుంది. ఈ సినిమా విషయంలో కూడా అక్కడక్కడా అదే జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ గురించి చెప్పాలంటే 1980 నాటి కథగా చెప్పడం వల్ల అప్పటి నేటివిటీని చూపించడం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. గ్రామాల్లోని రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది అర్థవంతంగా చూపించాడు సుకుమార్. చిట్టిబాబు క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం, చరణ్ నుంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం అద్భుతం అని చెప్పాలి. ఇప్పటివరకు సుకుమార్ చేసిన సినిమాలకు, ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. ఓ కొత్త బ్యాక్‌డ్రాప్‌లో పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈమధ్యకాలంలో ఇలాంటి నేటివిటీ ఉన్న సినిమా రాకపోవడం వల్ల సినిమా ప్రారంభమైన తర్వాత ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఫస్ట్‌హాఫ్ వరకు అదే కంటిన్యూ అవుతూ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎన్నికల ప్రహసనం, ఓవర్‌గా అనిపించే కొన్ని సెంటిమెంట్ సీన్స్, రిపీటెడ్‌గా అనిపించే హీరో, హీరోయిన్ మధ్య సీన్స్, రంగమ్మత్త భర్తను అదే ఊరి ప్రెసిడెంట్, అదే ఊళ్లో హత్య చేయించినప్పటికీ తన భర్త దుబాయ్‌లో ఉన్నాడని జనానికి చెప్పడం వంటి సీన్స్ లాజిక్ మిస్ అయ్యాయి. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రియాక్ట్ అయిన హీరో ఏం చెయ్యబోతున్నాడు? ఎలా చెయ్యబోతున్నాడు అనేది ఆడియన్స్‌కి చూఛాయగా తెలిసిపోవడం వంటివి సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చెయ్యలేకపోయాయి. సుకుమార్ సినిమాల్లో రెగ్యులర్‌గా ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమాలో పూజా హెగ్డేతో చేయించిన ఐటమ్ సాంగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పూజ ఆ పాటకు అస్సలు సూట్ అవ్వలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ, ఎంటర్‌టైన్‌మెంట్, హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్స్ లేకపోవడం వల్ల ఆడియన్స్‌కి ఎక్కడా రిలీఫ్ ఉండదు. ఫస్ట్‌హాఫ్ ఫర్వాలేదు అనిపిస్తుంది, కథలో పెద్ద ట్విస్ట్‌లు ఏమీ లేకపోవడం వల్ల సెకండాఫ్ సాగదీస్తున్న ఫీల్ కలుగుతుంది. ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో సినిమా ఓకే అనిపిస్తుంది. ఈ సినిమా కమర్షియల్‌గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రేక్షకులు, అభిమానులు చిట్టిబాబు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్‌ని యాక్సెప్ట్ చేసిన దాన్నిబట్టి ఉంటుంది.
ఫినిషింట్ టచ్: ఆకట్టుకునే కొత్త ప్రయత్నం
ramcharan new movie rangastalam