యు.వి. క్రియేషన్స్
భాగమతి
తారాగణం: అనుష్క, జయరామ్, ఆశా శరత్, మురళీశర్మ, ఉన్ని ముకుందన్, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, తలై వాసల్ విజయ్, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ఎస్.తమన్
నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్
రచన, దర్శకత్వం: జి.అశోక్
విడుదల తేదీ: 26.01.2018
లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌తో సినిమాలు తియ్యాలంటే మనకు వున్న ఒకే ఒక ఆప్షన్ అనుష్క అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. అరుంధతి, రుద్రమదేవి తర్వాత అనుష్కకి వచ్చిన ఆ క్రేజ్ బాహుబలిలో చేసిన క్యారెక్టర్‌తో మరింత బలపడింది. దీంతో అనుష్క కొత్త సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అయితే ఆమె ప్రధాన పాత్రల్లో వచ్చిన పంచాక్షరి, సైజ్ జీరో చిత్రాలు నిరాశ పరిచినా ఆడియన్స్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్‌ని ఎంతో తెలివిగా మలుచుకుంది భాగమతి యూనిట్. డిఫరెంట్ టైటిల్, లుక్, బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు దర్శకనిర్మాతలు. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదలైన భాగమతి ప్రేక్షకుల్ని ఏమేర థ్రిల్ చేసింది? ఈ చిత్రంతో అనుష్క మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఆమె పేరు చంచల(అనుష్క). తన ప్రియుడ్నే హత్య చేసిన నేరానికి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఆమె గతంలో ఐఎఎస్ ఆఫీసర్. సెంట్రల్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్(జయరాం)కి పర్సనల్ సెక్రటరీగా పనిచేసింది. ఈశ్వర్‌ప్రసాద్‌కి మచ్చలేని నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు ఉంది. అతనిపై అవినీతి మచ్చ వేసి అరెస్ట్ చేయించాలని అతని గురించి అన్ని విషయాలు తెలిసిన చంచలను ఉపయోగించుకోవాలనుకుంటుంది అధిష్టానం. అందుకోసం సిబిఐ ఆఫీసర్ వైష్ణవి నటరాజన్(ఆశా శరత్)ను నియమిస్తుంది. ఒక మంత్రి గురించిన రహస్యాలను రాబట్టడం కోసం జైల్లో విచారణ చేయలేమని, అందుకు ఓ రహస్య ప్రదేశం కావాలనుంటుంది వైష్ణవి. అడవి మధ్యలో ఉన్న ఓ పురాతన బంగ్లాకి చంచలను తరలిస్తారు. అక్కడ ఆమె నుంచి ఈశ్వర్‌ప్రసాద్‌కి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది వైష్ణవి. ఈలోగా ఆ బంగ్లాలో ఉన్న భాగమతి ఆత్మ చంచలను ఆవహిస్తుంది. దాంతో ఆమె చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ పోలీసులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రజల్లో మంచి పేరు వున్న ఈశ్వర్‌ప్రసాద్‌పై అవినీతి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక కారణం ఏమిటి? చంచల నుంచి సమాచారం రాబట్టడంలో పోలీసులు సక్సెస్ అయ్యారా? చంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు భాగమతి ఎవరు? బంగ్లాలో జరిగే ఘటనలకు కారణాలు ఏమిటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
అరుంధతితో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్న అనుష్క ఫెరోషియస్‌గా ఉండే భాగమతిగా, తెలివిగల ఐఎఎస్ ఆఫీసర్ చంచలగా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. మరోసారి సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించింది. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ ఆశా శరత్ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించింది. అనుష్క తర్వాత పెర్‌ఫార్మెన్స్ పరంగా ఆశాకు ఎక్కువ మార్కులు పడతాయి. ఎసిపిగా మురళీశర్మ నటన కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కామెడీ పండించే ప్రయత్నం చేశారు ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్. రెండు షేడ్స్ ఉన్న ఈశ్వర్‌ప్రసాద్ పాత్రలో జయరాం కొత్తగా కనిపించాడు. ఇప్పటివరకు చూసిన ఆర్టిస్టుల్నే ప్రతి సినిమాలో చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు జయరాం కాస్త రిలీఫ్ నిచ్చాడు.
ఈ సినిమాలోని కథ, కథనాలు, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకున్నవి సాంకేతిక విలువలు. సినిమాకి ఒక గొప్ప మూడ్‌ని, రిచ్‌నెస్‌ని తీసుకొచ్చింది మది ఫోటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, అద్భుతంగా చూపించడంలో మది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. సినిమాకి సగం ప్రాణం పోసింది ఫోటోగ్రఫీ. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది తమన్ సంగీతం గురించి. సినిమాలో ఉన్నది ఒక పాట, ఒక థీమ్ సాంగ్. ఈ రెండూ బాగా చేశాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అత్యద్భుతంగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి సీన్‌ని ఎలివేట్ చేస్తూ తమన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి భారీ లుక్‌ని తీసుకొచ్చింది. కథలోని ఎక్కువ భాగం బంగ్లాలోనే ఉంటుంది. ఆ బంగ్లాని అద్భుతంగా రూపొందించాడు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. నిజంగా అది కొన్ని వందల సంవత్సరాల క్రితం బంగ్లాయే అనిపించేలా ప్రతి విషయంలోనూ కేర్ తీసుకున్నాడు. సినిమాని 2 గంటల 22 నిమిషాలకు కుదించడంలో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ప్రతిభ కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అక్కడక్కడా కాస్త ల్యాగ్ అనిపించినా ఓవరాల్‌గా ఎడిటింగ్ బాగుంది. యు.వి. క్రియేషన్స్ మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని ప్రతి సీన్‌లో అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ అశోక్ గురించి చెప్పాలంటే కథలో కొత్తదనం లేకపోయినా కథనం, ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉండేలా చూసుకున్నాడు. ఫస్ట్‌హాఫ్‌లో ప్రశ్నలుగా వదిలేసిన ప్రతి విషయానికి సెకండాఫ్‌లో వివరణ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో భాగమతి ఎంట్రీ సీన్‌ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. దానికి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తోడైంది. సెకండాఫ్ మిడిల్ వరకు భాగమతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకలా ప్రవర్తిస్తోంది? అనేది తెలియదు. ఆ సస్పెన్స్‌ని రివీల్ చేసినపుడు ఒక్కసారిగా ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతారు. అలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. రెగ్యులర్ హారర్ సినిమాల్లో చేసే జిమ్మిక్స్ అన్నీ అశోక్ ఈ సినిమాలో కూడా చేశాడు. అలాగే కొన్ని సీన్స్‌లో ఆడియన్స్‌ని మిస్‌లీడ్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అయితే అది ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యడానికే అలా చేసి ఉంటాడని సరిపుచ్చుకోవాలి తప్ప లాజిక్స్ ఆలోచించకూడదు. సెకండాఫ్‌లోని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా వుండడంతో లాజిక్స్ పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఫైనల్‌గా చెప్పాలంటే భాగమతి గొప్ప కథ కాకపోయినా, కొత్తగా అనిపించే కథనం, అనుష్క పెర్‌ఫార్మెన్స్, అబ్బుర పరిచే ఆర్ట్ వర్క్, థ్రిల్ చేసే కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ భాగమతిని పాస్ చేసేస్తాయి. ఈ తరహా హారర్ సినిమాలు చాలా వచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని కమర్షియల్‌గా మంచి ఫిగర్స్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫినిషింగ్ టచ్: లెక్కలు తేలాయి
anushka new movie bhagamathie