సినీజోష్ రివ్యూ: జై సింహా
సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్
జై సింహా
తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి, మురళీమోహన్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, ప్రభాకర్, జె.పి., అశుతోష్ రాణా, పవిత్ర లోకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోని
సంగీతం: చిరంతన్ భట్
కథ, మాటలు: ఎం.రత్నం
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
విడుదల తేదీ: 12.01.2018
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా.. ఇలా నందమూరి బాలకృష్ణకు సింహా అనేది సెంటిమెంట్‌గా మారింది. టైటిల్‌లో సింహా ఉంటే చాలు హిట్ అయిపోతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే బాలకృష్ణ తాజా చిత్రానికి జై సింహా అనే టైటిల్‌ని పెట్టారు. రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్ వంటి స్టార్ హీరోలతో సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ఫైట్స్ బాలకృష్ణ సినిమాల్లో ఉంటాయి. అభిమానులు కూడా బాలకృష్ణను ఆ తరహా క్యారెక్టర్స్‌లో చూడడానికే ఇష్టపడతారు. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కట్టి పడేసే కథ, కథనాలు వుండాలన్నది ప్రస్తుత ప్రేక్షకుల అభిప్రాయం. మంచి కథలతో ఎన్నో సంచలన విజయాలు సాధించిన బాలకృష్ణ, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన కె.ఎస్.రవికుమార్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఏర్పడడం సహజమే. మరి వారి అంచనాలను జై సింహా ఎంతవరకు రీచ్ అయ్యాడు? ఈ సంక్రాంతికి బాలకృష్ణ మరో సూపర్‌హిట్ కొట్టగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఓపెన్ చేస్తే ఓ హాస్పిటల్. బెడ్‌పై నయనతార కనిపిస్తుంది. పక్కనే ఉయ్యాలలో ఉండాల్సిన బిడ్డ కనిపించకపోయేసరికి కంగారు పడుతుంది. కట్ చేస్తే రైల్వే స్టేషన్‌లో రగ్గు కప్పుకొని వెళ్తుంటాడు బాలకృష్ణ. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని పోలీసులు అడ్డగిస్తారు. రగ్గు వెనుక వున్న పసిబిడ్డను చూసి అతన్ని అనుమానిస్తారు. అప్పుడే రైల్వే స్టేషన్‌కి వచ్చిన ఓ మినిస్టర్ నరసింహా బాగున్నావా అంటూ పలకరిస్తాడు. అది చూసిన పోలీస్ ఆఫీసర్.. నరసింహ(బాలకృష్ణ)కు సారీ చెప్పి వదిలేస్తాడు. తన బిడ్డకు అనుకూలంగా లేదన్న కారణంతో చాలా ఊర్లు మారతాడు. చివరికి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ కోటీశ్వరుడైన మురళీమోహన్ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. మూడు సంవత్సరాలు వెనక్కి వెళితే నరసింహ ఓ కారు మెకానిక్. అతను, గౌరి(నయనతార) ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న గౌరి తండ్రి(ప్రకాష్‌రాజ్) ఇద్దరికీ పెళ్ళి చేయడానికి ఒప్పుకోడు. అందరితో ఎప్పుడూ గొడవలకు వెళ్ళే నరసింహ అంటే అతనికి ఇష్టం ఉండదు. గౌరిని ఎంతో ప్రేమించిన నరసింహ ఆమె ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుకుంటాడు. తనపై ఆమెకు అసహ్యం కలిగేలా ఓ పథకం వేస్తాడు. గౌరికి అసహ్యం కలిగేలా నరసింహ ఏం చేశాడు? నరసింహ దగ్గర ఉన్న బిడ్డ ఎవరు? వైజాగ్ నుంచి కుంభకోణం వచ్చిన తర్వాత నరసింహ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? గౌరి ఎవరిని పెళ్ళి చేసుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో బాలకృష్ణ ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ తక్కువనే చెప్పాలి. రెగ్యులర్‌గా కాకుండా కొత్తగా ట్రై చెయ్యాలనుకున్నారు. అయితే బాలకృష్ణ మార్కు డైలాగులు కొన్ని ఉన్నాయి. డాన్సులు, ఫైట్స్ ఎంతో ఎనర్జిటిక్‌గా చేశాడు. కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా తన నటనతో పండించాడు. నయనతార తప్ప మిగతా ఇద్దరు హీరోయిన్లు హరిప్రియ, నటాషా దోషి పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. విలన్‌గా ప్రభాకర్ ఆకట్టుకోలేకపోయాడు. అతని నటన, డైలాగ్ డెలివరీ అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు కనిపించలేదు. చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించిన బ్రహ్మానందం నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్లు చేసిన నటీనటులు ఓకే అనిపించారు.
సాంకేతిక విభాగాలకు వస్తే సి.రాంప్రసాద్ ఫోటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సీన్స్‌లో రిచ్‌నెస్ ఎక్కువగా కనిపించదు. చాలా సాదా సీదాగా ఉంది. శాతకర్ణి తర్వాత ఈ సినిమాకు సంగీతం అందించిన చిరంతన్ భట్ చేసిన పాటలు ఒక్కటి కూడా వినసొంపుగా లేవు. అలాగే వాటి చిత్రీకరణ కూడా రొటీన్‌గా ఉంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రణగొణ ధ్వనుల్లా అనిపిస్తుందే తప్ప ఏ దశలోనూ ఆకట్టుకోదు. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ ఫస్ట్‌హాఫ్ వరకు ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేయకుండా వదిలేయడం వల్ల లెంగ్తీగా అనిపిస్తుంది. ఎం.రత్నం రాసిన కథ, మాటల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. కథ, కథనాలు 80వ దశకంలో వచ్చిన సినిమాలను గుర్తు తెస్తాయి. అలాగే మాటలు అంతకుముందు బాలకృష్ణ సినిమాలో చెప్పిన డైలాగ్స్‌లాగే ఉన్నాయి. చప్పట్లు కొట్టించే డైలాగ్, విజిల్స్ వేయించే డైలాగ్ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. మేకింగ్ విషయానికి వస్తే సి.కళ్యాణ్ సినిమాని రిచ్‌గా చూపించేందుకు ఖర్చు బాగానే పెట్టారు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ గురించి చెప్పాలంటే అతను సెలెక్ట్ చేసుకున్న కథలో 1970 నుంచి ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాల కథలు కనిపిస్తాయి. హీరో అన్ని రకాల త్యాగాలకు పాల్పడడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రతి సీన్ అంతకుముందు చూసిన సినిమాలను గుర్తు తెస్తుంది. బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చెయ్యాలన్న తాపత్రయం కనిపించింది. అయితే అది ఆచరణ రూపంలో సాధ్యం కాలేదు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ల కంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయి. ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఫైనల్‌గా చెప్పాలంటే బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అతని కెరీర్‌లో సంక్రాంతి హిట్స్ చాలా వున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి హిట్ కొట్టాలన్న పట్టుదలతో వున్న బాలకృష్ణను ఈ సినిమా నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినా ఇది సంక్రాంతి సీజన్ కావడం వల్ల కలెక్షన్లపరంగా మంచి ఫిగర్సే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
>ఫినిషింగ్ టచ్: త్యాగసింహాbalakrishna new movie jai simha