లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఒక్క క్షణం
తారాగణం: అల్లు శిరీష్, సురభి, శీరత్‌కపూర్, శ్రీనివాస్ అవసరాల, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్, రోహిణి, సత్య, ప్రవీణ్, దాసరి అరుణ్‌కుమార్, రఘు కారుమంచి తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
సంగీతం: మణిశర్మ
మాటలు: అబ్బూరి రవి
సమర్పణ: శంకర్ చిగురుపాటి
నిర్మాతలు: చక్రి చిగురుపాటి, ధీరేష్ చిగురుపాటి
రచన, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
విడుదల తేదీ: 28.12.2017
ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే దానికో ఫార్ములా ఉంది. ఐదు పాటలు ఉండాలి, అవసరం ఉన్నా లేకపోయినా థ్రిల్ చేసే ఫైట్స్ ఉండాలి. అన్నింటినీ మించి కథతో సంబంధం లేకపోయినా కామెడీ ఉండాలి. ఇన్ని ఎలిమెంట్స్ ఉంటేగానీ సినిమా విజయం సాధించదు. ఇది ఒకప్పటి మాట. రోజురోజుకీ ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. ఏ సినిమాని హిట్ చేస్తారో, ఏ సినిమాని తిప్పి కొడతారో తెలీని పరిస్థితి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొని ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే చాలు.. హీరో ఎవరు, ఎంత బడ్జెట్‌లో తీశారు, పాటలు ఎక్కడ పిక్చరైజ్ చేశారు ఇవేవీ చూడడం లేదు. సూపర్‌హిట్ చేసేస్తున్నారు. కొంత మంది యువ దర్శకులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో టచ్ చేయని సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఈమధ్య వచ్చిన చాలా సినిమాలు విజయం సాధించాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి డిఫరెంట్ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు శిరీష్ హీరోగా చక్రి చిగురుపాటి నిర్మించిన ఒక్క క్షణం గురువారం విడుదలైంది. ఆనంద్ ఎంచుకున్న ఆ కొత్త కాన్సెప్ట్ ఏమిటి? దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అల్లు శిరీష్ కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది? విభిన్న చిత్రాలకు విజయాలు అందిస్తున్న ప్రేక్షకులకు ఒక్కక్షణం చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కొన్ని వందల కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టే సంఘటనలను పోలిన సంఘటనలు, ఒకసారి జరిగిన సంఘటన మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే పద్ధతిలో జరగడం అనేది అరుదుగా వింటూ ఉంటాం. దానికి కొన్ని ఉదాహరణలు చరిత్రలో ఉన్నట్టు ఆధారాలతో ఈ సినిమాలో చూపించారు. దాన్నే ప్యారలల్ లైఫ్ అంటారని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే జీవా(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి అబ్బాయి. ఆఫర్లకు, డిస్కౌంట్లకు ఆకర్షితుడయ్యే తండ్రితో కలిసి ఇన్‌ఆర్బిట్ మాల్‌కి షాపింగ్‌కి వెళతారు. లోపలికి వెళ్ళడానికి ఇష్టపడని జీవా పార్కింగ్‌లోనే కారులో ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అదే టైమ్‌లో దగ్గరలో ఉన్న కారులో హీరోయిన్ జ్యోత్స్న(సురభి) కనిపిస్తుంది. తొలిచూపులోనే ఆమెని ఇష్టపడతాడు. అలాగే జ్యోత్స్న కూడా జీవాని లైక్ చేస్తుంది. వెళుతూ వెళుతూ ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది. కట్ చేస్తే జో ఫ్లాట్ ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో శ్రీను(అవసరాల శ్రీనివాస్), స్వాతి(శీరత్‌కపూర్) ఉంటారు. ఎప్పుడూ వారిని గమనిస్తూ ఉండే జోకి ఒక విషయం అర్థమవుతుంది. శ్రీను ఒక సైకో అనీ, స్వాతిని ఎప్పుడూ వేధిస్తుంటాడని. ఈ విషయాన్ని జీవాకి చెప్తుంది. అసలు వాళ్ళిద్దరి సమస్య ఏమిటో తెలుసుకోవడానికి శ్రీనుని కలుస్తాడు జీవా. అతను చెప్పింది విని షాక్ అవుతాడు. జీవా, జో కలుసుకున్న ఇన్‌ఆర్బిట్ మాల్ పార్కింగ్‌లోనే శ్రీను, స్వాతి కలుసుకోవడం, అక్కడే వారి మధ్య ప్రేమ స్టార్ట్ అవడం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన విషయాలే శ్రీను, స్వాతి మధ్య కూడా జరిగాయని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు జీవా. ఒకరోజు స్వాతి తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే అది ఆత్మహత్య కాదని, హత్య అనీ తెలుస్తుంది. ఆ హత్య తనే చేశానని శ్రీను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత స్వాతి మెడికల్ హిస్టరీ చూసిన జోకి మరో కొత్త విషయం తెలుస్తుంది. హెల్త్ పరంగా స్వాతి జీవితంలో జరిగినవి తనకు కూడా జరిగినట్టు గుర్తిస్తుంది. దాన్ని బట్టి తాను కూడా చనిపోవడం ఖాయమని డిసైడ్ అవుతుంది. అదీ తను ఎంతో ప్రేమించిన జీవా చేతిలో చనిపోతానని భావించిన జో అతన్ని దూరం పెడుతుంది. అయితే విధికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేమని, అలా చేస్తే ఎప్పుడో రావాల్సిన ప్రమాదం మన ముందే ఉంటుందని హెచ్చరిస్తాడు ఓ ప్రొఫెసర్. కానీ, జాతకాలకి, సైన్స్‌కి అందని ఏదో శక్తి మనిషిని నడిపిస్తుందని, అది మనలోనే వుందని జీవా తల్లి ధైర్యం చెబుతుంది. విధితో పోరాడమని ప్రోత్సహిస్తుంది. మరి స్వాతి జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు జో జీవితంలో కూడా జరిగాయా? స్వాతిలాగే జో కూడా హత్యకు గురవుతుందా? అయితే అది ఏ రూపంలో, ఎలా వస్తుంది? దాన్ని ఆపడానికి జీవా ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు స్వాతిని హత్య చేసింది ఆమె భర్తేనా? లేక మరెవరైనా చేశారా? చివరికి జోని జీవా కాపాడుకోగలిగాడా? ఈ ప్రశ్నలన్నింటకీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
ఓ మధ్య తరగతి కుర్రాడిగా, ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె తన వల్లే చనిపోతుందని తెలిసి ప్రేమ, విధి మధ్య నలిగిపోయే యువకుడిగా అల్లు శిరీష్ నటన మెప్పిస్తుంది. పాటల్లో, ఫైట్స్‌లో ఫర్వాలేదనిపించాడు. హీరోగా ఇప్పటివరకు మంచి బ్రేక్ దొరకని శిరీష్‌కి ఒక్క క్షణం కాస్త పేరు తెచ్చే సినిమా అవుతుంది. జోగా సురభి నటన కూడా ఫర్వాలేదు. వీలైనంత గ్లామర్‌గా కనిపించేందుకు, అలరించేందుకు సురభి తన వంతు ప్రయత్నం చేసింది. స్వాతిగా శీరత్ కపూర్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది అనిపిస్తుంది. శ్రీనుగా అవసరాల శ్రీనివాస్ ఫర్వాలేదు. మిగిలిన పాత్రల్లో సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి ఓకే అనిపించారు. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించిన దాసరి అరుణ్‌కుమార్ విలన్‌గా కొత్త అవతారం ఎత్తాడు. పరిశ్రమకు ఓ కొత్త విలన్ దొరికాడని అతని పెర్‌ఫార్మెన్స్ చూస్తే చెప్పొచ్చు. తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు.
సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించడంలో శ్యామ్ కె.నాయుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. మణిశర్మ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా వరకు బాగానే చేశాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్‌గా అనిపిస్తుంది. ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే వుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌లో సెకండాఫ్‌లో అవసరం లేని చాలా సీన్స్ వున్నాయనిపిస్తుంది. వాటిని తొలిగించి ఉంటే సినిమా ఇంకా స్పీడ్‌గా ఉండేది. అబ్బూరి రవి రాసిన మాటలు అక్కడక్కడా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఎక్కడికి పోతావు చిన్నవాడా చేసిన ఆనంద్ ఒక్క క్షణంతో మరో కొత్త కథని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాలనుకున్నాడు. అయితే ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందనేది ఆలోచించి ఉండడు. అందుకే తన మానాన తను సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఆలోచించలేదు. ఫస్ట్‌హాఫ్‌లో క్యారెక్టర్ల పరిచయానికే చాలా సమయం తీసుకున్న ఆనంద్ అసలు కథలోకి వచ్చే సరికి ఫస్ట్‌హాఫ్ అయిపోతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు చూస్తే కథ ఎటు వెళ్తోంది అనేది డౌట్ వస్తుంది. చివరి 30 నిమిషాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, మ్యూజిక్, చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, అందరికీ కనెక్ట్ అవ్వని కాన్సెప్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, ఫస్ట్‌హాఫ్, సెకండాఫ్‌లోని అనవసరమైన కొన్ని సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిన ప్రేక్షకులకు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడే వారికి ఒక్క క్షణం నచ్చే అవకాశం వుంది. అయితే ఇది ఎ సెంటర్లకు మాత్రమే పరిమితమయ్యే కాన్సెప్ట్ అనేది వాస్తవం. బి, సి సెంటర్ ఆడియన్స్‌కి ఈ సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది సందేహమే. అయితే ఒక కొత్త కాన్సెప్ట్‌తో మంచి అటెమ్ట్ చేసిన దర్శకుడు ఆనంద్‌ని అప్రిషియేట్ చెయ్యాల్సిందే.
ఫినిషింగ్ టచ్: ఒక్క క్షణం.. ఓకే!
allu sirish new movie okka kshanam