డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
ఖాకి
తారాగణం: కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, సత్యన్, మనోబాల తదితరులు
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: శివ నందీశ్వరన్
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్
సంగీతం: జిబ్రాన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
సమర్పణ: ఆదిత్య మ్యూజిక్ ప్రై. లిమిటెడ్
నిర్మాతలు: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా,
ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు
రచన, దర్శకత్వం: హెచ్.వినోద్
విడుదల తేదీ: 17.11.2017
పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అనగానే ఒక ఏరియాలో వున్న బ్యాడ్ పొలిటికల్ లీడర్ని లేదా ఒక గూండాని ఎదుర్కొనే కథాంశంతో వుంటుంది. ఇప్పటి వరకు మన సినిమాల్లో అలాంటి కాప్‌నే చూశాం. అలా కాకుండా దక్షిణ భారతదేశాన్ని భయభ్రాంతుల్ని చేసే ఒక దోపిడీ దొంగల ముఠా కేసు ఓ పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తే, అతను సిన్సియర్ పోలీస్ అయి వుంటే.. ఆ కథ ఎలా వుంటుంది? ఆ దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఎంత కష్ట పడతాడు? అతన్నుంచి తప్పించుకోవడానికి లేదా అతన్ని చంపడానికి దొంగలు ఎలాంటి పథకాలు వేస్తారు? ఒక చిన్న క్లూ ఆధారంగా పోలీసులు కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఆ కేసుని సాల్వ్ చేసేవరకు వాళ్ళు పడే పాట్లు ఎలాంటివి? అనేది తెలుసుకోవాలంటే ఖాకి చిత్రం చూడాల్సిందే.
1995 నుంచి 2005 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో దోపిడీ దొంగల ముఠా స్వైర విహారం చేసింది. 45 దోపిడీలకు పాల్పడడమే కాకుండా అడ్డొచ్చిన వారిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అతి కిరాతకంగా చంపారు. అలా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 63 మంది తమ సంతోషకరమైన జీవితానికి దూరమయ్యారు. ఈ యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన సినిమాయే ఖాకి. ధీరజ్(కార్తీ) ఓ ట్రైనీ పోలీస్. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన ధీరజ్‌కి పక్కింటి ప్రియ(రకుల్ ప్రీత్) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారి ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. పోలీస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చే ముందు కొన్ని స్టేషన్లలో ట్రైనింగ్ తీసుకోవాల్సి వుంటుంది. అలా కొన్ని స్టేషన్స్‌లో ట్రైనింగ్ పూర్తి చేసి డిఎస్‌పిగా చార్జ్ తీసుకుంటాడు ధీరజ్. అవినీతి, అక్రమాలపై విరుచుపడతాడు. దీంతో అతనికి ట్రాన్స్‌ఫర్స్ తప్పనిసరి అవుతాయి. కొన్ని సంవత్సరాలుగా హైవే పక్కన వుండే ఇళ్ళపై దాడి చేయడం, హత్యలు చేయడం వంటి కేసులు పోలీసుల దగ్గర పెండింగ్ కేసులుగా మిగిలిపోతాయి. ఆ క్రమంలో హైవే పక్కనే వున్న ఓ ఇంట్లో దోపిడీ జరుగుతుంది. నగలు, డబ్బు దోచుకెళ్ళడమే కాకుండా ఆ ఇంట్లో వారిని చంపేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ధీరజ్ నియమించబడతాడు. అంతకుముందు ఇలాంటి ఘటనలు చాలా జరిగినప్పటికీ సీరియస్‌గా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యలేదని ధీరజ్‌కి అర్థమవుతుంది. ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని ఆ దొంగల ముఠా గురించి ఎంక్వయిరీ మొదలు పెడతాడు. ఇదంతా హవారియా అనే గ్యాంగ్ చేస్తోందని తెలుసుకుంటాడు. రాజస్థాన్‌కి చెందిన ఓమా(అభిమన్యుసింగ్) కొంతమందితో ముఠా ఏర్పరచుకొని దోపిడీలు, హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఓమా గ్యాంగ్ ఎక్కడ వుందో పోలీసులు తెలుసుకోగలుగుతారు. అయితే ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చెయ్యడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ ఊరంతా ఓమా గ్యాంగ్‌కి సపోర్ట్‌గా వుంటుంది. ఇది తెలిసీ అక్కడికి వెళ్ళిన ధీరజ్ బృందంపై దాడి చేస్తారు ఆ ఊరి జనం. అలాంటి పరిస్థితుల్లో ధీరజ్ బృందం హవారియా గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ఎలాంటి పథకం వేసింది? హైవే పక్కన వుండే జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వారి ఆగడాలకు పోలీసులు ఎలా అడ్డు కట్ట వేశారు? ఈ ప్రయత్నంలో ధీరజ్‌కి ఎదురైన సమస్యలు ఏమిటి? నష్టపోయిందేమిటి? అనేది మిగతా కథ.
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం బరువు తగ్గి ఒక కాప్ లుక్‌లో కనిపించడంలో కార్తీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు. తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యాడు. ప్రతి సీన్‌లో కార్తీ కష్టం కనిపిస్తుంది. ధీరజ్ ప్రియురాలు ప్రియగా రకుల్ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. వారిద్దరి లవ్ ట్రాక్‌లో రకుల్ ఎంతో క్యూట్‌గా కనిపించింది. తన గ్లామర్ ఫస్ట్‌హాఫ్‌కి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. హవారియా గ్యాంగ్ నాయకుడు ఓమా క్యారెక్టర్‌కి అభిమన్యు సింగ్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. ఓమాగా తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ భయపెట్టాడు. ధీరజ్ కొలీగ్ సత్యగా ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన బోస్ వెంకట్ నటన ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. ప్రియ తండ్రిగా మనోబాల కనిపించిన కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా ఆర్టిస్టులు తెలుగు వారికి పరిచయం లేని వారు. అయినా తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫైట్‌మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ గురించి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి పది నిముషాలకు ఫైట్‌గానీ, ఛేజ్‌గానీ వుంటాయి. అంటే సినిమాలో టెక్నికల్‌గా ఎక్కువ పని చేసింది దిలీప్ అనే చెప్పాలి. ప్రతి ఫైట్‌ని ఎంతో డిఫరెంట్‌గా కంపోజ్ చేసి ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫీ సినిమాకి మంచి ప్లస్ అయింది. ఫ్రేమింగ్‌గానీ, టేకింగ్‌గానీ చాలా పర్‌ఫెక్ట్‌గా వుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూసే వీలు కలిగింది. దీనికితోడు ఎడిటర్ శివ నందీశ్వర్ ఎడిటింగ్ కూడా స్పీడ్‌గా వుంది. నిడివి పరంగా కాస్త ఎక్కువగానే వున్నా ఎక్కడా బోర్ అనిపించకుండా ఎడిట్ చేశాడు. జిబ్రాన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేసింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే క్వాలిటీ మెయిన్ టెయిన్ చేసి ఆడియన్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నిచ్చాడు. ఇక డైరెక్టర్ వినోద్ గురించి చెప్పాలంటే.. ఇలాంటి సబ్జెక్ట్‌ని డీల్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. యదార్థ ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న ఈ సబ్జెక్ట్‌లో ఎక్కడా సినిమాటిక్‌గా అనిపించే సన్నివేశాలు వుండవు. ప్రతి సీన్‌ని నేచురల్ చూపించే ప్రయత్నం చేశాడు వినోద్. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకుని వుంటాడని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. పోలీస్ వ్యవస్థ ఎలా వుంది? ఒక కేసుని ఎన్ని కోణాల్లో పరిశీలిస్తారు? చిన్న క్లూ దొరికితే దాని ఆధారంగా నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు? అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వినోద్ వాటిని సినిమాలో అప్లై చేసి సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ముందు సత్య ఫ్యామిలీని, ప్రియని దొంగలు ఎటాక్ చేసే సీన్‌ని ఎంతో ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో ధీరజ్ బృందంపై ఓమా గ్యాంగ్ ఎటాక్ చేసే సీన్‌ని కూడా అద్భుతంగా తీశాడు. ఇలా ప్రతి సీన్‌ని అప్రిషియేట్ చేసేలా వినోద్ తెరకెక్కించాడు. ఫైనల్‌గా చెప్పాలంటే రెగ్యులర్‌గా వచ్చే పోలీస్ స్టోరీలకు భిన్నంగా ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌లో యదార్థ ఘటనల ఆధారంగా తీసిన ఖాకి చిత్రం యాక్షన్ చిత్రాలను, క్రైమ్ స్టోరీలను ఇష్టపడేవారిని ఫుల్‌గా శాటిస్‌ఫై చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫినిషింగ్ టచ్: న్యూ పోలీస్ స్టోరీ
karthi new movie khakee