పి.వి.పి. సినిమా, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రాజుగారి గది2
తారాగణం: అక్కినేని నాగార్జున, అక్కినేని సమంత, సీరత్‌కపూర్, అశ్విన్‌బాబు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, రావు రమేష్, నరేష్, దేవన్, అవినాష్, నందు తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
సంగీతం: ఎస్.ఎస్.థమన్
ఎడిటింగ్: మధు
మూలకథ: రంజిత్ శంకర్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: పి.వి.పి. సినిమా, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్
రచన, దర్శకత్వం: ఓంకార్
విడుదల తేదీ: 13.10.2017
ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది చిత్రంలో పెద్ద స్టార్స్ ఎవ్వరూ లేకపోయినా మంచి హార్రర్ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంది. అన్ని క్లాస్‌ల ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది. రాజుగారి గది2 విషయానికి వస్తే ఈసారి నాగార్జున వంటి స్టార్ హీరోని, సమంత వంటి స్టార్ హీరోయిన్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు ఓంకార్. రాజుగారి గది చిత్రానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. బాగా పాపులర్ అవ్వడం వల్ల ఆ టైటిల్‌నే ఈ సినిమాకీ వాడుకున్నారు. ఒక అమ్మాయి ఏదో కారణం వల్ల చనిపోతుంది, ఆమె ఆత్మ తనకు అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకుంటుంది... ట్రైలర్ చూసిన సాధారణ ప్రేక్షకుడు కూడా ఇలాంటి సాదా సీదా కథతో సినిమా రూపొంది వుంటుందన్న అంచనాకి వచ్చేస్తాడు. వాస్తవానికి సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు అందని కథతో రూపొందిందని చెప్పలేం. తీసుకున్న కథలో నావెల్టీ లేకపోయినా దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం, ఓ కొత్త తరహా క్యారెక్టర్‌తో కథని క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళిన విధానం, ఆడియన్స్‌ని థ్రిల్ చేసే విజువల్ ఎఫెక్ట్స్‌ని కథనానికి అనుగుణంగా వాడుకున్న తీరుని ప్రశంసించకుండా వుండలేం.
కథ విషయానికి వస్తే అశ్విన్, కిషోర్, ప్రవీణ్ ముగ్గురూ మంచి స్నేహితులు. ఓ రాజుగారు తన రిసార్ట్‌ని అమేస్తే దాన్ని కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ ముగ్గురికీ ఆ రిసార్ట్‌లో ఓ ఆత్మ తిరుగుతోందని అనుభవ పూర్వకంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చర్చి ఫాదర్(నరేష్) దృష్టికి తీసుకెళ్తారు. ఈ సమస్యని పరిష్కరించే వ్యక్తి రుద్ర(అక్కినేని నాగార్జున) ఒక్కడే అని చెప్తాడు ఫాదర్. రుద్రను కలిసి తమ రిసార్ట్‌లో వున్న ఆత్మ గురించి చెప్తారు ముగ్గురు ఫ్రెండ్స్. రిసార్ట్‌కి వచ్చిన రుద్రకి ఆత్మ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ ఆత్మ అక్కడే ఎందుకు సంచరిస్తోంది, ఎవరిని టార్గెట్ చేసింది? రుద్ర ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపాడు? అనేది మిగతా కథ.
హార్రర్ కామెడీ సినిమాల్లో ఒక భవనంలో దెయ్యాలు వుండడం, అక్కడికి వచ్చిన వారిని భయపెట్టడం జరుగుతుంది. 90 శాతం హార్రర్ సినిమాలు ఇలాగే వుంటాయి. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపడం లేదా రౌడీల చేతుల్లో బలి కావడం, ఆ తర్వాత ఆత్మగా మారి ప్రతీకారం తీర్చుకోవడం.. ఇవీ ఇంతకాలం మనం చూసిన కథలు. రాజుగారి గది2 విషయంలో ఆ ఎపిసోడ్ పూర్తి విభిన్నంగా వుంటుంది. ఆ డిఫరెన్స్ ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రెండు గంటల ఏడు నిముషాల సినిమాలో 45 నిముషాలు ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్‌తో, దెయ్యం వల్ల భయపడే సీన్స్‌తో గడిచిపోతుంది. రుద్ర క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా స్పీడ్ అందుకుంటుంది. మెంటలిస్ట్‌గా నాగార్జున సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆత్మ వల్ల బాధింపడే సీన్‌లో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో, సెంటిమెంట్ సీన్స్‌తో, తను చెప్పే డైలాగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే క్లైమాక్స్ వరకు సినిమాని తన భుజాలపై మోసుకెళ్ళాడు. అమృత క్యారెక్టర్‌లో సమంత ఒదిగిపోయిందని చెప్పాలి. తల్లి ప్రేమకు దూరమై, తండ్రిని కూడా పోగొట్టుకున్న కూతురుగా సమంత నటన ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సమంత బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడొచ్చు. అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ యధావిధిగా తమ క్యారెక్టర్స్‌కి తగిన న్యాయం చేశారు. అమృత తండ్రిగా కనిపించిన కాసేపు తన నటనతో, డైలాగ్స్‌తో ఆలోచింపజేసాడు రావు రమేష్. ఫస్ట్‌హాఫ్‌లో సీరత్ కపూర్ తన గ్లామర్ కనువిందు చేసింది. నరేష్ చేసిన ఫాదర్ క్యారెక్టర్‌కి అంతగా ప్రాధాన్యం లేదు. షకలక శంకర్ అక్కడక్కడా కామెడీ చేసే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ కాలేదు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదటగా విజువల్ ఎఫెక్ట్స్ గురించే చెప్పాలి. ఈమధ్యకాలంలో ఒక హార్రర్ సినిమాలో ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ రాలేదనే చెప్పాలి. ఎక్కడా ఆర్భాటం లేకుండా చాలా నీట్‌గా ఎఫెక్ట్స్ చేశారు. పది నిముషాలకు ఒకసారి ఏదో ఒక విజువల్ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. దివాకరన్ ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ప్రతి షాట్‌ని ఎంతో రిచ్‌గా, మరెంతో అందంగా చూపించడంలో దివాకరన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. సంగీత దర్శకుడు థమన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ఎస్సెట్ అయింది. కొన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్ చెయ్యడంలో థమన్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయింది. మధు ఎడిటింగ్ కూడా బాగుంది. రెండు గంటల ఏడు నిముషాల్లో సినిమాని కట్ చేయడం వల్ల చాలా స్పీడ్‌గా వుంది. అబ్బూరి రవి చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం మంచి మాటలు రాశాడు. క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్స్ మనసుని తట్టి లేపుతాయి. అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలవొచ్చు. కానీ, నాన్న స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేము, అమ్మాయి అనే పదంలోనే అమ్మా అనే పిలుపు వుంది వంటి మాటలు ఆకట్టుకుంటాయి. కథకి అవసరమైన ఖర్చు పెట్టడంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీ ఖర్చు కనిపిస్తుంది. డైరెక్టర్ ఓంకార్ గురించి చెప్పాలంటే మూల కథని ప్రేతమ్ నుంచి తీసుకున్నప్పటికీ దాన్ని తెలుగుకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడంలో సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్‌గా హార్రర్ మూవీలా కాకుండా కొంత సెంటిమెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్, మంచి డైలాగ్స్‌తో ఓ కొత్త తరహా సినిమా తీశాడని చెప్పొచ్చు. నాగార్జున ఎంటర్ అయినపుడు మనకు ఒక్కసారి చంద్రముఖి సినిమా గుర్తొస్తుంది. ఓ మానసిక వ్యాధితో బాధపడే హీరోయిన్‌ని ఆత్మ నుంచి కాపాడేందుకు వచ్చే రజనీకాంత్ గుర్తొస్తాడు. అందులో హీరోయిన్‌ని మానసిక వ్యాధికి దూరం చేస్తాడు. ఈ సినిమాలో అమృతకి అన్యాయం చేసింది ఎవరో కనిపెట్టడమే కాకుండా ఆ ఆత్మకు తండ్రిలా మంచిని ప్రబోధిస్తాడు. నాగార్జున నుంచి, సమంత నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో ఓంకార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. రాజుగారి గది అనగానే హారర్ ఎలిమెంట్‌తోపాటు ఫుల్ లెంగ్త్ కామెడీ వుంటుందని ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చే ప్రేక్షకులు నిరాశ పడే అవకాశం వుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కి సెకండాఫ్‌లోని సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. ఫైనల్‌గా చెప్పాలంటే హార్రర్ సినిమాని చక్కని విజువల్ ఎఫెక్ట్స్‌తో మెంటలిస్ట్ అనే కొత్త క్యారెక్టర్‌తో కొత్త పంథాలో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు ఓంకార్. రాజుగారి గది2 విజువల్‌గా ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. నాగార్జున, సమంతల పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా రూపొందిన రాజుగారి గది2 హార్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. చిత్రంలోని సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పిస్తాయి. ఏ విధంగా చూసినా కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయ్యే లక్షణాలు ఈ సినిమాలో పుష్కలంగా వున్నాయి.
ఫినిషింగ్ టచ్: కొత్త తరహా హార్రర్ థ్రిల్లర్
telugu movie rajugari gadi 2 review