Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఉంగరాల రాంబాబు

Fri 15th Sep 2017 10:40 PM
telugu movie ungarala rambabu,ungarala rambabu movie review,ungarala rambabu review in cinejosh,ungarala rambabu cinejosh review,sunil new movie ungarala rambabu  సినీజోష్‌ రివ్యూ: ఉంగరాల రాంబాబు
ungarala rambabu review సినీజోష్‌ రివ్యూ: ఉంగరాల రాంబాబు
సినీజోష్‌ రివ్యూ: ఉంగరాల రాంబాబు Rating: 1.5 / 5
Advertisement
Ads by CJ

యునైటెడ్‌ మూవీస్‌(కిరీటి)లిమిటెడ్‌ 

ఉంగరాల రాంబాబు 

తారాగణం: సునీల్‌, మియా జార్జ్‌, ప్రకాష్‌రాజ్‌, పోసాని, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల, ఆశిష్‌ విద్యార్థి, హరితేజ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి 

సంగీతం: జిబ్రాన్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

మాటలు: చంద్రమోహన్‌ 

నిర్మాత: పరుచూరి కిరీటి 

రచన, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్‌ 

విడుదల తేదీ: 15.09.2017 

కమెడియన్‌ నుంచి హీరోగా టర్న్‌ అయిన తర్వాత సునీల్‌ కెరీర్‌ చెప్పుకోదగ్గ హిట్‌ సినిమాలు అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు. ఆ తర్వాత హిట్‌ అనేది సునీల్‌ కనుచూపు మేరలో కనిపించలేదు. ఓనమాలు వంటి చక్కని సందేశాత్మక చిత్రాన్ని రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించిన క్రాంతిమాధవ్‌ ఆ తర్వాత శర్వానంద్‌, నిత్యా మీనన్‌లతో మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే అది మినిమం గ్యారెంటీ సినిమా అని అందరూ అనుకోవడంలో తప్పు లేదు. మరి ఈ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఉంగరాల రాంబాబు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆట్టుకుంది?రీ సినిమా సునీల్‌ని పరాజయాల బారి నుంచి రక్షించిందా? రెండు మంచి సినిమాలు చేసి దర్శకుడుగా ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న క్రాంతిమాధవ్‌ ఈ సినిమాతో దర్శకుడుగా ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ వినగానే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు క్రాంతి మాధవ్‌ మార్క్‌ మెసేజ్‌ కూడా వుంటుందని అందరూ ఆశిస్తారు. అలాగే యాక్షన్‌ హీరోగా చాలా సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న సునీల్‌ తనలోని కామెడీ యాంగిల్‌తో మరోసారి అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తాడని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ, ఎవరి ఊహలకి అందని విధంగా, మనం ఏ జోనర్‌ సినిమా చూస్తున్నామో అర్థంకాని విధంగా, మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ సినిమా చూడాల్సి వస్తోందని ప్రేక్షకులు హాహాకారాలు చేసే విధంగా ఉంగరాల రాంబాబు చిత్రం రూపొందింది. ఈ సినిమాని డిజాస్టర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడుగానీ, నిర్మాతగానీ ఎక్కడా రాజీ పడలేదు. ఇది ఒక జోనర్‌ సినిమా అని చెప్పడానికి వీలు లేకుండా అన్నీ ఒకే సినిమాలో చూపించాలనే తపన దర్శకుడిలో కనిపించింది. అయితే అన్నీ అసంపూర్తిగా, ఆకట్టుకోని విధంగా తియ్యడంలో డైరెక్టర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. కథని క్లుప్తంగా చెప్పాలంటే తాతయ్య(విజయ్‌కుమార్‌) నీడలో పెరిగిన రాంబాబు(సునీల్‌) చిన్నతనం నుంచి తాతయ్య చెప్పిన కథల్లోని స్వాతంత్య్ర సమరయోధులను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవాడు. పెద్దయ్యాక వాళ్ళని వదిలేసి సినిమా హీరోల డైలాగ్స్‌, స్టెప్స్‌కి, ఫైట్స్‌కి ఇన్‌స్పైర్‌ అవుతుంటాడు. ఇలా వుండగా 200 కోట్ల అప్పులు మిగిల్చి తాతయ్య కన్నుమూస్తాడు. అదే టైమ్‌లో బాదంబాబా(పోసాని) ఆశీస్సులతో 200 కోట్లకు అధిపతి అవుతాడు. తన ఆఫీస్‌లో పనిచేసే సావిత్రి(మియా జార్జ్‌)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతారు. కేరళలో వుండే సావిత్రి తండ్రి రంగనాయర్‌(ప్రకాష్‌రాజ్‌) దగ్గరకి వెళ్తారు. కమ్యూనిస్ట్‌ భావాలున్న రంగనాయర్‌... సునీల్‌ని అల్లుడుగా చేసుకోవడానికి ఒప్పుకోడు. ఆ క్షణం నుంచి రాంబాబు.. రంగనాయర్‌ ఇంట్లోనే వుంటూ వుంటాడు. తన ప్రవర్తనతో రంగనాయర్‌ని రాంబాబు ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? సావిత్రిని ఎలా పెళ్ళి చేసుకున్నాడనేది కథ. 

సింపుల్‌గా చెప్పుకున్న ఈ కథలో లక్షా తొంబై లొసుగులున్నాయి. పోయాయనుకున్న 200 కోట్లు సిల్లీగా బంగారం రూపంలో దొరకడం, దాంతో వ్యాపారం స్టార్ట్‌ చెయ్యడం దాన్ని 400 కోట్లు చేసెయ్యడం చాలా కామెడీగా జరిగిపోతాయి. ఈ సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టరైజేషన్‌ కూడా సమంజసం అనిపించదు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేసే రాంబాబు అప్పటికప్పుడే సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పేస్తుంటాడు. సామాజిక స్పృహ వున్నవాడిలా దేశంలోని అన్ని సమస్యల గురించి చర్చిస్తాడు. హీరోయిన్‌ ఇంట్లోనే మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ హీరోయిన్‌ తండ్రి దగ్గర బ్యాడ్‌ అనిపించుకుంటాడు. ఇక హీరోయిన్‌ గురించి చెప్పాలంటే హీరో ఏది చేసినా సర్దుకుపోయే మనస్తత్వంతో వుంటుంది. రాంబాబు, రంగనాయర్‌ కనిపించే ప్రతి సీన్‌లో వెనక ఒక ప్రాపర్టీలా వుంటుందే తప్ప ఆమె క్యారెక్టర్‌కి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఇక అన్నింటికంటే కామెడీ అనిపించే క్యారెక్టర్‌ రంగనాయర్‌ది. పొరుగు రాష్ట్రమైన కేరళలోని ఓ గ్రామంలో కమ్యూనిజాన్ని ఊళ్ళో అందరికీ నూరిపోసే క్యారెక్టర్‌. కార్పొరేట్‌ విధానాన్ని చీల్చి చెండాడుతూ వుంటాడు. ఫారిన్‌ కారు కనిపించినా సహించని క్యారెక్టర్‌. ఊళ్ళోవారి సమస్యల కోసం ఎప్పుడూ కలెక్టర్‌తో విభేదించే క్యారెక్టర్‌. తన సిద్ధాంతాలతో ఏం సాధించాడో మనకు అర్థం కాదు. మరో కామెడీ ఏమిటంటే ఊళ్ళో వాళ్ళందరికీ అతని ఇంటి నుంచో భోజనం వెళ్ళడం. ఇది మనం ఎక్కడా చూసి ఎరగం. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సునీల్‌ కామెడీ చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ, అస్సలు సక్సెస్‌ అవ్వలేదు. మియా జార్జ్‌ కేవలం పాటలకే పరిమితమైపోయింది. ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేస్తున్నాననుకున్న ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కామెడీగా మారిపోయింది. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే సర్వేష్‌ మురారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని అందంగా చూపించాడు. జిబ్రాన్‌ మ్యూజిక్‌ విషయానికి వస్తే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. దానికి తగ్గట్టుగానే పాటల పిక్చరైజేషన్‌ పరమ రొటీన్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇరగదీసే అవకాశం అస్సలు లేని కథ కాబట్టి జిబ్రాన్‌కి ఆ అవకాశం రాలేదు. చంద్రమోహన్‌ రాసిన మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోగా సాధారణంగా కూడా లేవు. సినిమాని రిచ్‌గా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా తియ్యడంలో నిర్మాత సహకారం కనిపిస్తుంది. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే ఎవరూ అతని నుంచి ఊహించని సినిమా ఇది. గతంలో అతను చేసిన రెండు సినిమాలు చూసిన వారికి ఉంగరాల రాంబాబు అతను చేసిన సినిమాయేనా అనే డౌట్‌ కూడా వస్తుంది. ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ ఎందుకు పెట్టాడు? ఏ జోనర్‌లో సినిమా చెయ్యాలనుకున్నాడు? అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం పర్థం లేని సీన్స్‌, అనవసరమైన పంచ్‌లు, కథ, కథనాలతో విసిగి వేసారిన ప్రేక్షకులపై ఒక్కసారిగా వచ్చి పడే పాటలు... ఇలా ఆద్యంతం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా సినిమా తియ్యడంలో క్రాంతిమాధవ్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ, కథనం, క్యారెక్టర్లు... ఇలా ఏ విషయంలోనూ ప్లస్‌ పాయింట్స్‌లేని ఈ సినిమాకి అన్నీ మైనస్సే అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన సునీల్‌ సినిమాల్లో అతి దారుణమైన సినిమా ఉంగరాల రాంబాబు అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: సినిమా చూస్తే గింగిరాలే! 

ungarala rambabu review:

sunil new movie ungarala rambabu review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ