భవ్య క్రియేషన్స్
పైసా వసూల్
తారాగణం: నందమూరి బాలకృష్ణ శ్రియా శరన్, ముస్కాన్ సేథీ, కైరా దత్, కబీర్ బేడి, విక్రమ్‌జీత్ విర్క్, అలోక్ జైన్, పృథ్వి, ఆలీ, అమిత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 01.09.2017
పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా వుంటుంది, బాడీ లాంగ్వేజ్ తేడాగా వుంటుంది, హీరో చెప్పే డైలాగులు కొత్తగా వుంటాయి. ఇప్పటివరకు 100 సినిమాలు చేసిన బాలకృష్ణ 101వ సినిమా పూరి జగన్నాథ్‌తో చెయ్యాలనుకున్నాడు. 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయే సినిమా. అలాంటి సినిమా తర్వాత వెంటనే తేడా సింగ్ అనే తేడా క్యారెక్టర్ చేస్తాడని ఎవరూ ఊహించి వుండరు. అందులోనూ బాలకృష్ణతో పూరి చేసిన మొదటి సినిమా కావడంతో బాలకృష్ణతో ఏమేం చేయించాలనుకున్నాడో అన్నీ చేయించేశాడు. కుర్ర హీరోల్లో వుండే చలాకీతనం, ఎనర్జీని తేడా సింగ్ క్యారెక్టర్‌లో టన్నుల కొద్దీ నింపేశాడు. అయితే కథకు అది ఎంతవరకు అవసరం అనేది మాత్రం పూరి ఆలోచించలేదు. తను తియ్యాలనుకున్నది తీశాడు, ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేసి ఎరుగని బాలకృష్ణ అతను చెప్పిందల్లా చేశాడు. ఫైనల్ ఔట్‌పుట్ చూస్తే ఇది ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అనే ఫ్లేవర్ పైసావసూల్‌కి వచ్చేసింది. తమ అభిమాన హీరో డైలాగులు చెప్తే చప్పట్లు కొట్టి, విజిల్స్ వేసే అభిమానులు ఆ డైలాగుల్ని, పంచ్‌ల్ని, అత్యుత్సాహం ప్రదర్శించే క్యారెక్టరైజేషన్‌ని కొంతవరకు బాగానే ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా అవే వుంటే.. ఎలా రియాక్ట్ అవుతారు? ఆమధ్య పవన్‌కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గబ్బర్‌సింగ్ సూపర్‌హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాలోనూ పవన్‌కళ్యాణ్ క్యారెక్టరైజేషన్, డైలాగులు, పంచ్‌లు హెవీగా వుండడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తినగా తినగా తీపైనా చేదుగా మారుతుందంటారు. సర్దార్ గబ్బర్‌సింగ్ విషయంలో అదే జరిగింది. ఇది కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని రిలీజ్ తర్వాత ప్రకటించారు. ఇప్పుడు పైసావసూల్ పరిస్థితి కూడా అదే. సినిమాలో ఓన్లీ ఫ్యాన్స్, ఫ్యామిలీస్.. ఔటర్స్ నాట్ ఎలౌడ్ అని బాలకృష్ణ చెప్పినట్టు పైసావసూల్ అనే సినిమా కేవలం ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అనిపిస్తుంది.
కథలో కొత్తదనం ఏదైనా వుందా అంటే ఒక శాతం కూడా లేదనే చెప్పాలి. రొటీన్ కథ, రొటీన్ కథనం, మాఫియా డాన్, అతన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్టుకోలేకపోవడం, ఆ డాన్ వల్ల హీరోయిన్ ఫ్యామిలీకి సమస్యలు రావడం, ఆ ఫ్యామిలీని రక్షించడానికి హీరో ఎక్కడి నుంచో రావడం, విలన్ గ్యాంగ్‌ని ఎదుర్కోవడం అంతా రొటీన్.. రొటీన్. ఈ సినిమాలో ఏమైనా కొత్తగా వున్నాయీ అంటే అవి బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ రాయడం పూరి జగన్నాథ్‌కి కొత్త కాకపోయినా, చెప్పడం బాలకృష్ణకు కొత్తే. ఈ సినిమాలో అభిమానులకు కనిపించే కొత్తదనం అదే. ఇప్పటివరకు బాలకృష్ణను అలాంటి క్యారెక్టర్‌లో చూడలేదు కాబట్టి అభిమానులు బాలకృష్ణ క్యారెక్టర్‌ని, అతను చెప్పే డైలాగ్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. మేరా నామ్ తేడా.. తేడా సింగ్, ధిమాక్ తోడా, చాలా తేడా అనే డైలాగ్, గొడవల్లో గోల్డ్ మెడలొచ్చినోడ్ని.. మళ్ళీ టోర్నమెంట్లు పెట్టొద్దు, ఒక్కసారి నా స్క్రూ లూజ్ అయితే నేనిలాగే వుంటా, బీహార్ నీళ్ళు తాగినోళ్ళని తీహార్‌లో పోయించా, కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా... వంటి డైలాగ్స్ ఆడియన్స్‌చేత చప్పట్లు కొట్టిస్తాయి.
ఇప్పటివరకు చేసిన 100 సినిమాల్లో చూడని బాలకృష్ణని పైసావసూల్‌లో చూస్తారు. తేడాసింగ్ క్యారెక్టర్‌ని పూరి ఎంత డిఫరెంట్‌గా డిజైన్ చేసాడో దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. పూరి అనుకున్న క్యారెక్టర్‌ని స్క్రీన్‌పై చూపించగలిగాడు. అయితే అతని క్యారెక్టర్‌లోని అత్యుత్సాహం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో యంగ్ హీరోలకు తాను ఏమాత్రం తీసిపోనని బాలకృష్ణ నిరూపించాడు. సినిమాలో మిగతా క్యారెక్టర్ల గురించి, ఆ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం ఇది బాలకృష్ణ షో అని చెప్పొచ్చు. మిగతా క్యారెక్టర్లు తేడా సింగ్ క్యారెక్టర్‌కి సపోర్ట్‌గా వుంటాయే తప్ప ఆ క్యారెక్టర్లకు అంత ప్రాధాన్యం లేదు. ఎందుకంటే బలమైన కథ లేకుండా బాలకృష్ణ కోసమే పెట్టిన పైసావసూల్ అనే టైటిల్, బాలకృష్ణ కోసమే రాసిన డైలాగ్స్‌తోనే సినిమాని స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కథంటూ ఒకటి వుండాలి కాబట్టి పాత కథనే తేడాసింగ్ క్యారెక్టర్ చుట్టూ అల్లారా అనే డౌట్ కూడా వస్తుంది.
మహేష్‌తో చేసిన పోకిరి కథను పోలినట్టుగా ఈ పైసావసూల్ కథ వుంటుంది. ఆ సినిమా తర్వాత అలాంటి కథాంశంతో ఎన్ని సినిమాలు వచ్చినా పూరి మాత్రం పోకిరిని మర్చిపోలేదు. పోకిరిలో కొన్ని ట్విస్టులకు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. కానీ, ఈ సినిమాలో ఏ సందర్భంలోనూ ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యలేకపోయాడు పూరి. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలంటే ముఖేష్ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ రిచ్‌గా కనిపిస్తుంది. అనూప్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. ఆల్రెడీ సినిమా రిలీజ్‌కి ముందే పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనూప్‌కి తక్కువ మార్కులే పడతాయి. ఏ సీన్‌లోనూ అతని మ్యూజిక్ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఫైట్‌మాస్టర్ వెంకట్ ఫైట్స్ అన్నీ డిఫరెంట్‌గానే కంపోజ్ చేశాడు. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ ఎంతో ఈజ్‌తో చేశాడు. సినిమాలో వెంకట్ భాగస్వామ్యమే ఎక్కువగా వుంటుంది. నిర్మాత గురించి చెప్పాలంటే బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఎంత రిచ్‌గా వుండాలో అంత రిచ్‌గా చెయ్యడంలో ఆనంద్‌ప్రసాద్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చెప్పాలంటే కథ విషయంలోగానీ, కథనం విషయంలోగానీ ఎలాంటి కొత్తదనం లేకుండా తన పాత ఫార్మాట్‌లోనే సినిమా చేయడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆల్రెడీ మనం కొన్ని వందల సినిమాల్లో చూసేసిన కథనే తీసుకొని దానికి కొన్ని కొత్త డైలాగులు రాసుకున్నాడు తప్ప కథ విషయంలో ఎలాంటి రిస్క్ చేయలేదు. రాసుకున్న పాత కథలో కూడా బోలెడన్ని లొసుగులున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మాఫియా డాన్ బాబ్ మార్లేని పట్టుకోవడం పోలీసుల తరం కాకపోవడంతో అతన్ని ఇల్లీగల్‌గానే ఫినిష్ చెయ్యాలని భావిస్తుంది రా. అందుకోసం ఒక ఖతర్నాక్ ఆద్మీ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో తేడా సింగ్ ఎంటర్ అవుతాడు. అతన్ని పట్టుకోవడానికి ఒక లేడీ ఏసీపి ఐటమ్ గర్ల్ అవతారమెత్తి, తన అందచందాలు అందరికీ ఆరబోసి తేడా సింగ్‌ని పట్టుకుంటుంది. ఇది మన తెలుగు సినిమాల్లోనే సాధ్యమవుతుందని పూరి మరోసారి ప్రూవ్ చేశాడు. తేడా సింగ్‌ని పట్టుకున్న రా ఆఫీసర్లు బాబ్ మార్లేని చంపమని అతనికి ఓ బంపర్ ఆఫర్ ఇస్తారు. కానీ, తేడా సింగ్ మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా హీరోయిన్ వెంటపడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఏ దశలోనూ ఆ ఆపరేషన్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడు. అసలు విషయాన్ని పక్కన పెట్టి బాలకృష్ణతో ఎలా ఎంటర్‌టైన్ చేయించాలనే దానిపైనే పూరి దృష్టి పెట్టాడు. ఇందులో డైలాగులు చెప్పాలన్నా, పంచ్‌లు వెయ్యాలన్నా, కామెడీ చెయ్యాలన్నా, ఫైట్స్ చెయ్యాలన్నా అన్నీ బాలకృష్ణే. పూరి సినిమాల్లో ఆలీ క్యారెక్టర్ డిఫరెంట్‌గా వుంటుంది. అతని కామెడీ హైలైట్‌గా వుంటుంది. ఇందులో ఆలీ వున్నా అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ జోలికి వెళ్ళలేదు పూరి. పృథ్వీలాంటి కమెడియన్‌ని పెట్టుకొని అతనితో ఒక్క కామెడీ డైలాగ్ కూడా చెప్పించలేకపోయాడు. సినిమాలో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోదగ్గది బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్, అతని పెర్‌ఫార్మెన్స్ మాత్రమే. మిగతావన్నీ సినిమాకి మైనస్‌లుగానే భావించాలి. బాలకృష్ణ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ అభిమానుల సినిమా. బాలకృష్ణ డైలాగ్స్‌ని ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే పైసా వసూల్ బాలకృష్ణ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, అతను చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకుల్లో వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా మాత్రమే. ఇందులో బలమైన కథకి, కథనానికి తావు లేదు. ఈ సినిమాని కేవలం బాలకృష్ణ అభిమానులు మాత్రమే ఎంజాయ్ చేస్తారు.
ఫినిషింగ్ టచ్: స్టోరీ తోడా.. చాలా తేడా!
balakrishna and puri jagannath movie paisa vasool