Advertisementt

సినీజోష్‌ రివ్యూ: అర్జున్‌రెడ్డి

Fri 25th Aug 2017 09:00 PM
telugu movie arjun reddy,vijay devarakonda new movie arjun reddy,arjun reddy movie review,arjun reddy movie review in cinejosh,arjun reddy movie cinejosh review  సినీజోష్‌ రివ్యూ: అర్జున్‌రెడ్డి
arjun reddy review సినీజోష్‌ రివ్యూ: అర్జున్‌రెడ్డి
సినీజోష్‌ రివ్యూ: అర్జున్‌రెడ్డి Rating: 2.75 / 5
Advertisement

భద్రకాళి పిక్చర్స్‌ 

అర్జున్‌రెడ్డి 

తారాగణం: విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, సంజయ్‌ స్వరూప్‌, కాంచన, కమల్‌ కామరాజు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రాజు తోట 

సంగీతం: రథన్‌ 

ఎడిటింగ్‌: శశాంక్‌ 

నిర్మాత: ప్రణయ్‌రెడ్డి వంగా

రచన, దర్శకత్వం: సందీప్‌రెడ్డి వంగా

విడుదల తేదీ: 25.08.2017 

ప్రేమకథలు ఇలాగే వుండాలి అనే రూల్‌ ఎక్కడా లేదు. ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు ప్రేమకథలు రాసుకుంటారు. సినిమాల విషయంలో కూడా అంతే. ఎవరి విజన్‌ని బట్టి వాళ్ళు లవ్‌స్టోరీస్‌ని అందంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అలాగే సమాజంలో ప్రేమికులు ఎలా నడుచుకోవాలి? పెద్దవాళ్ళ ముందు ఎలా బిహేవ్‌ చెయ్యాలి? పబ్లిక్‌ ప్లేస్‌లో వారి లిమిట్స్‌ ఏమిటి? అనే విషయంలో కూడా రూల్స్‌ ఏమీ లేవు. నిజ జీవితానికి, సినిమాకి వున్న తేడా ఏమిటంటే ఒక ప్రేమకథని అందరూ అన్వయించుకునేలా తియ్యగలగాలి? అందులోని ప్రేమికుల ఎమోషన్స్‌ని ప్రేక్షకులు కూడా ఫీల్‌ అవ్వాలి. మనం చూస్తున్నది సినిమా కాదు, ఒక మనిషి జీవితం అనే ట్రాన్స్‌లోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్ళగలగాలి. అప్పుడే ఏ ప్రేమకథైనా, ఎలాంటి ప్రేమకథైనా, అది ఎంత బోల్డ్‌గా తీసినా ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయిపోతుంది. ఈ శుక్రవారం విడుదలైన అర్జున్‌రెడ్డి చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఎలా వుండబోతుందన్నది ట్రైలర్‌ ద్వారా ఆడియన్స్‌కి అర్థమైంది. దానికితోడు హీరో, హీరోయిన్‌ ముద్దుపెట్టుకునే పోస్టర్స్‌ వల్ల ఏర్పడిన వివాదం వల్ల కొంత పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం యూత్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమాలో వారిని ఆకట్టుకునే అంశాలేమిటి? అర్జున్‌రెడ్డి ప్రేమకథని దర్శకుడు ఎలా చెప్పాడు? ఆడియన్స్‌కి ఈ కథ ఎంతవరకు కనెక్ట్‌ అవుతుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అర్జున్‌రెడ్డి(విజయ్‌ దేవరకొండ) ఒక సర్జన్‌. మంగుళూరులోన మెడికల్‌ కాలేజీలో మెడిసన్‌ చేస్తుంటాడు. కాలేజీలో టాపర్‌, యూనివర్సిటీలో టాపర్‌. అతన్ని అందరూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. జూనియర్స్‌ సర్‌ అని గౌరవంగా పిలుస్తారు. అన్నింటినీ మించి అతనంటే కాలేజ్‌లోని స్టూడెంట్స్‌ అందరికీ భయమే. ఎందుకంటే ఎవర్నీ లెక్క చెయ్యడు. సిగరెట్‌ తాగుతాడు, మందు కొడతాడు. కోపమొస్తే ఎవరినైనా కొడతాడు. ఒక డాక్టర్‌కి కోపం అనేది వుండకూడదని, అది ఈ వృత్తికి సరిపోదని అతని ప్రొఫెసర్‌ ఎంత చెప్పినా అది తలకెక్కించుకోడు. ఒకరోజు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో జరిగిన గొడవలో ఒకడ్ని కొడతాడు అర్జున్‌. దాంతో అతన్ని సస్పెండ్‌ చేస్తారు. అయితే తనే కాలేజ్‌ నుంచి వెళ్ళిపోతానంటాడు. అదే టైమ్‌లో ప్రీతి(షాలిని పాండే)ని చూస్తాడు. తొలిచూపులోనే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతాడు. ప్రీతి తనది అని ఫిక్స్‌ అయిపోతాడు. ఆ అమ్మాయి జోలికి ఎవ్వరూ రావద్దని మిగతా స్టూడెంట్స్‌కి వార్నింగ్‌ ఇస్తాడు. హోలీ రోజు ప్రీతికి ఎవడో రంగు పూశాడని వాడ్ని తన్నడానికి వెళ్తాడు. ప్రీతికి జరిగిన అవమానానికి తను కుమిలిపోతాడు. కోపమొచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ పుట్టినా అన్నీ అర్జున్‌కి అవధుల్ని దాటి వుంటాయి. దేన్నీ లైట్‌గా తీసుకోలేడు. అలా రోజు రోజుకీ ప్రీతికి దగ్గరవుతాడు. ప్రీతి కూడా అతనంటే ప్రేమ పెంచుకుంటుంది. ఇద్దరూ వారి లిమిట్స్‌ని దాటేస్తారు. శారీరక సుఖాన్ని కూడా పంచుకుంటారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అవుతారు. ప్రీతి ఇంటికి వెళ్తాడు అర్జున్‌. ప్రీతి తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు. అది పెద్ద గొడవగా మారుతుంది. ప్రీతికి వేరొకరితో పెళ్ళయిపోతుంది. ఇది తెలుసుకున్న అర్జున్‌ మందుకి, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతాడు. తండ్రి ఇంటి నుంచి గెంటేస్తాడు. ఒక హాస్పిటల్‌లో డాక్టర్‌గా వర్క్‌ చేస్తుంటాడు. ప్రీతిని మాత్రం మర్చిపోడు. ఆమె జ్ఞాపకార్థం తను పెంచుకునే కుక్కని కూడా ప్రీతి అనే పిలుచుకుంటాడు. హాస్పిటల్‌కి తాగే వెళ్తుంటాడు, తాగే సర్జరీలు కూడా చేస్తుంటాడు. ఇలా అస్తవ్యస్తంగా వున్న అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఎలా కొనసాగింది? అనేది మిగతా కథ. 

అన్ని ఎమోషన్స్‌ ఎక్స్‌ట్రీమ్‌లో వుండే అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌కి విజయ్‌ దేవరకొండ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. సినిమాలోని ఒక క్యారెక్టర్‌ని చూస్తున్నట్టు కాకుండా మనలో ఒకడి జీవితాన్ని దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటివరకు విజయ్‌ చేసిన పెర్‌ఫార్మెన్స్‌లో ఇది ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. ప్రీతిగా నటించిన షాలిని పాండే లుక్స్‌ పరంగా నార్మల్‌గా వున్నా కొన్ని సీన్స్‌లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ప్రీతి తండ్రితో గొడవ పెట్టుకొని బయటికి వచ్చిన తర్వాత అర్జున్‌ని కన్విన్స్‌ చేసేందుకు ప్రీతి తాపత్రయ పచుతూ అర్జున్‌ని కౌగిలించుకొని అతన్ని కూల్‌ చేసే సీన్‌లో షాలిని పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. సినిమాలో ఎక్కువ భాగం ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌నే చూడాల్సి వస్తుంది. ఆమె చెప్పిన డైలాగ్స్‌ చాలా తక్కువ. అర్జున్‌రెడ్డి స్నేహితుడు శివగా నటించిన రాహుల్‌ రామకృష్ణ ఆడియన్స్‌కి కావాల్సినంత కామెడీని అందించాడు. రియలిస్టిక్‌గా అనిపించిన అతని డైలాగ్స్‌కి ఆడియన్స్‌ చప్పట్లు కొట్టకుండా వుండలేరు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తియ్యాల్సిన సినిమా కాదు కాబట్టి చాలా నేచురల్‌గా ఎలాంటి ఎక్స్‌ట్రాలకు పోకుండా ఈ సినిమాని తీశారు. నేచురల్‌ లొకేషన్స్‌ని మరింత అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ రాజు తోట సక్సెస్‌ అయ్యాడు. మంగుళూరు, ముస్సోరీ,  హైదరాబాద్‌, యూరప్‌లోని నేచురల్‌ లొకేషన్స్‌లోనే సినిమా అంతా నడుస్తుంది. రథన్‌ మ్యూజిక్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా ప్లస్‌ అయింది. మెలోడీగా సాగే పాటలు, సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా నడిచే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్‌ విషయానికి వస్తే 3 గంటల 6 నిముషాల నిడివి వున్న ఈ సినిమాలో ఎడిట్‌ చెయ్యాల్సిన సీన్స్‌ లెక్కకు మించి వున్నాయి. కథనం దెబ్బతినకుండా చాలా సీన్స్‌ ఎత్తెయ్యవచ్చు. దాని వల్ల కథకు ఎలాంటి నష్టం జరగదు. స్లో నేరేషన్‌లో నడుస్తూ వున్నా సినిమా ఇంట్రెస్టింగ్‌గానే వుంది. ఫస్ట్‌హాఫ్‌ ఫర్వాలేదు అనిపించినా, సెకండాఫ్‌ మాత్రం సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కనీసం 30 నిముషాల సినిమాని కట్‌ చేస్తే స్పీడ్‌ అవుతుంది. డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే ఈ తరహా ప్రేమకథని తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడలేదు. అన్ని విషయాలను ఇంత బోల్డ్‌గా చెప్పిన డైరెక్టర్‌ని కూడా ఆడియన్స్‌ చూసి వుండరు. కేవలం ముద్దు సీన్‌తో ప్రేక్షకుల్లో అటెన్షన్‌ క్రియేట్‌ అయినా సినిమా చూసినవారు ఇదో కొత్త తరహా ప్రేమకథ అని ఒప్పుకుంటారు. సినిమాలోని కొన్ని సీన్స్‌ని ఎంత బాగా తీశాడో, కొన్ని సీన్స్‌ని అంత నార్మల్‌గా తీశాడు. అటు తిప్పి ఇటు తిప్పి క్లైమాక్స్‌ని సినిమాటిక్‌గా తీసుకెళ్ళి చాలా నార్మల్‌గా ముగించేశాడు. అప్పటి వరకు కొత్త కథగా ఫీల్‌ అయిన ఆడియన్‌కి క్లైమాక్స్‌ రుచించదు. కథ చాలా నేచురల్‌గా వుంది అని చెప్పుకున్నప్పటికీ అందులోనూ చాలా లాజిక్స్‌ మిస్‌ అయ్యాయి. హీరోయిన్‌ తండ్రి దగ్గరి వెళ్ళి తమ లవ్‌స్టోరీ గురించి చెప్పిన హీరోని కొట్టి పంపిస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో తండ్రి ఏం జరిగిందని అడుగుతాడు తప్ప అతని పెళ్ళి గురించి చొరవ తీసుకున్నట్టు కనిపించదు. నిజజీవితంలో అలా జరుగుతుందా? అలాగే లవ్‌ ఫెయిల్‌ అయిందని అన్ని అలవాట్లకు బానిసైపోయిన హీరో గురించి హీరోయిన్‌కి తెలిసినా ఆమె నుంచి ఎలాంటి స్పందన వుండదు. క్లైమాక్స్‌లో ఆమె చెప్పే మాటలకు, ఆమె ప్రవర్తనకు పొంతన వుండదు. అలాగే హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లోనే అతను స్త్రీ లోలుడనే భావన కలిగించారు. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్‌ వున్నట్టు చూపించారు. అయితే అమ్మాయిల విషయంలో బుద్ధిమంతుడు అని అతని ఫ్రెండ్‌తో చెప్పించారు. కట్‌ చేస్తే అర్జున్‌కి పరిచయమైన ఒక సినిమా హీరోయిన్‌తో కారులోనే సెక్స్‌ చెయ్యడానికి రెడీ అవుతాడు. ఇలా పొంతనలేని సీన్స్‌ కొన్ని వున్నాయి. అలాగే ప్రీతి క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా అసహజంగా అనిపిస్తుంది. అర్జున్‌ అంటే వున్న భయం వల్ల కావచ్చు, మరి దేనివల్లయినా కావచ్చు అతను ఏం చేసినా కాదనదు, ఎక్కడికి రమ్మన్నా వెనకాడదు. అర్జున్‌ని అంత గాఢంగా ప్రేమించడానికి గల రీజన్‌ ఏమిటో అర్థం కాదు. ఏ సినిమాలో అయినా మైనస్‌ పాయింట్స్‌ వుండడం సహజం. వాటిని పక్కన పెట్టి సినిమాని సినిమాగా ఎంజాయ్‌ చెయ్యాలనుకునేవారికి అర్జున్‌రెడ్డి నచ్చుతాడు. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా. నేచురల్‌గా యూత్‌ మాట్లాడుకునే మాటలే ఇందులోని క్యారెక్టర్స్‌ మాట్లాడతాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్తగా అనిపించే లవ్‌స్టోరీ, అర్జున్‌రెడ్డి క్యారెక్టరైజేషన్‌, కామెడీ, విజయ్‌ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఆలోచింపజేసే ఎమోషనల్‌ సీన్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, మూడు గంటలకు పైగా వున్న రన్‌ టైమ్‌, హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌, మిస్‌ అయిన కొన్ని లాజిక్స్‌, పేలవంగా వున్న క్లైమాక్స్‌ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. ఏది ఏమైనా యూత్‌కి కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా వున్న ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: బోల్డ్‌ లవ్‌స్టోరీ!

arjun reddy review:

vijay devara kona new movie arju reddy. directed by sandeep reddy vanga

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement