భవ్య క్రియేషన్స్
శమంతకమణి
తారాగణం: నారా రోహిత్, ఆది, సుదీర్‌బాబు, సందీప్ కిషన్, రాజేంద్రప్రసాద్, సుమన్, తనికెళ్ళ భరణి, కారుమంచి రఘు, సత్యం రాజేష్, ఇంద్రజ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: వి.ఆనందప్రసాద్
రచన, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
విడుదల తేదీ: 14.07.2017
ఇద్దరు హీరోలకు మించి మన సినిమాల్లో కనిపించడం చాలా అరుదు. అలాంటిది నలుగురు యంగ్ హీరోలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేసిన ప్రయత్నమే శమంతకమణి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు శమంతకమణి ఎవరు? దానితో ఈ నలుగురు హీరోలకు ఏమిటి సంబంధం? సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నదేమిటి? నలుగురు హీరోలతో రూపొందిన ఈ మల్టీస్టారర్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పాయింట్‌ని తీసుకొని దాని మీదే కథని రన్ చేస్తూ కథని ఊహించని మలుపులు తిప్పుతూ ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్ అవకుండా జాగ్రత్త పడుతూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే సినిమాలు గతంలో మనం చాలా చూశాం. ఒక క్రైమ్ జరిగిందంటే దాన్ని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాల్లో ఆడియన్స్‌కి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ చివరి వరకు దాన్ని అదే రేంజ్‌లో తీసుకెళ్ళినపుడు ఆడియన్స్ బాగా ఎంటర్‌టైన్ అవుతారు. సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం. వివిధ క్యారెక్టరైజేషన్లు కలిగిన ముగ్గురు యువకులు కృష్ణ(సుధీర్‌బాబు), కార్తీక్(ఆది), శివ(సందీప్ కిషన్), ఏజ్ బార్ అయిపోయినా పెళ్ళి కాని ఓ సీనియర్ మెకానిక్(రాజేంద్రప్రసాద్). ఈ నలుగురికీ నాలుగు రకాల బాధలు. వీరిలో కోటీశ్వరుడైన కృష్ణకు చిన్నతనంలోనే చనిపోయిన తల్లంటే ప్రాణం. ఆమె జ్ఞాపకార్థం వారికి వున్న రోల్స్ రాయిస్ కారు ఏదో కారణం వల్ల దూరమవుతుంది. మళ్ళీ కృష్ణ తండ్రి దాన్ని వేలంపాటలో 5 కోట్లకు కొనుక్కుంటాడు. దాని పేరు శమంతకమణి. పైన చెప్పుకున్న నలుగురికీ పరిచయం లేదు. ఓరోజు అనుకోకుండా నలుగురూ ఓ ఖరీదైన హోటల్‌లో పార్టీకి వెళ్తారు. అక్కడ కృష్ణ తీసుకొచ్చిన శమంతకమణి కారు దొంగిలించబడుతుంది. అది ఎలా పోయింది? ఆ పార్టీకి వచ్చినవారిలో ఎవరు కాజేశారు? అనేది సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్(నారా రోహిత్) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ కారుని ఎవరు దొంగిలించారు అనేది కనిపెట్టడమే మిగతా కథ.
ఒక కథను నమ్మి నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించడం అనేది ఆహ్వానించదగిన, ఆరోగ్యకరమైన పరిణామమే. ఎవరి క్యారెక్టర్‌కు ఎంత ఇంపార్టెన్స్ వుంది అనేది చూసుకోకుండా కేవలం తమకు ఇచ్చిన క్యారెక్టర్‌ను నమ్మి, డైరెక్టర్‌ని నమ్మి చేశారు. నలుగురు హీరోలుంటే నలుగురు హీరోయిన్లు వుండాలి, నలుగురికీ నాలుగు డ్యూయెట్లు వుండాలి అనేది పద్ధతిని ఫాలో అవ్వకుండా కథతోపాటే హీరోల క్యారెక్టర్స్ వెళ్తుంటాయి. పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే నలుగురు హీరోలూ తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. సీనియర్ మెకానిక్‌గా, వయసు పైబడిన ప్రేమికుడిగా రాజేంద్రప్రసాద్ కూడా తన పరిధిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కానిస్టేబుల్‌గా నటించిన కారుమంచి రఘు గురించి. సినిమాలో మేజర్ కామెడీ పార్ట్ అతనిదేనని చెప్పాలి. సెకండాఫ్ అంతా అతని కామెడీతోనే బోర్ లేకుండా నడుస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో సుమన్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ ఫర్వాలేదు అనిపించారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపించింది. కథకు తప్ప పాటలకు ఎక్కువగా స్కోప్‌లో ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ వుంది. మణిశర్మ తనదైన స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ఎక్కువ రన్ టైమ్ లేకుండా సినిమాని స్పీడ్‌గా వుండేలా చేశాడు. నిర్మాత వి.ఆనందప్రసాద్ వున్నంతలో సినిమాని రిచ్‌గానే నిర్మించాడు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే చాలా పాత కథని ఎంచుకున్న శ్రీరామ్ ఆదిత్య దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాలో నలుగురు హీరోలు, ఒక సీనియర్ క్యారెక్టర్ వుండడంతో ఆయా క్యారెక్టర్లను పరిచయం చెయ్యడానికే చాలా టైమ్ తీసుకున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా దాదాపు ఆర్టిస్టుల ఇంట్రడక్షన్‌కే సరిపోయింది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే వుంది. దాంతో ఫస్ట్ హాఫ్ నేచురల్‌గానే మనకి బోర్ కొడుతుంది. సెకండాఫ్‌లో అసలు కథలోకి వెళ్ళిన తర్వాత కథలో వచ్చే మలుపులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. శమంతకమణిని ఎవరు దొంగిలించారు అనే సస్పెన్స్‌ని చివరి వరకు మెయిన్‌టెయిన్ చెయ్యడం వల్ల ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. కారుమంచి రఘు కామెడీ వల్ల బోర్ లేకుండా అక్కడక్కడ నవ్వుకునే అవకాశం కలిగింది. రొటీన్ కథని తీసుకొని దానికి కొన్ని కొత్త హంగులు చేర్చి నలుగురు హీరోలను ఈ కథలో ఇన్‌వాల్వ్ చెయ్యడం వల్ల ఈ సినిమాని చూడాలి అనే ఆసక్తిని ఆడియన్స్‌లో కలిగించాడు డైరెక్టర్. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సోసోగా వుంటూ సెకండాఫ్‌లో ఇంట్రెస్ట్‌తో పాటు కామెడీని కూడా క్రియేట్ చేయడం వల్ల సినిమా ఫర్వాలేదు అనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ బయటికి వస్తారు.
ఫినిషింగ్ టచ్: రొటీనే. కానీ, ఓకే!
telugu movie shamanthakamani. this movie is directed by sriram aditya, produced by v.ananda prasad.