Advertisementt

సినీజోష్‌ రివ్యూ: డిజె దువ్వాడ జగన్నాథమ్‌

Fri 23rd Jun 2017 09:44 PM
dj duvvada jagannadham review,dj duvvada jagannadham review and rating,cinejosh review dj,allu arjun,pooja hegde,harish shankar,dil raju  సినీజోష్‌ రివ్యూ: డిజె దువ్వాడ జగన్నాథమ్‌
Duvvada Jagannadham Movie Telugu Review సినీజోష్‌ రివ్యూ: డిజె దువ్వాడ జగన్నాథమ్‌
సినీజోష్‌ రివ్యూ: డిజె దువ్వాడ జగన్నాథమ్‌ Rating: 2.75 / 5
Advertisement
Ads by CJ

 

 

 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 

డిజె దువ్వాడ జగన్నాథమ్‌ 

తారాగణం: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, వెన్నెల కిశోర్‌, సబ్బరాజు తదితరులు 

సినిమాటోగ్రఫీ: అయానంకా బోస్‌ 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌ 

నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌ 

రచన, దర్శకత్వం: హరీష్‌శంకర్‌ ఎస్‌. 

విడుదల తేదీ: 23.06.2017 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో ఆర్య, పరుగు తర్వాత హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేసిన చిత్రం డిజె దువ్వాడ జగన్నాథమ్‌. గబ్బర్‌సింగ్‌, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ వంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించిన హరీష్‌శంకర్‌ ఈసారి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఎన్నుకున్న కథాంశం ఏమిటి? డిజె దువ్వాడ జగన్నాథమ్‌ అంటూ ఓ డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాతో హరీష్‌ చెప్పాలనుకున్నదేమిటి? యూత్‌, మాస్‌ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ వున్న అల్లు అర్జున్‌ని దువ్వాడ జగన్నాథమ్‌ క్యారెక్టర్‌లో ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

20 సంవత్సరాల క్రితం అర్జున్‌ హీరోగా శంకర్‌ చేసిన మొదటి సినిమా జెంటిల్‌మేన్‌ ఈ చిత్రానికి ఇన్‌స్పిరేషన్‌గా చెప్పొచ్చు. అయితే ఆ సినిమాలో హీరో లక్ష్యం వేరు, ఈ సినిమాలో హీరో లక్ష్యం వేరు. కామన్‌ ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌లో కనిపించే అంశం హీరో బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు కావడం. దువ్వాడ జగన్నాథమ్‌ కథ విషయానికి వస్తే దువ్వాడ జగన్నాథమ్‌(అల్లు అర్జున్‌) అన్యాయాన్ని సహించలేని వ్యక్తిత్వం కలవాడు. దుష్టుల్ని శిక్షించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. ఒక మంచ పని చెయ్యాలనుకున్నప్పుడు అందులోని మంచి అందరికీ కనిపిస్తే చాలు వ్యక్తి కనిపించక్కర్లేదు అని తన తాతయ్య చెప్పిన మాటల్ని ఒంట బట్టించుకున్న జగన్నాథమ్‌ చిన్నప్పటి నుంచి దాన్నే అనుసరిస్తూ వుంటాడు. తన స్నేహితురాలిన అల్లరి పెట్టిన ఆకతాయిలకు బుద్ధి చెబుతాడు. తన కళ్ళముందే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పురుషోత్తం(మురళీశర్మ)ను చంపేందుకు ప్రయత్నించిన రౌడీలను వారి రివాల్వర్‌తోనే కాల్చి చంపుతాడు. జగన్నాథమ్‌లోని ధైర్యం, తెగువ చూసి ఆశ్చర్యపోతాడు. అన్యాయం ఎవరు చేసినా చంపెయ్యాలని కసిగా చెప్తాడు జగన్నాథమ్‌. ఇక అక్కడి నుంచి సీక్రెట్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేస్తారు పురుషోత్తం, జగన్నాథమ్‌. డిజె పేరుతో సమాజంలోని చీడ పురుగుల్ని ఏరి పారేస్తుంటాడు. మరో పక్క అగ్రహారంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కేటరింగ్‌ నడుపుతుంటాడు జగన్నాథమ్‌. ఈ క్రమంలోనే పూజ(పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇదిలా వుండగా ఆగ్రో డైమండ్‌ పేరుతో ఏడు వేల కోట్ల రూపాయల స్కామ్‌ జరుగుతుంది. దానికి సూత్రధారి రొయ్యల నాయుడు(రావు రమేష్‌). తను తెరపైకి రాకుండా బినామీల పేరుతో ఈ తతంగాన్ని నడిపిస్తుంటాడు రొయ్యల నాయుడు. ఆగ్రో డైమండ్‌ చేసిన మోసానికి జగన్నాథమ్‌ బాబాయ్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కంపెనీ వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలుసుకున్న జగన్నాథమ్‌ తన ఫోకస్‌ ఆ కంపెనీపై పెడతాడు. ఏడు వేల కోట్ల రూపాయలను బాధితులకు అందించేందుకు, అక్రమార్కుల బండారం బయట పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తాడు. ఆగ్రో డైమండ్‌ అక్రమాలను డిజె ఎలా బయట పెట్టాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏమిటి? డిజె అంటే జగన్నాథమే అని తెలుసుకున్న విలన్‌ గ్యాంగ్‌ ఏం చేసింది? ఈ స్కామ్‌ వెనుక వున్నది రొయ్యల నాయుడేనని డిజె ఎలా కనిపెట్టాడు? అతన్నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఎలా రాబట్టాడు? అనేది మిగతా కథ. 

సాధారణంగా అల్లు అర్జున్‌ చేసే క్యారెక్టర్స్‌ అన్నీ మాస్‌ని, యూత్‌ని ఆకట్టుకునేలా వుంటాయి. అతని డైలాగ్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ, డాన్స్‌గానీ, ఫైట్స్‌గానీ మాస్‌ ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించేలా వుంటాయి. దానికి భిన్నంగా ఈ సినిమాలో బన్ని ఓ బ్రాహ్మణుడి గెటప్‌లో కనిపిస్తాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ని, డైలాగ్‌ మాడ్యులేషన్‌ని మార్చుకొని ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు బన్ని. ఈమధ్యకాలంలో డాన్సుల్లో ఎక్కువ ఎనర్జీని ఈ సినిమాలోనే చూపించాడని చెప్పాలి. కామెడీని, ఎమోషన్‌ని, సెంటిమెంట్‌ని పర్‌ఫెక్ట్‌గా పలికించగలిగాడు. హీరోయిన్‌ పూజా హెగ్డేని పాటలకే పరిమితం చేయకుండా అక్కడక్కడా ఆమె క్యారెక్టర్‌కి కూడా ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు. తన అందచందాలతో, అభినయంతో పూజా అందర్నీ ఆకట్టుకుంటుంది. మిగతా క్యారెక్టర్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రావు రమేష్‌ చేసిన రొయ్యలనాయుడు క్యారెక్టర్‌ గురించి. ఇవివి డైరెక్షన్‌లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో రొయ్యల నాయుడుగా నిక్కరుతో కనిపిస్తాడు రావు గోపాలరావు. ఈ సినిమాలో రావు రమేష్‌తో అదే గెటప్‌ వేయించారు. అయితే ఇందులో రావు రమేష్‌ విలన్‌. నటనలో తండ్రికి ఏమాత్రం తీసిపోనని రొయ్యల నాయుడు క్యారెక్టర్‌తో ప్రూవ్‌ చేశాడు రావు రమేష్‌. అతను చెప్పిన ప్రతి డైలాగ్‌ నవ్వు తెప్పించేదిగా వుండడంతో ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇక తనికెళ్ళ భరణి, చంద్రమోహన్‌, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌, శత్రు, సుబ్బరాజు వారి వారి క్యారెక్టర్లకు న్యాయం చేశారు. 

సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీకి, సంగీతానికి, ఫైట్స్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. అయానంకా బోస్‌ అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు. పర్‌ఫెక్ట్‌ లైటింగ్‌తో ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించాడు. పాటలు కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్‌ని ఎంతో గ్లామరస్‌గా చూపించాడు. అల్లు అర్జున్‌ సినిమాలకు దేవిశ్రీప్రసాద్‌ ఏ రేంజ్‌లో వుంటుందో మనకి తెలిసిందే. ఆ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా దేవి పాటలు చేశాడు. ఆ రేంజ్‌ని మించి పాటల్ని పిక్చరైజ్‌ చేశారు కొరియోగ్రాఫర్లు. ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువగా వున్న ఈ సినిమాకి దేవి చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా పెద్ద ఎస్సెట్‌ అయింది. రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ ఆడియన్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ థ్రిల్‌ చేస్తాయి. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. సినిమాని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ రిచ్‌గా కనిపించేందుకు నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని అర్థమవుతుంది. 

ఇక డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ గురించి చెప్పాలంటే కథ, కథనంలో కొత్తదనం ఏమీ లేదు. కథలోని క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌ ఇవ్వడం వల్ల ఆడియన్స్‌కి ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ వచ్చింది. జెంటిల్‌మేన్‌ చిత్రంలో అర్జున్‌ బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుడిగా నమ్మిస్తాడు. అతని వేష, భాషల్లో ఎలాంటి మార్పూ కనిపించదు. హీరో క్యారెక్టర్‌తో నవ్వించడమే ధ్యేయంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నట్టూ అంటూ హీరో పదే పదే చెప్పడం మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత రొటీన్‌ అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ చాలా స్ట్రాంగ్‌గా వుండాలన్న ఉద్దేశంతో చిన్నతనం నుంచే మర్డర్లు చేయించాడు డైరెక్టర్‌. ఓ పిల్లవాడు రివాల్వర్‌తో ఐదుగుర్ని కాల్చి చంపడం, దాన్ని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఎంకరేజ్‌ చెయ్యడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీని ద్వారా సభ్య సమాజానికి హరీష్‌ శంకర్‌ ఇస్తున్న మెసేజ్‌ ఏమిటో మనకు అర్థం కాదు. దువ్వాడ జగన్నాథమ్‌గా వుంటూ మరో పక్క డిజెగా హత్యలు చేసే ప్రాసెస్‌లో ఎన్నో లాజిక్కులు మిస్‌ అయ్యాడు డైరెక్టర్‌. సినిమాని సినిమాగా చూడాలి కాబట్టి అలాంటి పొరపాట్లను టేకిట్‌ ఈజీగా తీసుకోవడమే. అయితే సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌కి ఎక్కడా బోర్‌ కొట్టకుండా, ఎక్కడా ల్యాగ్‌ అనేది లేకుండా తీసుకెళ్ళడంలో హరీష్‌ సక్సెస్‌ అయ్యాడు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో ఎక్కడా తడబడలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని లవ్‌ సీన్స్‌, మరికొన్ని కామెడీ సీన్స్‌ వెరసి ఓ కమర్షియల్‌ సినిమా అన్నట్టుగానే దువ్వాడ జగన్నాథమ్‌ సినిమా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. లాజిక్కుల కోసం వెతక్కుండా రెండున్నర గంటల సేపు ఎంటర్‌టైన్‌ అవ్వాలనుకునే ప్రేక్షకులకు న్యాయం చేస్తాడు డిజె.

ఫినిషింగ్‌ టచ్‌: బన్నీ సమాజానికేమో గానీ... సినీ సమాజానికి ఈ డీజే చాలడు!

Duvvada Jagannadham Movie Telugu Review:

Allu Arjun, Pooja Hegde, Rao Ramesh Starring DJ Duvvada Jagannadham Movie Review and Rating

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ