మధుర ఎంటర్‌టైన్‌మెంట్
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస, మనాలి, కృష్ణభగవాన్, కృష్ణుడు తదితరులు
సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి
మూలకథ: మధుర శ్రీధర్‌రెడ్డి
మాటలు: కళ్యాణ్ రాఘవ్
నిర్మాత: మధుర శ్రీధర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ: 02.06.2017
80వ దశకంలో వంశీ సినిమాలకు చాలా క్రేజ్ వుండేది. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో, కోనసీమ యాసలో వంశీ తీసిన సినిమాలన్నీ అప్పటి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. వాటిలో కొన్ని సినిమాల్ని ఇప్పటి ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. వంశీ సినిమాలకు సెపరేట్‌గా ఆడియన్స్ వుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రతి సంవత్సరం ఆడియన్స్ అభిరుచి మారుతూ వస్తోంది. వారి అభిరుచికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ వచ్చినపుడే ఏ డైరెక్టర్ అయినా సూపర్‌హిట్స్ ఇవ్వగలుగుతాడు. దాదాపు 30 సంవత్సరాల క్రితం రాజేంద్రప్రసాద్‌తో వంశీ చేసిన లేడీస్ టైలర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే కథాంశాన్ని కాస్త అటూ ఇటూ మార్చి ఫ్యాషన్ డిజైనర్‌గా మార్చాడు. ఫ్యాషన్ డిజైనర్‌గా సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్ర పోషించాడు. లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ ఎలా అయ్యాడు? ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చేశాడు? ఇప్పటి ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా వంశీ ఈ సినిమాని తియ్యగలిగాడా? ఈ సినిమాలో వంశీ మార్క్ కనిపించిందా? సుమంత్ అశ్విన్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎంతవరకు ఆకట్టుకోగలిగాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
30 సంవత్సరాల క్రితం లేడీస్ టైలర్ చిత్రంలో కనిపించిన పల్లెటూరి వాతావరణంతో సినిమా ప్రారంభమవుతుంది. అదే పాత ఇల్లు, అవే కాలువలు, అవే పడవలు, అదే యాస.. ఇలా ప్రతి విషయంలోనూ లేడీస్ టైలర్‌నే ఫ్యాషన్ డిజైనర్‌లో చూపించాలన్న తపన వంశీలో కనిపించింది. ఆ సినిమాకి, ఈ సినిమాకి 90 శాతం సారూప్యం వుంది. అందులో రాజేంద్రప్రసాద్ తొడ మీద పుట్టు మచ్చ వున్న అమ్మాయిని చేసుకుంటే రాజయోగం పడుతుందని దాని కోసం నానా తంటాలు పడతాడు. ఇందులో గోపాళం(సుమంత్ అశ్విన్) తనకు మన్మథరేఖ వుందని తెలుసుకుంటాడు. తను కోరిన అమ్మాయి ఒళ్ళో వచ్చి వాలుతుందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్ముతాడు. నరసాపురంలో షాప్ పెట్టి ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలనేది గోపాళం లక్ష్యం. అది తను సాధించాలంటే డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి. తండ్రిలాగే అమ్మాయిల వేట మొదలెడతాడు. ముగుర్ని ముగ్గులోకి దించుతాడు. ముగ్గురూ అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. మరి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ ముగ్గురి వల్ల గోపాళం ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు? చివరికి ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడు? అనేది లేడీస్ టైలర్ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఫస్ట్‌హాఫ్ చూడగానే అర్థమవుతుంది? అయిన్పటికీ చివరికి ముగ్గురిలో ఎవరికి దగ్గరయ్యాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
వంశీ చేసిన సినిమాల్లో లేడీస్ టైలర్‌కి ఒక ప్రత్యేక స్థానం వుంది. అతను ఎన్ని సినిమాలు చేసినా ముందుగా చెప్పుకునేది లేడీస్ టైలర్ గురించే. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ సుందరం పాత్రకు ప్రాణం పోశాడు. ఒక ఆర్టిస్ట్‌గా కాకుండా సుందరంగానే మనకు కనిపిస్తాడు, నవ్విస్తాడు. మరి సుందరం కొడుకు గోపాళంగా సుమంత్ అశ్విన్ ఆ స్థాయిలో పెర్‌ఫార్మ్ చెయ్యలేకపోయినా ఫర్వాలేదు అనిపించాడు. అయితే లేడీస్ టైలర్ సినిమా తీసినప్పటి పరిస్థితులు, అప్పటి ట్రెండ్ వేరు కావడం, ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ వేరు కావడం కూడా సుమంత్ ఆ క్యారెక్టర్‌కి ఫిట్ అవ్వలేదని చెప్పడానికి రీజన్ కావచ్చు. ఏది ఏమైనా వంశీ తన క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన ప్రకారం సుమంత్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇందులో వున్న ముగ్గురు హీరోయిన్ల ఫేస్‌లు ఎవరికీ తెలిసినవి కాకపోవడం వల్ల ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యలేకపోయారు. మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే కృష్ణభగవాన్ తప్ప సినిమాలో తెలిసిన నటీనటులు ఎవరూ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. వంశీ సినిమా అనగానే కమెడియన్స్ లెక్కకు మించి వుండడం, ప్రతి సీన్‌లోనూ నవ్వులు పూయించడం వంటివి జరిగేవి. కానీ, ఈ సినిమాలో అలాంటి నవ్వుల పువ్వులు తక్కువయ్యాయి.
సాంకేతికంగా చూస్తే నగేష్ బనెల్ ఫోటోగ్రఫీ బాగుంది. కోనసీమ అందాల్ని ఆహ్లాదకరంగా చూపించడంలో నగేష్ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ వంశీ స్కూల్‌లో సినిమా చేసిన మణిశర్మ అతని టేస్ట్‌కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఓ రెండు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. సినిమాలోని పాటలన్నింటినీ తన పాత పద్ధతిలోనే తీసే ప్రయత్నం చేశాడు వంశీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో అద్భుతాలు చేసే అవకాశం కథలో లేదు కాబట్టి మణిశర్మ కథకు తగ్గట్టుగా ఫర్వాలేదు అనిపించాడు. బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్ కొన్నిచోట్ల బాగానే అనిపించినా కొన్ని లెంగ్తీ సీన్స్‌ని తగ్గించలేకపోయాడు. వాటి వల్ల ఆడియన్స్‌కి చాలా బోర్ కొడుతుంది. ఈ చిత్రానికి మూల కథ అందించిన నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి కథకు తగినట్టుగా సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప సినిమాలు తీసి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వంశీ ఆ స్థాయిలోనే సినిమా తీసే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తియ్యాలన్న తపనతో ప్రతి సీన్‌ని స్పీడ్‌గా స్టార్ట్ చేసి స్పీడ్‌గా ఎండ్ చెయ్యడం, కామన్ ఆడియన్ క్యాచ్ చెయ్యలేనంత స్పీడ్‌గా ఆర్టిస్టులతో డైలాగులు చెప్పించడం వంటివి కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ సోసోగా అనిపించినా సెకండాఫ్ కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. వంశీ సినిమాల్లో వుండేంత స్థాయిలో కామెడీ లేకపోయినా అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగ్స్ పేలాయి. ఫైనల్‌గా చెప్పాలంటే టైటిల్‌తోనే ఆడియన్స్‌లో కొంత ఎక్స్‌పెక్టేషన్స్‌ని క్రియేట్ చేసిన వంశీ సినిమాతో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేకపోయాడు.
ఫినిషింగ్ టచ్: అదే వంశీ.. అదే సినిమా!
director vamsy latest movie fashion designer son of ladies tailer. sumanth aswin is the main lead in this movie