అభిషేక్ పిక్చర్స్
బాబు బాగా బిజీ
తారాగణం: శ్రీనివాస్ అవసరాల, మిస్తీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, శ్రీముఖి, ప్రియదర్శి, తనికెళ్ళ భరణి, రవిప్రకాష్, సుధ, ఆదర్శ్, పోసాని, అన్నపూర్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ
సంగీతం: సునీల్ కశ్యప్
ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్
కథ: హర్షవర్థన్ కులకర్ణి
మాటలు: మిర్చి కిరణ్, శ్రీకాంత్‌రెడ్డి, ప్రదీప్ బోద
సమర్పణ: దేవాంశ్ నామ
నిర్మాత: అభిషేక్ నామ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం
విడుదల తేదీ: 05.05.2017
సెక్స్ అనేది పూర్తిగా ఫిజికల్ యాక్ట్. దాన్ని పెళ్ళితో ముడిపెట్టడం సరికాదు. పెళ్ళి చేసుకునేది సెక్స్ కోసమే అయినపుడు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి. పెళ్ళి అనేది లేకుండానే ఆ సుఖాన్ని పొందవచ్చు కదా... ఇది ఎక్కువ శాతం యూత్‌లో వున్న ఆలోచన. దానికి తగ్గట్టుగానే సెక్స్ కోసం అర్రులు చాస్తూ వుంటారు. విశృంఖల సెక్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేది పెళ్ళి అని భావించే ఫ్రెండ్స్. స్కూల్ డేస్ నుంచే సెక్స్‌కి ఎడిక్ట్ అయిపోయిన ఓ కుర్రాడు. స్నేహితులు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సెటిల్ అయిపోతే, ఈ కుర్రాడు మాత్రం రోజుకో సుఖంతో ఆనందంలో మునిగి తేలుతుంటాడు. ఇదీ ఈరోజు విడుదలైన బాబు బాగా బిజీ కథ. హిందీలో సూపర్‌హిట్ అయిన హంటర్ చిత్రాన్ని నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామ తెలుగులో రీమేక్ చేశారు.
అతని పేరు మాధవ్(శ్రీనివాస్ అవసరాల). సెక్స్‌కి ఎడిక్ట్ అయిపోయి అమ్మాయి కనబడితే చాలు అదే దృష్టితో చూస్తాడు. ఎంతో మందితో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసిన మాధవ్‌కి ఇప్పుడు 30 సంవత్సరాలు. గతంలోలా తనకు అమ్మాయిలు పడడం లేదని బాధపడుతూ వుంటాడు. దాంతో పెళ్ళి చేసుకోమని సలహా ఇస్తారు అతని ఫ్రెండ్స్. పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారు. ఒకటి, రెండు, మూడు.. ఇలా మూడు సంబంధాల్ని తన ఓవర్ యాక్షన్‌తో చెడగొట్టుకున్న మాధవ్ నాలుగో పెళ్ళిచూపుల్లో మాత్రం డీసెంట్‌గా బిహేవ్ చెయ్యడం ద్వారా అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యగలుగుతాడు. ఆమె పేరు రాధ(మిస్తీ చక్రవర్తి). ఆమెకి కూడా ఒక లవ్ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. పెళ్ళిచూపులు తర్వాత మాధవ్ ఆమెకు బాగా దగ్గరవుతాడు. పెళ్ళి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే తను ప్లేబోయ్‌నని, సెక్స్‌కి ఎడిక్ట్ అయిపోయానని చెప్పాలని చాలా సార్లు ట్రై చేస్తాడు. కానీ, చెప్పలేకపోతాడు. రాధని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయినప్పటికీ తన శృంగార లీలల్ని కొనసాగిస్తూనే వుంటాడు. మరి మాధవ్ పెళ్ళికి ముందే రాధకు తన గురించి అన్ని వివరాలు చెప్పాడా? దానికి రాధ ఎలా రియాక్ట్ అయ్యింది? రాధ లవ్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఇద్దరూ తమ తమ గతాల్ని మర్చిపోయి ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.
కథపరంగా ఇందులో కొత్తదనం అంటూ ఏమీ లేదు. గతంలో ఇలాంటి కథలు కోకొల్లలుగా వచ్చాయి. పాత కథే అయినా దాన్ని కొత్తగా ప్రజెంట్ చెయ్యగలిగారా? అంటే అదీ లేదు. చాలా చాలా స్లోగా స్టార్ట్ అయ్యే కథ అదే స్లో క్లైమాక్స్ వరకు మెయిన్ టెయిన్ అవుతుంది. సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించదు. క్యారెక్టరైజేషన్స్ కూడా విచిత్రంగా వుంటాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ సెక్స్ అనేదే సెంట్రల్ పాయింట్. ఏ సీన్ అయినా దాని చుట్టూనే తిరుగుతూ వుంటుంది. నెక్స్‌ట్ ఏం జరుగుతుంది? కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలన్న ఆసక్తి అస్సలు కలగదు. సాదా సీదాగా వుండే ఇంటర్వెల్ బ్యాంగ్, అంతకంటే సాధారణంగా వుండే క్లైమాక్స్ ఆడియన్స్‌ని నీరసానికి గురిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ కూడా వుంటుంది. శ్రీనివాస్ అవసరాల ప్లేబోయ్ క్యారెక్టర్‌లో ఫర్వాలేదు అనిపించినా తన పెర్‌ఫార్మెన్స్‌తో అంతగా ఇంప్రెస్ చెయ్యలేకపోయాడు. మాధవ్ ఎదురింట్లో వుండే చంద్రికగా సుప్రియ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. తన అందచందాలతో, అభినయంతో ఆమె కనిపించినంత సేపు ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. రాధగా మిస్తీ చక్రవర్తి పెర్‌ఫార్మెన్స్ కూడా ఫర్వాలేదు. హీరో ఫ్రెండ్‌గా నటించిన ప్రియదర్శికి కామెడీ చేసే అవకాశం అంతగా రాలేదు. వచ్చినా ఆడియన్స్‌కి నవ్వు రాలేదు. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి అంతగా ఏమీ లేదు.
సాంకేతిక అంశాలకు ఈ సినిమాలో అంతగా ప్రాధాన్యం లేదు. కెమెరా వర్క్ చాలా నార్మల్‌గా వుంది. సునీల్ కశ్యప్ చేసిన పాటల్లో రెండు ఫర్వాలేదు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అవకాశం చాలా తక్కువ. ఉన్నంతలో కూడా మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదు. 2 గంటల 5 నిముషాలు వున్న సినిమాని స్పీడప్ చెయ్యాలంటే గంట సినిమా తీసెయ్యాలన్నట్టుగా వుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఎస్.బి.ఉద్దవ్‌కి కష్టపడే అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదు. ఇక ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. డైరెక్టర్ నవీన్ మేడారం గురించి చెప్పాలంటే హిందీలో సూపర్‌హిట్ అయిన హంటర్‌ని అదే స్పీడ్‌తో యాజ్ ఇటీజ్‌గా తీసినా సినిమా సూపర్‌హిట్ అయ్యేది. కానీ, కథలో స్పీడ్ లోపించడం, కథనంలో కొత్తదనం లేకపోవడం వంటి విషయాలు సినిమాని మరింత వెనక్కి లాగాయి. స్లోగా కదిలే కెమెరా, స్లోగా మాట్లాడే ఆర్టిస్టులు, స్లోగా జరిగే కథ. ఇలా అన్ని విధాలా స్లో నే ఎక్కువ నమ్ముకున్నాడు డైరెక్టర్. దీనికంటే టీవీ సీరియల్సే చాలా ఫాస్ట్‌గా వుంటున్నాయన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెక్స్ బేస్‌తో అల్లిన కథతో చేసిన సినిమా కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అవకాశం లేదు. పోనీ సెక్స్ సబ్జెక్ట్ అంటే యూత్ అయినా ఎట్రాక్ట్ అవుతారా అంటే అదీ లేదు. బాబు బాగా బిజీగా వుంటూ తమని నవ్విస్తాడని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో రూపొందిన బాబు బాగా బిజీ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
ఫినిషింగ్ టచ్: బాబు బాగా బోరు
today released babu baga busy is a romantic entertaner. in this movie srinivas avasarala played a playboy character. misti chakravarthi is pair to srinivas avasarala.