రోలింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
లంక
తారాగణం: రాశి, ఎన సహ, సాయి రోనక్, సుప్రీత్, సత్య, సుదర్శన్, సిజ్జు, సత్యం రాజేష్, వేణు తదితరులు
సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్
సంగీతం: శ్రీచరణ్ పాకల
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సమర్పణ: నామన శంకరరావు, సుందరి
నిర్మాతలు: నామన దినేష్, నామన విష్ణు కుమార్
రచన, దర్శకత్వం: శ్రీముని
విడుదల తేదీ: 21.04.2017
ఆడియన్స్‌ని భయపెట్టాలి, భయపెడుతూనే థ్రిల్ చెయ్యాలి. వారి ఊహకి అందని విధంగా కథలో ట్విస్టులు పెట్టాలి. తద్వారా వారి మెదడుకి కూడా పనిపెట్టాలి. కథ ఏదైనా, కథనం ఎలా వున్నా ప్రేక్షకుల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నారు కొందరు దర్శకులు. ఒక హార్రర్ మూవీ హిట్ అయ్యిందీ అంటే దాన్ని పోలిన ఓ పది సినిమాలు ప్రేక్షకులపై దాడి చేస్తాయి. ఏ విషయం లేకుండా కేవలం కెమెరా చేసే విన్యాసాలతో, అదరగొట్టే మ్యూజిక్‌తో, సౌండ్స్‌తో ఆ సినిమాలు భయపెడుతుంటాయి. అలా పది సినిమాల్లో ఒకటిగా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో శ్రీముని దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం లంక. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించింది. మరి ఈ డైరెక్టర్ అనుకున్న ఆ డిఫరెంట్ పాయింట్ ఏమిటి? లంక ప్రేక్షకుల్ని ఎంతవరకు భయపెట్టింది? ఏ మేర థ్రిల్ చేసింది? ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నది ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
లంక చిత్రం కోసం చేసిన పబ్లిసిటీలో అరుంధతి తరహాలో వున్న రాశి లుక్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. కథ విషయానికి వస్తే సాయి, సత్య, సుదర్శన్ ఫ్రెండ్స్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసేందుకు ఓ షార్ట్ ఫిలిం చెయ్యాలనుకుంటారు. ఆ షార్ట్ ఫిలింలో నటించేందుకు స్వాతి(ఎన సహ)ని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. అంతా కలిసి ఓ పాడు పడిన ఇంటికి వెళ్తారు. దాని ఓనర్ అయిన రెబెకా(రాశి) విచిత్ర ప్రవర్తనతో సాయి బృందం ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా స్వాతి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. రెబెకా విచిత్ర ప్రవర్తనకు కారణం టెలిపతి. దాని సాయంతో ఎదుటి మనిషి మనసులోని విషయాల్ని ఇట్టే గ్రహించేస్తుంది రెబెకా. అలా స్వాతికి బాగా దగ్గరవుతుంది రెబెకా. షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి బృందం సిటీకి బయల్దేరుతారు. స్వాతి మాత్రం రెబెకా దగ్గరే వుంటుంది. ఇదిలా వుండగా స్వాతి అవడంతో సాయి గ్రూప్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేనే స్వాతిని అంటూ పోలీస్ స్టేషన్‌కి వచ్చి హడావిడి చేస్తుంది రెబెకా. స్వాతిని కిడ్నాప్ చేసింది ఎవరు? రెబెకా... స్వాతిలా ప్రవర్తించడానికి కారణం టెలిపతేనా? అసలు రెబెకా కత ఏమిటి? స్వాతి కథ ఏమిటి? షార్ట్ ఫిలిం చేసి పేరు తెచ్చుకోవాలనుకున్న సాయి బృందం కథ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
డైరెక్టర్ శ్రీముని కథని ఆసక్తికరంగా ఎలా నడపాలి అనే దాని కంటే ప్రేక్షకుల్ని ఎలా కన్‌ఫ్యూజ్ చెయ్యాలి, ట్విస్టుల మీద ట్విస్టులతో వారిని మెదడుకి ఎలా పని చెప్పాలి అనే విషయంలోనే ఎక్కువ శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమా మొత్తంలో రాశి తప్ప చెప్పుకోదగ్గ ఆర్టిస్టుగానీ, పెర్‌ఫార్మెన్స్‌గానీ మనకు కనిపించదు. రెబెకాగా రాశి పెర్‌ఫార్మెన్స్ పార్టులు పార్టులుగా చూస్తే బాగానే వుంది అనిపించినా దాని వల్ల సినిమాకి హెల్ప్ అయింది ఏమీ లేదు. హీరోయిన్‌గా ఎన సహ లుక్స్ పరంగా గానీ, పెర్‌ఫార్మెన్స్ పరంగా గానీ ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఏదో ఓ రకంగా సినిమాని నడిపించే ఉద్దేశంతో సాయి, సత్య, సుదర్శన్‌లతో చేయించిన కామెడీ పరమ రొటీన్‌గానూ, విసుగు పుట్టించేదిగానూ వుంది. రెగ్యులర్‌గా కనిపించే పోలీస్ క్యారెక్టర్‌లో సుప్రీత్, రెండు రకాల క్యారెక్టర్స్‌లో కనిపించే సిజ్జు పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదు అనిపిస్తుంది.
టెక్నికల్‌గా చూస్తే రవికుమార్ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. కొన్ని షాట్స్ పేలవంగా కూడా అనిపిస్తాయి. శ్రీచరణ్ మ్యూజిక్ కూడా ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వున్నంతలో బాగానే అనిపించినా కొన్ని చోట్ల రణగొణ ధ్వనిలా వినిపించింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకొని కొన్ని లెంగ్తీ సీన్స్ కట్ చేసి వుంటే బాగుండేది. ప్రొడక్షన్ గురించి చెప్పుకోవాలంటే అన్ కాంప్రమైజ్డ్‌గా సినిమాని తీసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని గ్రాఫిక్ షాట్స్‌ని రిచ్‌గా చూపించగలిగారు. ఇక డైరెక్టర్ శ్రీముని విషయానికి వస్తే కథ, కథనం, ఆర్టిస్టుల సెలెక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్... ఇలా ఏ విషయంలోనూ అతనికి క్లారిటీ లేదనిపిస్తుంది. సినిమా ఆరంభంలోనే హీరోతోపాటు కమెడియన్స్ నవ్వించే ప్రయత్నాలు చాలా లెంగ్తీగా చేసి ఆడియన్స్‌కి బోర్ కొట్టించారు. అనవసరమైన సీన్స్, అర్థం కాని డైలాగ్స్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. ఇప్పటి వరకు టెలిపతి కాన్సెప్ట్‌తో తెలుగులో ఏ హార్రర్ మూవీ రాకపోవడం వల్ల పాయింట్ కొత్తగా అనిపించే అవకాశం వుంది. అయితే దాన్ని కథకి లింక్ చెయ్యడంలో, కామన్ ఆడియన్‌కి అర్థమయ్యేలా తియ్యడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ నుంచి కొంత సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చిన డైరెక్టర్ నెక్స్‌ట్ ఏదో కొత్త విషయం చెప్పబోతున్నాడు అనుకునే లోపే ఓ ట్విస్ట్ ఇస్తాడు. దాన్ని క్లియర్ అయ్యే లోపే మరో ట్విస్ట్ పెడతాడు. ఇలా సినిమాలో ట్విస్ట్‌లకు కొదవలేదు అనేలా చేశాడు డైరెక్టర్. టెలిపతి ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్నది ఏమిటి? అని ఆలోచిస్తే ఏమీ లేదనే సమాధానమే వస్తుంది. తన తెలివి తేటలతో హంతకుడ్ని పట్టించిన రెబెకా టెలిపతి ద్వారా ఏం సాధించిందో చెప్పలేకపోయారు. అసలు సినిమాకి లంక అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అర్థం కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో కొంత కామెడీతో, మరికొంత హీరోయిన్ గ్లామర్‌తో నడిపించి ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చెయ్యాలనుకున్న డైరెక్టర్ శ్రీముని ప్లాన్ బెడిసి కొట్టింది. క్యూరియాసిటీ కంటే ఇరిటేషన్‌నే ఎక్కువ ఫీల్ అయిన ఆడియన్స్ థియేటర్ బయటికి వచ్చిన తర్వాత అనుకునే ఒకే ఒక్క మాట సినిమా అర్థం కాకుండా తీశాడు అని. టెక్నికల్‌గా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, గ్రాఫిక్స్‌కి కోట్లు ఖర్చు పెట్టినా కథలో బలం లేకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రేక్షకులు తిప్పి కొడతారన్నది వాస్తవం.
ఫినిషింగ్ టచ్: అర్థం లేని లంక
Yesteryear glamorous actress Raasi is coming back with a heroine centric thriller Lanka in Sri Muni direction based on telepathy concept. The film created some excitement for its teaser, trailer. Read Full Review on Lanka Movie.