Advertisementt

సినీజోష్‌ రివ్యూ: శివలింగ

Sat 15th Apr 2017 04:46 PM
telugu movie sivalinga,lawrence new movie sivalinga,director p.vasu new movie sivalinga,sivalinga movie telugu review,telugu movie sivalinga review in cinejosh,telugu movie sivalinga cinejosh review  సినీజోష్‌ రివ్యూ: శివలింగ
Shivalinga Review సినీజోష్‌ రివ్యూ: శివలింగ
సినీజోష్‌ రివ్యూ: శివలింగ Rating: 2.5 / 5
Advertisement
Ads by CJ

అభిషేక్‌ ఫిలింస్‌ 
శివలింగ 
తారాగణం: రాఘవ లారెన్స్‌, రితిక సింగ్‌, వడివేలు, భానుప్రియ, ఊర్వశి, జయప్రకాష్‌, శక్తి, రాధా రవి, ప్రదీప్‌ రావత్‌ తదితరులు 
సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి 
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 
ఎడిటింగ్‌: సురేష్‌ అర్స్‌ 
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 
నిర్మాత: రమేష్‌ పి. పిళ్ళై 
రచన, దర్శకత్వం: పి.వాసు 
విడుదల తేదీ: 14.04.2017 
అప్పట్లో రజనీకాంత్‌తో పి.వాసు చేసిన చంద్రముఖి పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత పి.వాసుకి అంతటి హిట్‌ రాలేదు. ఇక రాఘవ లారెన్స్‌ ముని చిత్రంతో అందర్నీ భయపెట్టాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన కాంచన సూపర్‌హిట్‌ అయింది. దాని తర్వాత వచ్చిన గంగ కూడా కమర్షియల్‌గా హిట్‌ అయింది. చంద్రముఖి వంటి హార్రర్‌ థ్రిల్లర్‌ చేసిన పి.వాసు, హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మూడు హార్రర్‌ చిత్రాలతో వరస హిట్స్‌ కొట్టిన రాఘవ లారెన్స్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు వుంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన చిత్రం శివలింగ. లారెన్స్‌ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రమేష్‌ పి.పిళ్ళై నిర్మించిన ఈ చిత్రం ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. హార్రర్‌ మూవీస్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రాఘవ లారెన్స్‌, పి.వాసు శివలింగ చిత్రంతో ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యారా? హార్రర్‌ చిత్రాలకు కొంత గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో శివలింగ ప్రేక్షకుల్ని ఎంత వరకు భయపెట్టింది? ఏమేర థ్రిల్‌ చేసింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 
ఆత్మలు తిరుగుతున్నాయనే భయంతో ఆ ఇంట్లోకి ఎవరూ రారు. కానీ, మన హీరో ఫ్యామిలీ మాత్రం అదే ఇంట్లో దిగుతారు, దెయ్యాలతో యుద్ధం చేస్తారు. సాధారణంగా మన హార్రర్‌ సినిమాల్లో ప్రధాన ఇతివృత్తం ఇదే వుంటుంది. దానికి కొంత యాడింగ్‌ వుంటుంది తప్ప అసలు కథ అదే. శివలింగ విషయానికి వస్తే ఓపెనింగ్‌ సీన్‌ కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. అర్థరాత్రి ట్రైన్‌లోని ఒక కంపార్ట్‌మెంట్‌లో ఇద్దరే ఇద్దరు వుంటారు. అందులో ఒకడు గుడ్డివాడు. మరొక వ్యక్తి రహీమ్‌(శక్తి). అతనికి పావురం నేస్తం. టాయ్‌లెట్‌కి వెళ్ళబోయి మెయిన్‌ డోర్‌ దగ్గరికి వెళ్ళిన గుడ్డివాడిని గుర్తించిన పావురం రహీమ్‌ని ఎలర్ట్‌ చేస్తుంది. ప్రమాదం అంచుకి వెళ్ళిన గుడ్డివాడిని రహీమ్‌ రక్షిస్తాడు. గుడ్డివాడు మాత్రం రహీమ్‌ని ట్రైన్‌లో నుంచి తోయడంతో అతను చనిపోతాడు. కట్‌ చేస్తే అది ఆత్మహత్యగా కోర్టు ధృవీకరిస్తుంది. రహీమ్‌ ప్రియురాలు సంగీత మాత్రం అది హత్యగా నమ్ముతుంది. పోలీస్‌ కమిషనర్‌ని కలిసి సీక్రెట్‌గా కేస్‌ని రీ ఓపెన్‌ చేయిస్తుంది. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు సిబిసిఐడి ఆఫీసర్‌ శివలింగేశ్వర్‌(రాఘవ లారెన్స్‌)ను నియమిస్తారు. ఈలోగా శివ... సత్యభామ(రితిక సింగ్‌)ని పెళ్ళి చేసుకుంటాడు. యధావిధిగా నాలుగేళ్ళుగా స్మశానం పక్కన ఖాళీగా వున్న ఓ బిల్డింగ్‌లో కాపురం స్టార్ట్‌ చేస్తారు శివ, సత్యభామ. కొన్నిరోజుల తర్వాత సత్యభామ విచిత్రంగా ప్రవర్తించడం శివ గమనిస్తాడు. ఆమెని రహీమ్‌ ఆత్మ ఆవహిస్తోందని తెలుసుకుంటాడు. సత్యభామ శరీరంలోకి రహీమ్‌ ఆత్మ ఎందుకు వస్తోంది? రహీమ్‌ హత్యకు, సత్యభామకు ఏదైనా సంబంధం వుందా? ఎవరికీ హాని చేయని రహీమ్‌ని చంపింది ఎవరు? నిజానికి రహీమ్‌ది హత్యా? ఆత్మహత్యా? హత్య అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా అసలు హంతకుడ్ని శివ పట్టుకోగలిగాడా? అనేది మిగతా కథ. 
ముని, కాంచన, గంగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాకుండా ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసిన రాఘవ లారెన్స్‌ ఈ చిత్రంలోనూ అదే కొనసాగించాడు. తన పాత్ర పరిధి మేరకు ఎంటర్‌టైన్‌ చేసేందుకు ట్రై చేశాడు. తన డాన్సులతో, ఫైట్స్‌తో తప్ప పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం క్యారెక్టర్‌ పరంగా లారెన్స్‌కి దక్కలేదు. డిఫరెంట్‌ స్టెప్పులతో, డిఫరెంట్‌ ఫైట్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చెయ్యగలిగాడు. గురు చిత్రంతో ఆర్టిస్టుగా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న రితిక సింగ్‌ ఈ చిత్రంలో పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఒక స్టెప్‌ పైకి వెళ్ళిందని చెప్పాలి. ఆత్మ ప్రవేశించిన తర్వాత రితిక పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. మిగతా పాత్రల్లో ఊర్వశి, వడివేలు అక్కడక్కడ కామెడీ చెయ్యాలని ట్రై చేశారు. కానీ, కొన్ని సీన్స్‌లోనే సక్సెస్‌ అవ్వగలిగారు. రహీమ్‌గా నటించిన డైరెక్టర్‌ పి.వాసు తనయుడు శక్తి తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. మిగతా క్యారెక్టర్స్‌లో రాధారవి, జయప్రకాష్‌, భానుప్రియ ఫర్వాలేదు అనిపించారు. 
టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌కి వస్తే సర్వేష్‌ మురారి చేసిన ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌ అని చెప్పాలి. ఓపెనింగ్‌ సీన్‌ నుంచి ఎండింగ్‌ సీన్‌ వరకు ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించాడు. లైటింగ్‌ విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకొని విజువల్‌గా రిచ్‌ లుక్‌ రావడానికి ట్రై చేశాడు. థమన్‌ చేసిన పాటల్లో రెండు డాన్స్‌ నంబర్స్‌ బాగున్నాయి, ఒక మెలోడీ సాంగ్‌ కూడా బాగుంది. సినిమా మూడ్‌కి తగ్గట్టు, కథ, కథనాలకు తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా చేశాడు. సురేష్‌ అర్స్‌ ఎడిటింగ్‌ కూడా స్పీడ్‌గా వుంది. కథనంలో వున్న లోపం వల్ల అక్కడక్కడా స్లో అనిపించినా ఎడిటింగ్‌ పరంగా సురేష్‌ సక్సెస్‌ అయ్యాడు. శశాంక్‌ వెన్నెలకంటి మాటలు కూడా బాగున్నాయి. అనల్‌ అరసు ఫైట్స్‌ డిఫరెంట్‌గా వున్నాయి. ఫైట్స్‌లో వాడిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా థ్రిల్లింగ్‌గా వున్నాయి. డైరెక్టర్‌ పి.వాసు గురించి చెప్పాలంటే చంద్రముఖి తర్వాత మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టి, థ్రిల్‌ చేద్దామనుకోవడం కరెక్టే కానీ దానికి తగిన బలమైన కథ, స్ట్రాంగ్‌ సెంటర్‌ పాయింట్‌ని క్రియేట్‌ చేసుకోలేకపోయాడు. ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత సినిమాలో ఏదో వుంది అన్న క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. సీన్స్‌ పరంగా ఆ క్యూరియాసిటీ కంటిన్యూ అయినా కొంత సేపటికి టైమ్‌ పాస్‌ చేస్తున్నారన్న ఫీలింగ్‌ వచ్చేస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ అంతా అలాగే రన్‌ అవుతుంది. సెకండాఫ్‌ అద్భుతంగా వుంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. రహీమ్‌ని హత్య చేసింది ఎవరు? అనే చిన్న సస్సెన్స్‌ని క్లియర్‌ చెయ్యడానికి కథను ఎన్నో మలుపులు తిప్పి ప్రేక్షకుల్లో అప్పటివరకు వున్న ఆసక్తిని కాస్తా నీరుగార్చారు. చివరికి ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగిసిందనిపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే రాఘవ లారెన్స్‌, పి.వాసు కాంబినేషన్‌లో వచ్చిన శివలింగ చిత్రంలో మాస్‌ ఆడియన్స్‌ మెచ్చే అద్భుతమైన డాన్సులు, థ్రిల్‌ చేసే ఫైట్స్‌, ఎక్స్‌లెంట్‌ అనిపించే లారెన్స్‌, రితిక సింగ్‌ల పెర్‌ఫార్మెన్స్‌, మంచి ఫోటోగ్రఫీ, చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే, ఒక చిన్న పాయింట్‌ చుట్టూ పెద్ద కథను అల్లడానికి చేసిన ప్రయత్నం వృధా కావడం, గత చిత్రాలతో పోలిస్తే కంటెంట్‌ పరంగా వీక్‌ అనిపించడం సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే బి, సి సెంటర్స్‌లో కమర్షియల్‌గా వర్క్‌ అయ్యే అవకాశాలు శివలింగ చిత్రానికి ఎక్కువగా వున్నాయి. 
ఫినిషింగ్‌ టచ్‌: ఫర్వాలేదనిపించే శివలింగ 
సిినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ