Advertisementt

సినీజోష్‌ రివ్యూ: మిస్టర్‌

Fri 14th Apr 2017 06:24 PM
telugu movie mister,varun tej new movie mister,srinu vaitla new movie mister,mister movie review in cinejosh,mister movie cinejosh review,mister movie review,telugu movie mister review  సినీజోష్‌ రివ్యూ: మిస్టర్‌
సినీజోష్‌ రివ్యూ: మిస్టర్‌
Advertisement
Ads by CJ

శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ 

మిస్టర్‌ 

తారాగణం: వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌, నాజర్‌, చంద్రమోహన్‌, 

హరీష్‌ ఉత్తమన్‌, నికితిన్‌ ధీర్‌, ఆనంద్‌, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, పృథ్వీ, సత్యం రాజేష్‌, ఈశ్వరీరావు తదితరులు 

సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌ 

సంగీతం: మిక్కీ జె.మేయర్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

కథ: గోపీమోహన్‌ 

మాటలు: శ్రీధర్‌ సీపాన 

సమర్పణ: బేబీ భవ్య 

నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల 

విడుదల తేదీ: 14.04.2017 

ఒక కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే అందులో వుండాల్సిన అంశాలు ఏమిటి? ఒక సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే పాటించాల్సిన ప్రమాణాలేంటి? రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ సినిమా గురించి తప్ప మరేదీ ఆలోచించకుండా సీటుకు అతుక్కుపోయి వుండాలంటే ఒక దర్శకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి కథనైనా తీసుకొని దానితో అందరూ మెచ్చే అద్భుతమైన సినిమా తియ్యగల దర్శకుడు మాత్రమే ఇలాంటి విషయాలు ఆలోచిస్తాడు. తనకు మాత్రమే నచ్చిన కథ, కథనాలు, మాటలు, సెంటిమెంట్‌ సీన్స్‌, కామెడీ ట్రాక్‌.. ఇలా అన్నీ తనకు నచ్చిన అంశాలతో సినిమాలు తీసి హిట్‌ కొట్టాలంటే సాధ్యమయ్యే పనేనా? పైన చెప్పుకున్న విషయాల్లో ఒక కొత్త దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ, స్టార్‌ హీరోలతో కూడా సూపర్‌హిట్‌ సినిమాలు తీసిన శ్రీను వైట్ల లాంటి దర్శకుడు కూడా ఇలాంటి సాధారణ విషయాల్ని పట్టించుకోకుండా, ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా తనకు వచ్చిన విధంగా, తనకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ పోతే అపజయాలు ఆప్తమిత్రుల్లా వెన్నంటే వుంటాయి. ఈరోజు విడుదలైన మిస్టర్‌ సినిమా చూసిన ఎవరికైనా ప్రస్తుతం శ్రీను వైట్ల పరిస్థితి కూడా ఇదేనేమో అనిపించక మానదు. వరస హిట్లతో దూసుకెళ్తున్న శ్రీను వైట్లకి ఆగడు అడ్డు కట్ట వేసింది. తను ఎలాంటి తప్పులు చేశాడో, దాని వల్ల ఆ సినిమా ఎంతటి ఘోర పరాజయాన్ని చవి చూసిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత తన తప్పు తెలుసుకోకుండా రామ్‌చరణ్‌తో బ్రూస్‌లీ సినిమా చేసి అలాంటి పొరపాట్లే మళ్ళీ చేశాడు. ఇక శ్రీను వైట్లకి సినిమా వుండదు అనుకుంటున్న తరుణంలోనే వరుణ్‌తేజ్‌తో మిస్టర్‌ చేసే అవకాశం వచ్చింది. మరి ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడా? అపజయాలతో అడుగులు వెనక్కి వేస్తున్న శ్రీను వైట్ల మిస్టర్‌తో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందగలిగాడా? అంటే లేదనే చెప్పాలి. ఈమధ్యే సాయిధరమ్‌తేజ్‌తో విన్నర్‌ చిత్రాన్ని తీసి చేతులు కాల్చుకున్న నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధు మరో ప్రయత్నంగా శ్రీను వైట్లతో మిస్టర్‌ చేశారు. మిస్టర్‌ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ యునానిమస్‌గా బాగాలేదు అనే మాటను చెప్తున్నారంటే సినిమాలో అంత బ్యాడ్‌గా వున్న అంశాలు ఏమిటి? ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో శ్రీను వైట్ల ఎలాంటి తప్పులు చేశాడు? ఎంత కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు? తద్వార మరెన్ని పొరపాట్లు చేశాడు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఏమాత్రం ఆసక్తికరంగా లేని కథ, కథనాలతో రూపొందిన మిస్టర్‌ చిత్రంలో చెప్పుకోవడానికి ఒక స్ట్రాంగ్‌ పాయింట్‌ అంటూ ఏమీ లేదు. గోపీమోహన్‌ అందించిన నాసిరకమైన కథకి, శ్రీధర్‌ సీపాన అంతకంటే నాసిరకం డైలాగ్స్‌ రాశాడు. అంతకంటే నాసిరకమైన స్క్రీన్‌ప్లేతో, డైరెక్షన్‌తో మిస్టర్‌ని ఒక దారికి తెచ్చాడు శ్రీను వైట్ల. ఎలాంటి ఎయిమ్‌ లేని ఓ కుర్రాడు చై(వరుణ్‌తేజ్‌). అంటే హీరో క్యారెక్టరైజేషన్‌ అనేది నిల్‌. ఒకరికి హెల్ప్‌ చెయ్యడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. సాధారణంగా మన సినిమాల్లోని హీరోలంతా ఇలాగే వుంటారు. తనకు సంబంధంలేని విషయాల్ని మెడకు తగిలించుకొని అష్టకష్టాలు పడి చివరికి హీరో అనిపించుకుంటాడు. మిస్టర్‌ కథ కూడా అదే. అనుకోకుండా పరిచయమైన మీరా(హెబ్బా పటేల్‌)ని ప్రేమిస్తాడు చై. తను ప్రపోజ్‌ చేసే లోపే తనకు ఆల్‌రెడీ ఒక లవర్‌ వున్నాడని, అతన్ని పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని సమస్యలు వున్నాయని చెప్తుంది మీరా. అప్పుడు తన ప్రేమను త్యాగం చేసి మీరా ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేయడానికి సిద్ధపడతాడు జై. ఈ సమస్య పరిష్కారం కాకుండానే మరో సమస్య మరో హీరోయిన్‌ చంద్రముఖి(లావణ్య తిప్రాఠి) రూపంలో వచ్చి పడుతుంది. పెద్ద జమీందారీ వంశంలో పుట్టిన చంద్రముఖిని 12 ఏళ్ళపాటు గృహ నిర్బంధం చేస్తాడు ఆమె తండ్రి. అక్కడి నుంచి తప్పించుకొని హీరో దగ్గరకు చేరుతుంది. ఈ రెండు సమస్యలు కాక తన తాత సమస్య ఒకటి నెత్తిన వేసుకుంటాడు చై. ఇలా రకరకాల మలుపులతో హనుమంతుడి తోకలా సినిమా సాగుతూ వుంటుంది. చై.. మీరాని ప్రేమిస్తే, చంద్రముఖి.. చై ని ప్రేమిస్తుంది. మరి చివరికి మీరా తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుందా? చంద్రముఖి.. చై ప్రేమను గెలుచుకుందా? అనే విషయాలతో పాటు లెక్క లేనన్ని ట్విస్టులు, మరెన్నో విచిత్రాల గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ముకుంద, కంచె వంటి సినిమాలతో సెన్సిబుల్‌ హీరో అనిపించుకున్న వరుణ్‌తేజ్‌ లోఫర్‌తో ఒక మెట్టు దిగాడు. తన కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడని క్యారెక్టర్‌ చేశాడు. చైగా వరుణ్‌తేజ్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఒక విధంగా చెప్పాలంటే అతని క్యారెక్టర్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా, డాన్స్‌ల పరంగా, ఫైట్స్‌ పరంగా వరుణ్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్‌ లేదు. ఇక హీరోయిన్లు హెబ్బా పటేల్‌, లావణ్య త్రిపాఠిల పెర్‌ఫార్మెన్స్‌ గురించి, గ్లామర్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ల గ్లామర్‌ని ఎంజాయ్‌ చేసే ఆడియన్స్‌కి వెగటు పుట్టేలా ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో కనిపిస్తారు. ఇంతకుముందు సినిమాల్లోనే అంతంత మాత్రంగా కనిపించిన హెబ్బా పటేల్‌ ఈ సినిమాలో మరింత దారుణంగా కనిపించింది. అందమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో తన మొదటి సీన్‌ నుంచే చాలా డీ గ్లామర్‌గా కనిపించింది. హీరోయిన్ల క్యారెక్టర్లు, వారి ఫ్లాష్‌ బ్యాక్‌లు ఏ దశలోనూ ఆడియన్స్‌ని ఆకట్టుకోవు సరికదా ఎంతో విసుగును, చిరాకును కలిగిస్తాయి. రఘుబాబు, శ్రీనివాసరెడ్డిలతో చేసిన కామెడీ ట్రాక్‌ కాసేపు నవ్వించింది. ఆ తర్వాత పృథ్వీ, శేషులతో చేయించిన కామెడీ చిరాకు పుట్టిస్తుంది. జమీందారీ వంశానికి చెందిన వారిగా నాగినీడు, మురళీశర్మ, షఫీ, భరత్‌లకు వేసిన గెటప్‌లు ఎవరికైనా నవ్వు తెప్పించేవిగా వున్నాయి. వాళ్ళు సీరియస్‌గా పెర్‌ఫార్మ్‌ చేస్తున్నా ప్రేక్షకులకు మాత్రం మస్త్‌ కామెడీగా అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నాజర్‌, ఈశ్వరీరావు, ఆనంద్‌, తనికెళ్ళ భరణి పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతికపరంగా చూస్తే కె.విగుహన్‌ ఫోటోగ్రఫీ కొంతవరకు బాగుంది. సాంగ్స్‌లో కనిపించే స్పెయిన్‌లోని అందమైన లొకేషన్స్‌ వరకు అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత ఇండియాలో తీసిన పార్ట్‌ మొత్తం చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. చాలా షాట్స్‌ ఔట్‌ ఫోకస్‌లో వుండడం మనం గమనించవచ్చు. ఇక హీరోయిన్లను అంత డీగ్లామర్‌గా చూపించడం గుహన్‌ వల్లే సాధ్యమైందేమో. మ్యూజిక్‌ విషయానికి వస్తే మిక్కి జె.మేయర్‌ ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా చెయ్యలేకపోయాడు. స్పెయిన్‌లో తీసిన పాటలు విజువల్‌గా బాగానే అనిపించినా మ్యూజిక్‌ పరంగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సరేసరి. ఏ సీన్‌లోనూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌ అవ్వలేదు. నిడివి విషయానికి వస్తే ఫస్ట్‌హాఫే గంటన్నర వుండడంతో ఒక సినిమా చూసేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. టోటల్‌గా రెండున్నర గంటల సినిమాలో ఎడిట్‌ చెయ్యాల్సిన సీన్స్‌ చాలానే వున్నాయి. ఈ విషయంలో ఎం.ఆర్‌.వర్మకి ఫ్రీడమ్‌ ఇచ్చినట్టు లేదు. అందుకే ప్రేక్షకులకు రెండు సినిమాలు చూసిన ఫీలింగ్‌ కలిగింది. కథ, కథనాల గురించి చెప్పాలంటే గోపీమోహన్‌ రాసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఈ కథను హీరో, నిర్మాతలు ఎలా ఓకే చేశారో వారికే తెలియాలి. శ్రీధర్‌ సీపాన రాసిన మాటల్లో కొన్ని కామెడీ పంచ్‌లు తప్ప సినిమా మొత్తంలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. ప్రొడక్షన్‌ గురించి చెప్పాలంటే ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు చాలా రిచ్‌గానే సినిమాని నిర్మించారని చెప్పాలి. ఒక మంచి సినిమా చెయ్యడంలో, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమాని నడిపించడంలో శ్రీను వైట్ల మరోసారి విఫలమయ్యాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఎన్నో సిల్లీ సీన్స్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. కథ, కథనాలు ఎలా వున్నా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో, టెక్నీషియన్స్‌ నుంచి మంచి ఔట్‌పుట్‌ తెప్పించుకోవడంలో శ్రీను వైట్ల హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫెయిల్‌ అయ్యారు. తత్ఫలితంగా మిస్టర్‌ అనే సినిమా డిజాస్టర్‌ మూవీ అయింది. ఫస్ట్‌హాఫ్‌ కొన్ని ఫారిన్‌ లొకేషన్స్‌, కొంత కామెడీతో సినిమా సోసోగా అనిపించినా సెకండాఫ్‌ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడానికే ఈ సినిమా తీశారన్న నిర్ధారణకు వచ్చేలా చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే మిస్టర్‌ అనే సినిమా చూడడం అంటే పెద్ద సాహసం చేసినట్టేనని చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. 

ఫినిషింగ్‌ టచ్‌: లక్ష లొసుగులతో విసిగించే మిస్టర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 1.75/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ