Advertisementt

సినీజోష్‌ రివ్యూ: నేనోరకం

Fri 17th Mar 2017 07:41 PM
telugu movie nenorakam,nenorakam movie review,nenorakam review in cinejosh,nenorakam movie cinejosh review,sairam shankar new movie nenorakam  సినీజోష్‌ రివ్యూ: నేనోరకం
సినీజోష్‌ రివ్యూ: నేనోరకం
Advertisement
Ads by CJ

విభ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

నేనోరకం 

తారాగణం: రామ్‌శంకర్‌, రేష్మీ మీనన్‌, శరత్‌కుమార్‌, ఎం.ఎస్‌.నారాయణ, కాశీ విశ్వనాథ్‌, వైవా హర్ష తదితరులు 

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ రామస్వామి 

సంగీతం: మహిత్‌ నారాయణ్‌ 

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌ 

సమర్పణ: యర్రం వంశీధర్‌రెడ్డి 

నిర్మాత: దేపా శ్రీకాంత్‌ 

రచన, దర్శకత్వం: సుదర్శన్‌ సలేంద్ర 

విడుదల తేదీ: 17.03.2017 

అతని పేరు గౌతమ్‌(రామ్‌ శంకర్‌). అతను పరిగెత్తుతున్నాడు. ఆ పరుగు ఓ ప్రాణాన్ని కాపాడుతుంది. పరుగు ఆపితే ఆ ప్రాణం పోతుంది. అలాగని ఆపకుండా పరిగెత్తితే తన ప్రాణం పోతుంది. పరిగెత్తి ఆ ప్రాణాన్ని కాపాడాలా? పరుగు ఆపి తన ప్రాణాన్ని కాపాడుకోవాలా? ఇదీ గౌతమ్‌ ముందు వున్న సమస్య. మరి గౌతమ్‌ ఎవరి ప్రాణం కోసం పరుగులు పెడుతున్నాడు? రామ్‌ శంకర్‌గా మారిన సాయిరామ్‌ శంకర్‌ కొత్త సినిమా నేనోరకం కాన్సెప్ట్‌ ఇది. ఈమధ్యకాలంలో హిట్‌ అనేది లేక సతమతమవుతున్న సాయిరామ్‌శంకర్‌ ఒక యునీక్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ఓ కొత్త తరహా పాత్రలో సాయిరామ్‌ శంకర్‌ కనిపించాడు. సుదర్శన్‌ సలేంద్ర దర్శకత్వంలో దేపా శ్రీకాంత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేనోరకం చిత్రంలోని ఆ కొత్త కాన్సెప్ట్‌ ఏమిటి? దీనికి ఆడియన్స్‌ ఎంతవరకు కనెక్ట్‌ అయ్యారు? సాయిరామ్‌ శంకర్‌కి నేనోరకం హిట్‌ని అందిస్తుందా? ఓ ప్రత్యేక పాత్రలో తమిళ స్టార్‌ హీరో శరత్‌కుమార్‌ నటించాడంటే ఆ క్యారెక్టర్‌లోని కొత్తదనం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

గౌతమ్‌ ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పుడూ అమ్మాయిలవైపు కన్నెత్తి కూడా చూడని గౌతమ్‌ని స్వేచ్ఛ(రేష్మీ మీనన్‌) తన అందంతో పడేస్తుంది. ప్రేమా ప్రేమా అంటూ ఆమె చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఎన్నో రకాలుగా ట్రై చేసి చివరికి స్వేచ్ఛ కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు గౌతమ్‌. ఈ విషయం చెప్పేందుకు వచ్చిన స్వేచ్ఛను తన కళ్ళ ముందే కారులో ఎత్తుకుపోతారు. తన స్వేచ్ఛను కిడ్నాప్‌ చేసింది ఎవరు అని ఎంక్వయిరీ చేస్తుండగానే అతనికి ఓ ఫోన్‌ కాల్‌ వస్తుంది. తను చెప్పినట్టు చేస్తే స్వేచ్ఛను విడిచిపెడతానని అవతలి వ్యక్తి చెప్తాడు. అలా ఫోన్‌ ద్వారానే తనకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటాడు ఆ వ్యక్తి. ఫైనల్‌గా ఓ వ్యక్తిని చంపాలని, అది చేస్తే స్వేచ్ఛను వదిలేస్తానని చెప్తాడు. తన ప్రేమ కోసం ఒకరిని చంపడానికి కూడా సిద్ధపడి బయల్దేరతాడు గౌతమ్‌. గౌతమ్‌కి ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరు? స్వేచ్ఛను ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? గౌతమ్‌తో ఎలాంటి పనులు చేయించుకున్నాడు? చివరికి ఆ వ్యక్తి చంపమన్నది ఎవరిని? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే. 

ఇంతకుముందు సాయిరామ్‌ శంకర్‌ చేసిన సినిమాలతో పోలిస్తే అతని క్యారెక్టరైజేషన్‌ పరంగా, కాన్సెప్ట్‌ పరంగా ఈ సినిమా కొత్తగానే అనిపిస్తుంది. గౌతమ్‌ పాత్రని సాయి అద్భుతంగా చేశాడు. అన్ని ఎమోషన్స్‌ని బాగా క్యారీ చేశాడు. సెకండాఫ్‌లో ఎక్కువ భాగం సాయి పరిగెత్తుతూనే వుంటాడు. అది చూస్తున్న ఆడియన్స్‌లో కూడా నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందనే టెన్షన్‌ క్రియేట్‌ అవుతుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో కూడా సాయి కొత్తగా కనిపించాడు. హీరోయిన్‌ రేష్మీ మీనన్‌ గురించి చెప్పాలంటే లుక్స్‌ పరంగా బాగున్నా, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చెప్పుకోదగ్గ స్కిల్స్‌ ఆ అమ్మాయిలో కనిపించలేదు. డాన్సుల్లో కూడా అంతంత మాత్రమే అనిపించింది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన శరత్‌కుమార్‌ సెకండాఫ్‌ని లీడ్‌ చేశాడని చెప్పాలి. సినిమాలో గౌతమ్‌ని టెన్షన్‌ పెట్టడమే కాకుండా చూస్తున్న ఆడియన్స్‌ కూడా టెన్షన్‌ పడేలా చేశాడు. తన ఓన్‌ వాయిస్‌తోనే డబ్బింగ్‌ చెప్పి క్యారెక్టర్‌కి నిండుదనాన్ని చేకూర్చాడు. ఈ సినిమాలోని మిగతా క్యారెక్టర్స్‌ గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవా హర్ష, ఎం.ఎస్‌.నారాయణ చేసిన క్యారెక్టర్లు నవ్వించేందుకు ప్రయత్నించినా కొన్ని సీన్స్‌లోనే సక్సెస్‌ అయ్యారు. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే సిద్ధార్థ్‌ రామస్వామి ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుంది. విజువల్‌గా ప్రతి సీన్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేలా వుంది. మహిత్‌ నారాయణ్‌ చేసిన ఒకటి రెండు పాటలు మాత్రమే వినదగ్గవిగా వున్నాయి. విజువల్‌గా కూడా పాటలు ఫర్వాలేదు అనిపిస్తాయి. పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో మహిత్‌ ఎక్కువ కేర్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. సెకండాఫ్‌ అంతా ఊహించని ట్విస్టులతో, సస్పెన్స్‌తో నడుస్తుంది. దానికి తగ్గట్టుగా మహిత్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశాడు. అతని మ్యూజిక్‌ వల్లే కొన్ని సీన్స్‌ బాగా ఎలివేట్‌ అయ్యాయి. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఒకే ఏరియాలో కథ నడుస్తుండడంతో మనకి డిఫరెంట్‌ లొకేషన్స్‌ చూసే అవకాశం కలగదు. ఒకేచోట సినిమాని తీసేశారు అనే భావన కలుగుతుంది. మేకింగ్‌ పరంగా నిర్మాత శ్రీకాంత్‌ కాంప్రమైజ్‌ అవకుండా ఉన్నంతలో రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఇక డైరెక్టర్‌ సుదర్శన్‌ సలేంద్ర గురించి చెప్పాలంటే తను ఎంచుకున్న కాన్సెప్ట్‌ కొత్తదే అయినా అది సెకండాఫ్‌కే పరిమితమైపోయింది తప్ప సినిమా స్టార్టింగ్‌ నుంచి ఆడియన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్‌ చెయ్యలేకపోయింది. హీరో పరుగుతో ప్రారంభమయ్యే సినిమా కొన్ని రోజుల వెనక్కి వెళుతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్‌ బ్లాక్‌ వరకు చాలా సాదా సీదాగా నడుస్తుంది. శరత్‌కుమార్‌ క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాతే కథ స్పీడందుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సెకండాఫ్‌ అంతా శరత్‌కుమార్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేశాడు. శరత్‌కుమార్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లో తండ్రి, కూతురు మధ్య నడిచే సెంటిమెంట్‌ సీన్స్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. అలాగే ప్రజెంట్‌లో శరత్‌కుమార్‌, సాయిరామ్‌ శంకర్‌ల మధ్య నడిచే ఎమోషనల్‌ డ్రామా కూడా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్‌ సెకండాఫ్‌ని రాసుకున్నంత గ్రిప్పింగ్‌గా ఫస్ట్‌హాఫ్‌ని చెయ్యలేకపోయాడు. రొటీన్‌ లవ్‌ ట్రాక్‌, రొటీన్‌ కామెడీ, రొటీన్‌ సీన్స్‌, నిడివిని పెంచడానికి వచ్చే పాటలతో ఫస్ట్‌ హాఫ్‌ అంతా కాలయాపన చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ఎక్కడా డ్రాప్‌ అవకుండా నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. క్లైమాక్స్‌ కూడా ఆడియన్స్‌ థ్రిల్‌ అయ్యేలా వుంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన నేనోరకం ఫస్ట్‌ హాఫ్‌ రొటీన్‌గా అనిపించినా, సెకండాఫ్‌ మాత్రం అన్నివిధాలుగా ఆకట్టుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫస్టాఫ్‌ ఒకరకం.. సెకండాఫ్‌ మరో రకం 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ