Advertisementt

సినీజోష్‌ రివ్యూ: గుంటూరోడు

Sat 04th Mar 2017 07:50 PM
manchu manoj new movie gunturodu,gunturodu movie review,gunturodu movie cinejosh review,gunturodu review in cinejosh,telugu movie gunturodu  సినీజోష్‌ రివ్యూ: గుంటూరోడు
సినీజోష్‌ రివ్యూ: గుంటూరోడు
Advertisement

క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

గుంటూరోడు 

తారాగణం: మంచు మనోజ్‌, ప్రగ్యా జైస్వాల్‌, రాజేంద్రప్రసాద్‌, కోట శ్రీనివాసరావు, సంపత్‌రాజ్‌, రాజా రవీంద్ర, సత్య, ప్రవీణ్‌, హర్ష, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సిద్థార్థ్‌ రామస్వామి 

సంగీతం: డి.జె.వసంత్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: చిన్నా 

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌ 

సమర్పణ: అట్టూరి బాలప్రసాద్‌ 

నిర్మాత: శ్రీవరుణ్‌ అట్లూరి 

రచన, దర్శకత్వం: ఎస్‌.కె.సత్య 

విడుదల తేదీ: 03.03.2017 

ఒక సినిమా విజయం సాధించాలంటే నాలుగు మంచి పాటలు, థ్రిల్‌ చేసే నాలుగు ఫైట్లు, మధ్యలో రిలీఫ్‌ నిచ్చే కామెడీ సీన్స్‌.. వుంటే చాలు అనుకునే రోజులు కావివి. రొటీన్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమాలు తీస్తే జనం చూసే రోజులు పోయాయి. ప్రేక్షకులకు ఏం చెప్పినా వెరైటీగా చెప్పాలి. అలాగని ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవ్వకూడదు. టేకింగ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుండాలి, ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగుండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఏదైనా కొత్త పాయింట్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు దాన్ని కమర్షియల్‌గా పెద్ద హిట్‌ చేసేస్తారు. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గుర్తించని కొందరు దర్శకులు అదే మూస ధోరణిలో కథలు రెడీ చేస్తూ, హీరోలను బురిడీ కొట్టించేస్తున్నారు. లేటెస్ట్‌గా మంచు మనోజ్‌ హీరోగా ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో రూపొందిన గుంటూరోడు చిత్రం కూడా అదే బాపతు. ఈమధ్య కాలంలో సరైన హిట్‌ లేని మనోజ్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని ట్రైలర్స్‌ చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. మరి అతని కష్టం ఎంతవరకు ఫలించింది? గుంటూరోడు అని స్పెసిపిక్‌ ఒక ఊరి పేరు పెట్టడంలో డైరెక్టర్‌ ఆంతర్యం ఏమిటి? గుంటూరోడు ఎలాంటి పవర్‌ని చూపించాడు? చివరికి ఏం సాధించాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఇది చాలా సింపుల్‌ స్టోరీ. చిన్నతనం నుండి దూకుడుగా వుంటూ అన్ని విషయాల్లోనూ హైపర్‌గా ప్రవర్తిస్తుంటాడు కన్నా(మంచు మనోజ్‌). అతని తండ్రి సూర్యనారాయణ(రాజేంద్రప్రసాద్‌) ఎక్కువ గారాబం చేయడం వల్ల అతని దూకుడు మరింత ఎక్కువైంది. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేడు. వెంటనే అతని చేతులు దురదపెడతాయి. అన్యాయం చేసిన వాడి దురద తీర్చేస్తాడు. ఇదే స్పీడుతో గుంటూరులో పేరు ప్రఖ్యాతులు వున్న క్రిమినల్‌ లాయర్‌ శేషు(సంపత్‌రాజ్‌)ని కొడతాడు. దాంతో కన్నాపై పగ పెంచుకున్న శేషు అతని కోసం ఊరంతా జల్లెడ పడతాడు. ఇదిలా వుంటే ఒకసారి పెళ్ళిచూపులకు వెళ్ళిన కన్నా పెళ్ళికూతురు నచ్చలేదని చెప్తాడు. పక్కనే వున్న ఆమె ఫ్రెండ్‌ అమృత(ప్రగ్యా జైస్వాల్‌)ని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందడానికి నానా తంటాలు పడి చివరికి ఆమెతో ఐలవ్‌ యు చెప్పించుకుంటాడు. అదే సమయంలో కన్నాని చంపమని మనుషుల్ని పంపిస్తాడు శేషు. తనని చంపడానికి వచ్చిన వారందరినీ ఉతికి ఆరేసిన తర్వాత అమృతకు సంబంధించి ఒక విషయం విని షాక్‌ అవుతాడు కన్నా. అతన్ని అంతగా షాక్‌కి గురి చేసిన సంగతి ఏమిటి? కన్నా, శేషుల మధ్య రగిలిన పగ వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్ళింది? గుంటూరోడి ప్రేమ కథ పెళ్ళి వరకు వెళ్ళిందా? అనేది మిగతా కథ. 

గుంటూరోడు అనే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా అంతా మనోజ్‌ చుట్టూనే తిరుగుతుంది. డిఫరెంట్‌ క్యారెక్టర్‌ వున్న కుర్రాడిగా, అవసరమైతే పదిమందినైనా మట్టి కరిపించే పవర్‌ వున్న హీరోగా మనోజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్‌ అనే చెప్పాలి. పవర్‌ఫుల్‌గా డైలాగ్స్‌ చెప్పడంలో, కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో మనోజ్‌ నటన బాగుంది. ముఖ్యంగా ఫైట్స్‌ హెవీగా చేశాడు. కన్నా తండ్రిగా రాజేంద్రప్రసాద్‌ చేసిన క్యారెక్టర్‌ గతంలో చాలా సినిమాల్లోని తండ్రి పాత్రని పోలి వున్నప్పటికీ ఈ క్యారెక్టర్‌లో కొంత వేరియేషన్‌ చూపించారు. ఆ క్యారెక్టర్‌ని రాజేంద్రప్రసాద్‌ తనదైన స్టైల్‌లో బాగా చేశాడు. వీళ్ళిద్దరి తర్వాత చెప్పుకోవల్సిన మూడో వ్యక్తి, ముఖ్యమైన నటుడు సంపత్‌రాజ్‌. క్రిమినల్‌ లాయర్‌ శేషు పాత్రని ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే హీరోకి పోటాపోటీగా వుండే ఆ క్యారెక్టర్‌ని అంతే పవర్‌ఫుల్‌గా చేశాడు సంపత్‌. ఈమధ్యకాలంలో అతను చేసిన మంచి క్యారెక్టర్‌ ఇదే కావచ్చు. పొలిటీషియన్‌గా చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి క్యారెక్టర్‌ చేశారు కోట శ్రీనివాసరావు. ఇందులో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌కి ప్రాధాన్యం వున్న క్యారెక్టర్‌ దక్కలేదు. కేవలం పాటలకు, కొన్ని లవ్‌ సీన్స్‌కి మాత్రమే పరిమితమైన ప్రగ్యా పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. హీరోకి ఫ్రెండ్స్‌గా నటించిన ప్రవీణ్‌, సత్య, హర్ష అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో వచ్చే పృథ్వీ కనిపించిన కాసేపు కామెడీ చేయడానికి ట్రై చేసినా అది వర్కవుట్‌ కాలేదు. 

టెక్నీషియన్స్‌ విషయానికి వస్తే సిద్ధార్థ్‌ రామస్వామి ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. ముఖ్యంగా ఫైట్‌ సీక్వెన్స్‌లను బాగా తీశాడు. డి.జె.వసంత్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. అలాగే చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా కొత్తగా లేదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో విన్న మ్యూజిక్‌లాగే అనిపించింది. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ బాగుంది. టెక్నీషియన్స్‌లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి ఫైట్‌మాస్టర్‌ వెంకట్‌. డిఫరెంట్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లను ఎంతో ఎఫెక్టివ్‌గా తీశాడు. మేకింగ్‌ పరంగా నిర్మాతలు సినిమాకి బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక డైరెక్టర్‌ ఎస్‌.కె.సత్య గురించి చెప్పాలంటే మొదటి సినిమాతో ఆకట్టుకోలేకపోయినా రెండో సినిమానైనా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో చేసి వుంటే బాగుండేది. ఇలాంటి రివెంజ్‌ డ్రామాలు ఇంతకుముందు చాలా చూసేశారు మన ప్రేక్షకులు. కథ పరంగా, కథనం పరంగా ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమాని కేవలం మనోజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ కోసం, ఫైట్స్‌ కోసమే చూడాలి. పాత కథే అయినా నెక్స్‌ట్‌ హీరో ఏం చేయబోతున్నాడు? విలన్‌ ఏం చేయబోతున్నాడు? అనే క్యూరియాసిటీని కలిగించడంలో సత్య సక్సెస్‌ అయ్యాడు. స్టార్టింగ్‌ నుండి ప్రీ క్లైమాక్స్‌ ఫైట్‌ వరకు ఎంతో స్పీడ్‌గా అనిపించే కథ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఒక్కసారిగా చప్పబడిపోతుంది. ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగిసింది అనిపించారు. హీరో, విలన్‌ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తుంటే క్లైమాక్స్‌ ఇంకెంత హెవీగా వుంటుందోనని ఎంతో ఇంట్రెస్ట్‌గా చూసే ఆడియన్స్‌కి క్లైమాక్స్‌ చూసి నీరసంగా థియేటర్‌ బయటికి రావాల్సి వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా మొత్తాన్ని మంచు మనోజ్‌ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. మనోజ్‌, సంపత్‌, రాజేంద్రప్రసాద్‌ పెర్‌ఫార్మెన్సెస్‌, ఫైట్స్‌ సినిమాకి ప్లస్‌ కాగా, పాత కథ, కథనాలు, ఆకట్టుకోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, క్లైమాక్స్‌ మైనస్‌గా నిలిచాయి. హెవీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని, మనోజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ని ఎంజాయ్‌ చెయ్యాలనుకునేవారికి ఈ సినిమా ఫర్వాలేదు అనిపించవచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇది ఓన్లీ మనోజ్‌ సినిమా 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement