శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
విన్నర్
తారాగణం: సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్, జగపతిబాబు, ముఖేష్ రుషి, ఠాకూర్ అనూప్‌సింగ్, వెన్నెల కిషోర్, ఆలీ, సురేష్, పృథ్వీ, అనసూయ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఎడిటింగ్: గౌతంరాజు
కథ: వెలిగొండ శ్రీనివాస్
మాటలు: అబ్బూరి రవి
సమర్పణ: బేబీ భవ్య
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల తేదీ: 24.02.2017
తెలుగు సినిమాలకు కథలు కరువయ్యాయి అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఇతర భాషల సినిమాల కథలు బాగుంటున్నాయని, మన వాళ్ళు కొత్త కథలు ఆలోచించలేకపోతున్నారని అందరూ అనుకోవడం మనం వింటున్నాం. సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన విన్నర్ సినిమాని చూస్తే అది నిజమేననిపిస్తుంది. పిల్లానువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సూపర్‌హిట్ చిత్రాల హీరో అనిపించుకున్న తేజు ఆ తర్వాత చేసిన తిక్క డిజాస్టర్ కావడంతో అయోమయంలో పడిపోయాడు. ఇప్పుడు విన్నర్‌తో హిట్ ట్రాక్‌లోకి రావాలనుకున్న తేజు ప్రయత్నం ఫలించలేదు. రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్‌ప్లే, రొటీన్ కామెడీ... ఇలా సినిమాలోని ప్రతి అంశం రొటీన్‌గానే అనిపిస్తుంది. వెలిగొండ శ్రీనివాస్ తను అద్భుతంగా రాశాననుకున్న కథని డైరెక్టర్‌కి, హీరోకి చెప్పడం, ఇద్దరూ అద్భుతంగా వుందని చెప్పడంతో నిర్మాత సినిమాని స్టార్ట్ చేసేశాడు. రేస్ కోర్స్ అనే కొత్త బ్యాక్‌డ్రాప్‌తో ఫ్యామిలీ, లవ్, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అయింది? తిక్క తర్వాత విన్నర్ కూడా తేజుకి బెడిసి కొట్టడానికి గల కారణాలు ఏమిటి? మినిమం గ్యారెంటీ సినిమాలు చేసే గోపీచంద్ మలినేని ఈ సినిమా విషయంలో తప్పులో ఎలా కాలు వేశాడు? అనే అంశాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
తను కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి తండ్రితో విభేదించి ఇంటి నుంచి వచ్చేస్తాడు మహేందర్‌రెడ్డి(జగపతిబాబు). ఒక కొడుకుని కని అతని భార్య చనిపోతుంది. అప్పటి నుంచి కొడుకు సిద్ధార్థకి అన్నీ తానే అవుతాడు మహేందర్‌రెడ్డి. అతని తండ్రిది రేసులకు సంబంధించిన కంపెనీ. హార్స్ రేసింగ్‌లో ఎంతో నైపుణ్యం వున్న కొడుకు దూరం కావడంతో అతని బిజినెస్ కూడా దెబ్బతింటుంది. కొడుకుని తన దగ్గరకు తెచ్చుకుంటే మళ్ళీ మునుపటి వైభవాన్ని పొందవచ్చు అని భావించి మహేందర్‌ను ఇంటికి తీసుకొస్తాడు అతని తండ్రి. మహేందర్ రేసుల గురించి తప్ప వేరేదీ ఆలోచించకూడదని అతనికి కొడుకుని దూరంగా పెడుతుంటాడు. మహేందర్‌కి మరో అమ్మాయితో పెళ్ళి జరుగుతుంది. దీంతో తనను పట్టించుకోని తండ్రిపైన, రేసులపైన ద్వేషం పెంచుకొని ఇంటి నుంచి పారిపోతాడు సిద్దార్థ. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత న్యూ లుక్ అనే డైలీ పేపర్ అధినేతగా ప్రత్యక్షమవుతాడు సిద్ధార్థ(సాయిధరమ్ తేజ్). అన్ని సినిమాల్లోలాగే తొలిచూపులోనే సితార(రకుల్ ప్రీత్ సింగ్)ని ప్రేమిస్తాడు. తనను ప్రేమించమంటూ ఆమెను వేధిస్తుంటాడు. ఇలా వుండగా సితార తండ్రి ఆమె పెళ్ళి ఫిక్స్ చేస్తాడు. చిన్నతనంలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొడుకుగా ఆది(ఠాకూర్ అనూప్ సింగ్).. మహేందర్‌రెడ్డిని నమ్మిస్తాడు. అతనితోనే సితార పెళ్ళికి రంగం సిద్ధమవుతుంది. ఆ టైమ్‌లో అక్కడికి వచ్చిన సిద్ధార్థను చూసి ఆదితో తనకు పెళ్ళి ఇష్టం లేదని, సిద్ధార్థను ప్రేమిస్తున్నానని చెప్తుంది సితార. ఆది రేసింగ్‌లో నెంబర్ వన్ కావచ్చు, హైదరాబాద్‌లో సిద్ధార్థ నెంబర్ వన్ అని, రేస్‌లో ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారిని పెళ్ళి చేసుకుంటానని ఛాలెంజ్ విసురుతుంది. రేసులంటే అసహ్యించుకునే సిద్ధార్థ ఆ ఛాలెంజ్‌ని ఎలా తీసుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం రేసులో పార్టిసిపేట్ చేశాడా? తను మహేందర్‌రెడ్డి కొడుకునని సిద్థార్థ ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? చివరికి సితార ఎవరిని పెళ్ళి చేసుకుంది? అనేది మిగతా కథ.
తేజు గతంలో చేసిన మూడు సూపర్‌హిట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ మార్కులు పడవు. అతని పెర్‌ఫార్మెన్స్‌కి తగ్గ క్యారెక్టర్ కాదు. అందువల్ల తేజు పెర్‌ఫార్మెన్స్ ఏ దశలోనూ మనని ఆకట్టుకోదు. డాన్సుల్లోగానీ, ఫైట్స్‌లోగానీ, అతని మేనరిజంలోగానీ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యలేకపోయాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో, డ్రింక్ తాగినపుడు అతని పెర్‌ఫార్మెన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి చెప్పాలంటే ఆమెలో అంతకుముందు వున్న గ్లో ఆమెలో కనిపించలేదు. అయినప్పటికీ ఆమెను గ్లామర్‌గా చూపించేందుకు ఛోటా కె.నాయుడు ప్రయత్నం చేశాడు. పాటల కోసం, సినిమాని ముందుకు నడిపించడానికి టైమ్ పాస్ సీన్ల కోసం తప్ప ఉపయోగం లేదు. మిగతా క్యారెక్టర్లలో జగపతిబాబు, ముఖేష్ రుషి, సురేష్ తదితరుల క్యారెక్టర్లు రొటీన్‌గానే అనిపిస్తాయి తప్ప కొత్తగా కనిపించవు. కామెడీ కోసం క్రియేట్ చేసిన సింగం సుజాత, పీటర్ హెయిన్స్ క్యారెక్టర్లు హాస్యాన్ని పంచకపోగా అపహాస్యంగా వున్నాయి. సింగం సుజాతగా పృథ్వీ, పీటర్ హెయిన్స్‌గా ఆలీ ఆడియన్స్‌ని నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు.
సాంకేతిక పరంగా చూస్తే ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ ఎప్పటిలాగే రిచ్‌గా వుంది. పాటలు కూడా విజువల్‌గా బాగున్నాయి. థమన్ చేసిన పాటల్లో ఒకటి రెండు పాటలు తప్ప మిగతావన్నీ పరమ రొటీన్‌గా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు అనిపించేలా చేశాడు. కథ విషయానికి వస్తే వెలిగొండ శ్రీనివాస్ రాసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం గానీ, ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు కానీ లేవు. దానికి తగ్గట్టుగానే అబ్బూరి రవి మాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. మేకింగ్ విషయానికి వస్తే సినిమా రిచ్‌గా రావడం కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి చెప్పాలంటే ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈ సినిమా కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. రొటీన్ కథే అయినా దానికి మంచి స్క్రీన్‌ప్లే చేసుకోవడంలో కూడా గోపీచంద్ ఫెయిల్ అయ్యాడు. కథలో ఎలాంటి కదలిక లేకుండా ఫస్ట్‌హాఫ్ అంతా రన్ చేసి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో నెక్స్‌ట్ ఏం జరగబోతోందనే దానిపై క్యూరియాసిటీ కలిగించలేకపోయాడు. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో కామన్ ఆడియన్‌కి ఇట్టే అర్థమైపోతుంది. అందరూ ఊహించినట్టుగానే సెకండాఫ్ రన్ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి కొత్తదనం లేని కథ, కథనాలతో, ఆకట్టుకోని రేసులతో, నవ్వు తెప్పించని కామెడీ సీన్స్‌తో రూపొందిన విన్నర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయాడన్నది వాస్తవం.
ఫినిషింగ్ టచ్: విన్నర్ కాదు లూజర్
సినీజోష్ రేటింగ్: 2.25/5