Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఓం నమో వేంకటేశాయ

Sat 11th Feb 2017 12:39 PM
nagarjuna latest movie om namo venkatesaya,om namo venkatesaya movie review,om namo venkatesaya review in cinejosh review,raghavendra rao new movie om namo venkatesaya  సినీజోష్‌ రివ్యూ: ఓం నమో వేంకటేశాయ
సినీజోష్‌ రివ్యూ: ఓం నమో వేంకటేశాయ
Advertisement

సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ 

ఓం నమో వేంకటేశాయ 

తారాగణం: అక్కినేని నాగార్జున, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, సౌరభ్‌ జైన్‌, సాయికుమార్‌, సంపత్‌రాజ్‌, రావు రమేష్‌, రఘుబాబు తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎస్‌.గోపాలరెడ్డి 

సంగీతం: యం.యం.కీరవాణి 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

కథ, మాటలు: జె.కె.భారవి 

నిర్మాత: ఎ.మహేష్‌రెడ్డి 

దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు 

విడుదల తేదీ: 10.02.2017 

అన్నమయ్యతో భక్తి చిత్రాలకు శ్రీకారం చుట్టిన అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు ఆ చిత్రం ఘనవిజయం సాధించి నటుడుగా నాగార్జునకు, దర్శకుడుగా రాఘవేంద్రరావు ఎంతో ఖ్యాతి తెచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ఓలలాడేలా చేసాయి. తాజాగా హాథీరామ్‌ బావాజీ కథాంశంతో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో శిరిడిసాయి నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, నాగార్జున అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా? హాథీరామ్‌ బావాజీగా అక్కినేని నాగార్జున నటన ఏ స్థాయిలో వుంది? ఇటీవలి కాలంలో భక్తిరస చిత్రాలు తెరకెక్కించడంలో తనదే పైచేయి అనిపించుకున్న రాఘవేంద్రరావు ఈ చిత్రంతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ కనబరిచారా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

హాథీరామ్‌ బావాజీ.. ఇప్పటివరకు మనం ఎన్నో భక్తిరస చిత్రాలను చూశాం. అయితే ఇప్పటివరకు హాథీరామ్‌ బావాజీ కథాంశంతో ఒక్క సినిమా కూడా రాలేదు. అలా ఎక్కువ మందికి తెలియని హాథీరామ్‌ కథతో సినిమా చేయడానికి ముందుకొచ్చిన నాగార్జునను, రాఘవేంద్రరావును, నిర్మాత మహేష్‌రెడ్డిని అభినందించి తీరాల్సిందే. కీ.శ. 1500 శతాబ్దంలో జరిగిన కథ ఇది. హాథీరామ్‌ జీవిత చరిత్ర గురించి తెలిసిన విషయాలు కొన్నే అయినప్పటికీ దానికి కొంత కల్పిత కథను జోడించి సినిమాటిక్‌గా అందర్నీ ఆకట్టుకునేలా తీసేందుకు ప్రయత్నించారు. కథ విషయానికి వస్తే రామా అనే కుర్రాడు దేవుడిని కలుసుకోవాలని ఇంటి నుంచి బయల్దేరతాడు. తిరుమలోని ఓ ఆశ్రమంలో పిల్లలకు విద్యను బోధిస్తున్న స్వామీజీ(సాయికుమార్‌)ని కలిసి దేవుడిని చూపించే విద్యను చెప్పమని అడుగుతాడు. దేవుడిని కలుసుకోవడానికి విద్య అక్కర్లేదు, దేవుడిని గుర్తించడానికి విద్య అవసరమని చెప్తాడు స్వామి. అలా అక్కడి పిల్లలతో కలిసి విద్యను అభ్యసిస్తాడు. తర్వాత దేవుడి అనుగ్రహం కావాలంటే తపస్సు చెయ్యమని రామాను పంపిస్తాడు స్వామి. కొన్ని సంవత్సరాల తర్వాత ఓరోజు వేంకటేశ్వరస్వామి చిన్న పిల్లవాడిలా రామా దగ్గరకు వచ్చి అతనికి తపో భంగం కలిగిస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన రామా ఆ పిల్లవాడిని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మంటాడు. అలా వెళ్ళిపోయిన పిల్లవాడే తన స్వామి అని గుర్తించిన రామా వేంకటేశ్వరస్వామిని చూసేందుకు తిరుమల వెళ్తాడు. కానీ, గుడిలోకి వెళ్ళలేకపోతాడు. స్వామి తనకోసం మళ్ళీ వస్తాడని వారం రోజులపాటు గుడి బయటే ఎదురుచూస్తాడు. ఆ సమయంలో కృష్ణమ్మ(అనుష్క) అనే భక్తురాలు తిరుమల స్థల పురాణానికి సంబంధించి తాళపత్రాలు ఇచ్చి చదవమంటుంది. అది చదివిన తర్వాత తన కర్తవ్యాన్ని గుర్తిస్తాడు రామా. తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తాడు. నవనీత సుప్రభాత సేవ, నిత్యం శ్రీనివాసుని కళ్యాణం... ఇలా తిరుమలను ఎంతో అభివృద్ధి చేస్తాడు. ఆ క్రమంలోనే రామాకు వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. అప్పటి నుంచి తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి, రామా పాచికలు ఆడుతుంటారు. ఓరోజు ఆటలో తన ఒంటిమీది ఆభరణాలన్నింటినీ పందెం కాసి ఓడిపోతాడు వేంకటేశ్వరస్వామి. మరుసటి రోజు గుడి తలుపులు తెరిచి చూస్తే స్వామివారి విగ్రహంపై ఆభరణాలు కనిపించవు. అవి రామా ఇంట్లో వున్నట్టు గురిస్తారు రాజ్యాధికారులు. తనతో స్వామి పాచికలాడాడని చెప్తే రాజు నమ్మాడా? పరమ భక్తుడుగా పేరు తెచ్చుకున్న రామాపై ఆ మహారాజు ఎలాంటి చర్య తీసుకున్నాడు? రామా కాస్త హాథీరామ్‌ బావాజీగా ఎలా మారాడు? హాథీరామ్‌, వేంకటేశ్వరస్వామిల స్నేహం కొనసాగిందా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి, ఇప్పుడు హాథీరామ్‌ బావాజీ.. ఇలా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అక్కినేని నాగార్జున ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నాగార్జున ప్రదర్శించిన నటనే దానికి నిదర్శనం. తను కనిపించిన ప్రతి సీన్‌లోనూ హాథీరామ్‌ బావాజీయే కనిపించాడు తప్ప నాగార్జున కాదు. అంతలా ఆ క్యారెక్టర్‌ ఇన్‌వాల్వ్‌ అయి చేశారు. వేంకటేశ్వరస్వామిగా నటించిన సౌరభ్‌ జైన్‌.. వెంకటేశ్వర స్వామిగా అందర్నీ ఆకట్టుకున్నాడు. నిజంగానే వేంకటేశ్వరస్వామిని చూస్తున్నామా అనే ఫీలింగ్‌ కలిగించాడు. భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ప్రగ్యా జైస్వాల్‌.. రామా మరదలుగా ఓకే అనిపించింది. మిగతా క్యారెక్టర్లలో సాయికుమార్‌, అతిథిపాత్రలో కనిపించిన జగపతిబాబు, రావు రమేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపించింది. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే అందరి కంటే ముందు చెప్పుకోవాల్సింది ఎస్‌.గోపాలరెడ్డి గురించి. ప్రతి సీన్‌ ఎంతో అందంగా చిత్రీకరించాడు గోపాల్‌రెడ్డి. ఈ సినిమా విజువల్‌గా చాలా రిచ్‌గా కనిపిస్తోందంటే దానికి కారణం అతనే. ఇక కీరవాణి మ్యూజిక్‌ విషయానికి వస్తే నాగార్జున చేసిన మూడు భక్తి సినిమాల్లోని పాటలతో పోలిస్తే ఈ పాటలు పెదవి విరిచేలానే వున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా, వేంకటేశ్వరస్వామి కళ్యాణం పాట, క్లైమాక్స్‌లో హాథీరామ్‌ బావాజీ సజీవ సమాధి చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్‌ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎలాంటి వంక పెట్టలేని విధంగా చాలా అద్భుతంగా చేశాడు. ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ వర్క్స్‌.. ఇలా అన్నీ పర్‌ఫెక్ట్‌గా వుండడం వల్ల విజువల్‌ వండర్‌లాంటి మంచి సినిమా చూశామన్న ఫీల్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. నిర్మాత మహేష్‌రెడ్డి క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు గురించి చెప్పాల్సి వస్తే హాథీరామ్‌ బావాజీ జీవిత చరిత్ర అందుబాటులో లేకపోయినా చిన్న కథతోనే 2 గంటల 24 నిముషాల సినిమా తీసి అందర్నీ ఆకట్టుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాకి వున్న ప్లస్‌ పాయింట్స్‌, మైనస్‌ పాయింట్స్‌ గురించి చెప్పాలంటే హాథీరామ్‌గా నాగార్జున పెర్‌ఫార్మెన్స్‌, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్‌ జైన్‌ నటన, కీరవాణి మ్యూజిక్‌, రాఘవేంద్రరావు టేకింగ్‌ ప్లస్‌ పాయింట్స్‌ కాగా, అవసరం లేని కామెడీ, జగపతిబాబు క్యారెక్టర్‌, అనుష్క, రావు రమేష్‌, అతని గ్యాంగ్‌ చేసే కామెడీ, అక్కడక్కడ బోర్‌ కొట్టించే ఫస్ట్‌ హాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ అయ్యాయి. సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన పది నిముషాల తర్వాత పూర్తిగా కథతోనే సినిమా నడుస్తుంది. అనవసరమైన కామెడీలు లేకుండా క్లైమాక్స్‌కి కథని తీసుకెళ్ళడం, అక్కడ దేవుడికి, భక్తుడికి మధ్య సంభాషణలు, హాథీరామ్‌ సజీవ సమాధి జరుగుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాట ఇవన్నీ చాలా అద్భుతంగా తీశారు రాఘవేంద్రరావు. ఫైనల్‌గా చెప్పాలంటే తరచూ తిరుపతి వెళ్ళే వేంకటేశ్వరస్వామి భక్తులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అందరికీ ఈ సినిమా ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: భక్తిరస దృశ్యకావ్యం 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement